Previous Page Next Page 
ఆరాధన పేజి 12

 

    అనూరాధ లోన అడుగు పెట్టగానే హరికృష్ణ బుంగ మూతి పెట్టుకుని కూర్చున్నాడో మూల అంతవరకూ అరిచి గోల చేస్తున్నా వాడల్లా ఆగిపోయి. నర్సు సెలవు దీసికొని వెళ్ళిపోయింది. జోగులు నిదరోస్తోందంటూ క్రిందికి వెళ్లి పోయాడు. అనూరాధ హరికి కోపం వచ్చిందని గ్రహించింది.
    క్రింద విసిరి వేయబడిన పుస్తకాలనూ' తలగడలనూ, తీసి ఎప్పటిలా సర్దింది. అంతవరకూ నోరు విప్పనే లేదు డాక్టర్.
    అమ్మ కోసం అలిగిన పసి బిడ్డలా ముఖం ముడుచుకుని కూర్చున్నాడు మంచం మీద వో మూల. అనూరాధ కూడా అతని నేమీ మాట్లాడించనే లేదు. భోజనం తెచ్చి టేబిల్ మీద వుంచి 'రండి' అన్నది.
    'రాను. ఏం చేస్తావేమిటి! నువ్వంటే నాకేం భయం! లేదు. తెలుసా? నీ మాట విననిక! ఆ! అంతే!' కోపం వో మెట్టు దిగబోతోంది.!
    'వినవద్దు లెండి! ఆకలి వేసినప్పుడు అన్నం తినకపోతే ఆరోగ్యం చెడి పోతుంది. మీరు అన్నం తినకపోతే నేనిక్కడ నుంచి వెళ్లి పోతాను.'
    ఆ మాట అనగానే లేచి వచ్చాడు హరికృష్ణ. ఏం తింటున్నాడోతెలియడమే లేదతనికి. అయిదు నిమిషాల్లో భోజనం పూర్తయిందన్పించాడు. మధ్యలో మాట్లాడించితే మళ్లీ ఏం గొడవ వస్తుందో నని మౌనంగానే వుండి పోయింది అనూరాధ అంతసేపూ.
    ఆ రాత్రి అతడాపైన ఎక్కువగా విసిగించకుండానే నిదుర బోయాడెందుకనో. వంట యిల్లు సర్ది తాళం వేసి వచ్చేసరికి పది గంటలు కొట్టింది గడియారం. అలసిన ఆ అనురాగ మయి హృదయం విశ్రాంతి తో విలీనమై పోయింది నడుం వాల్చగానే.

                                      7
    ఆరోజునే అనూరాధ పరీక్షా ఫలితాలు ప్రకటించ బడ్డాయి. శారద 'ఫోను' లోనే కంగ్రాచ్యులేషన్స్' తెలిపింది. ఆమె ఫస్టు క్లాసులో ప్యాసయినందుకు. తరువాత ఆఖరి సంవత్సరం బి.యస్.సి మద్రాసు లోనే చదవ మన్నది.
    'ఉహూ! ఇక చదవ లేనక్కా! భాద్యతలు పెంచుకుంటూ పొతే హృదయం విశ్రాంతి లేక నలిగి పోతుంది.' అని మృదువుగా తన వుద్దేశ్యాన్ని తెలియజేసింది.
    హరికృష్ణ తో అన్నదా రోజున --
    'మీ హరి కృష్ణ గారి అనూరాధ బి.యస్. సి రెండో సంవత్సరం ఫస్ట్ క్లాసు లో ప్యాసయింది. ఏం బహుమతి యిస్తారు మరి?' హరికృష్ణ తల ఎత్తి ఆమె వంక చూశాడో క్షణం సేపు.
    'హరికృష్ణ ఏమిటీ వ్రాసుకున్నాడు తన డైరీ లో ! ఆ!.....
    'ఆమె నా ఆరాధ్య దేవత--- అందుకే నా జీవితాన్నే కానుకగా అర్పించు కుంటాను' చూశావా/ ఎంత చక్కగా వ్రాశాడో! ఇపుడు నేను మాత్రం నీకేమీ ఇవ్వలేను రాధా! నీ నుంచే స్వీకరించుతా నేదైనా , నేనేం జేసినా నన్ను క్షమించు. దూరంగా పారిపోవద్దు నా నుంచి ఎంత పెద్ద అపరాధం జేసినా --' అతనిలో గత్మ్సృతులు లీలగా కదులుతున్నాయి.
    ఈమధ్య హరికృష్ణ అంటే మీరేనని అనూరాధ నచ్చ జెప్పిన మీదట ఎంతో సేపు ఏదో ఆలోచించుకుంటూ నిశ్శబ్దం లో విలీనమై పోతున్నాడు. అనూరాధ మాట్లాడినపుడు 'నేనెక్కడ యిలాంటి స్వరమే విన్నాను రాధా! అవును....ఆ ..ఆహా...కాదు....గుర్తుకు రావడం లేదు' అంటున్నాడు కొన్ని సార్లు. అతని ప్రవర్తనలోని మార్పులన్నింటిని శారదకు తెలియబరచింది అనూరాధ.
    'మళ్లీ ఎప్పటి మనిషి కాగలరేమో!' అన్నది ఆశా భావంతో.
    'లేదమ్మా! అది అంత సులభ సాధ్యం కాదు. అమెరికా లో వున్న అయన స్నేహితుడికి వ్రాసి కనుక్కున్నాము. ఆపరేషన్ అవసర మంటున్నాడాయన.' శారద చెప్పలేక చెప్పింది.
    'కానీ...' అర్దోక్తి లో ఆగిపోయింది శారద కావాలనే.
    'నాకు తెలుసు అక్కా! ఎవరి కోసం ఆయనను మళ్లీ మామూలు మనిషిగా మలచాలంటావు. నువ్వు! ఆపరేషన్ ప్రమాద కరమైనదని తోస్తోంది నీ మాటలు వింటుంటే . కానీ నీ చెల్లాయిగా మనస్సు విప్పి చెబుతున్నాను --' వో క్షణం ఆగిందామె--
    'ఈ మనస్సున ఏ మూలనో వో భావన బయలుదేరిందో మధుర క్షణాన . ఆ చిన్ని భావనే నా జీవితాన చిత్రమైన మలుపుల్ని అల్లుతోంది. ఎన్ని అవాంతరాలూ, అభాండాలు వచ్చి నెత్తిన పడినా అయన నుంచి దూరంగా జరిగి సుఖాన్నందుకోలేనన్పించుతోంది. అందుకే -- అక్కా! నా కోసం తిరిగి మనిషిగా మార్చమని అడుగుతున్నాను.'
    శారద తృప్తిగా విశ్వసించింది. అనూరాధ కనులలో కనులుంచి అనురాగ పూర్ణ స్వరంతో అన్నది --
    'నీ మనస్సున అనురాగం మధువు లోలికించుతోంది అనూ! బావ నిజంగా అదృష్టవంతుడు. వెన్నెల కన్నా చల్లని మనస్సునే అందుకుంటూన్నాడు. వచ్చే నెలలో ఆపరేషన్ చేయిద్దామని వుంది. మరి నువ్వే మంటావ్?'
    'అంతవరకూ ఆకరుణా విభవుడైన మధుసూదనుడ్నీ ప్రార్ధించు తుంటానక్కా! ఇకనైనా డాక్టర్ గారి జీవితాన మల్లెలు విరియాలని, నవ్వులు పండాలని వెన్నెల నిండాలని------'
    'అమ్మ దొంగా! ఎంత ఆశ?! అందులూ నీకూ సగ భాగం వుందనా! అంత అందమైన కోరిక కోరుకున్నావు!' పరిహాస మాడిందామె.
    ఆ మృదువైన పరిహాసోక్తి అనూరాధ హృదయాన ఆనందాన్ని చిందులు వేయించింది. మధురానుభూతులేన్నింటి నో స్ప్రుజించింది మనస్సున.

                                 *    *    *    *
    రాజు , అన్నపూర్ణమ్మ గారు వచ్చారా నాడు. క్రింద ఖాళీ గా వున్న రెండు గదుల్లో వుందామని నిశ్చయించు కున్నారు. అనూరాధ రాజును కాలేజీ లో జాయిన్ చేస్యాలని నిద్చయించు కుంది. తల్లితో తన మనసున దాగి వున్న మధుర రహస్యాన్ని చెప్పివేసిందా మరునాడే---
    'అమ్మా! హరికృష్ణ గారి జీవితం నామూలన ఆనందాన్ని నింపు కుంటుందని తెలుసుకున్నాను. నిర్మలమైన అంతరంగం ఆయనది. అందుకే యిన్ని అభాండాలను కూడా సహించి నీ కూతురిగా ఆయనకు తోడుగా నిలిచి నడిచి పోదామని అనుకుంటున్నానమ్మా! అందుకు నీ నుంచి తప్పకుండా ఆశీస్సులు లభించుతాయనే నమ్ముతున్నాను.
    'నాకు తెలుసు! కన్నా! మంచితనానికి నా తల్లి మనస్సు మందిరమేనని. ఈ సంధ్యా సమయాన అంతకన్నా ఆనందం నాకే ముంటుందమ్మా !' ఆ అనురాగ మయి అంతరంగం ఆనందంతో నిండిపోయింది.
    'చూడమ్మా! ఒక మాట! రేపో మాపో డాక్టర్ గారి అత్తయ్య వస్తుంది . ఆవిడ యీ అనూరాధను అవమానంచాలానే వస్తోంది. ఆ అవమాన భారం నా హృదయాన నిండి వన్న నిర్ణయానికే అడ్డూ నూ అల్లలేదు. కానీ నీ మాతృహృదయం బాధపడుతుంది. అందుకు నన్ను క్షమించు. ఆ బాధనంతా దిగమ్రింగి నాకోసం నవ్వుతూ వుండాలమ్మా!' అన్నది అనూరాధ.
    బరువుగా విశ్వసించిందా మాతృమూర్తి సమాధానంగా.
    శారద అన్నపూర్ణమ్మ గారు వచ్చారని తెలియగానే చూడవచ్చింది. ఆమె శారద ను చూడగానే ఆప్యాయత విరిసేట్టు నవ్వింది. వాత్సల్యంగా రమ్మని ఆహ్వానించుతూ. శారద ఆమెను 'అమ్మా' అనే సంభోధించుతోంది.
    'అమ్మా! అనూరాధ పైన కొండంత బరువు వుంచవలసి వచ్చింది. ఎపుడో నీతో చెప్పాలను కున్నాను. కానీ అనూ మనస్సున ఏ వూహలు వూయలలూగుతున్నాయో తెలియనేదేన్నాళ్ళు! అందుకే ఆలస్యం జరిగింది. క్షమించగల అమ్మవనే అంత భారాన్ని నీ అంగీకారాన్ని అందుకోకుండానే చెల్లాయి పైన వుంచాను' అన్నది శారద.
    'పిచ్చి తల్లీ! ఏ అక్క, చెల్లెలి జీవితాన మల్లెలు విరిసి, వెన్నెల నిండాలని కోరుకోదు?! అందులో కోరరానిదేముందమ్మా ! నీ లాంటి అక్క 'అనూ' కి దొరికినందుకా మాధవుడి కి వేల నమస్కారాలు చేస్తున్నాను. పిచ్చి వూహలతో , అపార్ధాలతో అనురాగాన్ని దూరం చేసుకోకూడదు. అనూరాధ నా కూతురే గాదమ్మా! నీ చెల్లెలని కూడా గుర్తుంచుకో. ' ఆప్యాయత వెల్లివిరిసిందా మాతృమూర్తి కంఠనా.
    ఆ సమాధానం శారద కనుల నిండుగా ఆమె యెడల గౌరవాన్ని నింపింది. అనూరాధతో మాట్లాడి వెళ్తానంటూ లోనికి వెళ్ళిందామె అనూరాధ వో లావుపాటి పుస్తకాన్ని ముందు వేసుకుని కుస్తీ పడుతోంది కూడికలతో. శారద రాకను గమనించనే లెదామే. వంగి చూసింది శారద.
    అంతే! ఆమె స్థాణువు లా స్తంభించి పోయింది. ఎంతోసేపు కనుల ముందు నక్షత్రాల్లా మెరుస్తూన్న అంకెలే కన్పించుతున్నాయి. ఎప్పటికో ఆశ్చర్యాన్నుంచి తేరుకుని అన్నది--
    'అనూ! ఇదా నువ్వు ఎన్నాళ్ళ నుంచో వ్రాస్తున్న చిత్రగుప్రుని చిట్టా! నేనేం వ్రాస్తుందా అని అనుమానించుతూనే వున్నా నెప్పటి నుంచో. ఈ లెక్కలు ఎవరికి ఎప్పుడు చూపించుతావో కొంచెం చెప్పమ్మా! జీవన సర్వస్వాన్ని నీ చేతుల్లో ఉంచిన మనిషి నిన్ను పైసాతో సహా ఏం చేశావని నిలబెట్టి ప్రశ్నించుతాడని అనుకుంటున్నావన్నమాట! అంతేనా?'
    'అక్కా! కోపం వద్దు. నా మాట విన్న తరువాత తప్పు వుందని భావించితే శిక్షించు. ఆ హక్కు నీ కెప్పుడూ వుంది. ఇది లోకం, అయన పిచ్చి మనిషి! నీరజ మనుషుల్లో లెక్క గాదు. అందుకే ఆస్థి కోసం ఆశించి ఆ డాక్టర్ని పెళ్ళాడింది అనగలదీ గుడ్డి లోకం. అదీగాక అమ్మా, రాజూ యిక్కడే వుంటున్నారు. ఆ అపోహకు వాళ్ళ వునికి బలాన్ని అందించుతుంది. అందుకే ఎపుడు, ఎందుకు ఎంత ఖర్చు పెట్టినది వివరంగా వ్రాస్తున్నాను. తప్పేనంటావా? అక్కా?!'
    'అనూ! నిజంగా నాకెంతో ఆనందంగా వుందమ్మా! నాకింత అపురూపమైన అనురాగమయి , చెల్లెలిగా లభించు తుందని కలలో కూడా అనుకోలేదు. బావ ధన్యుడౌతాడు నీ సాహస చర్యలకు.' ప్రశంసించింది శారద.
    'ఇదిగో! అనూ! మన సంఘం లోకి రేపే ఆ తారాజువ్వ దిగుతోంది. అంటే అర్ధం తెలియడం లేదు గదూ! తారాజువ్వ అంటే శకుంతల మ్మ గారు. బావ మేనత్త గారన్న మాట. నెల్లూరి నుంచి వచ్చిన స్నేహితురాలికి కన్పించి చెప్పిందిట. ఈ యింటిని స్వర్గంగా మార్చి వేస్తుందట ఆ మహా యిల్లాలు ' వ్యంగ్యం స్పురించిందా మాటల్లో.
    'అనూరాధ పై మరో గాలివాన , రాళ్ళతో సహా యుద్దానికి తయారై వస్తోందన్న మాట! సరే! రానివ్వు! గెలుపు ఎవరిదో చూద్దువు గాని.' పెదవులపై మందహాస రేఖ మెరుపులా మెరిసింది.
    శారద వెళ్ళిపోయిన తరువాత ఆలోచనలు చుట్టూ ముట్టాయి అనూరాధను. ఏ క్షణాన హరికృష్ణ ఆ అనురాగమయి జీవితాన అడుగు పెట్టాడో గానీ అప్పటి నుంచీ ప్రశాంతత పారిపోయింది నిశ్శబ్దంగా. అంత బాధను ఏ మధుర మూర్తి కోసం ఆమె మనః స్పూర్తిగా భరించుతుందో అతడు పిచ్చితో మరో లోకం లో విహరించు తున్నాడు.
    మనస్సు విప్పి చెప్పనీయడు. చెప్పిన దెంత మధురమైనదైన చెవిని వేసుకోడు. కనులలో కనులుంచి 'రాధా! నువ్వెవరివి? నాకేమౌతావు?' అంటాడో సారి అనురాగం కోసం పరితపించుతూ.
    ఆమె పెదవుల నుంచి అక్షరం రాబోతుంది. 'అగు! నాకు తెలుసులే! నువ్వు నువ్వే! నేను నేనే! అంతే! నేనూ + నువ్వూ = నవ్వులు +పువ్వులు అయితే బావుంటుంది గదూ! అయినా అలా ఎందుకు జరుగుతుంది. నువ్వు నాతోనే వుంటావని నమ్మకం లేదుగా!' అంటాడు.
    ఆమె మనస్సున కదులుతున్న తీయని వూహలు చెల్లచెదురై పోతాయి ఆ ధోరణి తో, బరువుగా నిట్టూర్చి సంభాషణ మరో వైపుకు మళ్ళించుతుంది.

                                  *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS