Previous Page Next Page 
మారిన విలువలు పేజి 13

 

    పక్క మీద అటు ఇటు దొర్లుతున్నది జానకి. నిద్రాదేవి కటాక్షం కోసం అలా తపించడం ఆమెకు ఏనాడూ అలవాటు లేదు. అప్పటివరకు ఎన్ని ఆలోచనలు మనసులో దోర్లుతున్నా వాటిని పక్కకు నెట్టి, నిర్మలంగా నిద్రపోగలిగేది. కాని ఆరోజు రెండుమూడు గంటలైనా పక్క మీద దోర్లుతున్నా కళ్ళయినా బర నెక్కలేదు.
    చావిట్లో సాంబశివం దీపం ముందు కూర్చుని చదువు కొంటున్నాడు. అన్నయ్య పక్కగా శాంత కూడా కాస్త సేపు కూర్చుని ఏవో పుస్తకాలు ఇటు అటు తిరగేసింది. అంతలోనే ఆవలింతలు ముంచుకు రాగా మంచ మెక్కింది.
    చదువు కొంటానని అన్నయ్యతో అంతలా పోట్లాడి కాలేజీ లో చేరిన శాంత , ఇటీవల చదువు విషయంలో అంత శ్రద్ధ చూపించటం లేదని పించింది జానకికి. గడిచిన సంవత్సరం ఎంత రాత్రి వరకు చదివినా, మళ్ళా ఉదయాన్నే చీకటితో లేచి చదువుకొనేది. ఇప్పుడు నిద్రలేచేసరికి ఎర్రగా ఎండ పొడుచుకు వస్తున్నది. ;లేచిన తరువాతైనా ముస్తాబవడం, అన్నం తినడం, కాలేజీ కి పోవడం తప్ప పుస్తకం తీసింది కనిపించడం లేదు. చెల్లెలు అలంకరణ కోసం అంత సమయం వ్యర్ధం చెయ్యడం ఆమెకు బాగా లేదని పించింది.
    'చదువుకొంటున్న పిల్లవి. కాస్త తొందరగా తెమలడం నేర్చుకో. లేచిం దగ్గర నుండి ముస్తాబు తోనే అయిపోతే ఎలా?' అనేది జానకి.
    "నేనేం ముస్తాబవుతున్నానక్కా! అలంకరించుకొందికి అసలు మనింట్లో ఏమున్నాయి?సబ్బుతో ముఖం కడుక్కొని తల దువ్వుకోడమే ముస్తాబా? అక్కా, నువ్వు చూడలేదు కాని, కొందరు పిల్లలు ఎంత చక్కగా తయారై కాలేజీకి వస్తారను కొన్నావు! వాళ్ళ బట్టలు , వాళ్ళ అలంకరణ చూస్తుంటే.... అబ్బ...."
    చూస్తుంటే శాంతకు ఏమనిపిస్తుందో ఆమాట చెప్తున్నప్పుడు ఆమె కళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది.
    "పోనీలే శాంతా! ఎవరి కున్నది వాళ్ళ కుంటుంది. వాళ్ళు నీ అంత చక్కగా ఉంటారా ఏం? ఏ అలంకరణ చేసుకోకపోయినా ఏ నగలూ పెట్టుకోక పోయినా ఆ గళ్ళ చీర కట్టుకొని నువ్వు రోడ్డంట నడుస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా?"
    "ఏం గళ్ళ చీర లెద్దూ! ఏడాదై విసుగన్నది లేకుండా నెలలో ఇరవై రోజులు అదే కడుతున్నాను. అమ్మని ,మరో చీర కొనమంటే, వదినా, అక్కా కట్టడం ;లేదుటే అంటుంది.
    'అమ్మకేం పోయింది! ఏమైనా చెప్తుంది. ఇంటి నాలుగోడలు దాటి బయటికిరాని వదిన ఏ చీరకట్టినా అడిగేవాళ్ళు లేరు.నీమట్టుకి నువ్వో పుట్టు సన్యాసివి.ఏ సరదాలు లేవు. కాలేజీ లో అంతా నన్నుచూసి గళ్ళ చీర ట్రేడ్ మార్కు అంటుంటే ఎలా ఉంటుందేం?' శాంత కళ్ళలో నీళ్ళు తిరిగేవి.
    శాంత తన ఆశలను, మనోభావాల్ని ఏ పరిస్థితుల్లోనూ దాచుకోలేక పోయేది."డబ్బుంటే ఎన్ని లోపాలున్నా కప్పిపోతాయి.అక్కా! ప్రపంచంలో ఉన్న ఏ వస్తువైనా నా మనసులో తలిచిందే తడవుగా వచ్చి మన కాళ్ళ ముందు వాలుతుంది. డబ్బుతో కొనలేని ఆనందం ఏముంటుంది చెప్పు? అప్పుడు నీ పెళ్ళిలో మీ అత్తగారి నగలు, చీరలు చూసి నువ్వెంతో అదృష్టవంతురాలవనుకొన్నాను. అతనికి చదువు లేకపోతెనేం? అందం లేకపోతెనేం?  అన్న్టింటిని మించి డబ్బు ఉంది కదా? అసలు వాళ్ళు పెట్టిన నగలు, చీరలు నువెందుకు పంపించేశావో నాకర్ధం కాలేదు. పోనీ, మా అక్కకైనా ఉంటె ఎరువుగానైనా పెట్టుకోవచ్చనుకున్నాను." అనేది దిగులుగా.
    "ఆ నగలు , చీరలు నీకెందుకు లే , అమ్మా! అంతకన్న మంచి నగలు, చీరలు పెట్టె భర్త నీకు దొరుకుతాడు." అని చెల్లెల్ని ఓదార్చేది జానకి.
    శాంత జీవితం పై ఎంత ఆశ పెట్టుకుంది! ఎన్నెన్ని కోర్కెలు పెంచుకోంది! భగవంతుడా, ఇవన్నీ దానికి తీరుతాయా? దాని బ్రతుకు ఏమౌతుంది? అందని ఆనందాల్ని చూపించి దాన్నెందుకిలా మభ్య పెడుతున్నావు? వాస్తవిక జీవితం నుండి తప్పించి ఊహల ఊయలలో ఎందుకు ఊగిస్తున్నావు? అని బాధపడేది జానకి.
    "నీకు తెలియదు కాని , అక్కా! నా చేతిలో ఇంత ధనరేఖ ఉన్నదిట. మా క్లాసులో ఓ అమ్మాయి నా చెయ్యి చూసి చెప్పింది. శాంతా, నీకు పెద్ద ఆస్తి పరుడు భర్తగా దొరుకుతాడే--- అన్నది."
    ఇటీవల శాంత ఎమాటన్నా కారులతో తిరిగే అబ్బాయిలను, మేడలలో మసలే అమ్మాయిలను దృష్టి లో పెట్టుకొనే మాట్లాడుతున్నట్లు అనిపించేది ఇంట్లో వాళ్ళకు.
    'అటువంటి ఇళ్ళలో మసలిందికి పెట్టి పుట్టద్దమ్మా?" అనేది తల్లి.
    "ఏమో? నే క్రిందటి జన్మలో ఏం పెట్టి పుట్టెనో నువ్వు చూసోచ్చేవా?" అనేది శాంత.
    "శాంతా , ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని శ్రద్దగా చదువుకో. అయినవీ, కానివీ తలుచుకుంటూ పోయి చేతిలోకి వస్తున్న చదువును పాడు చేసుకోకు." అని హెచ్చరించేది జానకి.
    తన మాటకు ఎదురు చెప్పక పోయినా చెల్లెలికి చదువు మీద ఆసక్తి తగ్గిపోతున్నట్లు జానకి పసికట్టింది. పక్కదారులు పడుతున్న చెల్లెలి మనసును సరియైన మార్గానికి మళ్ళించి ఆమె చదువు సాగేలా చూడాలని జానకి తాపత్రయ పడేది.
    జానకి పక్కపే ఇటు నుండి అటు తిరిగి చూసేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది కిరసనాయలు చాలక, వత్తి కాలి, దీపం ఆరిపోయిన వాసన చావిట్లోంచి గుప్పున కొడుతున్నది. కిటికీలోంచి , వీధి దీపం వెలుగులో పుస్తకం పట్టుకొని నిలబడి చదువు కొంటున్న సాంబశివం కనిపించేడు. జానకి పక్క మీంచి లేచి వీధి వరండాలోకి వచ్చింది.
    రోడ్డు మీది పెద్ద పళ్ళెం పడ్డ దీపం వెలుగుతో స్తంభానికి అనుకోని నిల్చున్నాడు సాంబశివం. దీపం పురుగులు టపటప రాలి అతని బుర్ర మీద పడుతున్నాయి. సైడు కాలవ లోని దోమలు సంగీతం పాడుకుంటూ వచ్చి అతని బుగ్గల్ని ముద్దు పెట్టుకొంటున్నాయి. ఈ చేత, ఆచేత దోమల్ని తోలుకుంటూ పుస్తకం లోకి పట్టి పట్టి చూస్తున్నాడు. అతని ముఖంలోకి దీక్షగా చూసిన ఎవరికైనా అతడు చదువుతున్న విషయం తిన్నగా మెదడు కు సరఫరా కావటం లేదని తెలుస్తుంది.
    క్షణ కాలం సాంబశివం వైపు తేరిపార చూసింది జానకి. పక్క అరుగు మీద ప్రకాశం గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు. దోమలు పాటలు కాని, మురికి కాలువ కంపు కాని అతని నిద్రకు అంతరాయం కలిగించ లేదు. ఒకే తల్లిదండ్రుల బిడ్డలైన ప్రకాశం వైపు, సాంబశివం వైపు మార్చి మార్చి చూసింది జానకి. అన్నదమ్ముల మధ్య పోలికలు ఉంటాయంటారు. వీరిద్దరిలో శారీరకంగా, మానసికంగా ఎంత వైవిధ్యముంది! ఒక మాటలో, చేతలో, భావన లో దేనిలోనూ సామ్యం లేదు-- అనుకొన్నది ఆమె.
    మనిషి బ్రతికేందుకు విశాల ప్రపంచం ఉంది. పైన సూర్యచంద్రులు , దిగువ భూమి మనకు రక్షగా , మన బ్రతుకులకు బాసటగా నిలిచి ఉండగా , బ్రతకలేమనే భయం మనకెందుకు ఉండాలి? ఈ ప్రపంచమంతా నీది కాకపోవచ్చు నీకున్నది చిన్న చీకటి కొట్టు కావచ్చు. నీ కొట్టు విడిచి బయటికి తొంగి చూసేందుకు నిన్నెవరూ అభ్యంతర పెట్టరు. ఆ చీకటి లోనే పుట్టి అందులోనే చచ్చినా కూడా ఎవరూ లక్ష్య పెట్టరు.

                                  
    నీ అంతట నువ్వే అ చీకటిని చీల్చుకొని బయటికి రా. కాస్త సేపు నీ కళ్ళు అ వెలుగుకు అలవాటు పడలేక బాధతో, తిరిగి ఆ చీకట్లో కి పోవడానికి మనసును తొందర చేస్తాయి. కాని, పట్టుదలతో పది నిమిషాలు నిలదొక్కుకొని తిరిగి చూడు.
    రంగు రంగుల ప్రకృతి ; రకరకాల జీవరాసులు ఆనందంతో ఆమోదంతో జీవిస్తూ, జీవితంలో ఎప్పటి కప్పుడు పురోగమిస్తూ కనిపిస్తాయి. ఇక్కడే నీ మెదడుకు కాస్త మేత వెయ్యి. వాటి కున్నది; నీలో లోపించింది ఏమిటి? అవి తమ జీవన పరిధిని రోజు రోజుకూ విసృతం చేసుకుంటూ బ్రతికేందుకు తిండి, సంతృప్తి దొరికే చోటుకు వెతుక్కుంటూ పోతాయి.
    మనిషి తన పూర్వీకులు వ్రాసి పెట్టిన గిరిని దాటేందుకు భయపడతాడు. అది తనకు రక్ష అనుకొంటాడు. తప్పి నడిస్తే నాశనం అయిపోతావనుకొంటాడు. అలవాటుగా నలుగురు నడిచే మార్గం చదునుగా, చెత్తాచెదరం లేకుండా ఉంటుంది. కాని అది అప్పటికే కిక్కిరిసి నీ అడుగు మోపెందుకే చోటు లేనప్పుడు, దానినే చూస్తూ గడప లో కూర్చునే దాని కన్న , కాస్త చుట్టు దారైనా , రాళ్ళు రప్పలు, ముళ్ళు డొంకలు కాళ్ళకు తగిలినా నీ గమ్యం చేరుకోడానికి ఇంకో దారంటూ ఉంటె దానిని అనుసరించు. ఎప్పటికో అప్పటికి అక్కడికి చేరుకోగలననే ఉత్సాహం నిన్ను ముందుకు నడుపుతుంది.
    అక్కడికి చేరుకోన్నాక ఏమర్గాన చేరేవని నిన్నెవరు ప్రశ్నించరు. నీవు నడిచిన బాట గురించి ఎవరూ పరిహరించరు. నిజాయితీ, నిలకడ పనిముట్లుగా తీసుకొని, ఆత్మవిశ్వాసంతో మూడాచారాలను నరుక్కొంటూ ముందుకు నడిచి పో. చీకటి కనుమరుగవుతుంది. వెలుగు నీ ఇంట వెలుస్తుంది అనే తత్త్వం గల ప్రకాశానికీ, తన నీడను చూసుకుని తనే బెదిరిపోయి తన చుట్టూ గల అందరి కళ్ళూ తననే పరిహసిస్తున్నాయని కుంచించుకు పోయి, లోకం లోని అందరి బరువు బాధ్యతలు మొయ్యడం తన విధి అయినట్లు, ఆ కార్య నిర్వహణకు తమ ఆశక్తుడైనట్లు చింతిస్తూ , తన ఉచ్చ్వాస నిశ్వాసాల్లోనే మనో ధైర్యాన్ని కోల్పోతూ ఉన్న సాంబశివానికి సాపత్యం చూడడం జానకి వశంలో లేకపోయింది.
    "చాలా రాత్రయింది, సాంబూ! ఇంక పడుకో కూడదూ?" అన్నది మెల్లగా.
    సాంబశివం వెనక్కు తిరిగి గుమ్మంలో నిల్చున్న అక్కను చూసేడు. 'చదవ్వలసింది చాలా ఉంది అక్కా! ఎంత చదివినా బుర్ర కేక్కడం లేదు. ఈ పరీక్ష ఎలా పాసవుతానో అర్ధం కాకుండా ఉంది" అన్నాడు సాంబశివం దిగులుగా.
    "ఒరే సాంబూ! నేనొక్క మాట చెప్తాను విను. మీ కాలేజీ లో అంతా నీ కన్న తెలివైన వాళ్ళే ఉన్నారం'టావా? వాళ్ళంతా ఏదో విధాన గట్టెక్కితే, నీది మాత్రం పాసవకుండా ఉండి పోతుందా? నా ఉద్దేశంలో చాలామంది కంటే నువ్వు తెలివైన వాడివి. మరి ఈ పిరికితనం నీలో ఎలా పుట్టిందో నాకు తెలియడం లేదురా."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS