Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 12


    చాముండేశ్వరి ముఖం వికసించింది. "అమ్మయ్య!" అనుకుంది తనకు తాను బహిరంగం గానే.
    "అదేనండి. భగవంతుడా, మళ్ళీ దీన్ని గురించి ఎంత రాద్దాంతం జరుగుతుందో నని భయపడ్డా!"
    "భయపడడం దేనికి, చండీ? మనం పెళ్ళాడి ఎన్నేళ్ళ యింది ? అబ్బో....... ముప్పయి రెండేళ్ళు కాలా? ఇన్నేళ్ళు గా నీవు ప్రయత్నిస్తున్నావో లేదో గానీ, నిన్నర్ధం చేసుకోడానికి నేను కృషి చేస్తూనే ఉన్నాను. మన పెళ్లి నాటి నా స్థితి ఏమిటి? పాతిక రూపాయలు సంపాదించుకునే గుమస్తాను! మీ స్థితి ఏమిటి? నీ తలిదండ్రు లకు వారు ఉన్న ఆ తాటాకు పాక తప్ప. ఆ రెండు గేదెలూ....ఆరు కోళ్ళూ తప్ప ఎముండింది? ఏదో మన అదృష్టం పండింది. కలలో కూడా అనుకోని ఈ స్థితికి వచ్చాం. ఇప్పుడు.....ఈ వయస్సు లో .....నేను చేసిన పని నీకు నచ్చక, నీవు చేసిన పని నాకు నచ్చక మనం కీచు లాడుకోడం దేనికి? ఏమంటావు?"
    "నిజమే నండీ! నేను మాత్రం మిమ్మల్ని అర్ధం చేసుకోలేదంటారా? ఏమంటే.....మీది జాలి గుండె.....ఎదటి వ్యక్తీ బాధ చూచినప్పుడు మీరు ముందూ వెనకా ఆలోచించరు! మనకెందుకు చెప్పండి! మనం కష్టాలు పడ్డ రోజుల్లో మన కెవరు సాయం చేశారు?"
    "అవునే, చండీ , నీవన్నదీ నిజమే. అయినా ఎవరూ ఏమీ సహాయం చేయ్యనిదే నేనింతటి వాణ్ణి ఎలా అయ్యానా అని? ఒకనాడు తీరుబడిగా కూచుని మన జీవితాల్ని తిరగ దోడు కోవాలె. ఇదుగో , సంబంధం."
    "సర్?' పక్క గదిలో గుండెను గుప్పిట పట్టుకుని నిలుచున్న సంబంధం వచ్చాడు.
    'అరుణ నొకసారి ఇలా తీసుకురా!"
    సంబంధం వెళ్ళాడు. సేతుపతి మళ్ళీ పైపు వెలిగించి పచార్లు చెయ్యడం మొదలు పెట్టాడు.
    "నమస్కారమండీ."
    సేతుపతి అరుణను గమనించి చూశాడు. కాస్త అలసట చెందినట్టుంది గానీ, ఆ అమ్మాయి లో మరే మార్పూ లేదు. కోపం లేదు; తాపం లేదు; తనకేదో అన్యాయం జరిగిందన్న ఆరాటం లేదు. రైలు పెట్టె లో తాను చూసిన అమాయికపు ముద్ద, అలాగే ఉంది. అదే వినయం, అదే అసహాయత!
    "కడుపు నిండా బువ్వ తింటూన్నావా , అరుణా?"
    "తింటున్నానండీ."
    "మరి, ఇంటి పనులతోనే నీ బ్రతుకు సరిపోతుందా? చదువు కోడాని క్కూడా తీరిక ఉంటుందా?"        "రాత్రిళ్ళు ధదువుకుంటా నండీ. నాదగ్గిర నీతి కదల పుస్తకం ఉంది. అందులోని కధలన్నీ నవనీతానికి, కనకాని కీ, కేశవయ్య కూ, నాయరు కూ, మీ డ్రైవర్ల కూ చదివి వినిపిస్తూంటానండీ!"
    సేతుపతి కళ్ళు చెమ్మగిల్లినాయి. తబ్బిబ్బవబోతూన్న తన మనో భావాన్ని తనలోనే స్థిమిత పరుచు కోడానికి ప్రయత్నించి సాధించారాయన. ఏదో ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా "మిస్టర్ అయ్యం గార్" అని కేకవేశారు.
    "ఎస్, సర్?"
    "మీరు నాకో సహాయం చేసి పెట్టాలండీ...."
    "విత్ ప్లెషర్ , సర్."
    "ఓ పదిహేను వేల రూపాయలు ఏదైనా బ్యాంకు లో డిపాజిట్ చేసి, అరుణ కాలేజియేట్ ఎడ్యుకేషన్ పూర్తీ అయ్యేదాకా ఆయా అవసరాలకు తగ్గట్టు నెలనెలా ఇంత మొత్తం ముట్టేలా ఏర్పాటు చేయించండి!"
    "రైట్ ,సర్."
    చాముండేశ్వరి ముఖాన కత్తి వాటుకు నెత్తురు చుక్క లేదు!
    "సంబంధం!"
    "సర్?"
    "అరుణ ను ఇలానే .....ఇప్పుడే ....ఈ గది నుంచే తీసుకు వెళ్ళు. ఆంధ్ర మహిళా సభలో చేర్పించి, అక్కడే హాస్టల్లో ఉండే ఏర్పాటు చేయించిరా. అమ్మా, అరుణా , తెలిసి తెలిసీ నేను తెలివి తక్కువగా ప్రవర్తించాను. వెళ్ళు, సంబంధం అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఆదివారం ఆదివారం నేను కానీ, రఘు కానీ వచ్చి, నిన్ను చూస్తుంటాం. నేను బ్రతికి ఉండగా నీకేమీ భయం లేదు."
    కృతజ్ఞత తో అరుణ హృదయం నిండిపోయింది. ఆ పిల్లకు తెలియ కుండానే కళ్ళు కాలవలుగా కన్నీటిని ప్రవహింప జేస్తున్నాయి. ఏదో మాట్లాడాలని ఎంత గానో ప్రయత్నిస్తుంది.
    "నీవేమీ మాట్లాడరాదు. కన్నీరు కార్చరాదు పో, ముందు ఈ నరకం లోంచి వెళ్ళిపో . ఊ..... పో, అమ్మా....."
    అరుణ ముందడుగు వేసి, ముందు అయన పాదాలకు మొక్కింది. చాముండేశ్వరి పాదాలకు నమస్కరించింది. అక్కణ్ణించి వెళ్లి రఘు వద్దా, నౌకర్లందరి వద్దా సెలవు తీసుకుని , సంబంధం తోడు రాగా వెళ్ళిపోయింది.
    ఇక సేతు పతి గారి గదిలో చాముండేశ్వరి ఉండలేక పోయింది. దిగ్గున లేచి నిలుచుంది. కోపంతో, అసహనంతో , అవమానంతో , ఆవేశంతో, వెళ్ళగక్కుకోలేని మనో వేదనతో ఆమె కంపించి పోయింది.
    "వెళ్ళిపోతున్నావా?"
    "దీనికంటే నలుగురి ఎదటా మీరు నన్ను చెప్పుచ్చుకుని కొట్టి ఉంటె చాలా బాగుండేది....."
    "నిజమే! కాని.....నాకు వయస్సుతో పాటు ఈ సంస్కార మన్నది కాస్త ఎక్కువయింది. అందుకే అటువంటి పనులు నేను చెయ్యలేనే. చండీ. తీరిక సమయాల్లో, నీవు, మనం మన బ్రతుకు లేలా మొదలు పెట్టిందీ, నీ తలిదండ్రులు నిన్నెలా పెంచిందీ మొదలయిన విషయాల్నీ గురించి అలోచిస్తుండు , వెళ్ళు!"
    చాముండేశ్వరి ఇక అక్కడ ఎందుకుంటుంది? చరచరా వెళ్ళిపోయింది.
    "మిస్టర్ అయ్యం గార్, సుబ్బారావు గారూ."
    "సర్?"
    "క్షమించండి. అయాం టోటల్లీ అప్ సెట్. ఈ పూట నేనేమీ పని చెయ్యలేను. మనం మళ్ళీ రెండున్నర కు కలుసుకుందాం."
    'అలాగే నండీ." ఆ ఇద్దరూ తమతమ పనుల మీద వెళ్ళిపోయారు.
    
                                       17
    మనోవ్యాధి కి మందు లేదన్నారు . రోజులు గడిచే కొద్దీ అరుణ పరిస్థితీ అదే అయింది. ఆ అమ్మాయి ఏ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలమో భగవంతుడే సేతుపతి రూపంలో వచ్చి , ఆమె భావి జీవితగమనానికి ఒక పూల బాట పరిపించాడు. అయినా అరుణ లో ఏదో అసంతృప్తి, తీరని ఆందోళనా బయలుదేరాయి. అర్ధరాత్రి పూట "నాన్నా!" అంటూ బిగ్గరగా కేకవేసి నిద్ర లేచేది. ఎవరెన్ని విధాల ప్రశ్నించినా బదులు పలకక గోడుగోడు మని ఏడ్చేది. వారం తిరిగే లోగానే అరుణ గుర్తు చిక్కనంతగా మారిపోయింది.
    అయన చేసిన వాగ్దానం ప్రకారం, మరుసటి ఆదివారం సేతుపతి రఘును వెంట తీసుకుని తన కారులో వచ్చారు. నీరసంగా అరుణ వారి నెదుర్కొని , చేతులు జోడించి నిలుచుంది. చెక్కిళ్ళ వెంట రెండు జీవనదులు ప్రవహించి పోతున్నాయి.
    "ఎందుకమ్మా , అరుణా . అలా ఉన్నావు? ఒంట్లో  బాగాలేదా? హాస్టల్ నీకు నచ్చలేదా? ఈ వారం రోజుల్లోనే ఎందుకు ఇలా అయిపోయావు?' అంటూ సేతుపతి దయార్ద్ర హృదయులై ప్రశ్నించే కొద్దీ అరుణ దుఃఖం పొంగి, పోర్లిపోతుంది.
    "ఇదుగో! ముందు నీవా ఏడ్పు మానాలి. ఆడపిల్లలు ఏడిస్తే ఆశుభమని చెప్పానా? నీ విలా ఏడిస్తే నాకేదైనా చెడు జరుగుతుంది మరి."
    అరుణ ఆ క్షణం లోనే తనను తాను సముదాయించు కుంది.
    "రా, అమ్మా, బండెక్కు. అలా బీచి కి వెళ్లి మాట్లాడు కుందాం" అని, అరుణ కు చేయూత ఇచ్చి కారేక్కించారు సేతుపతి.
    అందరు కలిసి సముద్రపు టౌడ్డున ఒక పెద్ద కెరటం రివ్వురివ్వున వచ్చి నురుగుతో వారి పాదాలను ముద్దు పెట్టుకునేంత దగ్గిరగా కూర్చున్నారు. అందరూ ముభావంగానే ఉన్నారు. అరుణ కారు ఎక్కినప్పటి నుంచి ఇంతదనుక వంచిన తల ఎత్తలేదు. సేతుపతి ఆ అమ్మాయినే పరీక్షగా చూస్తూ కూర్చున్నారు. అరుణ తనలో తాను ఏదో ఒక నిశ్చయానికి వచ్చినట్లు అగుపడింది.
    "ఇక చెప్పమ్మా!" అన్నారు సేతుపతి.
    "మా నాన్నగారు.....అంటే నన్నిన్నేళ్ళూ పెంచి, ప్రేమించి, పెద్ద చేసిన వారు -- శంకర నారాయణ గారు."
    "అంటే ఆ లాయరు గారా?"
    "ఊ."
    "అవునవును . పాపం! వారిని గురించి ఇక్కడి వారు కూడా కధలు కధలుగా చెప్పుకున్నారు. అందుకే నమ్మా, విధి బలీయమన్నారు. మానవులం మనం ఎంతటి ధీమంతులమైనా, శక్తి గల వారలమయినా జరగనున్నదానిని అపలెం!"
    "వారికి కూడా పెద్ద బంగళా ఉండేది. కారు ఉండేది. నన్ను చేరదీశారు, అన్ని విధాలా అన్యాయమై పోయారు! ఇన్నేళ్ళూ పెంచి, పెద్ద చేసిన ఆ తండ్రికి చెప్పకుండా వచ్చేశాను. నేను లేనిదే ఆయనగారికి అసలు ఏమీ బాగోదు. నాకోసం అయన ఎంత బాధ పడిపోతుంటారో! ఒక్కసారి అయన గారిని చూచి, వారి పాదాలకు మొక్కి , కృతజ్ఞత తెలుపుకుంటే నా జీవితంలో ఇక నాకే కోరికా ఉండదు!"
    "అలాగేనమ్మా, అరుణా, వెళదాం . నేనూ వస్తాను."
    కృతజ్ఞత తో నిండిపోయిన మనసుతో అరుణ అక్కడే అయన పాదాల మీద పడి, ఆ పాదాల్ని తన కన్నీటితో కడిగింది.
    'అరుణా, తప్పమ్మా. తప్పు తల్లీ. లే!" అంటూ ఆ అమ్మాయిని కూర్చో బెట్టారు సేతుపతి. కన్నీరు తుడిచారు.
    "ఆ శంకర నారాయణ గారు ఎంత గొప్ప వారమ్మా! పెంచిన ఈ పదకొండు పన్నెండేళ్ల లో నీలో ఎంత మంచిని నించాడు! నీవు చదువుకున్న చదువెంత! సంపాదించు కున్న విజ్ఞాన మెంత! అరుణా, నీవేమీ బాధ పడద్ద్జు. కాలూ, చెయ్యి పడిపోయినంత మాత్రాన, మనిషిదేనికీ పనికి రాకుండా పోతాడా? అయన చదువుకున్న చదువంతా ఎక్కడికి పోతుంది? నాకూ ఒక లీగల్ అడ్వయిజర్ కావాలి. వెళ్లి, మీ నాన్నగారినీ, ఇక్కడికే తెచ్చుకుందాం. అంతా హాయిగా ఇక్కడే ఉండచ్చు!....ఆ ...ఆ! అదుగో....ఆ వద్దంది. నీవు కన్నీరు కార్చరాదు. కృతజ్ఞత తెలుపుకునే నెపంతో నా కాళ్ళు పట్టుకోరాదు. ఇక పదండి , పోదాం.
    అందరూ బయలుదేరారు. కారు వైపు నడుస్తూ, సేతుపతి రఘుతో "నాన్నా, రఘూ, ఈ ప్రపంచంలో మంచి తనానికి మించినది మరేదీ లేదు. అదెప్పుడూ మనసులో ఉంచుకో!" అన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS