"ఎలా ఉంది, మామగారూ?" అంది.
అతనొక్కడే ఈమెను చూడగానే లేచి కూర్చున్నాడు.
"ఏమమ్మా, ఇప్పుడు వచ్చావు, ఇంకా నాలుగన్నా కాలేదు. వాళ్ళు రానివ్వరే ఈవేళప్పుడు" అని ఆశ్చర్యపోయాడు.
తనేం మాట్లాడుతుంది?
"నన్నిక్కడ ఎక్కువ రోజులుంచుకోరటమ్మా ఇంకో మూడు నాలుగు రోజుల్లో వచ్చేస్తాను" అంటున్నాడు.
తులసి అక్కడ కూర్చోలేకపోయింది. సరైన కారణం కూడా చెప్పే ఓపిక లేదు.
"వస్తానండీ" అంటూ లేచింది.
ఇంటికి చేరేటప్పటికి నాలుగునలభై ఐదు. ఇంకా తాళం! పాప?
ఇంటి ముందరి మొక్కలను చూస్తూ అరుగు మీద కూర్చుంది. ఆ అరగంటా ఎలా గడిపిందో భగవంతునికే తెలుసు. ఐదుంబావు ప్రాంతాల గేటు ముందర రిక్షా ఆగింది. సడెన్ గా తనకు ఇదంతా నాటకంలోని పోర్షన్ లాగా తోచింది. గోడవెనక నక్కింది. రిక్షాలోంచి సీతాపతీ, పాపా దిగేరు. పాప చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది. వెనకే మరో రిక్షాలో గోవిందరావు వచ్చాడు. అతడు సీతాపతిని వారించి రెండు రిక్షాల డబ్బులూ తనే ఇచ్చాడు.
వాళ్ళు గేటు తియ్యబోతుంటే, తులసి వెళ్ళింది. వాళ్ళ మొహాల్లో నెత్తురు లేదు. చాలా సీరియస్ గా మారిపోయారు. అంతదాకా నవ్వినవాళ్ళు మౌనం వహించారు.
ఆ క్షణాన పాపను గొంతు నులిమి చంపెయ్యాలనిపించింది. సీతాపతి బలవంతంగా నవ్వుతూ, "అప్పుడే వచ్చావేం, తులసీ" అన్నాడు.
"తాళంచెవులివ్వండి" అంది తులసి. తన గొంతు విచిత్రంగా కీచుమంది.
సీతాపతి తాళంచెవులు ఇచ్చాడు.
"పరీక్షలైపొయ్యాయి గదా అని..." అని సీతాపతి అనబోతూంటే, "బావే బలవంతం చేసి సినిమాకు తీసికెళ్ళాడు" అంది పాప నేరం చేసినట్టుగా.
తులసి టైం చూసింది.
అది గమనించి, "సినిమాకంటూ వెళ్ళాంగాని టికట్లు దొరకలేదు. అందువల్ల అలా తిరిగొచ్చాం" అన్నాడు సీతాపతి.
తులసి నిశ్శబ్దంగా తలుపు తీసింది.
అప్పుడే గోవిందరావుకూడా వాళ్ళ వాటా తలుపు చేశాడు.
'ఇంత అన్యాయం భరించటం నా వశం కాదు' అనుకుంది తులసి.
పాప చేతిలోని ప్యాకెట్ అక్కడ పారేసి అవతలికి వెళ్ళింది.
"చూడు, తులసీ, నీకు టెర్లిన్ చీర తెచ్చాను" అన్నాడు సీతాపతి. అతడి కంఠంలోని ఆ కృత్రిమత్వం కనిపిస్తూనే ఉంది. ఔను, ఏదో జరిగింది.
తులసికి కంఠం పెగల్లేదు.
తనే మడుగుతుంది. అతడేం చెబుతాడు? తండ్రి హాస్పిటల్లో ఉంటే అతడు ఇలా తిరుగుతున్నాడు. ఆ సంగతేమైనా, తన చెల్లెలు ఇంతకు తెగించిందా? తనకేం తెలుసు? తను ఇంక భరించలేదు. ఒక్క క్షణం కూడా సహించలేదు.
"నాకేమీ వద్దు ఆ చీర. మీ నాన్నగారు హాస్పిటల్లో ఉంటే, మీరు నాకు చీర తెస్తారా?" అంది.
అసలు అతడి దగ్గిర డబ్బు లేదు. చాల ఇబ్బందుల్లో ఉన్నాడు ఈ వందరూపాయలు ఎక్కణ్ణించి వచ్చాయతడికి? భగవాన్, ఎందుకింత మోసం! అందరూ కలిసి తన సంసారంలో ఎందుకిలా చిచ్చు పెడుతున్నారు?
పాప కిదంతా తెలియదూ? ఎందుకిలా పతనమై పోతున్నది? తనెలా కదపటం?
సీతాపతి కాసేపు కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరిగాడు. కాని ఎందువల్లో మామూలుగా ఉండలేకపోయాడు.
"ఇప్పుడే వస్తాను" అంటూ అవతలికి వెళ్ళి పోయాడు. అంతకుముందే గోవిందరావు వెళ్ళిపోయాడు. పాప పేపరు ముందేసుకుంది కై, పాపలోని ఆ 'అశాంతి' ప్రస్ఫుటంగా కనిపిస్తూంది. ఇంట్లో ఇంకెవరూ లేరు.
ఇంత ఇంట్లో ఒంటరిగా, నిస్సహాయంగా, ఈ అసుర సంధ్యవేళ తన సంసారాన్ని తను ఇల్లా మురికి కాలవలోకి కీడ్చుకుంటూ.... అలా అనుకునేటప్పటికి తనకి ఏడుపు వచ్చింది. వద్దనుకున్నా బిగ్గరగా ఏడ్చేసింది.
పాప గుమ్మంలో నిలబడింది.
కాసేపు చూసి, "ఎందు కేడుస్తున్నావక్కా?" అంది.
తులసి ఏడుపు మానలేదు.
పాప మరింత దగ్గిరగా వచ్చి, "అక్కా, ఎందు కేడుస్తున్నావు?" అంది.
తులసి ఓ నిమిషం ఊరుకుంది. కళ్ళు తుడుచుకుంటూ "తలుపు గొళ్ళెం వేసి రా" అంది.
పాప తలుపులు దగ్గరేసింది. ఇల్లు చీకటైంది.
లైటేసి, పాప దగ్గిరగా నడిచి, "పాపా, ఇదిగో, నా మంగళసూత్రం ముట్టుకొని చెప్పు, నా మీద ఏమైనా ప్రేమ ఉంటే, నేను నీకు అక్కననుకుంటే, నిజం చెప్పు. నిన్నేమీ అనను. చెప్పు, ఇవ్వాళేం జరిగింది?" అంది తులసి.
పాప వణికిపోయింది.
"ఏమిటి, ఏం జరిగింది...లేదు. ఏమీ జరగలేదు" అంది. కాని మంగళసూత్రం ముట్టుకోలేదు.
"ఇది ముట్టుకోవే. రేపు నీకు పెళ్ళైతే, నీ మెళ్ళోకే వస్తుంది. దాని విలువ నీకు అప్పుడు తెలుస్తుంది" అంది తులసి.
"చెప్పాను గదూ ఏం జరగలేదని" అంది పాప వెనక్కు జరుగుతూ.
"నువ్వలా తప్పించుకోలేవు. చెప్పు, ఏం చెయ్యని దానివైతే అలా జంకుతావేం? నా మంగళసూత్రం తాకి చెప్పు, నీకూ, మీ బావకూ, ఆ గోవిందరావుకూ మధ్య ఏం జరుగుతున్నది? ఇవాళెక్కడి కెళ్ళారు? ఈ చీర ఎవరు కొన్నారు? ఎవరికోసం కొన్నారు? ఎందుకు కొన్నారు? నేను ఆఫీసు కెడితే రోజు మీ రాడుతున్న నాటకం ఏమిటి? ఇవన్నీ చెప్పితీరాలిప్పుడు" అంది తులసి.
పాప నోరు మెదపలేదు.
తులసి రెచ్చిపోయింది.
"చెబుతావా, లేదా?" అంది పాప జడ పుచ్చుకుని లాగుతూ.
పాప బిగ్గరగా ఏడ్చింది. కాని ఏమీ చెప్పలేదు.
తులసి ఊరుకోక, పాప మొహంమీద కప్పుకున్న చేతులు లాగుతూ, "ఈ రోజు ఏడుపుతో అయ్యేది కాదు. చెప్పాల్సిందే. ఇన్నాళ్ళూ చూస్తూ ఊరుకున్నాను. ఇంకమీదట ఇలాంటివి జరగటానికి వీల్లేదు. చెప్పు చంపేస్తాను" అంది.
పాపనించి జవాబు లేదు.
"ఎందుకిలా నా సంసారాన్ని వీధిలోకి ఈడుస్తున్నారు? నిన్ను ఇందుకేనా రమ్మన్నాను? మగవాళ్ళు - వాళ్ళకేం - కనిపించిన ప్రతి ఆడదాన్నీ కావాలంటారు. నువ్వు ఎంత వెర్రిదానిలా లోబడ్డావు? నా చెల్లెలివి-నా కొంపకే నిప్పు పెడతావా? వాళ్ళు ఇల్లానే నిన్ను నాలుగు రోజులు తిప్పుకుని తన్ని పంపిస్తారు, తెలుసా? నువ్వు వచ్సినప్పటినించీ నీ పోకడ చూస్తూనే ఉన్నాను. ఊరికి వెంటనే వెళ్ళిపో. నాన్నకు ఇప్పుడే రాస్తాను. నువ్వుమాత్రం ఇంక ఈ ఇంట్లో ఉండటానికి లేదు" అంది తులసి రొప్పుతూ.
పాప తల వంచుకొని కన్నీళ్లు కార్చింది.
ఇంతలో సీతాపతి వచ్చాడు.
"ఏం సంగతి? పాప ఎందుకేడుస్తున్నది?" అన్నాడు.
తులసి ఓ నిమిషం ఊరుకుని, బొంగురు పోయిన కంఠంతో, "ఎందుకిలా మీరంతా కలిసి నన్ను మోసం చేస్తున్నారు? నా కంతా తెలిసిపోయింది. ఇలా నన్నూ, నా చెల్లెల్నీ నాశనం చేస్తే మీ కేమొస్తుంది? మీకూ ఉందిగా ఓ చెల్లెలు. ఇలానేనా ప్రవర్తించటం - దానికి సిగ్గులేకపోతే మీకైనా....
అది చిన్న పిల్ల ఊరినించీ వచ్చింది. పట్నం మెరుపులు చూపించి, అవీ ఇవీ కొనిచ్చి, ఇలా మోసం చేస్తారా దాన్ని? ఇదేం న్యాయం?" అంది.
సీతాపతి నిరుత్తరుడయ్యాడు.
"మిమ్మల్నే నమ్ముకున్న నన్ను దగాచేసి మీరేం బాగుపడతారు. ఎందుకిలా చేస్తున్నారు? ఇంత విచక్షణ లేదూ! ఇదే మీ చెల్లెలైతే మీరేం చేసేవారు?" అంది తులసి.
"ఇదిగో, మాటకూ మా చెల్లెలి పేరెత్తొద్దు" అన్నాడు సీతాపతి కోపంగా.
"ఔను ఎందు కెత్తొద్దు? మీ చెల్లెలి మీద మీ కెంత ప్రేమో, నాకు పాప అలా కాదూ? ఇది ఆడది కాదూ?"
తులసి మాట్లాడలేకపోయింది.
సీతాపతి మళ్ళీ వెళ్ళిపోయాడు.
వెంటనే వచ్చి పాపను తీసికెళ్ళవలసిందిగా తండ్రికి ఉత్తరం రాసింది. కాని ఎలా తెల్లవారుతుందో, తండ్రి వచ్చేదాకా రోజులు - గంటలు, క్షణాలు ఎలా గడపాలో పాలుపోలేదు.
