
7
ఆ రాత్రి జయప్రదరావు ఇంటికి వచ్చేసరికి తెల్లవారు జాము అయింది. నాటుసారా తాగి వచ్చిన సంగతి గ్రహించేసరికి విజయ స్తబ్డురాలాయి పోయింది. '[భగవంతుడా , చివరికి ఈ శిక్ష కూడా విదిస్తున్నావా' అని, కనిపించని భగవంతుని ప్రశ్నిస్తూ భర్తను లోపలికి తీసుకుని పోయింది ఆమె. సారా త్రాగటానికి డబ్బు ఎక్కడిదో ఆమెకు తెలియలేదు. నిష్టాపరుడైన బ్రాహ్మణా యువకుడు స్వవినాశనాన్ని చేతులారా తెచ్చుకుంటున్నాడు. ఏ దేవతలో అలిగి శపించ లేదు గద? తన సౌశీల్యం లో సంకుచితత్వం యేర్పడ లేదు గద? భయంతో వణికిపోయింది విజయ.
పగలంతా ఏడిచి త్రాగానని శపథం చేసి జంతికలు వండి పెట్టమని కోరి సాయంత్రం అయేసరికి మాయమయినాడు జయప్రదరావు. విజయకు విచారించే ఓపిక కూడా నశించి పోయింది. రెండు రోజుల నుంచీ ఆమె భోజనం చెయ్యలేదు. రెండు రోజుల క్రిందట ఎవరింటి కో పేరంటా నికి వెళ్లి వాళ్ళిచ్చిన అరటి పళ్ళు రెండు తిన్నది. అంతే. మరేమీ లేదు.
ఆకలి అనేది ఎంత బాధగా ఉంటుందో ఈ మధ్యనే ఆమెకు తెలుస్తున్నది. ఈ ఆకలి ఎవరు తీరుస్తారు? ఎవరికి ఆ బాధ్యత ఉన్నదో వారు సంకుచితు లూ త్రాగుబోతూ అయిపొయినారు. తను కాపురానికి వచ్చిన కొత్తలో ఒకరోజు తనకు కోపం వస్తే భర్త కలిపి గోరుముద్దలు పెట్టడం గుర్తుకు వచ్చి తనలో తనే కుమిలి పోతున్నది విజయ. రెండు రోజుల నుంచీ జగన్నాధం కూడా రావటం లేదు. పోనీ అతని ఇంట్లో ఏమయినా ఉన్నదేమో! వెదుకుదామనిపించింది ఆమెకు.
జగన్నాధం తన వాటాకు ఏనాడూ తాళం వెయ్యడు. అందులో ఏముంది గనుక? విజయ అతని వాతాలోనికి పోయి చూసింది. మూడు రోజుల నాటి అన్నం ఎండిపోయి ఉట్టి మీద వేలాడు తున్నది.
అది తీసుకొచ్చి కడిగి కొంచెం సేపు నీళ్ళలో ఉంచి, అమ్మకం కాని అవకాయతో రెండు ముద్దలు తిన్నది. కానీ ఇమడ లేదు. ఒట్టి కడుపులో ఎండిన అన్నం పడేసరికి వాంతి అయింది. మెదలకుండా నులక మంచం మీద పడుకున్న విజయ కు అడుగుల చప్పుడు వినిపించి కళ్ళు తెరిచింది.
"వదిన గారూ, నమస్కారం."
విజయ లేవలేక పోయింది. ఏదో చెప్పాలను కున్నది కూడా. చెప్పలేక పోయింది.
నాగేశ్వర్రావుకు సర్వమూ అర్ధమయింది. ఈమె క్షుధాతుర. అరగంట లో కాఫీ నీళ్ళూ తెచ్చి ఆమె చేత తినిపించాడు అతను. అభిమానవతి విజయ అంగీకరించలేదు మొదట.
"నేను పరాయి వాడినా చెప్పండి. ఎందుకింత కక్ష మీకు?' అన్నాడు అతను. అతని కళ్ళలో నీరు తిరగటం చూసి తెల్లపోయి చేయి సాచింది విజయ. అతని వెళ్లు ఆమె వేళ్ళకు తగిలినయ్. కాని ఇప్పుడు కాల్చుకునే ఓపిక లేదు. ఆ అహంకారమూ నశించింది. ఒక అరగంట గడిచే సరికి విజయ తేరుకుంది.
"మిమ్మల్ని వదినా అని పిలవాలని ఉంది. గారూ అన బుద్ది కావటం లేదు.
"అలాగే అనండి."
"అయినా భయమే."
'అదీ తెలుసు."
"ఎలా తెలుసు?"
"అది మీలో ఉన్న అహంకారము. మీరెప్పుడూ ఏ స్త్రీ తోనూ సహజంగా ప్రవర్తించరు. స్త్రీ పురుషుల మధ్య సహజ సుందరమైన అనుబంధాన్ని గురించి మీకు అర్ధం కాదు" అంది విజయ. ఆ తరువాత తనన్న మాటలకు తనే సిగ్గు పడింది. విజయ మూర్కురాలనుకుంటున్న నాగేశ్వరరావు తెల్లపోయినాడు. నిజమే. తనింత వరకూ స్త్రీల గురించి తప్పు అంచనా లేస్తూ వచ్చాడు.
"మీ నా అనుబంధంలో అసహజతే ముంది?" అన్నాడు చివరికి.
";లేకపోవచ్చును. మీరు వచ్చే ముందు దొంగతనం చేసి తిన్న అన్నాన్ని కక్కుకున్నాను. మీరు దయతో యిచ్చిన ఆహారాన్ని స్వీకరించాలంటే సిగ్గుపడ్డాను. కాని యిప్పుడు మీకు ఋణ పడి ఉన్నాను."
నాగేశ్వరరావు విజయ చెప్పేది శ్రద్దగా వింటున్నాడు. విజయ మళ్ళీ అంది--
"మానవుడు తన అంతర్యాన్ని గురించి మరీ మరీ ఆలోచిస్తాడు. కాని అతనికి తెలిసిందీ అర్ధమయ్యేది తక్కువ. ఈ జీవిత నటనం ప్రతి అంకంలోనూ ఒక కొత్త అలంకారం ధరిస్తుంది. అలా కాని రోజున రాయికీ, డానికీ ఏ విధమైన భేదమూ ఉండదు. నిజం చెప్పాలంటే నాలాగా ఏ స్త్రీ కూడా తన భర్తను ప్రేమించి ఉండదు. నా అంతర్యం నా భర్తకే అంకితం అనే గర్వం అధికం గానే ఉండేది నాకు. కాని, ఇప్పుడిప్పుడే కొంచెం మారుతున్నది మనసు."
"ఎలా?"
"ఇలా అని విడమరిచి చెప్పటం కష్టం. అంతర్యంలో ఉండే అనుభూతు లకూ, మనసులో ఉండే ఆదర్శాలకూ , హృదయంలో ఉండే ప్రేమకూ లంగరందదని తెలుసుకున్నానను కుంటాను."
"వీటన్నిటి సమగ్ర స్వరూపం ఏదో? మన అనుభవానికి అందని అనుభూతి ఉందను కుంటాను" అన్నాడు నాగేశ్వరరావు విజయ విజ్ఞానానికి ఆశ్చర్యపడుతూ.
"అయి ఉండవచ్చును."
"ఇవన్నీ మీకెలా తెలిశాయి?"
"నా బ్రతుకే వీటిని తెలిపింది."
"మిమ్మల్ని నేను అమితంగా విశ్వసిస్తున్నాను వదిన గారూ. ప్రపంచంలో ఏ మగవాడు కూడా ఏ విధమైన అనుబంధమూ లేకుండా స్త్రీ ని ఇంతగా విశ్వ సించడనుకుంటాను. మరి పరిచయం కూడా స్వల్పమే. అయినా మీరంటే నాకు విశ్వాసం పోలేదు......."
విజయ బలహీనంగా నవ్వి "మనిషి మనిషే కాని దేవత ఎన్నడూ కాదు. మనిషి మీద అంత విశ్వాసం పనికి రాదు' అన్నది.
"అదేమో నాకు తెలియదు. తెలుసుకోవాలని అనిపించటం లేదు. అనుభవమే నా విశ్వాసానికి ప్రాతిపదిక." "మీ పరిచయం వలన చెడు వెనకల మంచి ఉంటుందనేది పూర్తిగా తెలిసింది."
"ఆ చెడులోనే చాలా జీవితం గడిసి, అలిసిపోయి, పవిత్రత కోసం వెతుక్కుంటున్న నాకు హటాత్తుగా మీరు జ్ఞాపకం వచ్చారు. ఇంతకాలంగా గడిపిన జీవితాన్ని ఒకసారి పర్యావలోకిస్తే నామీద నాకే అసహ్యం కలుగుతున్నది. బ్రతుకులోని అపవిత్ర ప్రకరణాలను చించి వేసి, కొత్త కధను ప్రారంభించటం ఎలాగో అర్ధం కావటం లేదు. ఎన్నిసార్లు ఆలోచించినా దీనికి నిష్కృతి కనిపించలేదు. దీన్ని మీరు క్షమిస్తారా? వదిన గారూ?"
విజయ మాట్లాడలేదు. మొన్న జగన్నాధం అదే మాటన్నాడు. తప్పుల్నీ, అవినీతి ని క్షమించాలి. కాని ఆరోజున క్షమించలేనని స్పష్టంగా చెప్పి వేసింది. ఈనాడలా చెప్పలేక పోతున్నది కారణం?
"మీ పరిచయం తో నా బ్రతుకు మరో దారి పట్టింది. స్త్ర్టీ పవిత్రత మీలో ఉందన్న విషయమే నాకు శాంతినీ, గర్వాన్నీ యిస్తున్నది. తద్వారా, నా మనస్సు, నిర్మలమూ, నిశ్చలమూ అయింది. చీకటి పోయి ఏదో ప్రభాతం వ్యాపించి నట్లుంది." అన్నాడు నాగేశ్వర్రావు . విజయ తెల్లపోయింది. తను పాపాన్ని క్షమించలేదు. పాపాల్ని భరించను లేదు. స్త్రీ పవిత్రత విషయంలో ఇన్ని అనుమానాలున్న వాడిని కూడా చూడలేదు తను.
"క్షమించా లేరా నన్ను?"
"ఊహూ!"
విజయ లేచి చివాలున లోపలికి నడిచింది. నాగేశ్వర్రావు తెల్లపోయినాడు. అతనిలో అహం కారం తిరిగి మరొకసారి పడగ విప్పింది. ఏమిటీ ఈవిడ అహంకారం? ఈ పవిత్రతా గర్వాన్ని తన మాటల చేత తనే హెచ్చు చేశాడు. ఈవిడ క్షమ యింత విలువ గలదా? అనిపించిందతనికి. మెదలకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
లోపలికి వెళ్ళిన విజయ చాలాసేపు ఆలోచించింది. ఎవరైనా తప్పు అనేది ఎందుకు చేస్తారో ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. అయినా కూడా ఎవరయినా ఎదురుగుండా వచ్చి తప్పుకు క్షమా అర్ధిస్తే ఇవ్వలేక పోతున్నది తను. చిన్నతనంలో తన తల్లి తండ్రుల నుంచి నేర్చుకొన్న కఠోర గుణం యిది.
తన తండ్రి కావటానికి గృహస్తే గాని అంతర్యంలో సన్యాసి. ప్రతి క్షణమూ, పురాణాలు, పురుష సూక్తాలూ పఠిస్తూ కాలం గడిపేవాడు. అన్ని కామాటాలను కాలదన్ని భగవంతుడి నామ సంకీర్తనానికి అంకితమై పోయేవాడు. తను అయన కుమార్తె. తనూ ఆ విధంగానే నిశ్చలంగా జీవించాలను కుంటుంది. కాని తన తండ్రి పాపాలను ఎలా తలిచే వాడో తనకు తెలియదు. తనకు మాత్రం అతనంటే తగని భయం. తప్పులన్న తరువాత ఎప్పుడో ఒకప్పుడు శిక్ష అనుభవించక ఎటూ తప్పదు. ఈ ఆలోచనలో ఉండగానే వాకిట్లో భర్త వచ్చిన అలికిడి అయింది. ఆదరాబాదరా వాకిట్లోకి వచ్చింది విజయ. ఇదివరకు లాగానే యిప్పుడు కూడా త్రాగి వచ్చాడు జయప్రదరావు.
