పెండ్లి పీటలపై కూర్చున్నాడు రాజశేఖర మూర్తి. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. అతని మనస్సు ఆ మంత్రాల మీద లేదు. ఇందుమతి కోసం ఎదురు తిన్నెలు చూస్తున్నది. ఇంతలో ఆమె రానే వచ్చింది. కాని, మధ్య యవనిక. ఇందేందుకో అనుకున్నాడు. రాజశేఖర మూర్తి సునిశితమైన దృక్కులు ఎక్స్ రే కిరణాల లాగ యవనిక చీల్చుకుని ఇందుమతీ ముఖ మండలాన్ని చేర ప్రయత్నిస్తున్నాయి . యవనిక కొంచెం పైకి లేచింది. కింద నుండి పారాణి పూసిన పదాంగుళులు తొంగి చూశాయి. అతని హృదయం లో యువ రక్తం ఒక్క పొంగు పొంగింది. తెర తియ్యగానే అతని చేతికి జీలకర్ర బెల్లం ఇచ్చి ఇందుమతీ మూర్ధం పై ఉంచమన్నారు. ఆమె మూర్ఘం స్పృశించి నప్పుడు అతని చేతి వేళ్ళలో విద్యుత్తూ లాగ ఏదో ప్రవహించింది. అతని మనస్సు సాగర తరంగం లాగ ఉప్పొంగి లేచింది. తెర దించారు. ఇందుమతీ దర్శనం అయింది. ధన్నోస్మీ" అనుకున్నాడు. ఆమె కన్నులు ఏ అఖో లోకాలనో వీక్షిస్తున్నవి. శిలీ ముఖాల వంటి ఆమె చూపులకు ప్వుద్వీ తలం అడ్డు రాదు కాబోలు! మంగళ సూత్రం చేతబూని లేచాడు రాజశేఖర మూర్తి. ఆ రెండు పీటలు ఒక పుష్పక విమానం అయినట్లూ, అవి రెండూ ఆకాశం లో ఏ చంద్ర లోకానికో పోతున్నట్టూ అనిపించింది. మంగళసూత్రం వధువు కంఠం లో బంధించాడు. ఇక నీవు నా దాన వనుకున్నాడు. కొంగు కొంగు ముడి వేశారు. ఇది విడరాని బంధం అనుకున్నాడు. వధువు చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. ఎంత సున్నితాలు ఆ వెళ్లు! చిగురు టాకులలా ఉన్నాయను కున్నాడు. వధూవరుల చేత వైశ్వానరుని కి ప్రదక్షిణం చేయించారు. సఖీ సమేతంగా మేరు పర్వత శృంగం పై విహరిస్తున్నట్లనిపించింది . "శతమానం భవతి శతాయుహ్ పురుష శ్శతెంద్రియ అయుష్యేవెంద్రియే ప్రతీతిష్టతి." ఆశీర్వాదం అయింది. సభాపడులు చల్లిన అక్షతలు వధూ వరుల శిరస్సు లపై పుష్ప వర్షం లా కురిశాయి. శచీ పతి సంప్రీతుడయినాడను కున్నాడు వెంకటాచలపతి. అయన కన్నులలో ఆనంద భాష్పాలు నిలిచాయి.
పెళ్లి పీటల మీద నించి లేచి లోపలికి పోవడానికి సన్నద్దు లైనారు ఇందుమతీ, రాజశేఖరులు. ద్వారం వద్ద భానుమతీ దేవి అడ్డగించింది. శారద, రేవతి, జానకీ దేవి, రమాదేవి, పద్మావతీ దేవి గుమిగూడారు. రాజశేఖర మూర్తిని పేరులు చెప్పమన్నది భానుమతి. రమాదేవి, పద్మావతి, శారద, ముందు ఇందుమతి చేత చెప్పించాలన్నారు. భానుమతి, జానకి, రేవతి కాదు, వరుడే ముందు చెప్పాలన్నారు. రెండు పక్షాల వారు సమ సంఖ్యాకులు . ఎటూ తెగలేదు. చివరికి రాజశేఖర మూర్తి "నేనూ నా నెత్తి మీది దేవతా వచ్చాం, తలుపు తియ్యండి" అన్నాడు. ఫక్కున నవ్వారందరూ. ఆ సమయంలో ఇందుమతి ముఖ కమలాన్ని చూసి తీరాలి. ఆమె క్రీగంటి చూపు ఒక్కటి రాజశేఖర మూర్తి ఎడమ చెంపకు చురుక్కున తగిలింది. 'అనుగ్రహితుడ్ని' అనుకున్నాడు.
పక్కనే ఉన్న అనంత కృష్ణ శర్మ గారు అల్లుడి చమత్కారం పై వ్యాఖ్యానించారు. "అవునే, చక్కగా చెప్పాడు రాజశేఖర మూర్తి. అతని పేరే అది. చంద్రుణ్ణి తలపై ధరించిన వాడు. ఇందుమతి చంద్రిక." ఆ వ్యాఖ్యానం విన్న ఇందుమతి సిగ్గుతో నీలోత్పలం లా ముడుచుకు పోయింది. 'ఇందుమతి అంటే ఎంత ప్రీతి, మరిదికి!" అనుకున్నది భానుమతి దేవి. "అన్నా, మేమందరమూ నీకిక ఏమీ కామా?' అనుకున్నది శారద. "ఎంత చమత్కారి , మరిది!' అనుకున్నది జానకీ దేవి.
భోజనాలకు ఆడవారి పంక్తి లో వడ్డించారు వదూవరులకు. అరిటాకు పరిచి, అందులో ఒకే ఒక వెండి పళ్ళెం లో అన్నం వడ్డించి, వెండి గిన్నెలలో పంచ భక్ష్య పరమాన్నాలు వడ్డించారు. పక్కపక్కగా పీటలు వేసి వధూవరులను కూర్చుండ బెట్టారు. రాజశేఖర మూర్తి కి కుడి పక్క శారద కూర్చున్నాది. ఇందుమతికి ఎడమ పక్క రేవతి కూర్చున్నది. వ=నెయ్యి వడ్డించారు. రాజశేఖర మూర్తి ఔపాసనం బట్టి సూపాన్నం కలిపి కొంతభాగం ఇందుమతి వైపు తోశాడు. ఇందుమతి ముద్దఎత్తలేదు.
"అట్లా కలిపి తోస్తే మా చెల్లమ్మ తినదండోయ్. ముద్దలు చేసి చేతిలో పెట్టాలి" అన్నది భానుమతి.
"చేతిలోనా, నోటిలోనా?' అన్నది రమాదేవి.
"అంత పట్టుదల పట్టదు లెండి మా చెల్లమ్మా!" అన్నది జానకి.
రాజశేఖర మూర్తి ముద్ద చేశాడు. ఇందుమతి చెయ్యి చాపలేదు.
"సరే, ఇక నేనేం చెయ్యను?" అని కినిశాడు రాజశేఖర మూర్తి.
"చెయ్యి పట్టవే" అన్నది భానుమతి . కదలలేదు ఇందుమతి.
"పోనీ, నోటికే అందియ్యి, తమ్ముడూ" అన్నది రమాదేవి.
'అలాగే" అన్నాడు రాజశేఖర మూర్తి . అప్పటికి గాని ఇందుమతి కరాంబుజం కదలలేదు. కుడిచెయ్యి నోటి కడ్డంగా చేసి వారించింది. ఆ విన్యాసం భారత నాట్య భంగిమ లాగ ఉన్నదను కున్నాడు రాజశేఖర మూర్తి. ప్రియుని చేతి ముద్ద ప్రసాదం లా చేతితో స్వీకరించి కళ్ళ కద్దుకుని నోట పెట్టుకున్నది ఇందుమతి. పవిత్రమయిన ఆ భక్తీ భావానికి అతని హృదయం స్పందించింది.
'ఇందూ, నేను ధన్యుణ్ణి.' అని లోలోపల అనుకున్నాడు రాజశేఖర మూర్తి. కాని, అ శబ్ద త్రయం ఎలాగో ఇందుమతి శ్రవణాలలో సోకి, మనస్సును తాకి హృదయంతరాళం లో కరిగిపోయింది.
అప్పగింతల వేళ దివాకర రావు గారు రాజశేఖర మూర్తిని ఒంటరిగా పిలిచి ఇలా చెప్పారు. "తమ్ముడూ, నీకు నేను చెప్పవలసినదేమీ లేదు. చదువుకున్న వాడివి, తెలివి తేటలు కలవాడివి. ఇందుమతి అతి సుకుమారి. ఆమె ఆరోగ్య పరిస్థితి డాక్టరు గా నాకు బాగా తెలుసు. నీ కభ్యంతరం లేకపోతె పుట్టింటిలో మరో రెండు సంవత్సరాలు ఉంచి వస్తూ పోతూ ఉంటె బాగుంటుందని నా ఉద్దేశం. నీ కిష్టమైతే ఈ రెండు సంవత్సరాలు కూడా చదివించి స్కూలు ఫైనలు గట్టెక్కించడానికి నేనూ, భానుమతీ సిద్దంగా ఉన్నాం. ఆలోచించుకుని నీ ఉద్దేశం నాకు తెలియ జెయ్యి."
"అలాగే, అన్నగారూ. నాకు మాత్రం ఏమి తొందర?' అన్నాడు రాజశేఖర మూర్తి.
13
పెళ్లి అయిన మరునాడు మగ పెళ్లి వారందరూ మూడు నిద్రలకు వీరన్న పేట బయలుదేరారు. వెంకటరత్నం గారి కుటుంబం మాత్రం గుంటూరు వెళ్ళిపోయారు. వధువుతో కూడా భానుమతీ దేవి , మాధవరావు, రేవతి బయలుదేరారు.
గృహప్రవేశ సమయం లో మాణిక్యమ్మ గారికి, సీతమ్మ గారికీ ఇందుమతీ సుందర మూర్తి లో శ్రీదేవి కనిపించింది. వారి కన్నులు భాష్ప ప్లావితా లయ్యాయి. కన్నులు ఒత్తుకుని మనసారా ఇందుమతీ రాజశేఖరుల చిర సౌఖ్యం కోసం భగవంతుణ్ణి ప్రార్ధించారు వారిద్దరూ.
జరగవలసిన మంత్రాంగం అంతా జరిగిన తరవాత వధూవరుల కోక పరీక్ష పెట్టారు. పానకపు బిందెలో నీరు పోసి, అందులో ఒక ఉంగరం పడవేశారు. ఎవరు ముందు దానిని బయటికి తీస్తారో వారిది గెలుపు. ఓడిపోయినవారు జీవితాంతము గెలిచినవారి కనుసన్నలలో మెలగాలని నిబంధన. సన్నని మూతి గల ఆబిందేలో ఇద్దరూ తమ కుదిచేతులు దూర్చారు. ఇందుమతి ఉంగరం కోసం వెతకటం పారంభించింది. రాజశేఖర మూర్తి లోపల ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఎంత మెత్తని దా చెయ్యి! ఎంత మ్రుడులాలు ఆ వేళ్ళు! ఇందుమతి వదిలించుకోవాలని ప్రయత్నిస్తుంది. రాజశేఖరుడు వదలడు. అతనికి శిరీష కోమలమయిన ఆ చెయ్యి వదల బుద్ది కాలేదు. జీవితాంతం అలాగే పట్టుకు ఉండాలని అనిపించింది. ఎంతకూ చేతులు బయటికి రావు. అతడామె పాణిని ప్రేమతో ఒత్తాడు. ఆమె కన్నులు మోడ్చి ఉస్సురన్నది. "ఇంకా ఎంత సేపర్రా" అన్నది సుభద్రమ్మ గారు. ఇందుమతి సిగ్గుతో చిరునవ్వులు చిందాయి. చివరికి రాజశేఖరమూర్తి చెయ్యి వదిలి ఉంగరం చేజిక్కించు కున్నాడు. చిక్కించుకున్న వాడు బయటికి తియ్యలేదు. మళ్ళీ ఇందుమతి చెయ్యి అందుకుని ఉంగరం ఆమె చేతిలో ఉంచాడు. ఆమె బయటికి తీసింది. భానుమతీ దేవి, "మా చెల్లాయే గెలిచింది." అని సంబర పడ్డది. రేవతి, "బావ ఓడిపోయా"డని గంతులు వేసింది. ఇందుమతి ఆధారం పంటితో నొక్కుకుంటూ పతిని క్రీగంటి తో చూసింది. రాజశేఖర మూర్తి మందహాసంతో కావాలని తెచ్చుకున్న ఓటమిని మనసారా స్వీకరించాడు. శారద మాత్రం ఈ రహస్యం గ్రహించినట్లుంది, చిన్నన్నయ్యే గెలిచాడని చాటింపు చేసింది" 'ఇందుమతి భర్త ప్రేమ మూర్తి' అనుకున్నాడు మాధవరావు.
ఇందుమతి వీరన్న పేటలో ఉన్న మూడు రోజులూ ఏదో సమయం చూసుకుని భార్యతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు రాజశేఖర మూర్తి. ఆమె పడక గది వదిలి బయటికి రాదు. ఆమె వద్ద ఎప్పుడూ భానుమతో, రేవతో కూర్చునే ఉంటారు. భోజనాల సమయంలో మాత్రం వధూవరు లిద్దరికీ ఒకే పంక్తి లో భోజనం. ఆమెను తనివితీరా చూసుకోడానికి అది ఒక్కటే సమయం. పెళ్ళినాడు ఒకే కంచం లో వడ్డించారు. ఆమె ముద్ద ఎత్తనే లేదు. అందుచేత రాజశేఖర మూర్తి ఆనతి ప్రకారం వీరన్న పేటలో ఉన్న మూడు రోజులూ వధూవరులను పక్కపక్కనే కూర్చో బెట్టినా విడివిడిగా కంచాలు పెట్టారు. మొదటి రోజున వంకాయ, పచ్చి మిరపకాయ , అల్లము వేసి చేసిన కూర నోట పెట్టుకుని గ్లాసెడు నీళ్ళు తాగింది ఇందుమతి. సీతమ్మ గారి వంటలో కారం ఒక పాలేక్కువే. "కారమా?" అని మెల్లిగా అడిగాడు రాజశేఖర మూర్తి. నీరు తిరిగిన కంటితో ఓరగా చూసింది ఇందుమతి. జవాబు లేదు. మరునాడు భోజనాల దగ్గిర ఇందుమతి కి కోరబోయింది. "మీ బావగారు తలుచు కుంటున్నారేమో!' అన్నాడు రాజశేఖర మూర్తి. నిశితంగా చూసి తల తిప్పుకుంది ఇందుమతి. జవాబు లేదు. మూడో నాడు ఇందుమతి తినకుండా కంచం లో ఉంచి వేసిన మిఠాయి ఎవరూ చూడకుండా రాజశేఖర మూర్తి కాజేసి, "నాకు తీపి అంటే ఇష్టం" అన్నాడు . ఇందుమతి వారించ బోయి నలుగురూ ఏమను కుంటారో నని ఊరుకున్నది.
రాజశేఖర మూర్తి ఆరాటం గ్రహించిన జానకీ అనాటీ మధ్యాహ్నం భానుమతీ దేవికి, రేవతికి శారదను తోడు ఇచ్చి ఊరిలోని చుట్టాలను చూసి రమ్మని పంపింది. తాను సుభ్రద్రమ్మ గారితో బాటు వంటింటి పని చేసుకుంటున్నది. మగవారందరూ బయట అరుగుల మీద పడుకున్నారు. మాణిక్యమ్మ గారు, సీతమ్మ గారు పడమటి వసారా లో నడుములు వాల్చారు. ఇందుమతి గదిలో కూర్చుని చదువు కొంటున్నది.
రాజశేఖర మూర్తి సమయం కనిపెట్టి పిల్లిలా మెల్లిగా గదిలోకి వెళ్ళాడు. తన భార్యతో తాను మాట్లాడడానికి కూడా అంత భయం ఎందుకో అర్ధం కాలేదు. ఇందుమతి ఉలికిపడి లేచి నిల్చున్నది.
"ఇందూ , నాతొ మాట్లాడవూ?"
"ఎందుకు మాట్లాడను?"
"మూడు రోజులుగా భోజనాల దగ్గిర నిన్ను మాట్లాడించటాని కెంత ప్రయత్నం చేశాను ఉలుకు లేదు, పలుకు లేదు."'
"అంతమంది లో ఎలా మాట్లాడను?"
"అవును. అంతమంది లో పలకరించ బోవటం నాదే పొరపాటు. ఏం చదువుతున్నావు?"
"బాపిరాజు నారాయణరావు."
"అది నీ కిష్టమా?"
"ఇదే మొదటిసారి చూడటం, బాగున్నది."
"అందులో నీకే పాత్ర నచ్చింది?"
"ఇంకా పూర్తిగా చదవలేదు. చదివినంత వరకు నారాయణరావు పాత్ర ఉదాత్తంగా ఉన్నది."
"నేను నారాయణరావు వంటి వాడను కానా?"
"నవల చదువుతున్నంత సేపూ మీరే నారాయణ రావు రూపంలో సాక్షాత్కరిస్తున్నారు."
"శారద నారాయణరావు ను లాగ నువ్వు కూడా నన్ను తిరస్కారిస్తావని భయపడ్డాను సుమా?"
"ఛీ! శారద తెలివి మాలినది. అయినా నేను జమీందారు బిడ్డను కాదుగా?"
"నేను మాత్రం ధనికుల బిడ్డనా?"
"మీ విధ్యాబుద్దులే మీ సంపద."
"నారాయణరావు అందమైన వాడు, బలిష్టమైన శరీరం కలవాడు, ప్రద్యుమ్నుడి వంటి వాడు. నా కాతనితో పోలిక ఎక్కడ?"
"మీ ఔదార్యమే మీ అందము. నా పాలిట మీరే ప్రధ్యమ్నులు! అయినా నేను శారద వంటి అపురూప సౌందర్య వతిని కానుగా?"
"నీ సౌందర్యం నాకు తెలుసు, నా రాణీ. నీలో ఎంతటి ఆకర్షణ లేకపోతె నిన్ను చూసిన మరుక్షణం లోనే నీ దాసుడ నై పోతానా? నాకు నిజానికి ఇంత చిన్న వయసులో వివాహం చేసుకోవాలని లేదు, ఇందూ. పెద్దవాళ్ళ బలవంతం తో నిన్ను చూడటానికి వచ్చాను. కాని, నిన్ను చూసిన తరవాత ఇక ఒక్క మాట అడ్డు చెప్పలేదంటే నమ్ము."
ఇందుమతి మాట్లాడలేదు.
"ఇక వస్తాను. ఇందూ చదువుకో" అని బయటికి వచ్చేశాడు రాజశేఖర మూర్తి. అతను వెళ్ళిపోయిన తరవాత చాలా సేపటి వరకూ ఇందుమతి చేతిలో పుస్తకం తెరిచే ఉన్నది కాని పేజీలు కదలలేదు.
