15
"సూపర్నెంటు బాబూ, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి."
"ధర్మ ప్రభువులు , దొరా, మీరు. వెయ్యేళ్ళు సుఖంగా వర్ధిల్లండి."
షడ్రపోపేతమైన భోజనం చేసి ఖైదీలందరూ బొజ్జలు నిమురుకుంటూ మనస్పూర్తిగా ధర్మారావును దీవించసాగారు.
ఒక్క గౌతమ్ మాత్రం అటువంటి వాటికి అతీతుడుగా మౌనంగా ఉండిపోవడం ధర్మారావు గమనించాడు. ధర్మారావు చూపులు తన పైననే పడడంతో గౌతమ్ చటుక్కున దృష్టి తిప్పుకొని ఏదో పని కల్పించుకుని వెళ్ళిపోయాడు.
పరీక్షగా అతడినే పరిశీలిస్తున్న ధర్మారావు ఉలిక్కి పడ్డాడు.
"అదే నడక! సందేహం లేదు. గత సాయంత్రం దయామయి తో మాట్లాడుతూ కనిపించిన వ్యక్తీ ఇతడే! ఏమిటో ఈ ఇద్దరికీ సంబంధం?' కొద్ది క్షణాలు మాత్రమే ఆ విషయం గురించి ఆశ్చర్యంగా ఆలోచించాడు ధర్మారావు. అంతలో అర్జున్ రావడంతో అతనితో సంభాషణ లో పడిపోయాడు.
"ధర్మరాజులు బాబూ, మీరు ధర్మరాజులు!" ఖైదీల స్తోత్రమాలికలు వింటూ అర్జున్ చిరునవ్వుతో ధర్మారావును అభినందించాడు.
"మీ అనుంగు మిత్రులు మీకు చక్కటి బిరుదును ప్రసాదించినట్లున్నారే" అంటూ హాస్యమాడాడు.
ప్రతిగా ధర్మారావు కూడా చిరుహాసం చేశాడు.
'అలా ఆ ఖైదీలలో ఒక్కొక్కరి ముఖమే చూడండి, అర్జున్ గారూ! సంతోషంతో, జీవ కళతో వెలిగి పోతున్నాయి. పాపం! రుచికరమైన తిండి తిని ఏనాడయిందో! స్వర్గ సౌఖ్యమేదో లభించినట్లు ఆనందిస్తున్నారు."
"నిజమే."
"ఇలా వీళ్ళని సౌమ్య మార్గంలోనే మంచి పద్దతికి తేవాలి. వాళ్ళని బాధపెట్టి , చాలీ చాలని తిండితో కఠినంగా , కర్కశంగా చూస్తె ప్రతీకారం చేయలేకపోయినా, నిస్సహాయులై అంతరాంతరాలలో ప్రతీకార వాంఛ, తీరని కక్ష తగులుకు పోయి రాక్షసత్వం విజ్రుంభించు తుంది వాళ్ళల్లో."
"నిజమే, ధర్మరావ్!' ప్రేమగా వీపు తట్టాడు అర్జున్. :మీ తెలివి అమోఘం. మీరు ప్రతి విషయాన్ని సమగ్రంగా పరిశీలించి సహేతుకంగా విమర్శిస్తారు."
"మీ పూర్తీ సహకారం నాకు ఉంటుందని మాట ఇచ్చారు."
"అవును, ధర్మరావ్! సందేహం దేనికి? ఈ విషయాలలో ఇంత పరిశీలనాత్మకంగా ఎన్నడూ ఆలోచించనందుకు నిజంగా నేను సిగ్గు పడుతున్నాను. చెప్పు, నన్ను ఏం చేయమంటావు?"
'............"
"చెప్పు, ధర్మరావ్. సందేహం వద్దు . నేనేం చేయాలి?"
"ఆ రోజున ఖైదీలు తింటున్న తిండి మీరు చూచారు. అది మనుషులు తినే తిండి కాదు కదా. పశువులైనా తింటాయా? చట్టం నేరస్తులు స్వేచ్చా విహారం చేయకుండా శృంఖలా బద్దం కావించమన్నదే కాని, కడుపు మాడ్చి హీనంగా బాధ పెట్ట మనలేడు."
"నిజమే."
"వారి కిస్తున్న ఆహారం సక్రమంగా సంతృప్తి కరంగా ఉండేటట్లు మీరూ, కాంట్రాక్టరు భుజంగం గారూ -- మీ మిత్రులు గనక, వారికి చెప్పి మార్పు చేయించగలరని ఆశిస్తున్నాను."
వింటూనే పకపకా, తేలికగా నవ్వేశాడు అర్జున్.
"మహా తెలివైన వాడవోయ్, ధర్మరావ్!" అంటూనే మళ్ళీ నవ్వాడు. "నీకూ, భుజంగానికీ ఈ విషయం లో జరిగిన వాగ్వాదం నాకు భుజంగమే చెప్పాడు. ఈ విషయం లోనే అతడు నాచేత నీకు హెచ్చరిక ఇప్పించాడు. విషానికి విషమే మందుగా నువ్వు తిప్పి కొడుతున్నావు. భలే యుక్తి పరుడవోయ్!"
ధర్మారావు మౌన గంబీర ముద్ర చెదరలేదు.
"సరే. అలాగే చెబుతాను చేయిస్తాను. ఎప్పుడూ నా సహకారం నీకు ఉంటుంది. గుడ్ బై."
"గుడ్ బై" పధకం చక్కగా నెరవేరు తున్నందుకు ధర్మారావు పెదవుల పై సంతృప్తి పూర్వక హాసం మెరిసింది.
విశ్రాంతి గా చెట్ల నీడన కూర్చున్న ఖైదీలాందరూ ధర్మారావు నూ చూచి గౌరవంగా లేచి నిలబడ్డారు. ఆత్రంగా, నిశ్శబ్దంగా అతడి వదనం వైపు చూస్తున్నారు.
"నేను మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను.'
"చెప్పండి, బాబూ! మీరు నిప్పుల్లో దూకమంటే దూకుతాము."
"ఏట్లో పడమంటే పడతాము." ఖైదీ లందరూ భక్తీ విశ్వాసాలతో ప్రకటిస్తున్నారు.
"చాలు, ఆపండి" గంబీరంగా అన్నాడు ధర్మారావు. "నాకోసం త్యాగాలు చేయడానికి కాదు, మీరిక్కడికి వచ్చింది. మిమ్మల్ని మీరు సరిదిద్దు కోవడానికి."
ఖైదీలు కిక్కురు మనకుండా తలలు వాల్చి నిలబడ్డారు.
ఆ నిశ్శబ్దం లో ధర్మారావు గంబీర కంఠం కంచు గంటలా పలికింది. "మీరు కడుపులు నిండాయని తృప్తిగా ఉన్నారు. మీరు తృప్తిగా ఉంటె నాకు తృప్తి. మీరు ఆనందంగా ఉంటె నాకు ఆనందం. మీరు సక్రమ మార్గం లో ప్రవర్తిస్తే నాకు అపార సంతోషం." కొద్ది సేపు ఆగాడు.
శ్రోతలు భక్తీ శ్రద్దలతో వింటున్నారు.
"మీరు ఒక నేరం మోపబడి ఇక్కడ బందీలయ్యారు. ఈ శిక్షా కాలం లో మీరు సరయిన క్రమశిక్షణ తో మెలిగి, బయటి ప్రపంచం లోని మనుషులలో తిరిగి యోగ్యులై కలిసిపోవాలి గాని, మళ్ళీ నేరస్తులై రావడం నేను సహించను. ఏయ్, ట్వెంటీ వన్ , ట్వెంటీ ఎయిట్ , ఫార్టీటూ! మీరందరూ కిందటి నెలలో రోజుల తేడాలో విడుదలై వెళ్ళిపోయారు. మళ్ళీ కొంచెం తేడాలో ముగ్గురూ వచ్చేశారు. ఏమిటిది?"
"..........."
"మాట్లాడరేం?' మౌనంగా నిలబడిన వారిని చూచి గర్జించాడు . "ఆడపిల్ల అత్తింటి కీ, పుట్టింటి కి తిరిగినట్టు బయటి ప్రపంచం లోకి, ఈ బంది ఖానా లోకి రాకపోకలు మీకు అలవాటై పోయాయి. సిగ్గు బిడియాలు, నీతి నిజాయితీలు , మానాభిమానాలు లేని మీ బతుకు లెందుకు? ఛీ!"
"సూపర్నెంట్!' అందరి మధ్య నుండీ కోపంగా అరుస్తూ పెద్ద పెద్ద అంగలేస్తూ ఖైదీ నంబరు నలబై రెండు నిప్పులు కురిపిస్తున్న నేత్రాలతో వచ్చి ధర్మారావు ను సవాలు చేస్తున్నట్లు చాతీ విరిచి నిలబడ్డాడు. తీక్షణంగా అన్నాడు: "ధర్మ పన్నాలు చెప్పడం సులభమే కాని, నిజ జేవితం లో అవి ఎక్కడున్నాయి? నీతీ, జాతి, అభిమానం! ఓహ్! చాలా పెద్ద పదాలే ఉపయోగిస్తున్నావు. ఈ మాటలన్నీ నేనూ ఎరుగుదును, నేనూ చదువుకున్నాను. నిజంగా వాటికో అర్ధమూ, విలువా ఉన్నాయా? అవి నిజంగా ఈ ప్రపంచం లో ఉన్నాయా?" ఒక్కొక్క మాట ఒక్కొక్క ఉరుము.
అతడి ఆవేశ ధోరణి ని అలాగే మౌనంగా తిలకిస్తూ వారించబోయిన ఖైదీలకు వద్దని సైగ చేశాడు ధర్మారావు. ఆ ఖైదీ అలా మాట్లాడగలుగుతున్నందుకు కొందరు ఖైదీలు ఆనంద పడుతున్నట్లు కూడా అతడు గమనించాడు. ధర్మారావు మౌనంతో ఖైదీ కోపం కొంత తగ్గింది.
"ఒకసారి బుద్ది తక్కువై నేరం చేసిన పాపానికి, తిన్నగా బతక పోయినా మమ్మల్ని బతకనివ్వరు. ఎక్కడ, ఏ నేరం జరిగినా పాత ఖైదీ లంటూ లాక్కు పోతారు. మేము నీతిగా బతికినా, మమ్మల్ని నమ్మరు. బతకనివ్వరు. ఎవ్వరూ మాకు పనులివ్వరు. మరి ఇక మేము బతికే దేలాగ? మా కిక అడ్డ దారులే గదా శరణ్యం ? దీనికేం చెబుతారు మీరు?"
"నిజం, నిజం. ఏం చెబుతారు?' అనేక కంఠలు అరిచాయి.
"తొందర పడకండి. ఆవేశమే శత్రువు.' ధర్మారావు గంబీరంగా పలకడంతో అలజడి సర్దుకుని తిరిగి నిశ్శబ్దం కుడురుకున్నది. "మీ కష్ట సుఖాలు నాకు తెలియక పోలేదు. ఇవన్నీ నాకు తెలుసు. ఏం చేస్తాము? వీటికి పరిష్కార మార్గం లేకపోలేదు. కాని వెంటనే మాత్రం సాధ్యం కాదు. తెలిసి తాకినా, తెలియకా తాకినా నిప్పు కాలుతుంది. మచ్చపడుతుంది. ఆ మచ్చను మాపు చేయడం తేలిక పని కాదు మరి!"
"ఎందు కొచ్చిన మాటలు, దొరా యియ్యి?" అసహనంగా అరిచాడు ఖైదీ. "ఒక్క పక్క కడుపు మాడిపోతాది. ఓ వంక ఆలు బిడ్డలను పోషించు కోవాలి. ఎవరినైనా పనడిగితే 'దొంగవు, పో'మ్మంటారు. బిచ్చ మడిగితే 'దుంగలా గున్నావు, పని చేసుకోపో'మ్మంటారు. ఇక మాకు దొంగతనం కాక, దారి ఏముంది?"
'అవును . ప్రజలు దొంగను చూచి భయపడటం సహజమే. అందుకని మీరు తెలిసీ, మళ్ళీ ఊబిలో దిగడం ఏమంత తెలివైన పని? నేనొక విషయం చెబుతాను. ఓర్పుగా విని, తెలివిగా అలోచించి మరీ సమాధానం చెప్పండి.'
"అలాగే, దొరా!'
"మీలో దొంగ లున్నారు, దోపీడీ దారులు న్నారు, దేశ ద్రోహులున్నారు, ఖూనీ కోరు లున్నారు."
పెనుగాలికి అరిటి ఆకులూ వాలిపోయినట్లు ఒక్కొక్క ఖైదీ ముఖమే కుంగి పోయింది.
"సిగ్గు పడకండి. ఏదో ఖర్మ కొద్దీ నేరం చేసిన వాళ్ళే అందరూ కాని మీరందరూ మూక ఉమ్మడిగా నేరస్తులే అయినా, ప్రతి ఒక్కరూ మరొకరికి భయపడతారు. వారి నేరం గురించి.
"జేబులు కొట్టేసే వాడిని చూచి తక్కిన వారు చిల్లర డబ్బులూ, చుట్ట ముక్కలూ దొంగిలిస్తాడని భయపడి జాగ్రత్త పడతారు. గూండాకు చుట్టూ పక్కల ఉండటానికే హడలి పోతారు. ఏ సమయానికి ఏం కోపం వచ్చి తంతా'డోనని. హత్యా నేరస్తుడు చటుక్కున కోపం వస్తే పీక నులిమి పారేస్తాడే మోనని అతడి వంక కన్నెత్తి చూడటానికే మిగిలిన వాళ్ళు భయపడతారు . ఔనా?"
వాలిన తలల లో ఒక్కటీ పైకి లేవలేదు.
"ఇన్నాళ్ళు గా మిమ్మల్ని పరీక్షిస్తున్నాను. మీలో మీకే మళ్ళీ ముఠాలు, నాయకులూ, కొందరు అధికులూ, కొందరూ అల్పులు! మీరందరూ నేరస్తులే. కాని, చూచారా , మీలో మీరే మీ నేరాలను మరిచి మరొకరిని నేరస్తుడు గా భయంతో చూస్తున్నారు. కొందరు అధికారంతో కొందరిని అణగ దోక్కుతున్నారు. వాళ్ళ వంతు పని మరొక బలహీనుడి నెత్తిన నయానో, భయానో పెట్టి మరి, నేరస్తుడే సాటి నేరస్తుడిని తనతో సమంగా చూడలేనప్పుడు, సజ్జన వాతావరణం లో , సభ్య సమాజం లో నేరం మరిచిపోయి మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు, ఎలా నమ్ముతారు?చెప్పండి."
అప్పటికీ ఒక్క తలా లేవలేదు.
"ఏం, పార్టీ టూ , ఏమంటావు?" సూటిగా అడిగాడు ధర్మారావు.
"నిజమే, దొరా." నసిగాడు ఖైదీ.
"అందువల్ల మనం లోకాన్ని ఏమీ అనడానికి వీలు లేదు. ఎవరి జాగ్రత్త లో వారుంటారు. మీరెవరో తెలియని, మీ మచ్చను గుర్తు పట్టని చోటికి పోయి అదేంత తక్కువైనా సరే, కూలి పని చేసి బతకవచ్చు. ఘరానా దొంగ తనాల కంటే, కనా కష్టమైనా కాయకష్టం గొప్పది , గౌరవ ప్రదం . అయినా ఒకరు మీకు పని ఇవ్వక్కర్లేదు. మీ మనస్సులో మాలిన్య గుణం పోయి, శుద్ధి అయిననాడు ఆ ఆత్మ బలం తో మీరే లోకం తో నిగ్రహించుకుని బతక గలరు. ఆత్మవిశ్వాసమూ, పట్టుదలా ఉన్ననాడు ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఏ కాయగూర లో, ఫల పుష్పాలో అమ్ముకుని బ్రతకవచ్చు. లేదా ఇక్కడ విదుద లై వెళ్ళిన నలుగురూ మీలో మీరే కూడి , ఏదో చిన్న వర్తకమో, వ్యవసాయమో చేసుకొని జీవించ వచ్చు. బాగా బతలాలనే పట్టుదల ఉన్న నాడు జీవికకు మార్గం లేకపోలేదు."
"ఔను దొరా! నిజమే దొరా!" ఖైదీల ముఖాలు ప్రకాశ వంతంగా వెలిగి పోయాయి.
