Previous Page Next Page 
అర్పణ పేజి 12

                                             
                                      9
    రెండు రోజులు ఎక్కడికి కదలలేదు రాజు. తప్పకుండా ఆ మధ్య కాలంలోనే ఎప్పుడో ఒక రోజు తండ్రి పార్వతి తో సంభాషిస్తాడు. అప్పుడు తను వినాలి. ఫలితాన్ని గురించి తనకేమీ ఆశ లేదు. ఉన్నా గానీ అది ఊహ మాత్రమె అంటూ అంతరాత్మ చివుక్కు మనిపింపజేస్తూంది. జీవితాలు సులుపు తిరగడం, కోరినవి తలకిందులు కావడం మానవ చరిత్రలో అనాది గా వస్తున్నా అదొక సహజానుభవంగా, సాధారణ దృశ్యంగా అయిపోయినా ప్రాణం నిండిన ప్రతి శరీరం ప్రత్యేకించి ఆ దుష్ట  క్షణాల్లో వ్యధా పూరితం అయిపోయి వైర్యాశ్యాన్ని , వైరాగ్యాన్ని పెంచుకుంటూ ఇహం కన్న పరాన్నే ఎక్కువ కోరుకుంటుంది. పరలోక భయమనేది ప్రపంచ భయం ముందు తీసి పోతుందేమో. అప్పుడు దేనినో అన్వేషిస్తున్నట్లు కనిపించే మనిషి బాహ్య స్వరూపం చూసి, ఆద్యాత్మిక చింతనలో పడ్డాడని అనుకున్నా పొరపాటు ఉండదు. రాజు అటువంటి స్థితికి ప్రారంభ దశలో ఉన్నాడు. పగ మాత్రమె రగులుతున్నది మదిలో.
    "పార్వతి దాచి పెడుతున్న హృదయ రహస్యాన్ని ఆమె ముఖదర్పణం లోనో, భావ స్వరూపం లోనో గ్రహించాలి. పార్వతి తనను ప్రేమించడమనేది కల్ల. అసంభవం. తను భావించింది నిజమైన పక్షంలో , పార్వతి స్వార్ధపరురాలని ప్రస్పుటంగా తన కర్ధమై పొతే -- అంతవరకూ చాలు. ఆపైన తాను ఆమె పట్ల ఏవిధంగా ప్రవర్తించినా అది ఎంతమాత్రం అన్యాయం చేయడం కాదు.'
    దృడమైన నిశ్చయంతో , నిప్పులు రగిలే కుంపటి లా వేగిపోతున్న హృదయం తో, తపించి పోయే మెదడు తో, తరించలేక పోతున్న భావాలతో మానసికంగా, దైహికంగా ఆందోళన పడిపోతున్నాడు రాజు.
    సమయం వచ్చింది. అభేరి రాగానికి అనుకూల మైన వేళ. జానకమ్మ ఎక్కడ ఉందొ, అంతటి ఇంట్లో. పార్వతి మాత్రం తన గదిలో కూర్చుని స్నేహితులకూ, తండ్రి కీ ఉత్తరాలు వ్రాస్తున్నది.
    వేసవి కాలపు గాడ్పులూ, చిరు చెమటలూ విసుగు పుట్టిస్తున్నాయి.
    తండ్రి పార్వతి దగ్గరకు వెళ్ళటం చూచాడు రాజు. రెండు క్షణాలు ఏమీ జరగబోతుందో అనే ఆత్రుతతో హృదయం చంచాలించింది. మరుక్షణాన, ఏమి జరిగినా , నిర్ణయాలు ఎలా బలపడినా, తను సిద్దమే నన్నట్లు గుండె దిటవు చేసుకుని నిలబడ్డాడు.
    లోపలి గదిలో పార్వతి కుర్చీ జరిపిన చప్పుడయింది.
    "కూర్చో, మామయ్యా!" సన్నటి కంఠం వినిపించింది. "మంచినీళ్ళు ఇవ్వనా?"
    "ఎంత వినయం ఒలక బోస్తున్నది!' అనుకున్నాడు రాజు ఆ మాటలు వింటూ. ఉద్వేగంతో తీవ్రమైన పనేదో చేసెయ్యాలని పిస్తున్నది . 'ఇప్పుడే వెళ్లి కపటం తో నిండి పోర్తుతున్న ఆమె హృదయాన్ని నిలువునా చీల్చి చూస్తె?"
    మాటలు వినిపించాయి స్పష్టంగా.
    "ఏమిటి, మామయ్యా?"
    "నీతో కొంచెం మాట్లాదాలమ్మా" అన్న రామనాధం గారి మాటకు పార్వతి వేసిన ప్రశ్న అది.
    "మరేమీ లేదు. నీకూ, రాజుకూ త్వరలో పెళ్లి చేసేయ్యాలను కుంటున్నా కదమ్మా? ఇప్పుడు అడిగేదేమిటంటే ....." అయన దీర్ఘం తీస్తుండగానే పార్వతి అడ్డు వచ్చింది.
    "ఫో, మామయ్యా! ఇందుకా రావటం! అక్కడ నాన్న, ఇక్కడ నువ్వు నన్ను చంపుతున్నారు."
    "లేని సిగ్గు ఒలక బోసి ఉంటుంది' అనుకున్నాడు రాజు-- "శూర్పణఖ!" అని గొణుక్కుంటూ.
    "వినమ్మా! రాజు మంచివాడు కదూ?"
    "అవును . మంచివాడే!"
    రాజుకు విసుగు వచ్చింది. 'అదేమిటలా చవట ప్రశ్నలు వేస్తాడు నాన్న? తనైతేనా , జడాయించి ఉండును!'
    "అదేం ప్రశ్న , మామయ్యా? నీ కొడుకు మంచివాడు కాకపోవడ మేమిటి?' గలగలా నవ్వు.
    'అయితే రాజుని పెళ్లి చేసుకోవడం పూర్తిగా నీకిష్టమే నన్నమాట? ఏం?"
    "పోనీ, ఇష్టం లేదన మంటావేమిటి? అత్తయ్య మాటలు, నీ మాటలు బట్టి చూస్తె అలాగే ఉంది. లేకపోతె ఒకమారు చెప్పినా ఇంకా ప్రశ్న లేమిటి?"
    "అది కాదమ్మా! ఏ విషయమూ గట్టిగా తెలుసుకుందామని. అంతే."
    "అయితే చెప్పమన్నావా మామయ్యా? రాజుని తప్పిస్తే మరెవర్నీ పెళ్లి చేసుకోను. బ్రహ్మ చారిణి గా ఉండిపోతాను . అంతే మరి!"
    "అంతేనా! అయితే మంచిదే" రామనాధం గారు గబగబ ఇవతలకు వచ్చి అరుగు దిగారు ఎటో వెళ్ళడానికి. ఘాటైన సంభాషణ జరిగిన తర్వాత ఇంట్లో నుండి బయటపడి తిరిగి రావడం అలవాటయనకు.
    తండ్రి అసమర్ధత కు , తన బలహీనత కు, పార్వతి మూర్ఖత్వానికి రాజు క్రోధాగ్నివేడిలో సతమతంయ్యాడు. విలుప్తమైన ఆశాభావంతో మనసులో కొట్టు మిట్టాడాడు. అతని అరచేతులు బిగుసుకున్నాయి. ఊపిరి వేడిగా వచ్చింది. ఆనాటి పార్వతి వగల మారి మాటలు గుర్తు వచ్చి సలసల కాగిపోయాడు.
    'ఎంత టక్కు చేసింది -- తనేమీ ఎరగనట్టు! కేవలం అత్తా మామయ్యల అజ్ఞ మీరనిది అన్నట్టు చెప్పింది. ఇప్పుడో? అంతా తేలింది. ఇప్పుడు తనూ, అమ్మా మరెంత మొత్తుకున్నా , ఏడ్చినా వింటాడా నాన్న? ష్! తన జీవితాన్ని వృధా చేసి పారేసింది ఈ పార్వతీ. తన పాలిట రాక్షసి! మూర్ఖత్వం తో స్వయంగా కల్పించు కుంటున్న నష్టాన్ని తెలుసు కోలేకుండా ఉంది."
    ఆ పట్టున వెళ్లి పార్వతి ని మొహం వాచేలా నాలుగు మాటలనేయ్యాలన్నంత ఉద్రేకంతో ముందుకు రెండడుగులు వేశాడు. కానీ మనసు తిప్పుకుని వెనక్కు మళ్లాడు.'ఎందుకు? ఎంత చెప్పినా ఇక అంతే! చేసుకున్నంత అంటారు. స్వయంకృతాపరాధాలు అనుభవం లోకి వస్తే కాని వివరం కావు. అర్ధం కావు.'
    
                           *    *    *    *
    రాజు ఏదో ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపించాడు జానకమ్మ కు. పైకి అలా కనిపించినా, అంతర్యం లో అతని స్థితి అర్ధం కాని విధంగా ఎలా భగ్గు మంటున్నదో గ్రహించే వారెవరూ లేకపోయారు. కాలేజీ కి వెళ్లి పోవాలంటూ పదిరోజులు వ్యవధి ఉండగానే ప్రయాణమై వెళ్ళాడు ఊరికి. మరో ఏటికి ఎమ్.ఏ. పూర్తీ అవుతుంది కాబట్టి అప్పుడే పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్న కొడుకుతో ఎక్కువగా తర్కించ లేదు రామనాధం గారు.

                                  10
    చిరాకు పుట్టించే ఇంటి పరిస్థితులలో నుంచి దూరంగా పోవాలని హాస్టలు కు వచ్చి పడ్డాడు కానీ, రాజుకు తను తిరుగుతున్న మహా పట్టణం కూడా అతి శూన్యంగా కనిపించింది.
    హాస్టలు కు రావలసిన విద్యార్ధులందరూ ఇళ్ళ దగ్గర కులుకుతున్నారు. ఇంకా సెలవల్లో ఉన్నారు. తనెందుకు వచ్చేశాడా? అని బాధ పడ్డాడు రాజు. 'సెలవలు పూర్తి కాకుండానే హాస్టలు కు వచ్చేసే విద్యార్ధులు జీవితం పూర్తీ కాకుండానే చచ్చిపోయే మనుషులు!' చిత్రమైన ఆలోచనలతో తిరిగాడు ఊరి ఆద్యంతాలు.
    హాస్టల్ సూపరింటెండెంట్ , అయిదారుగురు అబ్బాయిలు 'విద్యా వరదేవతే' అనే రకం వాళ్ళే హాస్టల్లో ఉంటున్నారు. పై అంతస్తులో ఎప్పుడూ గడబిడ వినిపిస్తుంది. అయినా అతి విశాలమైన హాస్టలు భవనం ఖాళీగా , భయంకరంగా , దీనంగా ఉంది. ఎవ్వరూ లేరనే ధీమాతో ఊడిచే కుర్రవాడు ఎగేస్తున్నాడెమో నేలమీద ధూళి మరకల్లా పేరుకుంది. పైన దివి నుండి భువికి అన్నట్లు బూజు వేలాడుతున్నది. అందులో ప్రత్యేకించి కొన్ని గదులు చెప్పలేనంతగా అఘోరిస్తున్నాయి. వాటిని మరమత్తు చెయ్యడానికి అప్పుడప్పుడే సున్నం డబ్బాలు దిగుమతి కావడం కూడా జరుగుతుంది. ఊపిరి సలపక రాజు ఉద్యాన వనాలూ, రాచబాట లూ పట్టాడు. ఇసక తిన్నెల మీద కాస్సేపు , కొండల మీద కాస్సేపు గడిపాడు.
    అతనికి పరితృప్తి కలిగించే నిద్ర మాత్రం హాస్టల్లో దొరికింది. అందుచేత పగలంతా ఎక్కడ సంచారం చేసినా రాత్రి ఎనిమిదవ గంట దాటకుండా హాస్టల్ చేరి, కడుపులో ఏం పడేసుకున్నాడో ఆలోచించ కుండానే నిద్రా వశు డయ్యెవాడు. వేసినది కర్ర మంచం అయినా మెత్తని పరుపు, దోమ తెర , చల్లని గాలి ఆలోచనలకూ అవకాశం ఇవ్వవు.
    
                             *    *    *    *
    ఒకరోజు దీర్ఘాలోచనలో , తర్క వితర్కాలలో తేలుతూ బీచి ఒడ్డున కూర్చున్నాడు రాజు. కెరటాలు వచ్చి పాదాలు తాకేటంత సామిప్యం లో కాకుండా, గుట్టగా పడిన ఇసుక లో కూర్చుని సముద్రపు అసలీ తీరాన్ని పరికిస్తున్నట్లు చూపులు నిశితం చేసి ఉన్నాడు. మత్తేభాల పోలికలో మబ్బులు ఆవైపు నుంచి తరుముకు వస్తున్నాయి.
    "రాజూ! ఏమిటోయ్ , ఏకాంత సేవ చేస్తున్నావు?" అంటూ హటాత్తుగా ఒక కంఠం వినిపించడమే కాకుండా, రాజు వెనుదిరిగి చూసే లోగా రెండు పదులు దాటిన నవ యువకారం అతని భుజం మీద చెయ్యి వేసి పక్కకు బోటా యించింది.
    "నువ్వా, పద్మా! ఎప్పుడొచ్చావోయ్? చూడలేదే నేను?"
    "నేనా? మానాన్న సంగతి చెబుతూంటాగా? నన్నొక పట్టాన నమ్మరాయన. నామాటేమిటి-- ఈనాటి యువకులంటేనే ఆయనకొక ఎహ్యాభావం , అపనమ్మకమూను. 'అయ్యా! ఇంకొక రెండు రోజులు సేలవలున్నాయి' అంటూ మొత్తుకున్నా వినక, 'దొంగ వేషా లేస్తున్నా' నంటూ తరిమారు. నేను చదువు ఎగేసినా , ఆ పల్లెటూళ్ళో నాకేం తోస్తుందని అయన ఉద్దేశమో? ఇక్కడికి వచ్చేనంటే మా పిన్ని గారేమో అతి గారాబంతో నన్ను నాకర్ధం కానివ్వ కుండా తయారు చేస్తుంది" అంటూ ఒక ఉపన్యాసం లాంటి మొర వినిపించాడు పద్మచరణ్ వ్యాసాన్ని పోషిస్తూ.
    వెంటనే ముఖ కవళికలు మార్చి, "నా విషయానికేం గానీ, నువ్వేమిటి, మారినట్లున్నవు? విశేషాలేమైనా ఉన్నాయేమిటి?" అన్నాడు రాజును చూస్తూ.
    "ఏముంది? ఆ ఊళ్ళో ఉండ బుద్ది కాక వారం రోజుల కిందటే ఇక్కడకు వచ్చేశాను" అన్నాడు మరేమని చెప్పాలో తోచని రాజు.
    "ఆ? నీకు అచ్చట ఉండుటకు విసుగు పుట్టుటయా? నమ్మలేక పోతున్నాను. ప్రతి సెలవలకూ ఇక్కడ ఉండాలేనంటూ వెళ్ళిపోయే వాడివి! పైగా.......ఔను......నీకొక పెళ్లి కాని మరదలున్నట్లు జ్ఞాపకం! ఇదేం చాదస్తమోయ్-- షికార్లంటూ సినిమాలంటూ -- హాయిగా ఆనందించక?"
    "ఆవిడ గారి ధర్మమా అంటూనే వచ్చేయ వలసి వచ్చింది." అప్రయత్నంగా అని, ఎందుకలా అన్నానా అని పశ్చాత్తాప పడ్డాడు రాజు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS