Previous Page Next Page 
అపరిష్కృతం పేజి 12

 

    "స్వర్ణా! మీ అన్న దగ్గరికి నీవు వెడితే నేనూ నీతో వస్తాను. మీ వాళ్ళకు కానీ, నీకు కానీ నిజంగా అభ్యంతర ఉండదనుకొంటాను." అని అడిగింది మరకతం.
    "అభ్యంతర మెందుకూ? మా అన్నా, వదిన లు ఎంతో సరదాగా ఉంటారు. మా వదిన నన్ను ఇంకా చిన్న పిల్ల లాగానే చూస్తుంది. నే నంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆవిడ పెద్ద కూతురిని నేను!" చిరునవ్వుతో అన్నది స్వర్ణ. అన్నా , వదిన ల పట్ల గల ప్రేమతో కళ్ళు తళతళ లాడాయి.
    మరకతం నవ్వుతూ -- "రెండో కూతురి స్థానాన్ని నేను కొట్టెస్తాను! చిట్టి శైలజ మూడో కూతురవుతుంది వాళ్ళకు" అన్నది.
    స్వర్ణ చిరునవ్వు నవ్వింది.
    "అదిగో ! పద్దాలు వస్తున్నది. రా, అమ్మడూ! దబ్బున మెడ్రాస్ కు పోయి "వీసా" లు గట్రా తెచ్చుకొని , అమెరికా లేచిపో. మాకు బోలెడు పనులున్నాయి!" అంటూ పద్మను ఆహ్వానించింది మరకతం.
    పద్మ నవ్వుతూ , "ఏమిటోయ్ నీ తొందర, మర్కటం? అమెరికా అంటే మాటలా? ఎట్లాగూ పోతాలే! మళ్ళీ నువ్వు నా కోసం కలవరించి, కలవరించి చిక్కి చీపురు పుల్ల అయేదాకా రాను సుమీ. స్వర్ణా! రాత్రికి మెడ్రాస్ పోతున్నాను. అక్కడ నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచి పలుకుబడి గల వాళ్ళు. ;వీసా' మొదలైనవి తెప్పించుకోవటం తో నాకు సహాయం చేస్తారు. మొత్తానికి, అమెరికాకు త్వరలోనే వెళ్ళవచ్చు" అన్నది పద్మ.
    "వెళ్ళు వెళ్ళు నీ కోసం ఇక్కడ దిగులు పడి కూర్చొనే వాళ్ళూ ఎవళ్ళూ లేరులే. నాకున్న దిగులంతా ఒక్కటే-- అమెరికా లో నిన్ను ఎవరేగవేసుకు పోతారో అని. ఎవరినన్నా అమెరికన్ ను చేసుకొని అక్కడే ఉండి పోయే వుస్మీ! 'రాత్రే పెండ్లి, తెల్లవారే ముసుగు' అన్నట్లుగా ఈ వేళ పెండ్లాడీ, రేపొద్దున్న విడాకు లిచ్చే య్యగలడు. కాస్త జాగ్రత్తగా మసులుకో!" అంది మరకతం కొంటెగా.
    "సింగినాదం కాదూ ! విడాకుల గొడవే లేకుండా పెళ్ళాం ముఖం కూడా చూడకుండా వదిలి పెట్టిన మహానుభావులు మన దేశంలో సవాలక్ష మంది లేరూ? ఏ దేశమయితేనేం? మనుష్యుల స్వభావాలు అన్ని దేశాలలోనూ సాధారణంగా ఒకే తీరున ఉంటాయి. అసలింతకూ నీవు దిగులు పడకు. నేను పెళ్ళంటూ చేసుకొంటే, భారతీయుడి నే చేసుకొంటాను. అమెరికా వెళ్ళాలన్న మోజే కాని, అమెరికన్ ని పెండ్లా డాలన్న మోజు మాత్రం నాకు లేదు!" అన్నది పద్మ నవ్వుతూ.
    ఇంతలోకే ఒక ముసిలాయన గెట్ తీసుకొని లోపలికి వచ్చాడు. వృద్దాప్యం చేత కొద్దిగా వణుకుతున్నాడు. చూపు సరిగ్గా అనుతున్నట్లు లేదు. చేతి కర్రతో నేలను తడుముకొంటూ వచ్చాడు.
    స్వర్ణ లేచి , "రండి! ఇట్లా కూర్చోండి!" అని సగౌరవంగా ఆహ్వానించింది.
    పద్మ -- "పని ఉంది, స్వర్ణా! వస్తాను" అంటూ  లేచింది.
    "ఏయ్ అగు! నీతో నాకూ పని ఉంది" అంటూ మరకతం కూడా పద్మతో వెళ్ళిపోయింది.
    గెట్ దాటి కొద్ది దూరం పోయిన తరవాత మరకతం -- "ఈ ముసిలాయన రావటం ఇది రెండో మారు. మొదటి మారు కూడా ఇట్లాగే పని ఉండి వెళ్ళిపోయాను. తరవాత వచ్చి చూస్తె స్వర్ణ అదోలాగ ఉంది. కళ్ళలో మునుపటి కాంతి కనిపించలేదు. మళ్ళీ ఈ వేళ వచ్చాడు. ఈయన వెళ్ళిన తరవాత స్వర్ణను చూడాలి" అన్నది.
    పద్మ చిరాకు అభినయుస్తూ "ప్రతిదీ నీకే కావాలి! పోనీ డిటెక్టివ్ వి కాకబోయావా/ చక్కగా అన్నీ కూపీ లాగే దానివి!" అన్నది.
    "మరే! నా లాంటి ప్రతిభ శాలిని చేర్చుకునే అదృష్టం వాళ్ళకు ఉండవద్దూ!" అన్నది మరకతం నవ్వుతూ.
    స్వర్ణ ఇంట్లో ముసిలాయన -- "ఏమమ్మా! బాగున్నావా?' మీ అన్న బాగున్నాడా?' అని అడిగాడు.
    "బాగానే ఉన్నారండీ!" జవాబిచ్చింది స్వర్ణ.
    సంచి లో నుండి రెండు బత్తాయి పండ్ల ను తీసి టేబుల్ మీద పెట్టి, "తీసుకో అమ్మా!" అన్నాడు ముసిలాయన.
    స్వర్ణ లోపలకు పోయి పళ్ళెం తెచ్చి ఆ బత్తాయి లను వలిచి తొనలు చక్కగా పేర్చి , పళ్లాన్ని ముసిలాయన కందించింది.
    "నువ్వూ తీసుకో అమ్మా!" అన్నాడు ముసిలాయన.
    స్వర్ణ పలకలేదు. లోపలికి పోయి, గ్లాస్ తో నీళ్ళు తెచ్చి ముసిలాయన పక్కగా పెట్టింది.
    తొనలు తింటూ, "వాడి సంగతే తెలియలేదమ్మా! అడ్డాల నాడే బిడ్డలు! ముసలి వాడిని చచ్చానో, బతికానో వాడి కక్కర లేదు. డబ్బుకు నానా ఇబ్బందీ పడుతున్నాననుకో! బుద్ది హీనుడు! లక్ష్మీ లాంటి నిన్ను వదులుకొని దేశం కాని దేశం లో దేవులాడుతున్నాడు. ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకొంటే, వాడి జీతం, నీ జీతం కలిపి మనందరికీ ఎక్కీ తక్కీ అయ్యేది! ప్రాప్తం ఉండద్దూ?' అని విచారాన్ని వెళ్ళబోసుకున్నాడు.
    స్వర్ణ తల వంచుకొని వింటున్నది.
    కాస్సేపటికి ముసిలాయన లేచి, "వస్తానమ్మా! అప్పుడప్పుడూ నిన్ను చూడకపోతే తోచదు నాకు!" అన్నాడు.
    స్వర్ణ లోపలికి పోయి , అయిదు పది రూపాయల నోట్లు తీసి, అతని చేతిలో పెట్టి, "తీసుకోండి!" అన్నది.
    "ఎందుకమ్మా ఇది!" అంటూనే, గుప్పిట్లో డబ్బును జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళిపోయాడు ముసిలాయన.

                        *    *    *    *
    పద్మ అమెరికా ప్రయాణం మరునాడే. స్నేహితురాళ్ళ అంతా స్వర్ణ ఇంటి ముందున్న తోటలో జంబుకానా మీద కూర్చుని ఉన్నారు.
    సాయం సంధ్య అతి మనోహరంగా ఉంది. స్నేహితురాళ్ళంతా ఏదో పిచ్చా పాటీ మాట్లాడు కొంటున్నారు.
    ఇంతలోనే మరకతం మాటలు గట్టిగా వినిపించాయి. "ఆ మాట నే నొప్పుకోను. స్వార్ధం లేని ప్రేమ ఈ  ప్రపంచంలోనే లేదు. భర్త తనకు శారీరక సుఖమిస్తాడు కాబట్టి భార్య అతన్ని ప్ర్రేమిస్తుంది. భర్త చనిపోతే వియోగ దుఖం కంటే , తనకు సుఖం దూర మౌతుందన్న భాదే అధికంగా ఉంటుంది. భర్త విషయమూ అంతే! పెండ్లి కాగానే తలిదండ్రులనూ, అక్క చెల్లెళ్ళ నూ , అన్న దమ్ముళ్ళను మరిచి పోవటానికి కారణం ఈ స్వార్ధమే. భర్త భార్యా అందాన్ని , భార్య అందాన్ని ప్రత్యేకంగా గమనిస్తారు. అదే వాళ్ళలోని ప్రత్యేకర్షణ. తలిదండ్రుల ప్రేమలో కూడా కాస్త స్వార్ధమే ఉంటుంది. రేపు వాళ్ళు పెద్దవాళ్ళయి తమను పోషిస్తారన్న కోరిక అంతరాంతరాలలో ఉంటుంది. తల్లి ప్రేమ గొప్పదే కాని,మ స్వార్ధం లేనిది మాత్రం కాదు. మీరు ఎన్ని చెప్పినా , మనిషి శారీరిక సుఖాని కిచ్చినంత విలువ మరి దేనికీ ఇవ్వడు. మనిషి చేసే ప్రతి పనిలో స్వార్ధం ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం!" మరకతం మాటల్లో ఉద్రేకం కనపడుతున్నది.
    "మనిషి స్వభావాన్ని అట్లా ఖండ ఖండాలుగా చేసి చూస్తె , అంతా వికృతంగా కనపడుతుంది. అందుకే వాటికి అందమైన భావాల మేలి ముసుగు కప్పుతాము!" అన్నది స్వర్ణ నెమ్మదిగా.
    "చక్కగా చెప్పావు, స్వర్ణా! వెన్నెల కొందరి కళ్ళకు వికృతంగా కనిపించవచ్చు. "పుండు నుండి కారే చీము లాగా వెన్నెల లోకాన్ని కప్పింది అనవచ్చు. ఒక వస్తువు అందాన్ని గాని, ఒక భావపు అందాన్ని గాని వాళ్ళ దృక్పధాన్ని బట్టి ఉంటుంది." అన్నది ఇందిర.
    ఇంతలోనే పద్మ -- "మర్కటం౧ ఈ వాదనలు ఎప్పుడూ ఉండేవే! ఈ ఒక్క రోజే నేను మీ మధ్య ఉండేది. తరవాత ఎన్నేళ్ళ కో! ఈ దినం నా మనస్సులో మధుర స్మ్రుతిగా నిలిచిపోవాలి! నీ వాదనలతో పాడు చెయ్యకు దాన్ని!" అన్నది.
    "చిత్తం, పద్దాలు! ఈ రోజున తమరు ఏది సెలవిస్తే అది వేదవాక్క వుతుంది. తమ కోరిక ఏమిటో సెలవివ్వండి. ఫోటో తీసి పేపర్ల కు పంపమన్నారా -- ఫలానా పద్దాలు ఉన్నత విద్య కోసమో, వరుడి కోసమో అమెరికా వెడుతున్నదని? లేక టిఫిన్ వెంటనే ఇప్పించమన్నారా? లేక....." అని మరకతం కొంటెగా అంటుండగానే పద్మ అందుకొని ..." ముందు నువ్వు నోరు మూసుకో!' అంది నవ్వుతూ.
    "చిత్తం , గురూ! ఊరికే కూర్చోవడం నా చేత గాదు. ఏదన్నా పని చెప్పు. లేదా స్వర్ణ తో పాట పాడించు!" అన్నది మరకతం.
    "వండర్ పుల్ ఐడియా!" అన్న మాట విని అంతా తిరిగి చూశారు.
    రాజగోపాల్, శేఖర్ నిలబడి ఉన్నారు. షికారు నుండి అప్పుడే తిరిగి వచ్చినట్లున్నారు.
    రాజ గోపాల్ కళ్ళతోనే స్వర్ణ ను ప్రార్ధించాడు.
    పద్మ స్వర్ణ వైపు తిరిగి, "స్వర్ణా! కొన్నేళ్ళ దాకా ఇది నా ఆఖరు కోరికవుతుంది. నీవు కవిత్వం వ్రాస్తావనీ, బాగా పాడుతావని ఇందు ముందే చెప్పింది. నే నెప్పుడూ నిన్ను అడగలేదు. ఒక్క పాట -- నీవు వ్రాసిన పాట -- ఈవేళ తప్పక పాడాలి. ఈ వెన్నెలా, ఈ ప్రకృతి దృశ్యమూ, నీ పాటా -- నా మనస్సులో అలాగే నిలిచి పోవాలి!" అని వేడుకొన్నది.
    "అమ్మ బాబోయ్! ఇప్పుడు నువ్వు మాట్లాడింది కవిత్వమే పద్దాలూ!" అంది మరకతం గుండెల మీదచేయ్యి వేసుకొని.
    పద్మ చిరాకు అభినయిస్తూ , "కాస్సేపు నోరు మూసుకో! స్వర్ణ ను పాట పాదనియ్యి!" అంది.
    అన్ని గొంతుకలూ -- "త్వరగా ప్లీజ్!" అని అభ్యర్ధించాయి.
    శేఖర్ కూడా కలగజేసుకుని, "పాడమ్మా , పాపా! పాపం ఆ అమ్మాయి అంతగా అడుగుతూ ఉంటే!" అన్నాడు.
    "పాపా! అన్న పిలుపు కు కొందరి ముఖాన చిరునవ్వు విరిసింది. ప్రేమతో కూడిన చిరునవ్వు గాని, యెగతాళి గా నవ్వింది కాదు.
    స్వర్ణ తల ఎత్తి చూసింది. ఎదురుగా దూరాన తాటి చెట్టు, దాని మీద చందుడు. ఫైన రత్నాలు పొదిగిన నీలాకాశమూ. ఉత్తరాన అక్కడక్కడా నల్లని మేఘ మాలికలు అప్పుడప్పుడు మెరుపు తీగ తళుక్కు మని మెరిసి పోతున్నది.
    స్వర్ణ తల ఎత్తి చూసేసరికి, అంతా తల ఎత్తి చూశారు. సాయంకాలం తమకు తెలియకుండానే గడిచింది. దివి నుండి భువికి ఒకే వెన్నెల వాక!
    వెలగ మల్లె చెట్టున అయిదారు పూలు పూచినట్లున్నాయి. తోటంతా చక్కని సువాసన అలుముకుంది.
    "నువ్యు భావలోకం నుండి దిగి వచ్చి పాట పాడే వేళకు పద్మ బహుశా అమెరికా లో ఉంటుంది!" అన్నది మరకతం.
    అంతా నవ్వారు.
    ఇక బెట్టు చెయ్యకుండా స్వర్ణ పాట ప్రారంభించింది.
    "ఏ కవి యెదలో పూచిన మధురోహాలు ఈ పువ్వులు
    అధరపుటంచుల లోపల, మదల దాచు కొన్నవహో!
    నీ లేజవ్వని కురు లీ నీలి మేఘ మాలికలు!
    విరబోసిన కురులలోన మెరియు పూవు చందమామ!     
    ఏ సుందరి కనులలోని వీక్షణ మీ విద్యుల్లత!
    తళుకు బెళుకులతో మెరియుచు, కులుకుచు నను మురిపించెను!
    ఏ ముగ్ధ మనస్సు లోని నునుసిగ్గులు ఈతారలు!
    నింగి నుండి తొంగి చూచి, దొంగలించే నా మనసును!
    ఏ విరహాణి నిట్టుర్పు మంద మలయమారుతము!
    హాయిగా నా యెదను సోకి తీయని బాధను రగిల్చే.
    ఏ గాయని మ్రోగించెను ఏడు రంగుల వీణియను!
    పులకరించి గగన సీమ చిలుకరించే పన్నీటిని!
    చిత్రమైన ఈ ప్రకృతి చిత్రించినవా రెవ్వరు?
    సుందరమగు ఈ సృష్టి ని సృజియించినవారెవ్వరూ?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS