'అందువల్ల . మనం కొన్ని ప్రత్యెక పద్దతులు అనుసరించి ఎటువంటి వారినైనా సజ్జనులను కావింపవచ్చునని నా ఆశ, నమ్మకం. ఇందుకు పూర్తిగా సహకరించాలి నాతొ."
"నీది చాలా విశాల హృదయం , ధర్మరావ్! నువ్వు ఏ కారణంగా ఇక్కడ పెరిగావో తెలియదు కాని, నీ జననీ జనకులు చాలా ఉత్తము లని, ఉన్నతులని మాత్రం నేను చెప్పగలను . అయితే నా సందేహం ఒక్కటే. మనం ఇచ్చేదాన్ని మోయగల శక్తి అవతలి వ్యక్తికీ ఉండాలి కదా? పన్నీరు ను బూడిద లో ఎంత పోస్తే మాత్రం ఏం ప్రయోజానం దక్కుతుంది?"
"దక్కదు నిజమే. కాని అంతా బూడిద కాక, యోగ్యమైనది కూడా కొంత ఉండి వుండవచ్చు కదా?"
"నిశ్చయంగా చెప్పలేము."
"పోనీ, పాత దారి వదిలి, ఇది ఒక ప్రయోగంగా మనం ఎందుకు చేయకూడదు, అర్జున్ గారూ? గతరాత్రి మనకు మనం చూచిన చిత్రం పై చర్చ జరిగింది. అది మన మనస్సు నాకర్శించింది."
"అవును."
"కాని యదార్ధానికి ప్రతిబింబమే అది. పరిష్కారం లేదు పరిష్కారం లేని చోట ప్రయోజనం శూన్యం. ప్రయోజనం లేని చర్విత చర్వణం నిరర్ధకం. కధ మానవుని జీవితానికి సన్నిహితంగా కనిపిస్తూ , అందులో లేని రమ్యతను రంగరించి, అందాన్ని ఒలికించి, అతడి సమస్య లకు పరిష్కారాన్ని చూపి, అతడందుకోలేని ఆదర్శాన్నీ, చేర లేని గమ్యాన్ని చేరే పద్దతిని తెలియ జెప్పాలి. నిత్య జీవన యాత్రా తాపత్రయాల్లో మూసుకు పోతున్న అతడి కండ్ల ను తెరిపించాలి. మరుగున పడిపోతున్న మంచినీ, మానవత్వాన్నీ పునరుద్దరించాలి. ఒక్క మాటలో -- అతడికి వెలుగు బాట అయి, నడిపించాలి. ఆదర్శ శిఖరమై అలరారాలి.
"ఆ పరిస్థితులలో అందరూ కాకున్నా, అసంఖ్యకులు మారగలరనీ, మనం ఆశించిన ఆదర్శ ప్రపంచం , బంగారు లోకం వెలియ గలదనీ ఘంటా పదంగా చెప్పగలను."
"సరే. మీ మాటను నేనూ ఆమోదించాను. కాని అందుకు ఆచరణ మార్గాలేవంటారు?" అర్జున్ ప్రశ్న.
"కృతజ్ఞుడిని. అనుకుంటే ఆచరణ ఎంత? చూడండి. ఖైదీలు నేరాలే చేశారు. కాని వారూ మనుష్యులే! వారికి కారాగారవాసం ఒక శిక్షగా మాత్రమే ఉంటున్నది. వారిని శారీరకంగా, బంధించు తున్నామే కాని, మానసిక ప్రవృత్తులను అరికట్టలేక పోతున్నాము. విడుదలై వెళ్ళిన వారిలో అసంఖ్యాకులు తిరిగి నేరాలు చేసి, జెయిలు కు పాత చుట్టాలు అవుతున్నారు.
"వారికీ కారాగారం ఒక పాఠాశాల అయి, వారిని సన్మార్గానికి తిప్పి, తిరిగి మనుష్యులను చేసి పంపగలగాలని నా ఆశ. కఠిన శిక్షతో, కరుకుధనంతో వారి మనస్సు నూ, శరీరాన్నీ మొరటు దేలించి వేయక , మన ఆదరంతో , ప్రేమతో వారి మనస్సులను మెత్తన కావించి, చక్కటి పుస్తకాలను వారి చేత చదివింప జేసి, చిత్రాలను చూపించి, వారి అంతరాంతరాలలో మంచి పై ప్రేమను, కాంక్ష ను పెంచాలి. వారిని మనుష్యులుగా మార్చి లోకంలోకి పంపాలి."
............
"మాట్లాడరేం, అర్జున్ గారూ?" ఆందోళిత స్వరంతో ప్రశ్నించాడు.
"నేనెప్పుడూ ఇంత లోతుగా ఆలోచించ లేదు, ధర్మారావ్! మీరు చెప్పిందంతా నిజమే. పదకమైతే చాలా బాగున్నది కాని, బాట అంతా కంటకమయమయ్యా! పలు కష్టాలు ఎదుర్కోవాలి. కాని నా పూర్తీ సహకారం ఉంటుంది నీ ప్రయత్నాలకు. సరేనా?"
"అర్జున్ గారూ, కృతజ్ఞుడిని!"
తన ఆదర్శ సౌద సోపానాల ప్రధమ వేదిక నదిరోహించాననే ఆనంద పారవశ్యం లో మునిగి పోయిన ధర్మారావు మర్నాడు విషయాలన్నీ సత్యాదేవి కి తెలియజేశాడు స్వయంగా.
'చాలా బాగున్నది" అంటూ అభినందించింది సత్య. "మీరు సార్ధక నాములు" అని నవ్వింది.
అనంతరం వాహ్యాళి కి కలిసి వెళ్ళిన ఆ ఇరువురి సంభాషణ అనేక విషయాలను స్పృశించింది.
"మీవంటి ఉత్తములతో పరిచయ భాగ్యం కలగడం నా అదృష్టం. స్నేహం కావడం మరీ అదృష్టం . ఈ స్నేహం ఇలా కలకాలం నిలవాలని నా కోరిక."
తన మాటలకు సమాధానం రాక సత్య తలెత్తి చూచింది. ధర్మారావు మౌనంగా సంపంగి చెట్టు నుండి రాలిన పూరేకులను ఏరుతూ కూర్చున్నాడు.
"మీ అమ్మగారిని చూస్తె ఏదో పూజ్య భావమూ, గౌరవమూ కలుగుతాయి. మన కుటుంబాల మధ్య స్నేహం పెంపొంది ఎన్నటికీ విడరాని బంధంగా పెనవేసుకు పోవాలని నా కోరిక."
ఉలిక్కి పడ్డాడు ధర్మారావు. "వద్దు, సత్యాదేవీ. అంతంత పెద్ద కోరికలు వద్దు. ఏదో ఈ పరిచయం ఇలా నిలిస్తే చాలు. సెంటు వాసన కొద్దిగా అయితేనే, ఇష్టపడి మురుస్తాము. కాని అధికమైతే మొగం మొత్తుతుంది."
సత్యాదేవి వదనం చిన్నబోయింది. "ఎందుకలా బాధపెడతారు మాటలతో? అయితే నేనలా పైపై మాటలదాన్నా? ఇంతేనా, మీరు నన్నర్ధం చేసుకున్నది?"
"చిన్న బుచ్చుకోవద్దు. నేను యదార్ధమే చెప్పాను కాని, అందులో ప్రత్యేకంగా మీ పై నింద లేదు. చూడండి. ఈ చంపకం ప్రీతి పాత్రమే కాని, పూజర్హం కాదు. అటువంటి వాడినే నేను."
"వద్దు, ధర్మారావు గారూ, అటువంటి మాటలనవద్దు. పారిజాత ప్రసూనాని కున్న చక్రవర్తులకు ఉండే ఠీవి, తెలివీ , హృదయ వైశాల్యమూ మీలో ఉన్నాయి. ఇంత ఉన్నత వ్యక్తీ అసలు ఎక్కడైనా ఉంటారా అని కూడా నే ననుకొనేడాన్ని. నిజంగా మీ యీ స్నేహానికి నేను గర్విస్తున్నాను. మీ సాహచర్యం శాశ్వతం కావాలని కోరుకొంటున్నాను."
"ఉండండి, సత్యాదేవి . తొందర పడకండి. మీకు నా గురించి పూర్తిగా తెలియదు. కొంచెం చెప్పనీయండి."
"ప్లీజ్, వద్దు. నా కటువంటి వన్నీ అనవసరం. గౌరవించడానికి వ్యక్తే ముఖ్యం."
"అసలు వినండి. విన్న తర్వాత కూడా, మీకీ గౌరవం ఉంటె సంతోషమే."
'అనవసరం. నేను వినను. నా కక్కర్లేదు." అంటూనే లేచింది సత్య. "అది నేను వింటే అంతగా మారి పోతానను కుంటే , అసలెందుకు వినాలి? వినను." నడక ప్రారంభించింది.
"అయితే పసి బిడ్డలుగా మిధ్య ను ప్రేమిస్తారా?"
"కాదు, పసిబిడ్డ లాగా నిర్మలత్వాన్ని నిష్కల్మషంగా ప్రేమిస్తాను."
"లాయర్ ననిపించారు. మాటల్లో మీతో నేను నేగ్గలేను."
"ఇష్టమైన వారి వద్ద ఓడిపోవడంలో కూడా అందం ఉందండీ!"
మనస్పూర్తిగా నవ్వుకొంటూ, కరచాలనం కావించుకుని విడిపోయారు.
పండు వెన్నెల పరమాదరం తో ఆశీర్వదించింది.
అత్యానందంగా ఇంటికి తిరిగి వచ్చిన ధర్మారావు 'అమ్మా!అమ్మా!' అని పిలుస్తూ దయామయి కోసం వెదక సాగాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు.
"అమ్మ ఎక్కడికీ వేళ్ళదే!' ఆలోచనతో నిలబడిన అతడికి కిటికీ లో నుండి ఆ సంధ్య చీకటి లో రెండు మానవాకారాలు-- ఒక పురుషుడు , స్త్రీ -- ఏదో మాట్లాడుకుంటూన్నట్టు కనిపించింది.
"ఎవరది?' అనుకొంటూ వెళ్ళబోతుండగానే చటుక్కున ఇద్దరూ విడిపోయారు. పురుషుడు చెట్ల కింది నుండి వడివడిగా చీకటి లో అదృశ్యమైపోయాడు.
స్త్రీ ఆకారం ఇంటి వైపే వస్తున్నది. ఆమె ఎవరో కాదు, దయామయి.
నిశ్చేష్టుడై నిలబడిన ధర్మారావును చూచి గదిలో అడుగిడిన దయామయి ఉలిక్కిపడింది. అంతలోనే తట్టుకొని, తొట్రుపాటు పైకి కనుపించ నీయకుండా "ఎంతసేపై వచ్చావు?' అని ప్రశ్నించింది.

"ఇప్పుడే .' యాంత్రికంగా అన్నాడు.
"కాఫీ ఇవ్వనా?"
"వద్దు కానీ..... ఎవరితో నమ్మా, మాటాదుతున్నావు?"
కలవరపడి దయామయి వెంటనే సమాధానం ఇవ్వలేక పోయింది.
"ఎవరున్నారు? నువ్వు లేక, ఏం తోచక కాస్సేపు అటు చల్లగాలి లో తిరగడానికి వెళ్ళాను.'మాట తడబడింది.
"ఎవరితోనో మాట్లాడుతున్నావు?"
"నేనా?' తేలికగా నవ్వేసింది దయామయి. "చీకటి లో చెట్ల నీడను చూచానేమో? నాతో ఎవరు మాట్లాడతారు?"
చెబుతున్నది అబద్దమని అతడికి తెలిసినా , మరేమీ మాట్లాడ లేదు. కాని, ఏమని అడుగుతాడు? ఆమె! తనను తల్లి లాగా పెంచిన ఆమె! చిన్ననాటి నుండీ తనను తీర్చిదిద్దిన తల్లి! తనను వదలలేక తన వద్దనే ఉన్న ఆమె! అహోరాత్రుల తన సుఖాన్ని కాంక్షించి , చల్లగా ఆశీర్వదిస్తున్న మమతామయి. ఆమె మాటకు ఊ కొట్టవలసిందే కాని, ఆమె ఏమి చెబితే మాత్రం తాను యేమని నిలదీసి అడగ గలడు? ఇంత ముది వయస్సు లో! ఛ! అటువంటి దురాలోచనలకు మనసు ఇచ్చ గించలేదు. మరి? ఏమి రహస్యాలుంటాయి? తనకు జ్ఞానం తెలిసిన నాటి నుండీ ఆమె కా ఆశ్రమ వాసమే తపస్సుగా ఉన్నది కాని, బయటి ప్రపంచం తో కాని, మానవులతో కాని సంబంధమే లేదు . అది సర్వ విదితం కూడా! మరి ? ఏమో!
"మీ అమ్మగారిని చూస్తె పూజ్య భావమూ, గౌరవమూ కలుగుతాయి.' సత్యాదేవి మాటలు గుర్తు వచ్చాయి. అంతలో మనస్సంతా ఆమె తీయని తలపులతో నిండి పోవడంతో మనసున తర్కించుతున్న విషయం తాత్కాలికంగా మరుగున పడింది.
