Previous Page Next Page 
బ్రతుకు బాట పేజి 12


    అలసటకి ముఖం నిండా చెమట పట్టేసింది. రిక్షాలో వెళ్లాలని పించలేదు -- తనతో పాటు అతనూ నిలబడే వున్నాడు. అతను బ్యాంక్ లో పని చేస్తాడని తెలుసు సుమిత్ర కి. అతన్ని ఆరు నెలలుగా బస్ స్టాప్ లో చూస్తూనే వుంది. తనని చూసి 'విష్' చేస్తున్నట్లు నవ్వుతూ వుంటుంది అతని వదనం.
    చాలా సేపటి నుంచీ తనని పలకరించడానికి అతను ప్రయత్నిస్తున్నాడని గ్రహించింది సుమిత్ర.
    'నిలబడితే కాళ్ళు నెప్పులు పుడతాయి. అలా హోటల్ కి వెళ్లి కాఫీ తీసుకుందాం రండి-- ఇంతలో కొంచెం రద్దీ తగ్గుతుంది.' అన్నాడతను చివరికి .
    సుమిత్ర ఆశ్చర్యపడలేదు. కోపమూ రాలేదు ఆమెకి. అతనెప్పుడో తనని పలకరిస్తాడని ఆమెకి తెలుసు.
    'పడండి వెడదాం'అన్నది ధైర్యంగానే.
    'థాంక్స్' అన్నాడు బసవరాజు . ఐస్ క్రీం కి అర్దరిస్తూ అతను అన్నాడు.
    'మీ పేరు సుమిత్ర కదూ? టీ ఆఫీసులో ఉద్యోగం -- వుండడం స్నేహితురాలి యింట్లో! ఆవిడ ఎం.ఏ స్టూడెంట్ -- అని.
    'మరే! మీకు తేలిందేం వుంది!' వెక్కిరింపుగా అన్నది సుమిత్ర.
    'కొందరిని గురించి తెలుసుకోడం యిష్టంగా వుంటుంది.
    'ఎందుకనో!'
    'ఫలానా అందుకని చెప్పే శక్తి నాకు లేదు సుమిత్రాదేవీ! మిమ్మల్ని పలకరించాలని ఎప్పటి నుంచో కోరిక!'
    'అందుకని ఐస్ క్రీం పెట్టిస్తున్నారా! మీరొక్కరే వెళ్లి తింటే బావుండేది!!'
    'కంపెనీ లేనిదే నేనెక్కడికి వెళ్ళను- సరేగాని నన్ను గురించి వివరాలు అడగరేం-? నేను స్టేట్ బ్యాంక్ లో పని చేస్తున్నాను. నాలుగొందలు జీతం వస్తోంది. ఇంకా పెళ్లి కాలేదు -- మా వూరు కృష్ణా జిల్లాలో వుంది. వెజిటేరియన్ ని-'
    "ఆపండి బాబూ! నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చెయ్యడానికి రాలేదు-- గబగబా ఐస్ క్రీం తినండి పోదాం -- నాకు పనుంది --' అన్నది సుమిత్ర అతన్ని మధ్యలో ఆపేసి.
    'మిమ్మల్ని ఆరు నెలల నుంచీ చూస్తున్నాను- అప్పటి నుంచీ మీతో మాట్లాడాలని-- అప్పటి కన్న ఇప్పుడు బావున్నారు- ఈ వూరు నీళ్ళ కి ఛాయ వచ్చింది. కొంచెం వళ్ళూ వచ్చింది-- ' అతను మాట్లాడడం ఆపే ప్రయత్నం చేయడం లేదు--
    'మాదే ఊరేమిటి!' అని వెక్కిరించింది సుమిత్ర.
    'బెజవాడ -' అన్నాడు బసవరాజు టకీమని . మరి కొంచెం సేపు ఆగి, యిష్టమున్న వ్యక్తిని గురించిన వివరాలు కనుక్కోడం ఏమీ కష్టం  కాదు -- వాటంతటవే తెలిసిపోతాయి-- మా ఇల్లు చిక్కడ పల్లిలో -- ఓ ఆదివారం రాకూడదూ! భయం అయితే కుముదిని గారిని తీసుకు రండి. పోస్టాఫీసు దగ్గరే -- ' కళ్ళల్లో మర్యాద కురిపిస్తూ అడిగాడు.
    తల వంచుకుని కూర్చుంది సుమిత్ర.
    ఆరడుగుల చామల చాయవిగ్రహం.
    ప్రబంధ నాయకులకీ సినిమా హీరోలకీ వుండవలసిన లక్షణాలు లేకపోయినా, చూడగానే స్నేహితుడనే నమ్మకం కుదిరే చిరునవ్వూ , ఠీవి వున్నాయతడికి. అమాయకత్వం, నిజాయితీ అతని కళ్ళల్లో కనపడతాయి. అతన్ని చూస్తూ వుంటే, సుమిత్రకి కుముదినితో మాట్లాడినట్లే అనిపించింది కానీ మరో భావం కలుగలేదు.
    'ప్లీజ్-- ఆదివారం రండి-- నేనొక్కడినే వుండను-- కుముదిని గారూ, మీరూ రండి --' అతను మళ్ళీ అన్నాడు. ఆ కంఠం లో ఆహ్వానం వుంది కానీ అర్దింపు లేదు.
    ఆదివారం మా ఫ్రెండ్ చెల్లెలి బర్త్ డే -- అందుకని మేము రాలేం. మరోసారి వస్తాం లెండి థాంక్స్' అన్నది సుమిత్ర లేస్తూ.
    'అలా కాదు-- స్నేహం సాప్టపదీనం అన్నారు. మనిద్దరం ఏడడుగులేమిటి డెబ్బయి అడుగులు కలిసి నడిచాం -- కనుక మీరు నా మాట కాదన కూడదు--'
    అబిడ్స్ సెంటర్ లో సుమిత్రని బస్సేక్కిస్తూ 'నన్ను జ్ఞాపకం వుంచుకోండి ' అన్నాడు బసవరాజు. అతని కంఠం లో ఆర్ద్రత కీ ఆశ్చర్య పడింది సుమిత్ర.
    ఇతడిని తనూ చూస్తూనే వుంది ఎప్పటి నుంచో. నగరాల్లో సిటీ బస్సుల్లో రోజూ తారస పడే వాళ్ళు అనేకమంది. ఒక టైము కి రావడం వలన అనేక మంది ఇలా బస్సుల్లో కలుస్తూనే వుంటారు. కానీ ఈ బసవరాజు చాలా చిత్రమైన వ్యక్తిలా వున్నాడు. ఈతని ప్రవేశంతో తన జీవితంలో కలిగే సంచలనాన్ని గురించి ఆలోచించింది సుమిత్ర, బస్సు పై అంతస్తులోకూర్చుని క్రింద నడిచే మనుష్యులని చూస్తూ .
    'ఇవాళ చాలా హుషారుగా వున్నావే! ఏమిటి కధ' అని అడిగింది కుముదిని సాయంత్రం.
    'ఏమీ లేదు....అనేసింది సుమిత్ర. అల్లా అన్నప్పుడు ఆమె కళ్ళ ఎదుట బసవ రాజు విగ్రహం క్షణం సేపు కదిలి అదృశ్యమై పోయింది.
    'ఎనీ రోమాన్స్?' అంది మళ్ళీ కుముదిని.
    'రొమాన్సూ లేదు ఏమీ లేదు. పద -- కాసేపు క్యారమ్స్ ఆడుకుందాం' అని వరండాలోకి దారి తీసింది.
    'సుమిత్రక్కా మధ్యాహ్నం నీకు రెండు ఉత్తరాలోచ్చాయి-- ' అని గబగబ పరిగెత్తుకుంటూ వచ్చింది రాగిణి.
    ఉత్తరాలు అందుకుంటూ వుంటే జ్ఞాపకం వచ్చింది. తను కాలేజీ నుంచి రాగానే ఇలాగే ఉత్తరాలు యిచ్చేది చిట్టి. ఎన్నాళ్ళయిందో వాళ్ళని చూసి.
    ఒక ఉత్తరం మీద ఎడ్రేసు చిన్నపిల్లలు వ్రాసినట్లు గజిబిజిగా వుంది. రెండోది విశ్వం దగ్గరనుంచి.
    'అమ్మ పోయాక అందరూ స్వతంత్రు లైపోయారు . ఎవరి యిష్టాలు వారివై పోయాయి. మీరందరూ చదువుకున్న వాళ్ళూ, తెలివి గలవాళ్ళూ కనుక మీ జీవితాలు చక్కగా జరిగిపోతున్నాయి. నా అనేవాళ్ళేవరూ అసత్సమయం లో ఆదుకునేందుకు లేక నేను ఎన్ని అవస్తలు పడుతున్నానో నీకు తెలీదు సుమిత్రా! నువ్వు ఉద్యోగస్తురాలివయావు-- అందుకు చాలా సంతోషం. ఒక్కసారి మా వూరు వచ్చి మమ్మల్ని చూసి పో! ఈ మధ్యనే రఘుపతి ఓ వంద రూపాయలు పంపించి  పట్టు చీరే కొనుక్కోమని వ్రాశాడు. డబ్బెం పాపం చేసిందని తీసుకున్నాను--' ఇలా సాగింది మొదటి ఉత్తరం. విమల తన ఎడ్రెస్ కనుక్కుని ఇన్నాళ్ళ కి ఒక జాబు వ్రాయగాలిగింది.
    'ఈ నెలలో నాన్నగారు నాకు డబ్బు చాలా తక్కువగా పంపారు. అది చాలదు. ఇంతదూరం వచ్చి చదువు లో చేరిన తరువాత యిప్పుడు డబ్బుకు వెనుకాడ్డం ఎంత అవివేకమో నీకు తెలుసు. నాకిప్పుడు రెండొందలు అర్జంటుగా కావాలి. బాబాయిని అడగాలని లేదు. అడగడానికి ధైర్యం చాలదు. నువ్వేలాగైనా సర్దాలి చిన్నత్తా'! ఆ నమ్మకంతోనే ఈ ఉత్తరం వ్రాస్తున్నాను--'
    రెండు ఉత్తరాలూ చదవగానే ఉత్సాహమంతా నీరు కారిపోయింది.
    జీవితంలో ఆడవాల్లు చాలా రకాలైన అవస్తలు అనుభవించాలి కాబోలు.
    ఒక వయస్సులో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయిన స్త్రీ ధనాన్ని ఎవరూ అపేక్షించరు . కానీ, అదే ఉద్యోగిని అయిన స్త్రీ ధనాన్ని తమకు హక్కు న్నట్లు అనుభవించాలని చూస్తారు. ఆ స్త్రీకి ఇంక పెళ్ళీ సంసారం, సుఖ జీవనం ఏమీ అవసరం వుండవనీ యంత్రం లాగా సంపాదించి, చుట్టూ వున్న వాళ్ళకి పెట్టడమే వాళ్ళ జీవన మార్గమనీ అనుకుంటారు కాబోలు! పెద్దవాడు, వివేకి అయిన మాధవన్నయ్య విశ్వం చేత తనకి లాంటి జాబులు వ్రాయించడం సహించలేక పోయింది సుమిత్ర.
    పగలంతా ఆఫీసులో వుండి, సాయంత్రం ట్యూషన్లు చెప్పి డబ్బు దాచుకుని ఎం.ఏ కి వేడదామను కుంటే ఇలాంటి ఉత్తరాలోకటి మధ్యలో!
    విమలక్క వ్రాసిన ఉత్తరంలో అంతరార్ధం గ్రహించలేక పోలేదు తను.
    'ఏం మనుష్యులు!' అనుకుంది విరక్తిగా. అలాగని ఎక్కువసేపు అనుకోలేదు ఆమె. జాలిగా తనని 'చిన్నత్తా' అని పిలిచే విశ్వం వదనాన్ని తనెలా మర్చిపో గలదు.
    నాలుగేళ్ళు కళ్ళు మూసుకుంటే విశ్వం చదువై పోతుంది. అప్పుడు చదవ కూడదా ఎం.ఎ!
    'అవును -- అప్పుడతను ఇంజనీరై నీకు డబ్బు పంపుతాడు. యూనివర్శీటీ లో చేరుదూ గాని!' అని కసిగా వెక్కిరించింది కుముదిని.
    'ఇంకేం నువ్వు లేక్చరరూ, వాడు ఇంజనీరూ! ఇద్దరూ కలిసి నన్ను చదివించండి' అంటూ నవ్వేసింది సుమిత్ర. మర్నాడే బ్యాంకు లో రెండొందలు ద్రాచేసి అతనికి పంపించింది. మరో యాభై రూపాయలు విమలకి పంపుతూ మరో రెండు నెలలకి వస్తానని ఉత్తరం వ్రాసింది.
    పోస్టాఫీసు లో నుంచీ బయటికి వస్తూ వుంటే బసవరాజు కనిపించాడు.
    'హలో-- మీరు ఈ టైం లో ఇలా--' అన్నాడు నవ్వుతూ--
    'ఎందుకు దయ చేశారనా?' అని ఎదురు ప్రశ్న వేసింది సుమిత్ర.
    'ఎందుకు వచ్చారని ఎలా అంటాను-- రండి తాజ్ మహల్ కి పోయి మాట్లాడుకుందాం --'
    'డ్రా చేసిన డబ్బంతా మనీ అర్దర్డ్లు చేసేశాను. గెస్ట్ లకి కాఫీ లిప్పించడానికి ప్రస్తుతం నా పర్స్ కి శక్తి లేదు -- ' అంది సుమిత్ర బస్ స్టాప్ దిక్కుగా నడుస్తూ --
    'ప్లీజ్- ఇవాళ నేనిప్పిస్తాను రండి -' అన్నాడు బసవరాజు.
    'మీకిప్పుడు డ్యూటీ లేదా?' అనడిగింది.
    'శనివారం హాఫ్ డే కదా!' అన్నాడు బసవరాజు హుషారుగా--
    అప్పుడు టైం చూస్తె రెండు దాటింది. వాచీ చూడగానే బసవరాజు ముఖం లోకి చూసింది సుమిత్ర.
    -అతను భోజనం చేసినట్లు లేదు.
    'సారీ -- మీరు భోజనం చెయ్యండి-- నేను వెళ్ళిపోతాను-- లేకపోతె మీకు తోడు కూర్చుంటాను--' అన్నది.
    హోటల్ లో భోజనం చేస్తే ఇంటి దగ్గర తన్నులు తినాలి -- ప్రస్తుతం కాఫీ యే కర్తవ్యం --'
    'మిమ్మల్ని ఆకలితో మాడ్చడం నాకు బావుండలేదు-- అదీగాక నేను పర్మిషన్ తీసుకుని వచ్చాను. నేను వెళ్ళాలి. ఏమీ అనుకోకండి' నడుస్తూనే చెప్పింది సుమిత్ర.
    'అలాగైతే వెళ్ళండి -- ' అన్నాడు బసవరాజు స్పోర్టింగ్ గానే.
    తను ఆఫీసు నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చిన మాటైతే నిజమే గానీ, మరీ అంత త్వరగా వెళ్ళాలనే నిబంధన ఏదీ లేదు. ఎందుకో అతనితో అబద్దం చెప్పాలనిపించింది. చెప్పాక 'అయ్యో' అనిపించింది.
    ఇంటికి వెళ్ళే టప్పుడు రాగిణి కి పుట్టిన రోజు బహుమానం కొనాలని గుర్తొచ్చింది. తనకి భర్తా, పిల్లలూ సంసారం అంటూ ఏదీ లేదు. ఒక్కతి. కానీ దేనికీ డబ్బు చాలడం లేదు. ప్రతి నెలలోనూ యిబ్బందీ చివరి రోజుల్లో. ఉద్యోగం చేసే వాళ్లకి శుభ్రమైన నలగని బట్టలుండాలి. బస్సు ఖర్చులకీ, ఎప్పుడైనా స్నేహితులని సినిమాలకీ, కాఫీకి పిలవడానికి డబ్బుండాలి. వీటన్నిటికీ తను చాలా పొదుపుగా ఖర్చు చేస్తున్నా వచ్చే జీతమూ, పైన ట్యూషను మీద వచ్చే డబ్బూ కూడా చాలడం లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS