పీటలమీద కూర్చునేటప్పుడే "మీకు ఇష్టం అని పెసరపప్పు పచ్చడి చేసేను" అంది.
టొపేరం ఎగిరిపోయింది మధుకు. క్షణికం కళ్ళు మూసుకున్నాడు. పెదిమలే కదిలేయి.
నాలిక్కరుచుకుంది శాంత. అపచారం అన్నట్లే బాధ పడింది. సత్యకే అర్ధం కాలేదు ఈ ఉప్పెనలా క్షణికంలోని మార్పు. మధువైపు చూస్తే స్పృహతప్పిన స్థితి. శాంత అపరాధం అన్న దృష్టి. ఈమధ్య మౌనంగా ఉన్న స్థితి ఏమిటి? ఏమిటీ ఇంట్లో ఉన్నది? తన్ను బరువుగా, ఇరుగ్గా కూర్చోపెడుతూంది? లోపల్లోపల కుదిపేసే భయం.
చిన్నగా నవ్వుతూనే, నమస్కారం పెట్టుకుని, ఔపోసనం పట్టేడు. లోపలే అనుకున్నా "చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ" శాంత వింది.
"మీరు కూడా........"
"ఆ అమ్మ మా కులదైవం" అన్నాడు.
"నాది పొరపాటే అయ్యింది. పెద్ద చదువులు చదివేవారికి ఈ పూజలు, పునస్కారాలు, అనుష్ఠానాలు ఉంటాయని ఊహించలేదు."
"అదొక్క టేకా మనకిమిగిలింది?" అనేసేడు.
జీవితంలో సత్య ఎప్పుడూ ఈ విషయాన్ని గూర్చి ఆలోచించలేదు. అసలు దేవుడు, పూజలు అన్నీకూడా తాత్కాలికమైన పిరికితనాన్ని పోగొట్టుకుందుకు అన్న భావంలోనే ఉంది. అని అంతర్గతంగా విజ్రుంభణ చేస్తాయని, ఒక్కసారి దాసోహం అంటే, ఇక నెత్తి కెక్కి కూర్చునే నిషా వస్తుందన్న దృష్టే మనిషి వ్యక్తిత్వం దెబ్బ తీసే మహమ్మా రులచే గట్టి నమ్మకంకూడాను. అందువల్లే తను ఎక్కువ కాలం మనస్సును వాట్లమీదకు పోనివ్వలేదు. అరికట్టుకుంది, తుక్కు అనుకుంటూ. ఈనాడు తెలియకుండానే ఆవ్యక్తం కుమిలింది, ఇదికాదు వాట్ల అర్ధం అంటూ. అది ఈ ఇంట్లోనే ఎందుకు కలగాలి? ఏ శాంతనైతే తను చిత్రవధచేసి, చిత్తు చెయ్యాలనుకుని వచ్చిందో, ఆమెను చూడగానే తనలో ఎవరో ప్రవేశించినట్లు సంభూతి కలిగింది. అది ఎక్కడో అణిగి మణిగి ఉన్నాను, తలెత్తుతున్నా అన్న ఫణీంద్రంలాగే తట్టింది. చీకట్లో అల్లాడుతున్నట్లుగా ఉంది.
"అయినా కర్మ ఒకటి వుందికదా?" అన్నాడు మధ్యలో.
"దాన్ని నమ్ముతారా?"
"ముమ్మూర్తులా నమ్మాలి. దాని బలాబలాలు, ఎగుడు దిగుడులు, ఎప్పుడో, ఎక్కడో చేసుకున్న ఫలితమే, ఈనాటి అనుభవం. అది ఒప్పుకోవడమే ఈనాటి సందిగ్ధత."
"మరి, మామగారు, కర్మక్షయం కోసమేను ఈ నిష్ఠ, నియమం, జపం, అని అంటూ వుంటారే?"
"నిజమే! కొంతగతం పునాదివుంటే, ప్రేరణ చేసే కర్మని హరింపచేసుకుని, ఓరోజు జమలేదు అన్నవతులో మానవ ప్రయత్నపు ఆశే."
"అయితే ఈ జన్మ పూర్వజన్మ ప్రవాహ క్రమమే అయితే....." ఇక మాట్లాడలేదు శాంత. వెనుక గభీరమైన లోయలు దాగి ఉన్నట్లు ఆగింది.
"మీరు నమ్ముతారా?" మధ్యలో సత్య అడిగింది. కంఠం డెక్కు పట్టింది.
శాంత మాట్లాడలేదు. జవాబు ఇవ్వలేదు. మధు ఇరుకున పడ్డాడు.
"అది మనం నమ్మలేని అజ్ఞానంలో వున్నాం" అనేసి తప్పుకున్నాడు.
సత్యకు వెలక్కాయ అయ్యింది. ఎల్లాగైనా మాటల్లోకి రాజు విషయం తీసుకురావాలన్న ఆయత్తత కలిగినా, అది రాకుండా, దూరంగా నిల్చుని ఉండిపోయింది. కాని ఆనాటి రాజు అన్న మాటల్లో అర్ధం, భావం, ఇప్పుడు సాంబ్రాణి అయి చర్చించబడుతున్నాయి. ముక్కు క్షోణాలు బిగియకట్టే ఆధ్యాత్మికపు అంశం అది. వీళ్ళిద్దరూ కూర్చుని టీకా, తాత్పర్యం అన్న సమీక్షకు పూనుకున్నట్లు, ఆ బాష, పరిజ్ఞానం తన ఆవృత్తి దాటిన బిరిలోనే నడుస్తున్నట్లు తట్టింది.
"రాజు విషయం తీసుకో. ఏమిటి, వాడిలో కొట్లాట? నిలవనియ్యకుండా ఉండే ఆ శక్తి ఏమిటి? ఆ చైతన్యంగా వెతుక్కుంటున్నది దేన్ని? తల్లిపోయిన పచ్చిదినాలు. ఇంట్లో మేనరికం చేసితీరాలన్న పట్టుదలలు. డబ్బు ఉన్నా అక్కరలేని విముఖత. సహజంగా తెలివితేటలు వున్నా చదువుయందు ఆసక్తి లేదు. ఆఖరుకు 'భోజనం చెయ్యలేదేం' అన్నదికూడా జ్ఞాపకం చెయ్యాలి ఒకరు. అంత పరాకు. ఏమిటి, ఇది, పిచ్చి ఎత్తటం లేదుకదా అనుకుంటారు. కాని....." ఆగేడు; కనుకొలకుల్లోంచి సత్యను చూస్తూనే.
"ఆఁ!" అనే నోరు తెరిచింది.
"పూర్వపుణ్యం. ఇది నువ్వు నమ్మకపోవచ్చు. అదే ఇంత చిన్న వయస్సులోనూ, జన్మల రహస్యాన్ని కదల్చి, అణగారిపోయిన తంత్రిని తట్టి లేపింది. ఆ కంపనానికి తట్టుకోలేకనే ఇల్లు, చదువు, నావారు అన్న భావనేపోయి, దేశాలు పట్టేడు. ఆ కళ్ళవెనుక పిపాసల్లో వెతుక్కుంటున్నాడు. ఎక్కడ? ఎల్లా? ఏమిటి? ఈ శూన్యంలో దిక్కులు పిక్కటిల్లేటట్లు మధన పడుతూ పిక్కటిల్లుతున్నాడు.
"ఒక్కటే ఆశయం. అవి తెలుసుకోవాలి. తెలుసుకున్నందువల్ల ప్రయోజనం వుందా, లేదా అన్న సమీక్ష వద్దు. ఎందుకనవచ్చు. ఇటువంటి జ్ఞానమే అరుదు. నమ్మశక్యం కాదు. అదే వేరువిధంగా నిర్వచించాలంటే పతన జన్మల ఫలితంలోని పునరపిజన్మ అంటే నువ్వు నమ్మవు.
"మనం, మన చదువులు, షేక్ప్సియర్ నాటకాలు, మిల్టన్ స్వర్గపతనాలు, వర్డ్స్ వర్తు ప్రకృతికూడా మనలను చెంచాలతో వ్యామోహం పెంచి పీకలదాకా, మన శాస్త్రం, ధర్మాలు, దైవాల్ని పాతిపెట్టించాయి. ఒట్టి అసభ్యంగా, హేళనగా కన్పడుతాయి ఇవన్నీ.
"ఇదీ రాజు అతన్ని ఏవిధంగా ప్రపంచం అర్ధం చేసుకోగలదు? నువ్వుమాత్రం?"
శాంత అతికుతూహలంతోనే వింది. సత్యకు కళ్ళు చెమర్చేయి. వంగి విస్తట్లో అడ్డుపెట్టుకుంది. మారు అడగాలి అన్న తలంపే కలగలేదు శాంతకు.
"కాని ఒక్కటే దుఃఖం కలుగుతుంది వాడిని తలుచుకున్నప్పుడెల్లా వాడు ఎవరివాడూ కాలేడేమో! నువ్వూ, నేనూ, రావూ, రామచంద్రయ్యా, దశరధం వీళ్ళంతా వాడి దృష్టిలో మధ్యలో ఆ బలవత్తరమైన కర్మ త్రోస్తే, ప్రవేశించే మేమో! మన పాత్రలు మనం ఆడి నిష్క్రమణే అయ్యేమేమో అనుకునే కాలం వచ్చిందేమో.
"వాడు వాడే ఒక్కడూ, ఏకాకిగా మధన పడుతూ ఈ రహస్యం, యుగాలనుండి దాచుకున్న సృష్టి సమ్మేళనంలో కీలకం తెలుసుకోవడానికే అన్వేషిస్తాడు. అది సఫలం కావచ్చు; కాకపోవచ్చు. ఏది ఏమైనా భౌతికపు కట్టె కదిలినంతకాలం వెతుక్కుంటూనే వుంటాడు. ఓనాడు......ఓనాడు..... అదీ......"
ఇక చెప్పలేకపోయేడు. కంఠం బాగా జీర పడింది. కన్నీళ్లు అరిటాకులో పడ్డ చప్పుడు రుంజలాగే ప్రతిధ్వనించింది. సత్య బావురు మనలేని జీవి అయ్యి కొంగుతో ముఖం దాచుకుంది.
"కాదూ ముమ్మాటికీ కాదు." హుంకరించి అనిమిష శక్తులన్నీ సంపుటి అయి, స్వరమేళం చేసినట్లే శాంత అరిచింది.
వణికిపోయి కళ్ళప్పగించేడు. ఏమిటీ సత్యం శాంత చెప్పింది అన్న పిడచకట్టే ఆవేదన నెమ్మదిగా క్రమ్ముకుంటూనే-
"అతనే మీ ఇంటికి వచ్చి, ఓ రాత్రి వుండి, పరారీ అయ్యేడు" అని నెమ్మదిగానే అన్నాడు.
"ఆ!" అన్న ఆశ్చర్యంలో అన్నా, "వారు.....వారు నా పసుపూ కుంకుమా, మరిదీ" అనేలోపలికి వెళ్ళిపోయింది.
సత్య లేచి వెళ్ళింది. మధుమాత్రం తినలేని వ్యంజనాలవైపు చూచి, ఉత్తర ఔపోసనం పెట్టి లేచేడు. వంటింటి గుమ్మంలో నించుని పూజాపీఠం వైపే దృష్టి కేంద్రీకరించిన శాంతను కౌగలించుకుంది. పొదివిలో ఇమిడి పోయి, కన్నీళ్లు పెట్టింది.
ఆ స్థితిలో వాళ్ళిద్దర్నీ చూచేసరికి మధుకు కళ్ళు చెమర్చేయి. రెండు మూడు వత్సరాల నుండి, ఎరిక ఉండి, సామీప్యత చెందిన సత్యలో రాజు అంటే తనవాడవుతాడు తాళికట్టి అన్న భావన చెలరేగి ఉంది. ఇక శాంత కొద్ది రోజుల క్రితమే రాజును చూచి, గతజన్మల వాసనలను వెదజల్లుకుని, భర్త పీఠానికి తగిన గౌరవం ఇచ్చి, ఆదర్శం అయ్యింది. ఇవి నిజంగా చూస్తే విరుద్ధ ప్రవృత్తులే. అవి కలవవు. కలిసినా బ్రహ్మాండం బద్ధలవుతుంది సాముదాయిక లోకంలో.
సత్యకు తెలియకపోలేదు. "రాజు తన భర్త" అన్నా శాంత దాన్ని ససాక్షికంగా నిరూపించి లోకానికి చెప్పలేదు. చెప్పి రాజును తన వాడుగా చేసుకోలేదు. ఎంతో విరుద్ధంగా ఉన్న వయస్సు తేడా వెక్కిరించినట్లుంది. ఇది లోకం ఆమోదించదు. పైగా అవధాని జగజ్జెట్టీలా పురాతన హైందవధర్మ సంప్రదాయాలను కాపాడుతున్నాడు. అల్లాంటివాడు ఈ విషయంలో స్వార్ధంగా ప్రవర్తిస్తే తలెత్తుకు తిరగలేడు. పైగా ఈనాడు రాజు నియోగి కుటుంబంలో పుట్టి, రామచంద్రయ్య దంపతుల కొడుగ్గా పెరిగేడు. చలామణీ అయ్యేడు. అవధానిది వైదిక సంప్రదాయం. గోత్రం వేరు. శాఖ విభిన్నం. ఆచారాలు విరుద్ధం ఈ స్థితిలో రాజు తనవాడు అనుకుని కోడలికి పసుపుకుంకుమ దిద్దలేడు.
కాని ఒక్కటే భయం. రాజులో విప్లవం, వైరుధ్య సమ్మేళనం ఏ దారి త్రొక్కుతుంది? తన పాత్ర ఏ అంకంలో ముగుస్తుంది? మంగళం పాడేవరకూ తను ఉపచ్చయంలోనే ఉండిపోతుందా? హారతే పుచ్చుకుంటుందా?
"వారు నిన్నంతగానూ ప్రేమించేవారా?" శాంతే అడిగింది.
"ఆయనలో పవిత్రతకు దాసోహం అన్నా."
"వెర్రి పిల్లా!" అనే వీపు నిమిరింది.
"ఆయనకు నీమీద అంత మక్కువ కాబోలు." అవకాశంలోకి చూస్తూనే అంది శాంత.
ఠావుల్ తప్పేయి. తన అంతన్ను మాట్లాడుతూందన్నట్లు, రహస్యం బట్ట బయలవుతూంది.
"నువ్వో?" ఓటమి అంగీకరించలేక అంది.
మెళ్ళో కట్టుకున్న తాళిబొందు పైకి తీసి 'ఇదీ' అన్నట్లు చూపించింది.
తల తిరిగిపోయింది. దుఃఖం వెల్లువలా ఉబుకుతూంది. ఏమనీ సమాధానం చెప్పి అనునయం చేసుకోలేదు. మౌనంగానే ఊరు కుంది.
"నాకు తెలుసు, నువ్వు నాతో దెబ్బలాడైనా, ఆయన్ని తీసుకువెళ్ళి, నీవాడుగా చేసుకోవాలనే వచ్చేవు. ఆయన నీ సొత్తన్న అభిప్రాయంలో ఉన్నావు.
"దీనికి నేనేం అడ్డురాను. నా విధివ్రాత ఎల్లా ఉందో అల్లా జరుగుతుంది. దాన్ని స్వీకరించడానికి నాకు ధైర్యం ఉంది. ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఏండ్ల వైధవ్యం నాది, సంసారం ఎరగని జీవితం నాది. నా నమ్మకంలో నేను సధవనే అన్నా లోకం ఒప్పుకోదని వైధవ్యంలో గడిపేను.
"ఆ మనస్సులో ఉన్న గాఢ నమ్మకం రూపొందుతున్నట్లే ఆయన రావడం జరిగింది. ఇది మరిచిపోకు. అందువల్ల రేపటి జీవితం ఏమైనా నాకు చింతలేదు."
