"నిజం చెప్పమంటారా......అబద్దం మంటారా?"
"అబద్దం చెప్పండి."
"నేను........"
"అంటే మీ రచనల్ని గురించి మీకు మంచి అభిప్రాయం లేదన్న మాట. గుడ్. ఇక నిజం చెప్పండి."
"తెలుగులో బుచ్చి బాబు.........ఇంగ్లీషు లో నాకు ఒక్కల్లె నచ్చుతారని చెప్పలేను. మామ్ తో బాటు పెరల్ బక్, జీన్ ఆస్టిన్ ......ముఖ్యంగా అమెది 'స్తైడ్ ఆంట్ ప్రేజుడీస్' నవల డిశ్రాయిలీ పద్దెనిమిది సార్లు చదివాడట. నేను అన్నిసార్లు చదవలేదు గాని నాకు బాగా నచ్చింది. అంత హాయిగా నడిచిన నవలలు చాలా తక్కువ ఉన్నాయి. స్ట్రెయిన్ తీసుకొని రాసేవారంటే నాకు కొంచెం చిరాకు."
రాజగోపాలం అతన్ని సరదాగా చూశాడు ఆ మాటలు చెబుతున్నప్పుడు.
"మీ రనుమతిస్తే రెండు పుస్తకాలు ఏరుకుని మళ్ళీ చదివిన తరవాత తెచ్చిస్తాను."
"ప్లీజ్.........డూ ఇట్. తప్పకుండా మీకు ఏం కావాలో చూసుకోండి. నేను మాత్రం మీకు ఇప్పుడు 'త్రీ మస్కేటీర్స్ ' సజెస్ట్ చేస్తాను. చాలా హుషారుగా ఉంటుంది."
"వెరీ గుడ్. రెండో పుస్తకం గలీవర్ దండ యాత్రలు కాదు గదా?' అన్నాడు.
ఇద్దరు కులాసాగా నవ్వుకొని, రవి ఏవో రెండు పుస్తకాలు తీసుకున్న తరవాత గది బయటకు వచ్చారు.
రవి వెళ్లి పోతున్నప్పుడు రాజగోపాలం , "చాలా కులాసాగా గడిచిపోయింది మీ కంపెనీ లో. థాంక్స్" అన్నాడు.
రవి " అని నే ననవలిసిన మాటలు. మీరు వాడేశారు" అన్నాడు.
ప్రియ నవ్వుతూ, "ఊహూ! మీరిద్దరూ అనవలసినవి కావు. అని నేనవలిసినవి. మీ కంపెనీ తో మావారు రీడింగ్ రూం వదిలి రాలేదు కాబట్టి బ్రతికి పోయాను. సుఖంగా మధ్యాహ్నం పూట నిద్రపోయాను . లేకపోతె........"
"ఊ లేకపోతె......' కొంటెగా రెట్టించాడు రాజగోపాలం.
ప్రియ బుగ్గలు ఎరుపెక్కాయి. కొంచెం సిగ్గు పడింది, తను జాగ్రత్తగా మాట్లాడనందుకు . "చిన్న పిల్లాడిలా మారాం చేసేవారు........'అంది సరిదిద్దుకుంటూ.
రవి హృదయం ఆరోజు తెచ్చిన ఆనందంతో నిండిపోయింది. నెమ్మదిగా సెలవు తీసుకొని గది వైపు నడవసాగాడు.
వెళుతుంటే "వీలున్నప్పుడల్లా మీరు వస్తుండాలి. మీకోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటాం" అన్నాడు రాజగోపాలం.
"ఈ ఆనంద నిలయానికి రాకుండా ఎలా ఉండగలను? తప్పకుండా వస్తాను'అనుకున్నాను మనసులో రవి నడుస్తూ.
8
ఆ ఉదయం సురేంద్ర హడావిడిగా ఎక్కడి కో వెళ్ళాడు.
రవిచంద్ర రాజగోపాలం దగ్గిర తెచ్చుకున్న పుస్తకాలలో ఒకటి పూర్తి చేసి పండుకోవడం వల్ల కొంచెం ఆలస్యంగానే లేచాడు. స్నానం చేసి టీ తెప్పించుకొని తాగుతుండగా సురేఖ వచ్చింది.
ఈసారి సురేఖ రెండు జడలు వేసుకోలేదు. గళ్ళ చీర మీద తెల్లటి బిగుతు జాకెట్టు వేసుకుంది. మెడలో లాకేట్టు ఉన్న గొలుసు మాత్రమె ఉంది. వదులుగా వేసుకున్న జడ ఆమెకు నిండుదనాన్ని ఇచ్చింది. జడలో ఒక పక్కగా గులాబీ తురుముకుంది. వస్తూనే "హలో, సురేంద్ర లేడా?" అంది.
చదువుతున్న పుస్తకాన్ని పక్కన ఉంచి, "లేడు, రండి, కూర్చోండి!" అన్నాడు. గదిలో ఒకటే కుర్చీ ఉంది. అందులోంచి లేస్తుంటే , "ఫర్వాలేదు. మీరు కూర్చోండి ." అంది సురేఖ.
"నో.....నో...........మీరు కూర్చోక తప్పదు."
"మీరు కూడా అతిధులే. అందుకనే కూర్చోవాలి."
"నేను పర్మనెంటు గెస్టు నయ్యాను. అందువల్ల , అభ్యాగతి రైట్సు కూడా కొట్టేశాను....మీరు అపోజిట్ పెక్స్ అవటం వల్ల కుర్చీని షేర్ చేయటానికి వీల్లేదు . లేకపోతె అది నేను సజెస్ట్ చేసి ఉండేవాణ్ణి."
ఆ మాటలకు కొంచెం సిగ్గుపడింది సురేఖ. ఆమెకు ఇప్పుడు రవిచంద్ర చాలా కొత్తగా, హుషారుగా ఉన్నాడు. ఇంతకూ పూర్వం రెండు మూడు సార్లు చూసినప్పుడు ఇతనికి మాట్లాడడం వచ్చా, రాదా? అనే అనుమానం కూడా చాలాసార్లు వచ్చింది. ఎప్పుడూ ఏదో దిగులుగా పరధ్యానంగా ఉండే అతణ్ణి చూసి, "బహుశా యితడు ఫిలాసఫర్ అయి ఉండవచ్చు" అనుకున్న క్షణాలు కూడా ఉన్నాయి. కాని రవిచంద్ర ప్రవర్తన ఆమెకు చాలా మారినట్లు అనిపించింది ఈరోజు.
"బహుశా మీది ఎమ్.ఎ.లో ఫిలాసఫీ అయి ఉంటుంది. అనుకుంటుండేదాన్ని ఇంతకూ పూర్వం." సన్నటి నవ్వుతో ఆమె అన్న మాటలకు రవి కొంచెం ఆశ్చర్యపోయి, "ఏం? మీరెందు కలా అనుకున్నారు?" అన్నాడు.
"నేను తరవాత చెబుతాను ఎందుకను కున్నానో. మొదట మీరు చెప్పండి, మీది ఫిలసఫీయా? లేక పొతే ఇంకో సబ్జేక్టా?"
"నాది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ . అలాంటి సబ్జెక్ట్ ఒకటి ఉందని చాలా తక్కువ మందికి తెలుసు లెండి. మీరు నన్ను సబ్జెక్టు లో పరీక్షిద్దామనుకున్నా చేయలేరు."
ఆమె అందంగా నవ్వడానికి ప్రయత్నించి, "అలాంటి ప్రయత్నం చేయటానికి నేను సాహసించను లెండి. ఇంతకూ పూర్వం మిమ్మల్ని ఎప్పుడూ చూసినా ఏదో పరధ్యానంగా ఉన్నట్లు అనిపిస్తుండేది నాకు. అందువల్ల మీది ఎమ్.ఎ . లో పిలసఫీ కాబోలు అనుకున్నాను." అంది.
క్షణం లో అర సెకండు మాత్రమె అతని ముఖం నల్లబడింది. దాన్ని కప్పి పుచ్చుకొని బలవంతాన నవ్వు ముఖానికి పులుముకొని "ఓహ్, అదా? అదొక బాడ్ సాచ్. ఫిలాసఫర్ గా కావటానికి కావలిసింది ఆ మూడ్ కాదు. అన్ని విషయాల పట్ల నిర్లిప్తత ,దేనికీ పట్టనట్లు ఉండడం."
"ఉహూ. మీరు మంచి మూడ్సు లో ఉన్నప్పుడు కాస్త కదిలిస్తే లేక్చరిచ్చేటట్లున్నారే! అన్నట్లు, మీరు లెక్చరర్ గా పని చేస్తున్నారని కూడా విన్నాను." కనుబొమ్మలు షోగ్గా తిప్పుతూ అంది.
"అందువల్లే చాలామంది అనుభవజ్ఞులు అంటుంటారు, ఈ ప్రపంచంలో అర్ధం లేకుండా వాగేది రాజకీయవాదులనీ, అర్ధం కాకుండా వాగేది అధ్యాపకులని. ఆ విధంగా చూస్తె నేనిందాకా చెప్పిన మాటలు మీకు అర్ధం కాకుండా ఉండటానికి అన్నాను."
ఈసారి స్వచ్చతతో కూడుకున్న చిరుహాసం చేసి సురేఖ అంది: "నాకు మీలాంటి చదువుకున్న వాళ్ళంటే భయం. అందుకే నేను మాట్లాడటానికి సాహసించను."
'అంటూనే మాట్లాడుతుంటారు. భాగుంది. మీరు ఏం చదువుకున్నారో తెలుసుకోవచ్చా?"
"నేను....చెప్పమంటారా?"
"ఊ! చెప్పండి."
"ఎ,మ్. బి.బి.ఎఫ్."
"ఓహో! బాగుంది. ఈ డిగ్రీ తీసుకుంటున్నవాళ్ళు' చాలా ఎక్కువ మంది అయిపోతున్నారు ఈ రోజుల్లో.'
"మీరు ఏమీ అనుకోకపోతే నేను ఒక విషయాన్ని అడగదలుచుకున్నాను. ఏమీ అనుకోరు గదా?"
నివ్వేర పోయాడు ఆమె సూటి ప్రశ్నకు. సురేఖ అది గమనిస్తూనే ఉంది. రవి మాత్రం "అడగండి" అని కొంచెం పేలవంగానే అన్నాడు.
"మీరు క్లాసులో పాఠాలు చెప్పుతున్నప్పటి అనుభవాలు తెలుసుకోవచ్చా?"
"స్వేచ్చగా గాలి పీల్చుకొని, "ఓ అదా! చంపేశారు పొండి సస్పెన్సు తో" ఆని ఒక క్షణం ఆగి ఆమెను నవ్వుతున్న కళ్ళతో చూస్తూ, "మీరు స్టేజి మీద నటిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తున్నదో , మా ప్రొఫెషన్ లో క్లాసురూం లో మాకు అలాగే అనిపిస్తుంది అన్నాడు.
"ఓహో! అయితే మేము స్టేజీ మీద డాన్సు చేస్తాం. మీరు చేస్తారా?"
"ఆ, చెప్పవలసింది పట్టుబడితే, మేమూ కధాకళీ చేస్తాం."
విరగబడి నవ్వింది సురేఖ. వస్తున్న నవ్వు ఆపుకుంటూ, "మరి భరతనాట్యం ఎప్పుడు?' అంది.
"క్లాసులో పిల్లలు మమ్మల్ని అల్లరి పట్టిస్తున్నప్పుడు " అని నవ్వకుండా చెబుతున్న అతని వాలకం ఆమెకు మరింత నవ్వు తెప్పించింది.
క్షణకాలం నిశ్శబ్దం. తరవాత అన్నాడు రవిచంద్ర: "సారీ, ఆరోజు మిమ్మల్ని కంగ్రాచ్యు లేట్ చేయటానికి అవకాశం లేకపోయింది. మీరు చాలా బాగా నటించారు. కంగ్రాట్స్ దో లేట్."
"థాంక్స్. బెటర్ లేట్ దాన్ నెవర్" అతను సూటిగా చూసేసరికి ఆమె కొంచెం ఓరగా తల వాల్చుకుంది.
"మీది ఎమ్.ఎ.బి.ఎఫ్. కాదు. అంతకంటే పెద్ద డిగ్రీ అయి ఉండాలి."
"బాగా కనిపెట్టారు . నేను బి.ఎ చదువుతూ అపుచేశాను. అయినా మీకేండుకా సందేహం వచ్చింది?"
"నిజం దాచినా దాగదు. ఒక్కోసారి ఆప్రయత్నం గానే బయట పడుతూంటుంది. నాకెందుక నో అలా అనిపించింది . అంతే!"
"ఇంతకూ మీరు నేను అడిగిన సందేహానికి సరియిన జవాబు చెప్పనే లేదు. ఏదో మాటలతో దాటేశారు గాని."
"క్లాసులో పాఠాలు చెప్పే సంగతి అంటారా? బాగానే చెబుతాను. బాగానే ఉంటుంది."
"అలా కాదు. మీరు మీ మొదటి క్లాసులో ఏ విధంగా అనుభూతి చెందింది చెప్పాలి."
"బాగుంది మీరు అడిగే విధానం, కొత్త హీరోను పేపర్ల వాళ్ళు అడిగినట్లు. అదో చిత్రమైన అనుభూతి. నా వరకు నేను సర్వము మరిచి పోతాను, క్లాసులో విద్యార్ధులు కూడా నాకు కనిపించడం మానేస్తారు. కేవలం నేనూ, నేను విడమర్చే సమస్యే మిగులుతాము. ఆ సమస్యతో కుస్తీ పట్టి దాన్ని చిత్తుగా ఓడించిన అనుభూతి కలుగుతుంది, బాగా చెప్పేడం సంభవిస్తే."
"బాగాచేప్ప లేకపోతె?"
"వేరే చెప్పాలా? పహిల్వాన్ చేత దెబ్బలు తిన్నవాడి మాదిరిగా అవుతాం."
సురేఖ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి విపరీతంగా.....ఆమె నవ్వుతున్నప్పుడు చూసేవారికి చాలా హాయిగా ఉంటుంది, ఆమె నవ్వు చేసే శబ్దం గలగల మని ఒరుసుకుని ప్రవహించే ప్రవాహపు చప్పుడును జ్ఞప్తికి తెస్తుంది. కులాసాగా ఆమెను చూస్తూ రవిచంద్ర కూర్చున్నాడు.
గభాల్న అడిగింది. "భోం చేయరా?' అని.
"చేద్దామనే ఉంది. కాని వీడి కోసం ఎదురు చూస్తున్నాను."
"సురేంద్ర కోసమా? అతన్ని నమ్ముకుంటే మీరు ఇవ్వాళ భోం చేసినట్లే!"
"అయితే వెళదాం, పదండి. ఈ వీధిలో ఉన్న హోటలో భోం చేద్దామా?" అంటూ రవిచంద్ర లేచి గదికి తాళం వేశాడు. అతని వెనకాలే సురేఖ కూడా బయలుదేరింది.
ఇద్దరు వీధి చివర ఉన్న హోటలు కు చేరుకొని భోజనానికి ఆర్డరు ఇచ్చారు. రవిచంద్ర కు ఈ మహారాష్ట్ర భోజనం సరిగ్గా సహించటం లేదు. ఇక్కడికి వచ్చిన తరవాత తృప్తిగా భోజనం చేసింది రాజగోపాలం ఇంట్లోనే.
భోజనం చేస్తున్నప్పుడు ఇద్దర్లోనూ ఎవరూ మాట్లాడలేదు.
సురేఖ ఆప్పుడప్పుడు తింటున్న అతన్ని పరీక్షగా చూడసాగింది. కొద్ది క్షణాల క్రితం ఉన్నంత ఉత్సాహంగా లేడు రవిచంద్ర. కొంచెం పరధ్యానంగా చపాతీలను సాంబారు తో నంజుకుంటున్నాడు.
చటుక్కున తల ఎత్తి, "రాజగోపాలం మీకెలా పరిచయం?" అని అడిగాడు.
"నాటకాలంటే ఆయనకు అభిలాష మెండు. రెండేళ్ళ నుంచి మాకు అయన తెలుసు."
"మా సురేంద్ర కు ఎలా పరిచయమో మీకు తెలుసా?"
"సురేంద్ర మొదట్లో వచ్చినప్పుడు తిలక్ నగర్ లోనే ఉంటుండేవాడు. బహుశా అక్కడే పరిచయం అయి ఉండచ్చు అనుకుంటాను. నాకు తెలిసిన దగ్గర నుంచీ వారిద్దరూ స్నేహితులే."
"మీరు ఇంత చక్కటి తెలుగు ఎక్కడ నేర్చుకున్నారు?"
ఆమె అతన్ని ఉత్సాహంగా చూసి, "మేము తెలుగు వాళ్ళమే. తెలుగు వాళ్లకు తెలుగు రావడం లో ఆశ్చర్య మేముంది?' అంది.
"మీ పూర్వికులు తెలుగు వారని ఎప్పుడో చెప్పినట్లు గుర్తు. కానీ మీరు కాదుగా."
"చాలా రోజుల కిందట ఇక్కడకు వచ్చాం. అప్పటి నుంచి మేము మరాఠీ వాళ్ళుగా మారిపోయాం. మా అమ్మమ్మ చెబుతుండేది , మేము తెలుగువాళ్ళమన్న సంగతి. అప్పటి నుంచి నాకు తెలుగు నేర్చుకోవాలని అభిలాష ఉండేది. అభిలాష ఉంటె సాధ్యపడంది ఏమీ లేదుగా?"
ఇద్దరూ భోజనాలు అయిన తరవాత నెమ్మదిగా గదికి చేరుకున్నారు.
కాసేపు ఎవరూ మాట్లాడలేదు. తరవాత సురేఖ "నేను వెళతాను" అని లేచింది. చిరునవ్వుతో 'అలాగే' అన్నట్లు తల ఊపాడు రవిచంద్ర.
ఆమె బయటకు వెళ్ళటానికి ఉద్యుక్తురాలవుతుండగా "ఇంటికేనా?' అన్నాడు.
'అవును" అంది ఆమె.
"పదండి. అలా నేను కూడా బజారు దాకా వస్తాను." అంటూ రవిచంద్ర లేచాడు, ఒంటరిగా కూర్చోటానికి భయపడి. రవిచంద్ర గదికి తాళం వేసి పక్కగా ఉన్న కిటికీ లో తాళం చెవి ఉంచాడు.
"మీ రహస్య స్థలం తెలిసింది. నేను ఒకసారి వచ్చి దొంగతనం చేస్తాను" అంది సురేఖ, అతను కిటికీ లో ఒక పక్కగా తాళం చెవిని ఉంచుతుంటే.
"మా దగ్గర ఏమున్నాయి మీరు దొంగిలించటానికి? మహా ఉంటె సురేంద్ర వి నాటకానికి పనికి వచ్చే రెండు విగ్గు లున్నాయి."
"ఎబ్బే" అంటూ సురేఖ అందంగా చీత్కరించింది.
ఇద్దరూ కలిసి బజారు మధ్యకు వచ్చిన తరవాత "మీరు ఎక్కడికి వెళతారు?' అని అడిగింది.
"ఎక్కడికీ లేదు. అలా బరిడీ దాకా వెళ్లి వస్తాను."
"మా ఇంటికి వెళదాం , రండి. ఇప్పుడు మీకు అభ్యంతరం లేకపోతె."
"ఇప్పుడు కాదు ఇంకోసారి వస్తాను" అని తప్పించుకో బోయాడు.
"రాజగోపాలం గారి ఇంటి దగ్గరే మా ఇల్లు. మీరు అక్కడికి కూడా వెళ్ళవచ్చు. మీరు అక్కడికి వెళ్ళలేదుగా ఇంతవరకూ?"
"వెళ్లాను. పదిహేను రోజుల కిందట ఒకసారి వెళ్లి భోజనం కూడా చేశాను. చాలా ముచ్చటయిన ఇల్లు, ముచ్చటయిన జంట."
"అవును" అంది సురేఖ.
రాజగోపాలం ఇల్లు అనగానే ఎందుకనో రవిచంద్ర సురేఖ వెంట వెళ్ళటానికి ఆకర్షితుడయ్యాడు. అభ్యంతరం చెప్పకుండా కొంతసేపు నడిచిన తరవాత బస్సు ఎక్కి తిలక్ నగర్ చేరుకున్నారు.
