10
"హెలెన్ లింగరాజు ని ప్రేమించిందా?' అని అడిగాను సారధి ని.
"లేదు." అన్నాడు నిశ్చయంగా సారధి.
"నీకెలా తెలుసు ?'
"హెలెన్ లోకంలో నన్ను ఒక్కడ్నే ప్రేమిస్తుంది."
"మరి లింగరాజు ని ఎందుకు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంది?"
"అదే అర్ధం కావటం లేదు. బహుశా నన్ను బెదిరించటానికి కావచ్చు. నామీద పగ తీర్చుకుంటా నికి కావచ్చు. లేదా ఎవరినో ఒకర్ని పెళ్లి చేసుకుని, అందరి లాగే సంసారం చేయాలని స్త్రీ కి సహజంగా ఉండే కాంక్ష కావచ్చు ."
"నువ్వెందుకు చేసుకోకూడదు హెలేన్ని?"
సారధి మాట్లాడలేదు. ఏ విషయం మాట్లాడాలో, ఏ విషయం మాట్లాడ కూడదో సారధి కి బాగా తెలుసు. అంతేకాదు, అతని కిష్టం లేని పని అతని చేత చేయించటం బ్రహ్మతరం కాదు.
* * * *
సారధి ఉద్యోగం కోసం ప్రయత్నించటం లేదు. టాల్ స్టాయ్ నవలలు రెండు అనువాదం చేసి, అయిదు వందలు సంపాదించాడు. ఆ డబ్బంతా పబ్లిషర్ ఒకసారి ఇవ్వలేదు. అప్పుడప్పుడు పదీ పాతికా, ఒకటి రెండు సార్లు యాభై చొప్పునా తెచ్చుకునే వాడు. వారాని కోసారి గుంటూరు వెళ్లి వస్తుండే వాడు. గాంధీ నగరం లో రూం అలాగే అతని కింద ఉండేది. అప్పుడప్పుడు వచ్చి నాకు కనిపించేవాడు.
ఒక నవల వ్రాస్తున్నాడ ప్పుడు సారధి. మధ్య మధ్య వచ్చి నవలని గురించి పాత్రల గురించి , సంఘటన లను గురించి నాతొ చర్చించి పోతూ ఉండేవాడు.
రచయిత కుండే ముఖ్యమయిన ఆత్మ సంతృప్తి కి కారణం తన రచనలు చదివిన పాఠకులు, ఉత్తరాలు వ్రాయటం. ఒక పాఠకుడు "మీ రచన చదివి పరవశత్వం అనుభవించాను" అని వ్రాసినప్పుడు ఆ లేఖ రచయితకు గొప్ప టానిక్ లా పని చేస్తుంది. అతనిలోని చైతన్యం మరింత జాగరితమౌతుంది. అతనిలోని సృజనాత్మక శక్తి పదింతలౌతుంది.
ఆ లేఖ వ్రాసింది ఆడపిల్ల యితే?"
ఆ రచయిత పురుషుడైతే?
ఒక యువ రచయిత వ్రాసిన కధను చదివి పరవశత్వం అనుభవించిన ఒక పెళ్లి కాని పిల్ల, అందమూ, ఆడంబర మూ, సిరిసంపదలూ అన్నీ ఉన్న రాకుమారి లాంటి కన్య ఆ ఉత్తరం రాసిందనుకోండి అప్పుడా యువ రచయిత సంరంభం ఎలా ఉంటుందో నాకు తెలుసు.
అంత కాకపోయినా, అంతలో కొంతయినా సంరంభం ఇటీవల సారధి లోనే చూశాను. సహజంగా సహానం గలవాడైనా , ఆ ఉత్తరాలకి కనిపించే టంతగా పొంగాడు సారధి.
సారధి 'గిగంతాల కు' అనే నవల వ్రాశాడు.
ఆ నవల చదివిన ఒక ఆడపిల్ల సారధి అడ్రసు కనుక్కొని ఉత్తరాలు వ్రాయటం మొదలెట్టింది. ఆ అమ్మాయి పేరు సుమ బాల. ఏలూరు దగ్గిర ఉన్న పెట్రాయి వాళ్ళూరు.
ఒకనాడు సారధి అయిదారు ఉత్తరాలు తెచ్చి నాకు చూపెట్టాడు. ఆ లేఖల్లోని విషయాలను బట్టి సుమబాల సంగతి సందర్భాలు కొంతవరకు తెలుసుకుంటానికి వీలయింది.
జమీందారీ కుటుంబంలో పుట్టింది సుమబాల. ఆమధ్యనే ఇరవై రెండి బర్త్ డే చేసుకుంది. చెవులకు రింగులు కొనుక్కుంటాని కని పనిగట్టుకొని మద్రాసు వెళ్లి నలభై రెండు వందల రూపాయలు పెట్టి డైమండ్ రింగులు కొనుక్కుని వచ్చింది. వాళ్ళ జమీందారీ పోయింది. పోయినా ఇంకా జమీందారి ని మించిన ఆస్తి ఉంది. వాళ్ళ ఇల్లు కోటలా ఉంటుంది. ఇంటి నిండా అనేకమంది పాలేళ్ళు, దాసీలు , వంట మనుషులు. ఆమెకి ఇద్దరు చెల్లెళ్ళు న్నారు. ఒక అన్న ఉన్నాడు. ఆయనిప్పుడు మద్రాసు చేరి సినిమా కంపెనీ పెట్టాడు. అప్పుడప్పుడు తను మద్రాసు వెళ్లి వస్తూ ఉంటుంది. మద్రాసులో కాన్వెంటు లో కొన్నాళ్ళు చదువు కుంది. ఇంటర్ తప్పి , ఇంటికి వచ్చేసింది. చదవలసిన అవసరమూ లేదు, శ్రద్దా లేదు. అందుచేత ఆ వానాకాలం చదువు అలాగే ఆగిపోయింది.
సుమబాల రాసిన ఉత్తరాలు నే చదివాను.
"ఎలా ఉన్నాయిరా?' అని అడిగాడు సారధి.
"బాగున్నాయి " అన్నాను.
"ఈ ఉత్తరాలని బట్టి సుమబాల ఎలా ఉంటుంది ఊహించగలవా?' అన్నాడు.
"నువ్వు ఊహించగలవా?"
"మనిషి చాలా ఆవేశ పరురాలు కావాలి. సన్నగా, పొడుగ్గా, పచ్చగా ఉంటుంది. కొంచెం వంకీల జుత్తు. =నుదుటి మీద చిన్న గంటు. కోలా ముఖం, కోన తేలిన గెడ్డం . అందమైన నడుముకు నిలువుగా వంగిన వీపు. అటూ ఇటూ పరిగెత్తే చూపులు. లావైన కింది పెదిమ. పల్చటి బుగ్గలు. కోర్కెలతో గడ్డ కట్టిన గుండెలు."
"నువ్వు చెప్పే లక్షణాలున్న వాళ్ళు ఆవేశ పరులని అర్ధమా'?"
'అలా అని కాదు. ఎందుకో అలా అనిపించింది. ఒకవేళ రూపు రేఖలు మరోలా ఉన్నా, సుమబాల తప్పకుండా ఆవేశ పరుల ధోరణి కలది కావాలి. లేకపోతె ఆ ఉత్తరాల్లో అంత పదునైన మాటలు పడటానికి వీల్లేదు."
"ఇంకా ఏ మూహించావా అమ్మాయి గురించి?"
"ఆమె ఒక అరవిచ్చిన గులాబీ!"
"అంటే దస్తూరీ బావుంది కాబట్టా?"
"కాదు."
"మరెలా ఊహించావు?"
"ఎలా అంటే ఏం చెప్పను? నాకలా అనిపించింది. ఆమె పెదిమలు ఇంతవరకు ఎవరూ స్పృశించ లేదు. ఆ నెల జవ్వని కౌగిలి లో ఇంతవరకు ఎవరూ చలి కాచుకోలేదు అని ఆ అమ్మాయిని గురించి కవిత్వం లాటి కధ వ్రాయాలనిపిస్తుంది.
'ఆవిడ అక్కడ, నువ్విక్కడ దిళ్ళ ని ప్రేమిస్తూ ఉత్తరాలు వ్రాసుకొని ఏం ప్రయోజనం?"
"నేనింకా రెండేళ్ళు బ్రతికుంటే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను."
"అంటే?"
"ఇప్పుడు నాకు ఇరవై ఏడు. నా లెక్క ప్రకారం ఇరవై తొమ్మిది వచ్చిన మూడు నెల్లకి నా ఆయుర్దాయం తీరాలి. అలా కాక, ఒకవేళ బ్రతికి బైట పడితే, సుమబాల ని పెళ్లి చేసుకుంటాను."
నాకు నవ్వు వచ్చింది. కాని నవ్వితే మిత్రుడెంత బాధపదతాడో నాకు తెలుసు.
"సారదీ, ఇలాటి ఆడపిల్లల మీద ఆశలు పెంచు కోవటం కంటే వెర్రి మరోటి ఉండదు. వీళ్ళకి జీవితాన్ని అనుభవించే వయసు వచ్చినా, అవకాశం ఇంకా వచ్చి ఉండదు. ఇరవై నాలుగు గంటలూ భావిష్యజ్జీవితాన్ని గురించి ఆశా శౌధాలు కట్టుకుంటూ , కలలు కంటూ, కాలక్షేపం కోసం ఇలాటి ఉత్తరాలు రాస్తారు.
యౌవనపు పొంగు, కోర్కెల వేడి, ఆశల మత్తు వాళ్ళ ఉత్తరాల్లో, మాటల్లో , చూపుల్లో , చుంబనాల్లో , కౌగిళ్ళ లో కనిపిస్తాయి. అంతే. ఆ ఉదృతం నీ మీద ప్రేమ అనుకోని, అనురాగపు పొందను కొని ఆత్మవంచన చేసుకుంటే ?'
'అయితే?"
"వాళ్ళు పెళ్లయే దాకా ఇలాగే నీలాటి వాణ్ణి ప్రేమిస్తారు. ప్రేమించటం ఒక హాబీ అనుకుంటే, వాళ్ళ లాగా నువ్వూ కొంత కధ నడపచ్చు. కాని అది నిజమనీ, అదే జీవిత పరమార్ధమనీ, అనుకోని తల్ల కిందులైతే ఆశా భంగం తప్పదు. ఒక శుభ ముహూర్తాన ఆ కన్యామణి ఓ పురుషుడి ఒళ్లో వాలిపోతుంది. పెళ్ళయిన క్షణం నుంచి నీ గురించి పూర్తిగా మరిచిపోయి, అంతవరకూ నీముందు చూపిన ఉదృతానని మరో పక్కకు అనుకూలంగా తిప్పుకుంటుంది."
సారధి వింటున్నట్టు లేదు.
"ఏమంటావ్ , సారదీ?"
"నీకు జీవితం అసలర్ధం కాలేదంటాను. జీవితపు తోలి మలుపులో ఏ మనిషీ కపటంగా ఉండదు; ఉండలేడు. జాహ్నవీ తరంగా లెంత స్వచ్చమైనవో పున్నమి వెన్నెల ఎంత నిర్మల మైందో వారి జీవితం కూడా అంతే పవిత్రమైంది. మానవ జీవితాన్ని నిర్ణయించేది ఆ తోలి మలుపే; ఆ తోలి అనుభవమే. ఆ అనుభవమే అతణ్ణి వంచిస్తే, అతను మరెన్నడూ ప్రపంచాన్ని సవ్యంగా చూడలేడు. సవ్యంగా బ్రతకలేడు. మరొకరు సవ్యంగా బ్రతుకుతున్నారంటే నమ్మలేడు జీవన పధంలో. క్రమంగా కపటం, కాఠిన్యం , మాలిన్యం అతని నైర్మల్యాన్ని నాశనం చేస్తాయి. స్వచ్చమైన జీవన స్రవంతి లో విషాద నీరదాలు అంతర్వాహినులై కలుషితం చేస్తాయి. అప్పుడు మనిషి దొంగగా మారతాడు. నటించటం నేర్చుకుంటాడు. మోసం చేయటం దినచర్యగా , కల్లలు చెప్పటం అలవాటుగా మార్చుకుంటాడు. అంతేగాని , ఇంకా సుమ బాలకు జీవితం తాలుకూ మాలిన్యాలు , విషాదాలు, నీలి నీడలు దగ్గిరికి రాలేదు. ఆమె వ్రాసిన ప్రతి అక్షరాన్ని నేను నమ్ముతున్నాను."
సారధి ఏ మాట చెప్పినా చాలా నిశ్చయంగా చెబుతాడు. సుమబాల ఉత్తరాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ పరిచయం , పరస్పరాకర్షణా ఇంతటితో ఆగటం సహజం కాదేమో అనిపించింది.
నేనూహించింది నిజమే అయింది.
సారధి కి , సుమబాల కు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తూనే ఉన్నాయి. సుమబాల ఒక ఉత్తరంలో తన ఫోటోలు పంపింది. ఆ ఫోటో నాకు చూపించి "నా ఊహ ఎప్పుడూ నన్ను మోసం చేయదని నీకిప్పుడన్నా తెలిసిందా?' అన్నాడు.
సుమబాల సౌందర్య రాశి. రెండు ఫోటోలు పంపింది. ఒకటి బస్టు. జడ భుజం మీదుగా ముందుకు వేసుకొని అమాయికంగా బెదిరి చూస్తున్నట్లుంది. జడపై రవ్వల నాగరం మెరుస్తుంది. ఒకటి రెండు పాయలుగా ముంగురులు రేగి, నుదుటి మీద వ్రాలుతున్నాయి.
సృష్టి లోని యౌవన మంతా ఘనీభవించి , సౌందర్యపు మేలి ముసుగు వేసుకుంటే సుమబాల అయింది.
పురుషుణ్ణి ఉన్నత శిఖరాలకు ఎగాబ్రాకించినా, అధః పాతాళానికి దిగ జారించినా ఆ శక్తి స్త్రీ కే ఉంటుంది.
అనుకోకుండా తమాషాగా, కధలో జరిగినట్లు, నిజంగానే సారధి జీవితంలో ప్రవేశించింది సుమబాల. ఒక్క రోజు ఉత్తరం రాయటం ఆలస్యమైతే , నిందలతో, నిష్టూరాలతో , కోప తాపాలను విరజిమ్ముతూ వ్రాసేది. ఆమె తిట్టిన కొద్దీ, సారధి ఆనందించే వాడు.
'ఆడది ఎంత కసిగా తిడితే, ఆమె నిన్ను అంత ప్రేమిస్తుందని అర్ధం" అని వ్యాఖ్యానించాడు.
ఇలాగే దాగుడు మూతలతో రోజులు గడుస్తున్నాయి. సుమబాల ఏ ఉత్తరం వ్రాసినా ఏడెనిమిది పేజీలకు తక్కువ ఉండేది కాదు. వ్రాయటం లో మంచి సౌలభ్యం ఉండేది. చదవాలని పించేది. ఎదటి వ్యక్తీ తో మాట్లాడుతున్నట్టు వ్రాసేది. అది శైలి అంటే బావుంటుందేమో.
"మీ ఫోటో పంపండి దయ ఉంచి" అని వ్రాసింది ఎర్ర సిరాతో.
సారధి ఫోటో పంపకుండా , "బాలా! ఎలాగో ఉంటానని ఊహించు కుంటున్నావేమో. నేను చాలా వికృతంగా ఉంటాను సుమా! నల్లగా, పొట్టిగా, ఉండే నా మూర్తిని చూసి నువ్వు ఆశా భంగం చెందుతావేమో . అందుచేత ఫోటో పంపటం లేదు" అని వ్రాశాడు.
డానికి వెంటనే జవాబు వచ్చింది సుమబాల దగ్గిర నించి, "సారధి, నువ్వెలా ఉన్నా, నీవేవరైనా , నిన్ను స్వీకరించటానికి నేను సిద్డమే. కావట్టి నిస్సంకోచం గా ఫోటో పంపు!' అని.
సారధి ఫోటో పంపాడు.
సుమ బాల అది చూసి, "సారదీ , నీ కెంత పొగరు? అందంగా ఉంటానని ? ఉంగరాల జుట్టుందని? నాకు నచ్చావని వ్రాయాలనుంది . అలా ఏ అడదన్నా వ్రాస్తుందీ? సిగ్గు వేయదూ? అందుకని వ్రాయటం లేదు. అయినా స్పష్టంగా చెప్పాలా నువ్వు బావున్నావని?' అని వ్రాసింది.
సుమబాల దూరంగా వున్నా, సారధికి ఆ ఉత్తరాలు రాయటం , వచ్చిన ఉత్తరాలు చదవటం ముఖ్య వ్యాపక మైంది.
