Previous Page Next Page 
మనిషి - మిథ్య పేజి 12


    హెడ్ క్లర్కు నుంచి ప్యూను వరకూ ప్రతీ వాడూ వాళ్ళని అలక్ష్యం  చెయ్యడం నేర్చుకున్నారు. ఒకప్పుడు వాళ్ళూ కొత్తవాళ్ళే, కొత్తవాళ్ళయన తర్వాత వసంతా ఒక్కసారిగా ఎలా తెలుస్తుందనే యింగితం లేకుండా వీళ్ళని దెప్పి పొడుస్తూ "మే మందరమూ ప్రయోజకులం, ది చేస్తాం, ఇది పొడిచేస్తాం" అంటూ ప్రగల్భాలు పలకడమూ అలవాటయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో మరొకడూ మరొకడూ అయితే ఏనాడో కాలికి బుద్ధి చెప్పి ఉండేవాడు. నలుగురూ ఒకటై ఒకే మాటమీద నడుస్తున్నారు గనుక, ఎదురు నిలిచి తట్టుకోగల సత్తా ఉన్నది గనక - దేన్నీ ఖాతరు చెయ్యకుండా నెట్టుకోస్తున్నారు.
    శంకరం చక్కటి కథలు రాస్తున్నడనే విషయం తెలిసి, అతనిపైన ఈర్ష్య చూపడం మొదలెట్టారు. ఒకడు బాగుపడుతున్నాడంటే విని బాధపడే జనం ఆ ఆఫీసులో చాలామంది ఉన్నారు.
    వాళ్ళ చుట్టూ వాళ్ళే ఒక చిన్న పరిధి గీసుకుని అదే లోకమని భావించే మానవులూ ఉన్నారు. వాళ్ళకి తెలిసిందల్లా బజార్లో వీసెడువంకాయ లెలా యిస్తున్నారనే విషయ మొక్కటి! ఇలాటి వాళ్ళతో ఏది మాటాడినా చిక్కే మరి.
    మొదట్లో ఈ వాతావరణాన్ని అసహ్యించుకున్నారు నలుగురూ. తర్వాత సర్దుకోడం అలవాటు చేసుకున్నారు. పదిమంది మధ్యా తమ మాటకి విలువలేనప్పుడు గొంతు చించుకుని తమ గోడు చెప్పుకుంటే ఏం లాభం? లక్ష్మీపతి అంటాడు.
    "అయినా వంద మాటల్తో పనేమిటి గురూ? ఒక్క వాత చాలదూ? ఆ రోజు వస్తుంది, వాతాపెడతాము. అంతవరకూ సహనం కావాలి. లెటజ్ వెయిటండ్ సీ!"
    ఒకరోజున టైపిస్టుమీద ఆకాశ మంతెత్తున లేచి ఎగిరి పడ్డాడు శాస్త్రి. ఆ సమయానికి ఆఫీసరు లేకపోవడంతో, అతని మాటలు ఆఫీసంతటికీ విని పించేలా అరిచేశాడు. ఇంతా వింటూ నోరు నొక్కుకు కూర్చున్నాడు హెడ్ క్లార్కు. ఆయన గ్గూడా శాస్త్రి నెదిరించే ధైర్యం లేకపోవడం దారుణమే మరి.
    అసలు జరిగిన విషయం యిది. కుసుమ అని ఓ టైపిస్ట్ ఆ ఆఫీసులో పనిచేస్తుంది. ఆవిడకు రెండు రోజులు సెలవు కావలసివచ్చి అర్జీ పెట్టింది. సెలవు మంజూరయ్యింది గాని, శాస్త్రి చిరాకు మాత్రం తారస్థాయిని అందుకుంది.
    "మీరిలా సెలవుమీద సెలవు పెట్టేస్తే ఆఫీసు పొజిషనేంగానూ అని 'ఆయన' మండిపడ్డారు. ఏదో చెప్పి సేంక్షన్ చేయించాను. మీరేమో టెంపరరీ కేండిడేట్ ఈ తాత్కాలిక ఉద్యిగానికే సెలవులు మీ యిష్టం వచ్చినట్టు పెట్టేస్తే ఎలా? మీరు మీ పద్ధతి మార్చుకోవాలండీ" అని అన్నాడు.
    పాపం, ఆవిడ తలొంచుకుని ఓపిగ్గా అతను అన్న ప్రతి మాటనీ జాగ్రత్తగా ఆలకించింది. అతని ధోరణి చూస్తుంటే ఆఫీసరులా మాటాడాడు. అసలీ విషయంలో అతనికేం సంబంధం? సంబంధం ఉన్న ఆఫీసరు ఏమన్నాడో నిజానికి ఎవరికీ తెలీదు. శాస్త్రి తన చేతికి చిక్కిన అవకాశాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నాడు. సాక్షాత్తు తనపైనుద్యోగి, ఆఫీసరు తర్వాతే ఆఫీసారంతటి వాడు హెడ్ క్లర్కుని తన ముందు పెట్టుకుని పెత్తనం చెలాయించడం అతని వళ్ళో పడ్డ అవకాశం కాదూ?
    కుసుమ తన సీట్లోకెళ్ళి కూర్చుంది. కూర్చున్న దన్న మాటేగాని దించిన తలని మళ్ళీ ఎత్తనే లేదు.
    లంఛవర్లో ఈ విషయమై శాస్త్రి తన బృందానికి లెక్చరిచ్చాడు. మధ్యమధ్య విట్లూ గట్రా వాడుతూ. వింటూ కొందరు నవ్వేరు, కొందరు హర్షించేరు, మరికొందరు మవునంవహించేరు.
    "ఈ పద్ధతి నాకేం బాగులేదు" అన్నాడు శంకరం.
    "ఒకడికి బాగుండేడ్చిం దేవిటీ" అన్నాడు పతి.
    "వాళ్ళవి రోజులు గురూ!" ప్రసాదం మాట అందించాడు.
    "అదీ చూద్దాం!" అన్నాడు పతి కసిగా.
    -మరో గంటకి ఆఫీసయిపోతుందనగా ఆఫీసరు ఇంటికి వెళ్ళిపోయారు. శాస్త్రి హెడ్ క్లర్కు సీటు దగ్గర నుంచుని పతిని పిలిపించేడు. పతి వెళ్ళాడు.
    "మీరు వేళకి అన్నట్టు సరిగ్గా అయిదు గంటలకే వెళ్ళిపోతున్నారు గదూ!" అన్నాడు శాస్త్రి.
    "చిత్తం" పతి వినయం నటించాడు.
    "మాకు రెండు సంవత్సరాల సర్వీసున్నది. హెడ్ క్లర్కుకు చెప్పందే ఈరోజు వరకూ మేము యింటికి వెళ్ళము."
    "అలాగా."
    "చాలా సీరియస్ గా చెప్తున్నాను. మీరు మీ యిష్టం వచ్చినట్టు వెళ్ళిపోడానికిది ఆఫీసనుకున్నారా? లేక ...." శాస్త్రి రెచ్చిపోయాడు.
    "కాస్త ఆగండి" మాట మధ్యని అడ్డు పడ్డాడు పతి.
    ఏమిటన్నట్టు అతనివైపు చూశాడు శాస్త్రి.
    "మీకు కందముక్కా, కత్తిపీటా ఈ రెండు వస్తువులు తెలుసా?" అని తాపీగా అడిగాడు పతి.
    ఈ మాటలో ఆఫీసులో అందరూ ఉలిక్కిపడ్డారు. తర్వాత సంభాషణ ఎలా జరుగుతుందో వినాలని కుతూహల పడ్డారు.
    "మాకూ చాతనవును మాటలు" అన్నాడు శాస్త్రి ఏమనాలో తోచక.
    "అలాగా పాపం! మరేమీ లేదు. మన తెలుగులో ఈ రెంటి గురించీ ఒక చక్కటి వాడుకున్నది, కందకు లేని దురద కత్తిపీట కెందుకూ అనటాని చెప్పుకుంటారు" అన్నాడు పతి.
    శాస్త్రి బిక్కమొహం పెట్టాడు. చివరి సీట్లో కూర్చున్న ప్రసాదం ఫక్కున నవ్వేసి తల వంచుకుని సీరియస్ గా గీతలు గీస్తున్నాడు.
    హెడ్ క్లర్కు గుటకలు మింగాడు.
    "మిష్టర్ పతి మీరిక మీ సీట్లోకి వెళ్ళండి" అన్నారాయన.
    "అయితే మీరు చెప్పదలుచుకునేది ఏమీ లేదుగా. దట్సాల్ రైట్" అంటూ పతి తన సీట్లోకి వొచ్చి కూర్చున్నాడు. అతను కూర్చున్న తర్వాత హెడ్ క్లర్కు ప్రసాద్నా పిలిచేరు. ప్రసాదం అతి వినయాన్ని నటిస్తూ హెడ్ క్లర్కు దగ్గర కొచ్చాడు.
    "మిష్టర్ ....."
    "ప్రసాదరావ్."
    "ఐనో మేన్!"
    "దెన్ థాంక్స్."
    మరింత బిత్తరపోయారు హెడ్ క్లర్కు. కాస్త ఆలస్యంగా అన్నారు.
    "ఇది ఆఫీసనుకున్నారా? మీ కాలేజీ అనుకున్నారా?"
    "ఆఫీసనుకున్నాను సార్!"
    "మరి మీ నవ్వు లేమిటీ, ఆ గోలేమిటీ?"
    "మరేనండి-ఉన్నమాట అన్న తర్వాత మెచ్చుకోలేక ఉండలేం చూడండి మరి."
    "ఊ మీరప్పుడే పెద్దవాళ్ళయిపోతున్నారు."
    "మరేనండి. ఈ ఆఫీసులో అందరూ అదే అవుతున్నారండీ ...... ఇదంతా ఎందుకుగాని సార్.....ఏమైనా చెప్పదలుచుకుంటే, మేము చేసింది తప్పని మీకు తోస్తే మీరు చెప్పండి. వింటాం. ఆఫీసర్తో చెప్పించండి. తప్పయితే దిద్దుకుంటాం. అంతేగానీ ప్రతివాళ్ళూ మామీద అధికారం చెలాయించాలంటే మాత్రం- గొప్ప కష్టం లేండీ!"
    ప్రసాదం ఇంత ఉద్రేకంగా మాటాడుతాడని ఆఫీసులో ఎవరూ అనుకోలేదు. ఈ హఠాత్పరిణా మానికి  అందరూ ఆశ్చర్యపోయారు. హెడ్ క్లర్కు ముఖం చిన్నబోయింది. ఆయన ఏమీ మాటాడలేక పోయారు.
    ఆఫీసైన తర్వాత నలుగురూ యధావిధిగా బయట కొచ్చేరు.
    "మన తిరుగుబాటుకీ రోజు నాంది" అన్నాడు పతి.
    "మరే...... మనం నల్లులం, దోమలం, చీమలం అని తేలిగ్గా చూస్తుంటే మనకేనా ఆత్మాభిమానం లేనిది" అన్నాడు ప్రసాదం.
    "వసుధా, హెడ్ క్లర్కు మంచివాడే ఆయన్ని పాడుచేస్తుంది ఈ శాస్త్రి."
    ఇంటికొచ్చిన తర్వాత ఆఫీసు విషయాలు మరి కొన్ని మాటాడుకున్నారు. వాటిల్లో కుసుమ విషయం వచ్చింది. ఆమెను చాలామంది చాటుగా గేళి చెయ్యడం విన్నారు. ఆమె ఎల్లాటి పరిస్థితుల్లో ఈ ఉద్యోగం చేస్తోందో ఆమెకీ, దైవానికీ తెలియాలి గాని ప్రచారంలో ఉన్న వదంతి ఇది : ఆమె భర్త ఆమె శీలాన్ని శంకించి విడిచి వెళ్ళి పోయాడనీ, ఉద్యోగం చేస్తూ గూడా తన పెడదారి వదలిపెట్టలేదని గూడా అంటున్నారు. దీనిలో నిజం, నిజాని కెవ్వరికీ తెలీదు.
    చాలాసేపు ఆవిడ విషయమే మాటాడుకున్నారు. ఆ తర్వాత ముగ్గురూ హోటల్ కి, ప్రసాదం వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళిపోయారు.
    తర్వాత రోజు ఆఫీసులో చాలా మార్పు వచ్చింది. ఎవరి పని వాళ్ళు మౌనంగా చేసుకుపోయేరు. వాతావరణం ఇంత హఠాత్తుగా మారినందుకు సంతోషించేరు మిత్రులు నలుగుతూను. రోజూ ఇంత హాయిగా గడుస్తే ఎంత బాగుంటుందని గూడా అనుకున్నారు.
    ఆ సాయంత్రం రూంలో బాతాఖానీ జరుగుతూండగా ప్రసాదం హఠాత్తుగా లేచి,
    "వొస్తా ...... నా కవతల బోల్డు పనుంది" అన్నాడు.
    "ఏమిటో విశేషం" అడిగాడు పతి.
    "మొన్న మా అత్తయ్య వచ్చింది గురూ!"
    "అవుతే."
    "మే మందరం కలసి సినిమాకి వెళ్ళాలి" అన్నాడు ప్రసాదం.
    "అన్నట్టు నీ పెళ్ళి భోజనం మా కెప్పుడు పెట్టిస్తావయ్యా మహానుభావా! హోటల్ తిండి తినలేక చస్తున్నాం" అన్నాడు పతి.
    "పోవయ్యా మహానుభావా! నీతో ఏం మాటాడినా గొప్ప చిక్కు" అనేసి గబగబా వెళ్ళిపోయాడు ప్రసాదం.
    రూంలో నవ్వులు ప్రారంభమయ్యాయి.
    
                                     *    *    *

    జీతాలిచ్చే రోజు.
    జీవితంలో తొలిసారిగా జీతం పుచ్చుకున్నాడు శంకరం. ఆవేళ అందరి మొహాల్లోనూ కళాకాంతులుట్టిపడుతున్నాయి. రూపాయిని నయాపైసలా చూస్తున్నారు. ఎవరో కొంతమంది దురదృస్టవంతులు మాత్రం బిక్కమొహం వేశారు. నెల పొడుగూతా చేసిన అప్పులు తీర్చుకునేసరికి వాళ్ళ తల ప్రాణం తోకకి వచ్చింది. అప్పులిచ్సిన ఆసాముల కాళ్ళా వేళ్ళా పడి మరో నెలకి వాయిదా వేయమని కోరుకోడం, వడ్డీ తీసుకుంటూ గూడా వాయిదా పెంచడం యిష్టంలేదన్నట్టు అవతల వాళ్ళు విసుక్కోవడం చాటుగా, గుట్టుగా గోడవతల సాగుతూనే ఉన్నాయి.
    ఏ బాదరబందీ లేని గుమాస్తాలకి వచ్చిన జీతాన్నెలా ఖర్చుపెట్టాలో తెలీక తికమక పడుతున్నారు.
    మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చుపెట్టుకోడానికి ఈ బెజవాడ మంచి అనువైన ఊరు. నాలుగు డబ్బు లుండాలే గాని, కాలం సరదాగా గడవటానికి ఏ ఆటంకమూ రానేరాదు. కావలసి నాన్ని థియేటర్లు, వాటిల్లో తరచూ మారు తూండే సినిమాలూ, హోటళ్ళు వగైరాలకు కొదువలేదు.
    జీతం పుచ్చుకున్న మిత్రులు నలుగురూ కాంటీన్లో కూర్చుని ఆ సాయంత్రం ప్రోగ్రాం ఆలోచించడంలో మునిగిపోయారు. చివరికి ప్రసాదం సూచించిన ప్రోగ్రాం ని అందరూ ఆమోదించారు. లీలామహల్లో హేమాహేమీ లందరూ కలిసి నటించిన 'గన్స్ ఆఫ్ నెవరోస్' సినిమాని పావనం చెయ్యాలని ప్రసాదం ప్రతిపాదించాడు. గ్రెగరీ పెక్, డేవిడ్ నివెన్, అంథోని క్వీన్ లూ వాళ్ళ నటనా చాతుర్యమూ గురించి తనకు తెలిసినదంతా చెప్పి ఆ సినిమాకి వెళ్ళడానికి వాళ్ళనీ వప్పించాడు.
    సాయంత్రం కార్యక్రమం నిర్ణయించుకుని బయట కొస్తూండగా కుసుమ వాళ్ళకి ఎదురైంది. ఎందుచేతనొ ఆమె తమని చూస్తూ తటపటాయించడం గమనించారు. ఆమె శంకరాన్ని ఉద్దేశించి-
    "మీతో కాస్త పనుంది" అన్నది.
    శంకరం ఆగిపోయేడు. మిగతా మిత్రులు ఆఫీసులోకి వెళ్ళిపోయారు.
    "నాకో చిన్న సాయం చేయగలరా?" కుసుమ అడిగింది.
    "చెప్పండి."
    "మా యింటిదగ్గర మావయ్య ఉన్నాడు. ఆయనకీ మద్యనే పక్షవాతం దాపురించడంవలన ఆర్ధికంగా యిబ్బంది పడుతున్నారు. రెండు రోజుల క్రితం అత్తయ్య ఉత్తరం వ్రాసింది. ఒక వంద రూపాయలుంటే సర్దమని. వందరూపాయలిచ్చే స్తోమతు నాకు లేదు, నా అవసరాలు తీరగా ఒక ఏభై రూపాయలు మాత్రం పంపగలను. తతిమా పైకాన్ని ఎవర్నయినా అడిగి తీసుకుందామంటే- అడగ్గానే యిస్తారనే నమ్మకం నాకు లేదు. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో అడక్క తప్పింది కాదు. ఒక్క ఏభై రూపాయలు సర్దండి. ఆ పైకం మెల్లిగా చెల్లించుకుంటాను."
    శంకరం వెంటనే జవాబు చెప్పలేదు.
    "మీకూ అవసరాలుంటే పోనీండి" ఆమె సిగ్గుపడుతూ అన్నది.
    "ఉహూ ...... ఇప్పట్లో తల మునిగే అవసరాలేమీ లేవు లెండి. వచ్చినా-ఆదుకునేందుకు మావాళ్ళున్నారు." అన్నాడు నవ్వుతో. అయిదు పది నోట్లను ఆమె చేతిలో పెట్టాడు. ఆవిడ తీసుకుంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS