Previous Page Next Page 
ఆరాధన పేజి 12


    ఆమె అన్నంలో చేయిపెట్టింది. కమ్మటి వాసన-ఆకువైపు తదేకంగా చూచింది. రెండు ఆదరవులు- పచ్చడి వేసున్నాయి. తన గిన్నెలో పప్పు పులుసుంది. పగిలిపోయిన మొండి కప్పులో గట్టిపెరుగుంది. ఇలాంటి భోజనం తిని ఎన్ని సంవత్సరాలై గిర్రున ఆమె కళ్ళలో నీరు తిరిగింది.
    భోజనం ముగించి. "ఎన్ని సంవత్సరాలకు తిన్నానో తల్లీ-చాలా వడ్డించేశారమ్మ.
    ఆమె వెళ్ళిపోయింది మరుసటిరోజు నాలుగు గంటలయ్యాక వచ్చింది.
    "ఏం సుబ్బమ్మా? నిన్న సాయంత్రం మీ యింటికేసి వచ్చాను. ఏదో పుస్తకం చదువుతున్నావు - ఏం పుస్తకం?
    "టాల్ స్టాయ్ కథల సంపుటి-అమ్మగారూ" అంది కూచుంటూ.
    "ఎంతవరకు చదువుకున్నావు?"
    ఆమె మౌనం దాల్చింది. ఎందుకు చెప్పాలి? ఏం లాభం-తెలిసికొని ఆమె ఏం చెయ్యగలదు? గతాన్ని త్రవ్వుకుంటే తన జీవితంలో అంతా అంధకారమే గాని ఒక్క కాంతికిరణం లేదు కదా? మంజుకేసి చూస్తుంటే తన గాథనంతా చెప్పాలని ఆరాటం కల్గింది. ఇంతకాలం ఎవ్వరికి కూడా చెప్పను సాహసించలేనిది ఇవ్వాళ మంజులకు చెప్పాలనుకుంది - దానికి ఆమెకే ఆశ్చర్యం వేసింది.    
    "బి. ఏ, జూనియర్"
    "ఆ" అంది మంజు విస్తుపోయి "ఆ" వెనుక జాలి, బాధ దాగివున్నాయి.
    కొన్ని నిముషాలు మౌనం గంభీరంగా రాజ్యం చేసింది.
    "చదువుకున్న దానివి? నీకీగతి ఎలా పట్టింది? ఎక్కడైనా ఆశ్రమంలో చేరలేక పోయావా?"
    "అంతా అయిందమ్మా' ఆమె కనుకొలకుల్లో నీరు నిల్పింది. చీర కొంగుతో ఒక్కమారొత్తుకుంది. నా చరిత్ర ఇంతవరకు ఎవ్వరికి చెప్పలేదు. మీకు చెప్పాలని నా మనసు చెబుతోంది, విని-మర్చిపోండి తల్లీ- కోస్తాలో ఉత్తరాన వుండేది మా స్వగ్రామం. మా తండ్రి గారు హైస్కూల్లో మేష్టారు, స్త్రీ విద్య విషయంలో శ్రద్ధ వహించారు, నాకు చదువు చెప్పించారు, బి.ఎ. రెండవ సంవత్సరంలో వుండగా మా తండ్రిగార్కి పక్షవాతం రావటంతో నా పెళ్ళి తప్పనిసరిగా చేయవలసి వచ్చింది. నాకు తోబుట్టువులు లేరు. నా పెళ్ళి మా స్వంత బావతో జరిపించారు, చిన్నప్పటినుంచి మా నాన్న మా అత్తయ్యలకు మాటల్లేవు. ఆయన జబ్బు పడటంతో రాజీ పడ్డారు. అందుకని ఆమెపై నాకు ప్రత్యేకాభిమానం వుండేది. పెళ్ళయిన నాల్గు సంవత్సరాలకు నాకు ఇద్దరు పిల్లలు కల్గారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. నా భర్తకూడా మేష్టారే. ఏదీ, లోటు లేకుండా జరిగిపోయేది. ఆనందం సంపూర్ణత్వం చెందింది. నాకిక కావలసిందేమీ లేదు. ఉన్న దాన్లో సర్దుకుని ఏ లోటు లేకుండా దినాలు వెళ్ళబుచ్చుతున్నాము.
    పల్లెలో పండ్లతోట వుండేది మా అత్తగారు మా దగ్గరే వుండేవారు. అవసానకాలం సమీపించింది. పల్లెలో, స్వగ్రామంలో, స్వంత ఇంట్లో ప్రాణం పోవాలట. ఆశను కాదనలేక అందరం వెళ్ళాము. ఆ తోటలో చిన్న ఇల్లుంది, అది కొన్ని సంవత్సరాలుగా ఎవ్వరు వాడక పాడు పడినట్లుండేది తోటమాలికి పూరిల్లు వున్నా - అతని సంసారం ఈ ఇంట్లోనే వుండేదిట. ఆ విషయం తెలిసి శుభ్రం చేయించమని రాసి- తర్వాత మా అత్తగార్ని తీసికొని వెళ్ళాము. వారు ఎంతకాలం వుంటారు? పెట్టిన సెలవు అయిపోగానే వెళ్ళిపోయారు. పిల్లలిద్ధర్నీ కూడా తీసికొని వెళ్ళారు, అంత చిన్న పిల్లలైనా తండ్రితో వెళ్లేందుకాటంక పర్చలేదు. నాకు కూడా పిల్లల్ని ఆ పల్లెలో వుంచాలనిపించలేదు. అంతా ఆ దైవసంకల్పం, ఉన్నట్లుండి మా అత్తగారు ఆరోగ్యవంతులయ్యారు. స్వంత ఇల్లు వాకిలి, పుట్టిన, మెట్టిన గడ్డ -ఆమెకెంతో ఆనందంగా వుండేది కాబోలు. మా తోట వూరికినాలుగైదుమైళ్ళ దూరంలో వుండేది. జనసంచారం వుండేదికాదు. కానీ బస్సురోడ్డు దగ్గర- ఎప్పుడూ బండ్లు నడుస్తూ నిర్విరామంగా సందడి స్తూనే వుండేది. యజమానులుండటంతో తోటమాలి శ్రద్ధగా పని చేసేవాడు. అలా ఆరు నెలలున్నాము, కూరగాయలు అవీ పండించటంతో మాకు ఆ ఏడాది డబ్బు బాగానే ముట్టింది. మా అత్తగార్కి బాగున్నట్లుగా వుంది. ఇక అక్కడ వుండటం అనవసరమని ఇంటికి తిరిగొచ్చేశాము ఆ ఇల్లు. తోట కౌలుకిచ్చి వచ్చేశాము.
    ఇల్లు చేరిన మూడు నాల్గురోజులకు చేతుల మీద తెలుపాటి మచ్చలు కనిపించాయి. ఏదో అనుకున్నాము. స్పర్శలేక, వెంట్రుకలు లేక స్వేత రహితమైన ఈ మచ్చలు చూచి మొదట భయపడింది, మా డాక్టరుగారు, ఈ జబ్బు నాకెలా వచ్చిందని ఎంతో ఆశ్చర్యపడ్డారు. తరువాత తెలిసిందనుకోండి. ఆతోట యింటి వెనుక, ముందు వరండాల్లో రాత్రుళ్ళు ఎవరెవరో వచ్చి వండుకునే వారని" కొందరు అక్కడే వండుకు తినేవారని-తోట మాలికి ఏదో ముట్టజెప్పేవారని అంటే మాలిమా నించి చాలా విషయాలు దాచాడన్నమాట. నాలుగైదుచోట్ల నా చర్మాన్ని కోసి చిన్న ముక్కలు తీసి. కుష్టరోగుల ఆసుపత్రికి తీసుకెళ్ళామన్నారు. మావారు వెళ్ళి మూడవనాటి కంతా తిరిగొచ్చారు. వారి ముఖం చూడగానే నాకంతా అవగాహనమైంది, ఒక్కసారి భూమి బ్రద్దలై నన్ను మ్రింగినా బావుండుననిపించింది. ఇకపై నేను వారికేమీకాను-ఒక రోగిని-పరాయిదాన్ని-స్పృహతప్పి పడిపోయాను. లేచి చూచేసరికీ అక్కడే వున్నాను. మా అత్తగారు కాస్త దూరంలో కూచుని వున్నారు-డాక్టరు అనుమానం తెలిసి నప్పటినుంచి నాకుగానునేను అందరికి దూరంగా వుండిపోయాను- కానీ- అమ్మా - పిల్లల్ని దగ్గరకు తీసికోకుండా - అంటకుండా వుండటం సహింపలేక పోయాను కన్నీరు కరువై పోయింది. మమత చంపుకున్నాను. జీవితం మీద విరక్తి కలిగింది. నేనే పాపం చేశానని నాకీ శిక్ష? ఈజబ్బు త్వరగా ఎవ్వరికీ అంటదు. అయితే నాకంటింది.....భగవంతుని అనకుండా ఎలావుండగలను?.... అంతే మరుసటిరోజు కావలసిన సామానులతో బయలు దేరాను.....ఆమె ఆవుజేసింది, వికృతంగా మారిన ఆ ముఖములో ఏనాటి బాధ తాండవం చేస్తోంది. మంజు జాలి గొలిపే చూపులతో చూస్తోంది. ఆయన నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఒక్కమాట నన్ను అజ్ఞాతంగా వుంచటానికి ఆయత్తం చేసింది. నా పిల్లల భవిష్యత్తు నాశనం కాకూడదు. వారికోసం నేను సర్వం త్యజించి దూరంగా వుండిపోవాలి....వారికోసం నేను ఈ త్యాగం మాత్రం చేయగలను అనుకున్నాను.....అమ్మా ఈ జబ్బు వంశపారంపర్యంగా రాదు. పిల్లల్ని మాలాంటివారికి పుట్ట గానే తల్లినించి దూరంచేసి పెంచుతారుకదా? ఇది అంతత్వరగా అంటే అంటువ్యాధి కాదు గదా! చదువుకన్న పెద్దలే చూస్తూచూస్తూ కుష్ట రోగికి పుట్టిన బిడ్డల్ని చేసికోరు....ఆలాంటప్పుడు నా బిడ్డల భవిష్యత్తు సౌభాగ్య వంతంగా వుంటుందన్న నమ్మకం ఏమిటి?

                              *    *    *

    నా పరిస్థితి అంత దిగజారిపోలేదు. మందు డి డి ఎస్. కొంటూనే వుండేదాన్ని. ఇది ఎంత చౌకనో అంత ఎక్కువ కాలం తీసికొంటుంది బాగుచేయటానికి. పాపం - కొందరు ఎంతో వికలాంగులై పోయేవారు మానని కురుపులు. తినివేయబడి లేక వంగిపోయిన వ్రేళ్ళతో- స్పర్శజ్ఞానం లేక పోవటంచేత రాత్రుళ్ళు ఎలుకలువచ్చి వ్రేళ్ళ చర్మాన్ని-కాల్చి వ్రేళ్ళను తినేసి పోతుండేవి పిల్లుల్ని పెంచే వాళ్ళంతా ఎంతో లోతుగా కండలు. కొరుక్కు పోయినా నొప్పి తెలిసేది కాదమ్మా.....ఇదంతా మీకు తెలుసు...ఐనా ఏదో చెబుతున్నాను. అదంతా జ్ఞాపకానికొస్తోంది. ఐదు సంవత్సరాలు న్నాను.....ఆరోజు శుభదినం పెద్ద డిగ్రీపుచ్చుకునే రోజున ఎంత ఆనందాన్ననుభవిస్తామో అంతకు వెయ్యిరెట్లు సంతోషంతో వున్నాము మేమంతా పదిహేను మందిమి.

             
    పెద్ద డాక్టరు వచ్చి సర్టిఫికెటు చదివి సంతకం-ముద్రవేసి చేతికిచ్చారు అదే మా డిగ్రీ.  డాక్టర్ డిగ్రీ....?" ఆమె పగలబడి నవ్వింది. ఆ నవ్వులో ద్వేషం-కోపం-జుగుప్స దుఖం కల్సి మిళితమై వున్నాయి, ....32.....పం.......స్త్రీ......ఐదేళ్ళు మందుతీసికొని బాగుపడినది.....నెగటివ్.....ఈమెవల్ల సంఘానికి ఏ హానీలేదు..." అంటే నాలోని జబ్బుచని పోయింది తిన్నని పుల్ల ఆ కారములో వుండే ఆ క్రిములు సజీవంగా లేవు. అందరిలా ఆరోగ్యవంతురాలివి. నా పరిసరాలు హేయమైనవి కావు. నేను తిరిగి సంఘంలోకి వెళ్ళిపోవచ్చు వెంటనే మేము అనుకున్న భాషలో వైర్ ఇచ్చాను. సామాను సర్దు కున్నాను వారి రాకకోసం ఎదురు చూస్తున్నాను. వారిని చూచి మూడు సంవత్సరాలైంది నాపిచ్చి -ఎంతో ఆశ పెంచుకుని కనిపెట్టుకుని చూశాను. ఇక ఆసుపత్రిలో మాలాంటి వారికి తావు లేదు తెల్లారితే మాదారి మేము చూచుకోవాలి ఆ రాత్రి టెలిగ్రాం వచ్చింది... ఒక్కోమాట సమ్మెటపోట్లే అయ్యాయి "నువ్వు రావద్దు .....నీ పిల్లల భవిష్యత్తు చూడు.....రెండవ భార్య ఇద్దరు పిల్లలున్నాం....మిమ్మల్ని నాశనం చెయ్యకు..." గుండెలు వేయిప్రక్కలయ్యాయి. ఎక్కడికైనా వెళ్ళిపొమ్మని వందరూపాయలు పంపాడు.....ఏం చెప్పను తల్లీ-నేనింకా రోగినే. నా సర్టిఫికెట్టు చిత్తుకాగితం మాత్రమే! లక్ష రూపాయల చెక్కు కానీ అది చెల్లదు....దమ్మిడీకి విలువలేదు అన్ని జబ్బులు నయమైనాక మనిషిలో మార్పుండదు కదా విశ్రాంతి సరైన ఆహారం తీసికొంటే మామూలు రూపం వచ్చేస్తుంది. ఇదేమిటి? పోతూపోతూ తన జ్ఞాపకార్ధం కొన్ని చిహ్నాలను చిరస్థాయిగా మాలో వుంచి వెళ్తుంది. నేను భాగయ్యాను - మామూలు మనిషి - అని మొత్తుకుని సర్టిఫికెట్టును చూపించినా నమ్మరు -నమ్మినా చేరదీయరు. నాకు బోధపడిన సత్యం యిది. నా ఆశలన్నీ అడియాశ లయ్యాయి నా ఆనందం నీటి బుడగ అయింది ఎవరికోసం బ్రతకాలి?
    డబ్బు చేతిలో పడగానే అజ్ఞాతంగా వెళ్ళి నా పిల్లల్ని చూచివచ్చాను. ఆయన స్టేషన్ కొచ్చి ఎక్కించారు. వందరూపాయలిచ్చారు నా కిలా అయిందనగానే అంతా అమ్ముకుని పట్నంలో స్థిరపడిపోయారు. అక్కడికివెళ్ళి చూచివచ్చాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS