Previous Page Next Page 
ప్రేమించు ప్రేమకై పేజి 12


                                   6
    ఓ నిముషం పాటు అక్కడ నిశ్శబ్దం తాండవించింది. మోహన్ ముఖం చిరునవ్వుతో వెల్గిపోతుంది. అదే క్షణం లో లలిత గుండెలు త్వరితగతిని కొట్టుకొని పాత జ్ఞాపకాల కోతలు పెట్టుతున్నాయి. తను మూయాలని ప్రయత్నిసున్న తలుపుని ఎవరో బలవంతాన తెరచినట్టు అనిపించింది లలితకి. మరుక్షణం లో ఊహల ఉచ్చులు సడలిపోయి ఎన్నడూ తెలియనంత కోపం ముంచు కొచ్చింది లలితకి. తన మనసులో అంత కోపానికి చోటుందని ఊహించనైనా లేదు లలిత.
    "మళ్ళీ తారస పడ్డానే -- గమ్మత్తుగా లేదు!' అంది. పౌరుషం కల మగవాడికి సెట్టు చాలనుకుంది.
    'ఈ ప్రపంచం చాలా చిన్నదన్న దానికిది నిదర్శనం కాదూ?' అంటూ వెర్రిగా నవ్వాడు మోహన్ ......అతని ముఖం లో కళ తప్పింది.-- కాని నటన అమోఘంగానే ఉంది. తరువాత అసలతని కేసి చూడలేదు లలిత. భోజనం చేశారో మాటలే తిన్నారో తెలియకుండా ముగించారు-- అప్పటికే రెండున్నర దాటుతోంది అంతా లేచారు. అందరూ దాటి వెళ్ళేదాకా ఆగి లలితని ఓ క్షణం నిలవేసి అడిగాడు మోహన్.
    'నన్ను అసహ్యించుకుంటున్నావా లలితా?' అంటూ నెమ్మదిగా అడిగాడు.
    లలిత ముఖం లో రంగులు మారలేదు. ఆమె కళ్ళు కోపంగానూ లేవు. బాధగానూ లేదు. ఆశ్చర్యం మటుకు ప్రస్పుటంగా ప్రకటిస్తున్నాయి. అతని బ్రతిమాలుతున్న ధోరణి కి ఆశ్చర్య పడుతూ.
    'ఎందుకూ అసహ్యించుకొడం?" అడిగింది.
    "నీకు నేను కృతజ్ఞత తెల్పాలే గాని అసహ్యించు కోవడం ఎందుకు?' అనేసి అతని బదులు కోసం ఆగకుండా వచ్చి కారు ఎక్కింది.
    అసలిక్కడ మోహన్ తారసపడ్డమే ఆశ్చర్యం. కాని అంతకుమించిన ఆశ్చర్యం -- తన కదేమంత బాధాగా ఉండక పోవడం.
    దారిలో దింపుతామంటూ మోహన్ ని సరళ కారు ఎక్కనుంది.
    'లలిత కారు కొనుక్కుంటోంది. అందుకే అంత సరదాగా ఉందీ వేళ' అంది మాటల ధోరణి లో.
    'అందుకే కాబోలు నన్ను మరిచిపోయింది అన్నాడు మోహన్ నిర్లిప్తంగా. 'మేం ఇది వరకు చాలాసార్లు కలుసుకున్నాం. ఆమె అత్తయ్య కూడా ఇక్కడే ఉన్నారా?'
    'అరె, ఆమె హటాత్తుగా పోయింది తెలియదా నీకు? అయితే లలిత ఇక్కడి కొచ్చేసింది. ఆమె మేనమామ కూడా పోయాడు. ఇద్దరి అస్తికీ వారసురాలైంది లలిత. బలరాం ఆమెకి ట్రస్టీ....' వివరాలు చెప్పింది సరళ.
    'ఏం డబ్బు? ఎంత డబ్బు? ' అన్న ప్రశ్న మోహన్ నోట్లోనే ఉండిపోయింది ...తొందర పడకూడదనుకున్నాడో---గమ్యం వచ్చిందని దిగిపోవలసి వచ్చిందో!
    కారు దిగిపోయినా కూడా మోహన్ మొద్దు బారిన మెదడు పనిచేయడం మొదలెట్టలేదు.
    ముందు సీటు మీదికి వంగుతూ 'లలితా మోహన్ తెలుసుననైనా చెప్పలేదేం?' అని అడిగింది సరళ. ' చాలా పేరున్నవాడు తెలుసా?'
    'అలాగా? నాకంతనంత బాగా తెలియదు. చాలామందిని చూస్తుంటాం కదా?' నెమ్మదిగా అంది లలిత.
    'అమ్మా, మోహన్ రచయిత. ఇప్పుడే దర్శకత్వం చాన్సు కూడా వచ్చిందిట. మన పక్క భూపతి గారి బంగళా వాడుకుంటారట-- అందుకూ ఇటు వైపులకి వస్త' అంటూ తల్లికి వివరించింది.
    సరళ కి చాలా సూక్ష్మ దృష్టి. అందుకే లలిత కి మోహన్ బాగానే తెలుసునని గ్రహించింది. అతన్ని మొదట చూసినప్పుడు , అతన్ని పలకరించినప్పుడు -- అంతా గమనించింది. ఇప్పుడు పిడికిళ్ళు బిగించి ఒడిలో చేతులు పెట్టుకుని కూర్చున్న లలితని చూస్తుంటే సరళ కి కుతూహలం హెచ్చింది.
    దీన్లో ఏదో ఉంది. అదేమిటో తెలుసుకోవాలి- అనుకుంది. 'వాళ్ళంతా ఓ పదిహేను రోజులు లుంటారుట. బలరాం ఓ రోజు మన బంగళా కి పిలుద్దామా. అసలు మన బంగళా ఎందుకు వాడుకోనివ్వకూడదు?' అంది సరళ.
    బలరాం కూడా మౌనంగా కారు తోలుతున్నాడు . భోజనం దగ్గర తారస పడ్డ యీ వ్యక్తీ పానకం లో పుడకలాగా తోచాడు. ఆ ఫోజు గట్రా చూస్తె లోపల డొల్లే అని గ్రహించడానికి బలరాం కి అట్టే టైము పట్టలేదు? అందుకే సరళ మాటలు మాటలు వినిపించుకోలేదు. ఇప్పుడు సరళ ప్రశ్నకి నవ్వు నవ్వేసి ఊరుకున్నాడు.
    'అవును బలరాం పిలుద్దాం , మనకు సరదాగా ఉంటుంది.'
    'సరళా, సిల్లీగా మాట్లాడకు' అంటూ సీరియస్ గా రోడ్డు చూడ్డం ప్రారంభించాడు బలరాం.
    ఎంతో ఆనందంగా ప్రారంభం అయిన ఆరోజు కాస్తా మోహన్ రాకతో నిరుత్సాహంగా అయిపోయిందని పించింది లలితకి. ఇదింతటి తో అగదేమో అన్న అనుమానం కూడా తలెత్తింది లలితకి. ఇప్పుడసల తనంటే అపేక్ష గాని ఆదరణ గాని తనకి లేకపోవచ్చు. కాని పూర్వం లో అతనే లోకం అనుకుంది అతని విలువ ఇప్పుడు అసలు లేకపోయినా, అతని ఉనికిని ఉన్న న్యూసెన్సు వాల్యూ ఎక్కువగానే ఉండొచ్చుననిపించింది. ఈ చుట్టూ పక్కలే ఉన్నట్టయితే  మళ్లీ తారస పడతాడు. అదామే కసలు యిష్టం లేదు. సర్దుకుంటున్న తన జీవితం మీద విధి ఎదురుదెబ్బ తీయదు కదా అన్న అనుమానం మనసులో ఏర్పడింది లలితకి. తనలాగే ఆటగాడూ మరిచిపోయి నిశ్చింతగా ఉంటె బాగుండేది. కాని అతనలా ఊరుకునేలా తోచలేదు. 'నన్ను ఆసహ్యించు కుంటూన్నవా లలితా' అన్న అతని ప్రశ్నే చెప్తుందా సంగతి.
    పాపం మోహన్ చాలాసరదా అయిన వాడు. అందరి నటులలాగా భేషజాలు లేవు. నువ్వతన్ని గుర్తించక పొతే ఎంత సిగ్గుపడి పోయాడో చూశావా? అయినా అదేమిటి లలితా? అతన్నేలా మరిచిపోయావు? ' వెనక సీటులో జేరపడి కూర్చుంటూ అంది సరళ.
    ఎలా సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పి తీరాలా ? అన్న సంశయం తో సతమత మయిపోతున్న లలితని బలరం రక్షించాడు.
    "ఏం దారి తప్పిన దూర బంధువునిలాగా పల్కరించాలా?"
    కొంచెం తీవ్రంగానే అన్నాడు బలరాం. 'అలాంటి వాళ్ళని నేనెరుగుదును'--
    'ఏం తెలిసిన వాళ్ళని గుర్తించడం కూడా తప్పా?' నవ్వుతూనే అడిగింది సరళ.
    'సరళా, నీ స్నేహితుడో, చుట్టమో ఆ వ్యక్తిని అతని పనేదో చేసుకోనియ్యి... సినిమాకి రాసుకుంటాడో జులపాలు పెంచుకు తిరుగుతాడో వదిలేయి' అని సంభాషణ ముగించు అన్నంతగా అన్నాడు బలరాం.

                 
    'పో ,బలరాం మోహన్ కొంచెం అత్యాధునికుడనుకో . అంతమాత్రం చేత అలా అనుకోవాలా ఏం?'
    నిశ్శబ్దంగా కూర్చున్న లలిత ని చూస్తూ ' లలితా, నువ్వెవరి సైడో చెప్పు?' అన్నాడు బలరాం-- ఏదో మాట్లాడించాలని.
    'చాలామటుకు నీ ప్రక్కనే బలరాం .' అంది.
    'చాలింక' అంటూ నిశ్శబ్దంగా కారు తోలడం ప్రారంభించాడు.
    అడపా తడపా సరళా సరస్వతమ్మా మాటలు తప్పించి -- అంతా ఏం మాట్లాడకుండానే ఇల్లు చేరారు.
    బలరాం కారు దిగి తలుపు తీశాడు లలిత కోపం . అతన్నీ, బలమైన అతని భుజాలను ఓ క్షణం పరిశీలనగా చూసింది లలిత ఎందుకో మనస్సుని అలముకొన్న మగత కొంచెం తొలగినట్టనిపించింది.
    "ఎప్పుడో ఒకప్పుడు మోహన్ గురించి చెప్తాను బలరాం కి. మేం ఇంకా దగ్గర స్నేహితులం అవాలి. అప్పుడు కాని కుదరదు.' అనుకుంటూ ఇంట్లోకి నడిచింది లలిత.
    రాత్రి పడుకుందన్నమాటే గాని సరళ కి రకరకాల ఊహలు ఆలోచనలు మనస్సుని చుట్టుముట్టాయి. నంగనాచి వంగ ముల్లు అన్నట్టు ఈ లలిత పైకి కనిపించేంత అమాయకురాలు కాదని గ్రహించింది. కాని ఆ కప్పిపెట్టే సంగతేమిటో అంతు చిక్కడం లేదు.
    బలరాం అల్లుడిగా సరస్వతమ్మ ఎప్పుడూ ఊహించుకోలేదు -- కారణం బలరాం అసలు పెళ్లి చేసుకోడన్నగుడ్డి నమ్మకం పడిపోయిందావిడ మనస్సులో. అందుకే ఎంతసేపూ తమ చుట్టుపక్కల వాళ్ళలో సరళ కి తగిన వరుడు దొరుకుతాడేమోననే తాపత్రయం పడుతోందావిడ గారు. కాని సరళ ఊహలందుకు తల్లకిందులు. అందుకే ఆమె ఎవరితో స్నేహంగా ఉన్నా ఎక్కువ సీరియస్ గా తీసుకోలేదు. బలరాంతో  చనువుగా ఉంటూ అతని ఇంట్లో ఒకతేగా అతనికి తెలియకుండానే బలపదిపోతే -- తరవాత చూసుకోవచ్చునని ఆమె అభిప్రాయ పడింది. అందుకే తలలో నాలికగా మసలుతూనే ప్రత్యేకించి అతనిపై శ్రద్ధ కనపడనివ్వలేదు .... ఇంత రహస్య పధకం వేసుకుంది కనుకనే లలిత వస్తుందంటేనే ఇష్టం లేకపోయింది. అందుకే ప్రత్యేకంగా పై వ్యక్తీ వస్తే ఇంట్లో ఎంత విసుగ్గా ఉంటుందో , యిబ్బందిగా ఉంటుందో పదేపదే చెప్పి రాబోయే లలిత ఓ బెడద అన్న ఉద్దేశం బలరాం తో కలిగించ కల్గింది. వచ్చినా ఆమెని ఎంత త్వరగా పంపించాలా అని ఆలోచనలు చేసింది. అందుకే లలితని చూసినప్పుడు అంతా అంతగా ఆశ్చర్య పడ్డారు. ఏదో స్కూల్లో బోర్డింగ్ లో పడేయడానికి తగి ఉంటుందని ఊహించిన పిల్ల- చక్కని యువతి అవగానే బలరాం ఆశ్చర్యానికి అంతు లేదు. ఏదో మనుష్యుల మధ్య జంతువులా పెంచబడిన లలిత ఇంత నాజూకుగా హుందాగా ఉంటుందని సరళా ఊహించలేదు...బలరాం వివాహ ప్రసక్తి తలపెట్టినా యుక్తా యుక్తాలు తెలియని అమ్మాయిని చేసుకుంటాడని తలపెట్టని సరళ కి తన అంచనాలు తప్పు అవుతాయేమోనని భయం తలెత్తింది. బలరాం , లలిత విషయం లో ఎక్కువ శ్రద్ధ చూపించడం ప్రారంభించే సరికి మొలకెత్తిన భయం బలపడసాగింది. ...లలిత కి త్వరలోనే తగిన వరుణ్ణి వెతుకుతాడు బలరాం అని ఊహించ సాగింది సరళ.... కాని సరస్వతమ్మ గారికిది సరైనదిగా తోచలేదు. ఇంకా సరళ కే తను తొందర పడ్డం లేదే అనుకుంది. అమ్మమ్మ గారు లలిత పట్ల ప్రత్యెక శ్రద్ధ కనపరచడం, బలరాం మీద ఆవిడ కేనలేని అభిమానంతో పాటు లోంగించే అధికారం కూడా ఉండడంతో సరస్వతమ్మ గారు ఆలోచనలకి తల్లీ కూతుళ్ళ లో అలజడి రేకెత్తించాయి. ఆందోళన కల్గించాయి . చూసి చూడనట్టు బలరాం లలితకేసి చూడ్డం, ఆమెని చూసినప్పుడతని ముఖం వింతగా వెల్గడం కన్పిస్తూనే ఉండడంలో ఆశ్చర్యం లేదు. అందుకే ఇప్పుడు మోహన్ ని పావులా ఉపయోగించాలని నిశ్చయించు కుంది. లలిత  కనిపించేటంత నెమ్మదైనది, నిర్మల మైనది కాదని బలరాం కి తెలియాలన్నదే సరళ కోరిక. అదే జరిగితే ౦- కోటలో పాగా వేసినట్టే ననుకుంది -- సరళ మనస్సు లోని ఆలోచనలతో ముఖం కళ మారి నల్లబడింది.
    కూతురు పక్కనే పడుకున్న సరస్వతమ్మ గారు 'ఏమిటే ఆలోచిస్తున్నావు' అన్నారు.
    అంతరాంతరాలలో బద్దకించిన పాములలాగా కదలాడుతున్న ఆలోచనలు, అసూయలు ఎలా చెప్తుంది?
    'చాలా ఉండమ్మా, నీకెందుకు నువ్వు చూస్తూ ఉండు. ఈ లలిత ఎలాంటిదో నే తేలుస్తాను' అంటూ బెడ్ లైటు అర్పి పడుకుంది సరళ.
    పడుకుందన్నమాటే గాని ఓ పట్టాన నిద్ర పోలేదు సరళ.
    లలిత మటుకు - సమయం వచ్చినప్పుడు బలరాం కి అన్నీ చెప్తాను అనుకుని నిశ్చింతగా పడుకుంది. బలరాం నమ్మడేమో అన్న అనుమానమేనా రాలేదు లలితకి.  అతని పై అంత నమ్మకం , గౌరవం ఏర్పడింది....
    ఎప్పుడు తల్లవారుతుందా అన్న ఆత్రంతో పడుకుంది సరళ.
    ఎప్పుడు తెల్లవారిందో తెలియనంత గాడంగా నిద్రపోయింది లలిత.
    మనుష్యుల లోపలి ఊహలలా చేస్తాయి కాబోలు.
    
                            *    *    *    *
    ఉదయం లలిత లేచేసరికే అంతా కాఫీలు ముగించినట్టుంది. ఎండ బాగా వచ్చేసింది. ఎండా నీడల్లో చెట్లాకులు నల్లగానూ, పచ్చగానూ కనపడుతున్నాయి. వరండా లోకి వచ్చి పిట్ట గోడ మీద కూర్చుంది లలిత , గాలికి కదలాడుతున్న ఆకులనీ, పూల గుత్తులనీ చూస్తూ. రాధా మనోహరం తీగ పూల బరువుతో వంగిపోయింది. ఆ గుత్తుల నిండా హడావిడిగా తిరుగుతున్నాయి తేనే తీగలు. వాటి కదలికను తిలకిస్తుంది లలిత. బలరాం రావడం కూడా గుర్తించలేదు. వస్తూనే అతను ఓ ఉత్తరం అందించి పక్కనే నిలబడ్డాడు. లలిత లేచి సరిగా కూర్చుందుకు కూడా లేకపోయింది. చెదరిన ముంగురులు నుదుటి మీద పడి ఉన్నాయి. ఓ మెలికలు తిరిగిన కొస ఎడం కంటి మీద పడి కప్పుతోంది.
    "అప్పుడే ఉత్తరాలు కూడా వచ్చాయి?' అంటూ అందుకుంది బలరాం అందించిన లేఖ.
    'చదువు. వెంకట్రామయ్యర్ టైపు కూడా మని చేతివ్రాత రాసి నా ప్రాణం తోడాడు. అరగంట తల బాదుకున్నా ఆ మాట తెలియలేదు. ఏమై ఉంటుందంటావు?' అంటూ చూపుడు వేలుతో ఓ మాటని సూచించాడు. లలిత అతని వేలు వంకా మాట వంకా చూస్తుంది. మొనతెరిని అతని వేలు బలంగా అందంగా కళాకారుని ముద్రకి తగినట్టుగా ఉందనిపించింది. ఏమై ఉంటుంది చెప్మా? అన్నట్టు తల తిప్పి బలరాం ముఖంలోకి చూసింది లలిత. అతను తననే చూస్తుండడం గమనించి -- ఉత్తరం మీదికి దృష్టి సాగించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS