వాకిట్లో కి వచ్చిన రాయుడు గారిని చూసేసరికి రామయ్య గారికి ఆశ్చర్యం వేసింది. రాయుడు గారితో బాటు ఇంకా పది మంది ఉన్నారు. ఇంతమంది ఒక్కసారిగా వచ్చేసరికి ఆయన మనస్సు లో అనేక ఊహలు కలిగినాయి. అందరినీ కుశల ప్రశ్నలు వేసి పలకరించాడు. రాయుడు గారు రామయ్య గారి బావమరిది. కనుక అయన వచ్చినందుకు ఎవ్వరూ ఏమీ అనుకోరు. తతిమ్మా వాళ్ళు కూడా వచ్చారంటే ఊరందరికీ ఆశ్చర్యం గానే ఉంది. ఎందుకంటె ఒక పార్టీ అభ్యర్ధులు మరో పార్టీ వారితో ఎందుకు మాట్లాడుతారు?
"ఏం, బావగారూ, మందీ మార్బలంతో వచ్చారు? మా ఊళ్ళో కూడా మీకు రావలసిన ఒట్లున్నాయ్యా?' అన్నాడు రామయ్య నవ్వుతూ. అంతా ముభావంగా ఊరుకున్నారు.
"కాదు బావగారూ . ఎన్నికల ప్రచారానికి రాలేదు. వెనకటి కోక షావుకారుండేవాడు మా ఊళ్ళో. పచ్చరటి పండిస్తే ఇది కాంగ్రేసు పార్టీ రంగ ని తినలేదు. రామములగ పండు కమ్యూనిస్టు పార్టీ రంగ ని అది తినేవాడు కాదు. అట్లాగే మనం ఎక్కడికి బయల్దేరినా ఓట్ల కోసమే పోతున్నామంటారా బావగారూ?" అన్నాడు రాయుడు గారు నవ్వుతూ.
అంతా నవ్వుకున్నారు.
"ఇంతమంది పెద్దలు ఒక్కసారిగా వస్తే.....ప్రస్తుతం అదే వ్యావృత్తి లో ఉన్నాం గా అందరం? సరే అసలు విషయం?' అన్నారు రామయ్య గారు.
"బావగారూ , సురేంద్ర మీక్కాకుండా పోవటం అటుంచి, మాకూ కాకుండా పోతున్నాడు. అసలు వాడి మాటలు వింటుంటే మన సురేంద్ర వీడేనా అనిపిస్తున్నది. వాడికో స్నేహితుడున్నాడు, రమేష్. మీ నియోజకవర్గం వాడే. ప్రసాద పురం లో నాగభూషణం లేడూ? అయన కొడుకు. వాడి స్నేహం చేసి మనవాడు పూర్తిగా చెడిపోతున్నాడు. సురేంద్ర కు ఇప్పుడు పెళ్లి అక్కరలేదుట. చదువు పూర్తయి ఉద్యోగం లో చేరితేనే గాని చేసుకొట్ట." అన్నాడు రాయుడు గారు.
"సురేంద్ర అన్నాడా, లేక అ స్నేహితుడు అనిపించాడా వాడి చేత?' అన్నాడు రామయ్య గారు ఆశ్చర్యంగా. కొడుకు ఆ తీరుగా అంటాడని అయన ఎప్పుడూ అనుకోలేదు.
"వాడే అన్నాడు. అయినా వాణ్ణి పెళ్లి చేసుకుని పెళ్ళాం తో యిప్పుడే కాపురం పెట్టమనలేదుగా? పైగా ఉద్యోగం లో కూడా చేరితేనే గాని చేసుకొట్ట. వేలకి వేలు ఎన్నికల కి ఖర్చు పెడుతున్నామే, సురేంద్ర ఉద్యోగం చెయ్యకపోతే వాడికి గడవదా? అటు నాకూ ఒక్క కూతురు. ఇటు మీకూ ఒక్క కొడుకు. ఏదో నలుగురం బావుండగానే ముచ్చటగా పెళ్లి చేద్దామనుకుంటే వాడేమో బిగిసి కూర్చున్నాడు. వాడి చదువు పూర్తయినా కనే కాపురం పెట్టుకోవచ్చు. అందాకా నా పిల్ల నా యింట్లో ఉంటె నేనేం కాదన్నానా?"
నలుగురి లోనూ రాయుడు గారు యిట్లా మాట్లాడటం చూస్తె రామయ్య కు చాలా కష్టమనిపించింది.
"అప్పుడే వాడు అంత వాడయినాడన్న మాట! చూస్తాను, ఎట్లా చేసుకోడో? ఎందుకు చేసుకోడో? వాడు చెప్పినట్లు నాలుగేళ్ళూ, అరెళ్ళూ కూర్చోవటానికి మనమేం వాడికి లొంగి పోతామను కున్నాడు కామాలు. అయినా ఆ నాగభూషణం మీ పార్టీ గోత్రీకుడేగా" అన్నాడు. అంతమందిని చూస్తుంటే ఆయనకు పార్టీ తత్త్వం కడుపులో సుళ్ళు తిరిగింది.
"ఈ విషయంలో పార్టీ తత్వాలు ఎత్తవద్దు బావగారూ. ఆ విషయాలు చర్చించేందుకు మనకు చాలా అవకాశాలున్నాయి. ప్రజలే అందుకు సమర్ధులు. మనం నిమిత్త మాత్రులమే. సరే. లోపలికి వెళ్లి వరలక్ష్మీ తో కూడా మాట్లాడి వస్తా" అంటూనే ఇంట్లో కి వెళ్లి చెల్లెలితో మాట్లాడి రామయ్య గారితో మరోసారి పెళ్లి విషయం హెచ్చరించి, అందర్నీ వెంట బెట్టికుని వెళ్ళిపోయాడు రాయుడు గారు.
మర్నాడే గుంటూరు వెళ్లి కొడుకుతో పెళ్లి విషయం సంప్రతించాడు రామయ్య గారు. సురేంద్ర మేనమామ తో చెప్పిన మాటే తండ్రి తోనూ చెప్పాడు.
"పోనీ, వాళ్ళు శ్యామ సుందర్నీ నాలుగేళ్ళూ నువ్వు చెప్పినట్లుగానే ఉంచుతారు. చదువు పూర్తయి ఉద్యోగం లో చేరాకనయినా చేసుకుంటావా శ్యామ సుందర్ని?' అన్నాడు రామయ్య గారు కోపంతో.
సురేంద్ర కు ఈ మాటకు ఏమి సమాధానం చెప్పాలో తెలీలేదు. ఈ నాలుగేళ్ళూ ఆగినా, తను శ్యామసుందరి ని చేసుకుంటాడా?
"నాలుగేళ్ల తరువాత సంగతి యిప్పుడేందుకు నాన్నా? అంతవరకూఆగితే అప్పుడు ఆలోచించ వచ్చు." అన్నాడు సురేంద్ర ముభావంగా.
రామయ్య గారి ముఖం కందగడ్డ అయిపొయింది. ఈ మాటతో ఉక్కిరిబిక్కిరి అయాడు. కన్నకొడుకు యీ తీరుగా మాట్లాడతాడని అయన కలలో నైనా అనుకోలేదు. అయన హృదయం ఆక్రోశించింది. ఇంక సురేంద్ర తో ఈ విషయం మాట్లాడ బుద్ది పుట్టలేదు.
"నా కడుపున చెడ పుట్టావు. ఈ రోజు నుంచీ నాకూ నీకూ ఋణం తీరిపోయింది. మంచిది. వెళతాను" అంటూనే కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోయాడు.
బరువేక్కిన హృదయం తో తండ్రి వెళ్ళిన వైపే చూస్తూ నిల్చున్నాడు సురేంద్ర.
ఇంటికి వెళ్ళగానే రాయుడు గారికి ఉత్తరం వ్రాశాడు రామయ్య గారు -- "మతి స్థిమితం లేని ఈ పిచ్చి వాడి కిచ్చి చేసే బదులు శ్యామ సుందరి ని తగిన వరుడి కిచ్చి పెళ్లి చెయ్యవలసింది"----అని. ఈరీతిగా మేనరికం తప్పిపోయినందుకు వరలక్షమ్మ నెత్తీ నోరూ బాదుకుంది.
10
ఆరోజున జరిగిన సంఘటన లూ, అసలు సరోజ అంటే ఎవరయినదీ , ఎట్లా తెలుసుకో గలిగినదీ , రమేష్ తో మాట్లాడిన మాటలూ అన్నీ తలచుకుని వసుంధర తనలో తను ఎన్నో సార్లు నవ్వుకుంది. రమేష్ ఎంత నాటకం ఆడాడు! అచ్చగా ఆడవాళ్ళు వ్రాసినట్లు గానే ఎంతో నేర్పుగా ఉత్తరాలు వ్రాశాడు. అతను మొదటి నుంచీ జాగ్రత్త గానే ఎక్కడా పట్టుబడ కుండా ఉత్తరాలు వ్రాశాడు. తానే మోసపోయింది.
హైస్కూల్లో తనతో మాట్లాడేందు కూ తనను కల్పించుకుని చూసేందుకూ కొంతమంది విద్యార్ధులు పడేపాట్లు చూస్తుంటే వసుంధర కు నవ్వు వచ్చేది. కాని అంతవరకూ ఎవ్వరితోనూ మాట్లాడలేదు. ఆరోజున రమేష్ తో మాట్లాడటమే జీవితంలో అనుకోని ఒక సంఘటన. 'మీ కొత్త స్నేహితురాలు సరోజ రాలేదేమే పేరంటానికి?' అని అక్కయ్య అడిగితె రేమేష్ తో ఎగతాళి గా అన్నట్లు గానే, "ఆవిడ వాకిట ఉన్నారు.' అని చెప్పింది అక్కయ్య తో. ఇవన్నీ తలచుకుంటే ఆశ్చర్యమూ, భయమూ, నవ్వూ , ఆత్రుతా అన్నీ ఒక్కసారిగా కలిగినాయి వసుంధర మనస్సు లో. రహస్యం తెలీనంత వరకూ 'సరోజ గార్ని మనకు నాటకం రోజున తీసుకొస్తాను.' అని చెప్పింది స్నేహితులతో వసుంధర. ఆరోజున వాళ్ళంతా అడిగితె ఏం చెప్పాలి? ఎంత ఆలోచించినా ఏమీ అర్ధం కాలేదు వసుంధర కు. ఇంతవరకూ వచ్చిన తరువాత, రహస్యం తెలిసిన తరువాత రమేష్ తో మాట్లాడటం మానేయ్యటమా? మానేస్తే? అంతవరకూ అతనితో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఏమయ్యేటట్లు? తను వ్రాసిన ఉత్తరాలన్నీ రమేష్ ఎవరికయినా చూపెడితే? అయినా ఆ ఉత్తరాలన్నీ తను సరోజ పేరిట వ్రాసింది గాని రమేష్ పేర కాదుగా? ఇందులో తప్పేముంది? అసలు విషయం తెలిసినా తరువాత వసుంధర మాట్లాడటం మానేసిందని అతనూ చిన్నబుచ్చు కోడూ? అదీగాక అతను వ్రాసి పంపిన 'స్త్రీ పాత్ర' నాటకం తాము ప్రదర్శించబోతూ నాటక రచయిత తో మాట్లాడక పోవటమా!మాట్లాడి నందు వల్ల తప్పేముంది? తననేమో అమర్యదాకరంగా చూడలేదే? తనంతట తానుగా మాట్లాడటం మానేస్తే ఏం బావుంటుంది?
వసుంధర ఇవన్నీ ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రాలేక పోయింది.
జనవరి ఇరవై ఒకటవ తారీఖున రమేష్ కనిపించాడు వసుంధర కు . ఒకరు నొకరు నవ్వు ముఖంతో పలకరించు కున్నారు. మాట్లాడకుండా ఉండలేక పోయారు ఇద్దరూ.
"కులాసాగా ఉన్నావా, వసుంధరా? కోపం రాలేదు కదా?' అన్నాడు రమేష్.
"కోపమెందుకు?' అన్నది మెల్లిగా వసుంధర.
"రేపు ఆదివారం మా గదికి వస్తావా? కులాసాగా కబుర్లు చెప్పుకోవచ్చు."
"మీ వదిన సరోజ వచ్చారా?' నవ్వుతూ అడిగింది వసుంధర.
"ఆ! వచ్చారు. నిన్ను రమ్మన మని మరీ మరీ చెప్పారు . వస్తావా మరి?' అన్నాడు రమేష్ నవ్వుతూనే.
"సరే, వస్తాను. సాయంత్రం నాలుగింటికి.
ఇద్దరూ విడిపోయారు.
రమేష్ తో చెప్పిందే గాని వసుంధర కు వెళ్ళటానికి భయం కలిగింది. తనకు అతనేమీ బంధువు కాదు. తన క్లాసు మేట్ కాదు . పరాయి వాడు. అంతవరకూ తన నిజ పరిస్థితి బయట పెట్టక తనతో అనవసరంగా కల్పించుకుని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపించిన వాడు. మోసకారి. ఏదో ఎత్తుగడ తో పన్నాగం పన్ని తనను వలలో వేసుకోవాలను కుంటున్నాడు. తను అనేక పుస్తకాలూ, నవలలూ చదివింది. ఎన్నో పరిచయాలు ప్రేమగా మారినవట. ఏ పుస్తకాలు చదివినా, ఎన్ని నవలలు చదివినా పరిచయాలను గురించీ, ప్రేమను గురించీ , ప్రణయ కలాపాలను గురించీ వ్రాయని కధలూ, నవలలూ లేవు. రచనల్లో అనేక వస్తా విక్త విషయాలు పుణికి పుచ్చుకున్నట్లుగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. తమ స్నేహమూ, పరిచయమూ, ఉత్తరాలూ అట్లాగే ఉన్నాయి. తీరా తమ పరిచయం ప్రేమగా మారి చివరకు వంచించబడి సినిమా లో నాయకి లాగా కష్టాలను ఎదుర్కోవలసి వస్తే? అప్పుడు నలుగుతూ ఏమంటారు? గౌరవంగా బ్రతుకుతున్న తమ కుటుంబానికి తీరని కళంకం తెచ్చునట్లే గా? అక్కయ్యలు తనతో మాట్లాడరు. నాన్న తనను యింట్లోంచి పొమ్మంటారు. బావలు నవ్వుతారు. తమ యింటికి రానివ్వరు. అమ్మ గుండె పగిలి ఏడుస్తుంది. ఇల్లోక నరక కూపంలా తయారవుతుంది. తనవల్ల అందరికీ తాపులే.
అటు రమేష్ విషయం లో ఆలోచిస్తే, వస్తానని చెప్పి వెళ్ళక పొతే అతను ఏమను కుంటాడు? వసుంధర దగా కోరను కుంటాడు. ఆప్యాయత ఉత్తరాల్లో నే గాని, మనస్సు కఠినమైన దనుకుంటాడు. కనబడ్డప్పుడల్లా మనస్సు కెలిగి నట్టవుతుంది. కోపం లో తనను గురించి దుష్ప్రచారమూ చెయ్యవచ్చు.
పరిచయ మనేది కలగకుండానే ఉండాలి గాని పరిచయం ఏర్పడిన తరువాత, పరిచయస్తు లతో మాట్లాడక పొతే, విరోధస్తూల కన్నా తేలికయి పోతారు. గర్వమనీ, అహంభావ మనీ అనుకుంటారు. అప్పుడు కలిగే మానసిక వేదన మనస్సును క్రుంగ దీస్తుంది. ఏదో పోగొట్టు కున్న వారిలా బాధపడతారు.
ఆ రాత్రి తెల్లవార్లూ అలోచించి మర్నాడు రమేష్ గదికి వెళ్ళటానికే నిశ్చయించు కుంది వసుంధర.
వసుంధర వస్తుందని రమేష్ గదిలోనే ఉన్నాడు. చిందర వందరగా ఉన్న పుస్తకాలన్నీ సర్దాడు సిగరెట్టు పీకలన్నీ ఎత్తి పారేశాడు. చక్కగా చాపలు పరిచి గదంతా శుభ్రంగా ఉంచాడు.
సురేంద్ర కూడా ఆ రోజున గదిలోనే ఉన్నాడు. వసుంధర వస్తుందని సురేంద్ర తో ముందుగానే చెప్పాడు రమేష్. రమేష్ ఆదుర్దా అత్రమూ చూస్తుంటే సురేంద్ర కు నవ్వు వచ్చింది.
