Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 12

 

    అనుకున్నట్టు ఆదివారం సాయంత్రం నాల్గింటి కల్లా ప్రభాకర్ రామయ్య గారింటికి హాజరయ్యాడు.
    ఠీవిగా, నీటుగా , అందంగా , ఉత్సాహంగా కనబడుతున్న ప్రభాకర్ నుచూసి జానకమ్మ ఆశ్చర్య పోయింది.
    "సాముద్రికుడంటే విభూతి పట్టెలు, చేతిలో చినిగిపోయిన కాగితాల కట్టలు -- పళ్ళూడి , వళ్ళు వంగిపోయిన ముసలాయన కాబోలనుకున్నాను. ఇంత చిన్న కుర్రాడా?' అంది ముక్కు మీద వ్రేలేసుకుంటూ.
    ప్రభాకర్ నమ్రతగా నవ్వాడు.
    "ఆ అబ్బాయి డాక్టరీ చదువుతున్నాడే.... ఇదే పని మీద ఉన్నాడనుకున్నావా ఏమిటి? బాగుంది!" అన్నారు రామయ్య గారు.
    "మా శకుంతల అన్నయ్య వీరేనే....." అని పరిచయం చేసింది  ఉష.
    జానకమ్మ మరీ ఆశ్చర్య పోయింది.
    "అలాగా! నాతొ మీరూ చెప్పందే?' అంది.
    "మీరు మొదట మా ఆవిడ చెయ్యి చూడండి. మీ సంగతి చెప్పిన దగ్గర్నుంచీ ఆవిడ నన్ను నిలబడినీళ్ళు తాగానీయటం లేదు. జాతకం, సాముద్రికం చూసే వాళ్ళెవరూ కనబడకపోతే చివరకు సోదైనా చెప్పించుకుంటేనే కాని మా ఆవిడకు నిద్రపట్టదు.." అన్నారు రామయ్య గారు.
    'చేతుల్లో ఆడా, మగా తేడాలుంటాయా? ఏమో గొడవ? పుస్తకం లో అలా ఏం రాయలేదు. అయినా రోటిలో తల దూర్చి రోకటి పోటుకు నేరవటం ఎందుకు?" అంటూ గుండె దిటవు చేసుకున్నాడు ప్రభాకర్.
    అంతా డ్రాయింగ్ రూం లో గుమిగూడారు. ప్రభాకర్, రామయ్య గారు సోఫాలో కూర్చున్నారు. జానకమ్మ కుర్చీ సోఫా ముందుకు లాక్కుని కూర్చున్నది. గీత, చిత్ర, శారద సోఫానానుకుని నిలబడ్డారు. కళ, ఉష తల్లీ కుర్చీ నానుకుని నిలబడ్డారు. ప్రభాకర్ ఏం చెప్తాడో విందామని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాకర్ కు ఒక్క క్షణం వణుకోచ్చింది.....
    "చెయ్యి చాపండి....." అన్నాడు ప్రభాకర్.
    జానకమ్మ చేయి సాచింది.
    "కాస్త పౌడరు పూసుకు రండి...."
    జానకమ్మ అయోమయంగా చూసింది.
    "నాకు పౌడరు రాసుకోవటం అలవాటు లేదు నాయనా. పౌడరు అద్దుకుంటేనే గాని చెయ్యి చూడ్డానికి వీలుకాదా?"
    ప్రభాకర్ కు నవ్వొచ్చినా ఆపుకున్నాడు.
    "మొహానిక్కాదండి.... చేతిలో రేఖలు స్పష్టంగా కనబడతాయని చేతికి పూసుకోమంటున్నాను...."
    'అలాగా!" అంటూ జానకమ్మ తేలికపడి చేతికి పౌడరు పూసుకోచ్చింది.
    ప్రభాకర్ స్టడీ చేయటం మొదలు పెట్టాడు. కాస్దేపు చెయ్యి అటూ. ఇటూ పట్టుకుని "అరే! ఇదేమిటండీ? మీ ఆరోగ్యం ఇంత అద్వాన్నంగా ఉన్నది?" అన్నాడు.
    "ఎంత బాగా చెప్పావు నాయనా! నేను ఒక రోజు లేస్తే మూడు రోజులు పడుకుంటాను. ఈ మధ్య మరీని...." అంది జానకమ్మ ప్రభాకర్ నైపుణ్యానికి ఆశ్చర్యపోతూ, మురిసిపోతూ.
    "అది చెయ్యి చూసి చేప్పేడేమిటి? మా అమ్మ ముఖం చూసే చెప్పొచ్చు...." అని కిసుక్కున నవ్వింది చిత్ర.
    రామయ్యగారు చీవాట్లేశారు.
    "నీకు నమ్మకం లేకపోతె అవతల కెళ్లవే..... ముఖం చూస్తె ఏం తెలుస్తుంది?.... దాని మాటలు పట్టించుకోకండి!" అంటూ రామయ్యగారు ప్రభాకర్ ను వెనకేసుకుని వచ్చారు.
    అయినా ప్రభాకర్ కు కోపం వచ్చింది.
    "చూడండి! ఈ రేఖ ఎంత గజిబిజి గా ఉన్నదో? ఇలా ఉంటె ఆరోగ్యం సరిగా ఉండదన్న మాట."
    "సరే! ఆ తర్వాత చూడండి!" అని జానకమ్మ తొందర పెట్టింది. ఏ రేఖ ఎలా ఉంటె తనకెందుకు? ఫలితం కావాలి కాని....
    ప్రభాకర్ మళ్ళా చెయ్యి చూసి "మీ చేతిలో క్రాసు ఉన్నదే?' అన్నాడు గభాలున మాట జారుతూ.
    "ఉంటె ఏమిటి?" అనడిగారు రామయ్య గారు ఆతృతగా. ప్రభాకర్ చెప్పటానికి తటపటాయించాడు.
    "చెప్పవోయ్, ఫర్వాలేదు! మంచిదైనా, చెడ్డదైనా మేం ఏమి అనుకోం...." అంటూ రామయ్య గారు ప్రభాకర్ భుజం తట్టారు.
    "మరేమీ అనుకోకండి! ఈ మౌంటు లో క్రాసు ఉంటె.....
    "ఉంటె?"
    "ఉంటె ఆవిడకి  లవ్ మారేజ్ అంటారు అన్నాడు. ప్రభాకర్, నోరెందుకు జారానా అని లోలోన మధన పడుతూ. బోడమ్మ లా రామ్మయ్య గారు ఎన్ని తిట్లు తిడతారో? ఆవిడంటే అరవం లో తిట్టింది కాబట్టి తనకు బోధపడలేదు. బోధపడక బాధపడలేదు. ఈయన అచ్చంగా తెలుగులో తిడితే -- అదీ ఇంత మంది అమ్మాయిల ఎదుట-- తిడితే తన్ను కాదని ఎలా దులిపెసుకోవటం?
    రామయ్య గారు ప్రభాకర్ చెయ్యి గట్టిగా నలిపేస్తూ "బ్రహ్మాండంగా చెప్పావయ్యా! ఎంత మందో చెప్పారు కాని ఈ ముక్క ఒక్కళ్ళూ చెప్పలేదూ..." అన్నారు.
    నిజమా ? కలా? అనుకుంటూ ప్రభాకర్ రామయ్య గారి వంక గ్రుడ్లప్పగించి చూశాడు.
    "నూటికి నూరుపాళ్ళు నిజమేనయ్యా! మా ఆవిడా వాళ్ళు అద్దె కున్న పక్కింట్లోనే నేనుండే వాడిని.... చదువు కోసం మేడ మీది గది అద్దెకు తీసుకున్నానులే. ప్రొద్దున్న ఏడు గంటల వేళ నేను పక్క మీది నుంచి లేచి కిటికీ దగ్గర కెళ్ళేవాడిని.... మా ఆవిడ వాళ్ళ దొడ్లో కరివేపాకు కోస్తూ ఉండేది ఆ సమయంలో. నేనొక వేళ కాస్త ముందు లేచినా ఆవిడ కరివేపాకు ఎప్పుడు కోస్తుందా అని కనిపెట్టుకుని కూర్చునే వాడిని. రోజూ ఆవిడ్నీ చూడకుండా మాత్రం నిద్రపోయే వాడిని కాదు.... మా ఆవిడ కప్పుడు పదేళ్ళ కన్నా ఎక్కు ఉండదు. నాకు పదహారేళ్ళు ఉంటాయి. ఎస్.ఎస్. ఎల్. సి చదువుతుండేవాడిని... ఆ ఏడాది పరీక్ష పల్టీ కొట్టిందిలే....."
    జానకమ్మ సిగ్గు పడింది.
    'ఆ విషయాలన్నీ అబ్బాయి కెందుకండి?"
    రామయ్య గారు వినిపించుకోలేదు.
    "ఆ తర్వాత మా వాళ్ళు నా సంగతి తెలుసుకుని వాళ్ళ వాళ్ళతో మాట్లాడి పెళ్ళి చేశారు....ఎంత కరెక్టు గా చెప్పావయ్యా కళ్ళతో చూసినట్టు!"
    రామయ్యగారు ఆశ్చర్యంతో తల మునకలయ్యారు .
    కళ నవ్వింది.
    "అయన చూస్తున్నది అమ్మ చెయ్యిగా? మీరు మీ సంగతి చెప్తారేమిటి మధ్య?"
    "ఇద్దరిలో ఎవరు ప్రేమించినా అది లవ్ మారేజీ క్రిందే లెక్క కొస్తుంది.... మొగుడూ పెళ్ళాల చేతుల్లో ఎవరిదో ఒకరిది చూస్తె సరిపోతుంది.  మళ్ళా రెండో వాళ్ళ చెయ్యి చూడ నక్కర్లేదు.... అన్ని విషయాలు అందులోనే ఉంటాయి...."
    "ఇదీ బాగానే ఉన్నది! డబ్బిచ్చుకునే పక్షమైతే డబ్బు మిగులుతుంది... ఎవరో ఒకళ్ళు డబ్బిచ్చి చూపించుకుంటే సరిపోతుంది... ఒకే దెబ్బతో రెండు పిట్టలు!" అని పకపక లాడింది గీత.
    ఈ గడుగ్గాయి పిల్లలందరి మధ్యకి తనను ఈడ్చు కొచ్చి పడేసింది. ఇప్పుడు బుద్ది మంతురాలికి మల్లె మాట్లాడకుండా కూర్చున్నది ఉష. కానీ ఈసారి మళ్ళా వంటరిగా కనబడక పోతుందా?"
    ప్రభాకర్ ఏం  తోచక జానకమ్మ చేతిలో ఒక రేఖ చుట్టూ వ్రేలితో గీశాడు.
    రామయ్యగారు ఆతృతగా అడిగారు "ఆ రేకేమిటి ?' అని.
    "నా తలకాయ రేఖ" అని స్వగతం చెప్పుకుంటూ పైకి "ఫారిన్ రేఖ" అన్నాడు ప్రభాకర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS