Previous Page Next Page 
మారిన విలువలు పేజి 12

 

    "బాబుగారూ! మల్లె మొగ్గలు ....సంపంగి పూలు .... మరవం.... దవనం.... ఏటి కావాల?"
    పూలమ్మి ప్రశ్నతో ఆలోచనలు ఆగిన ప్రకాశం దాని పళ్ళెం లో పాతిక పైసల నాణెం గిరవాటేసి "మల్లెమొగ్గలు" అన్నాడు.
    పూలమ్మి పచ్చి మోదుగాకుతో మల్లెమొగ్గలు కొలిచి పోసింది.
    "మరి పీల మొగ్గల్లా ఉన్నాయి. కాస్త పెద్దవి చూసి వెయ్యి" అన్నాడు ప్రకాశం.
    "లేదు, బాబూ! ఈ బజారు కల్లా నాయే పెద్ద మొగ్గలు. కాలం అయిపోతున్నది కదా మరి?" అన్నది పూలమ్మి.
    పూలమ్మి అరిటి నారతో కట్టిచ్చిన పువ్వులు పొట్లం పట్టుకొని హుషారుగా నడక సాగించేడు ప్రకాశం.

                           *    *    *    *
    ఆరోజు అందరి కన్న ముందు నిద్ర లేచాడు ప్రకాశం. తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి వాకిట నీళ్ళు జల్లి వన్నె వన్నెల ముగ్గులు పెట్టడం కనకానికో సరదా. సంక్రాంతి, ఉగాది, విజయదశమి వంటి పండుగ రోజులైతే ఇంక చెప్పనే అక్కరలేదు.
    వారం రోజులకో మారు ముగ్గు కొనడానికి పెళ్ళాం డబ్బులడిగితే విసుక్కోనేవాడు సూర్యారావు. "మొన్న మొన్ననే కదా కొన్నావు? అప్పుడే అయిపోయిందా? ఏదో లంచానానికి నాలుగు ముగ్గు కర్ర్రలు తీస్తే సరిపోదూ? వీధీ , వాడా నింపెయాలా? అక్కడికి కాని నీ నేర్పరితనం ఊరందరికీ తెలిసి రాదా ఏం?" అనేవాడు.
    తన సరదాను మానుకోలేక, భర్త మాటకు ఎదురు చెప్పలేక దిగులుగా అత్తగారి వైపు చూసేది కనకం.
    "అదేమిటిరా, సూర్యం, ఆడపిల్ల ముచ్చటపడి ఇంటి ముందు కలకల్లాడుతూ ముగ్గులు పెడుతుంటే అలాగంటావు? ఆ ముగ్గు కిచ్చే అణా  డబ్బులతో నువ్వేం కోటలు , పేటలు కట్టించబోవులే" అనేది సుందరమ్మ.
    మళ్ళా కనకం పుట్టింటికి వెళ్ళి , సుందరమ్మ కు చెయ్యి తెరిపికాక ఓ ఘడియ గుమ్మంలో ముగ్గు పెట్టడం ఆలస్య మైననాడో, జానకి మొక్కుబడిలా  ఒక చుక్కల ముగ్గు పెట్టి ఊరుకొన్ననాడో, వీధి గుమ్మం లోకి వస్తూనే ముఖం చిట్లించుకొనేవాడు సూర్యారావు. గుమ్మం ముందు తిన్నగా ముగ్గు కర్ర తీసేపాటి ఓపికైనా ఇంట్లో వాళ్ళకు లేకుండా పోతున్నది-- అని సణుక్కొనేవాడు.
    ఆరోజు విజయదశమి మూలంగా, రోజూ కన్న కాస్త ముందుగానే లేచింది కనకం. అప్పటికే ప్రకాశం లేచి దంతధావన చేస్తున్నాడు. ఎవరు ఎంత ;లేపినా ఎండ ముఖానికి చుర్రున కొడితే కానీ లేచే అలవాటు లేని మరిది ఆనాడు అంత చీకటితో లేవడంచూసి కనకం ఆశ్చర్యపోయింది. ఎంత చలైనా ప్రకాశం తన పక్క, వీధి అరుగు మీంచి మార్చాడు. రాత్రి భోజనం ముగించుకొని తన జంబుకానా , పుస్తకాలు పట్టుకొని ప్రకాశం బయటపడితే,తిరిగి మరునాటి ఉదయమే ఇంట్లో కాలు పెట్టడం. ఏమైనా చదువుకోవలసి ఉన్నా వీధి లైటు వెలుగులోనే చదువుకొనేవాడు. లేకపోతె ముసుగు తన్నినిద్ర పోయేవాడు.
    ఉదయం వదిన గారు ముగ్గులు పూర్తీ చేసి వెళ్ళి పోతూ, ప్రకాశానికి మొదటి మేలుకొలుపు పాడేది. అరగంట పోయేక పళ్ళు తోముకోందికి వచ్చిన అన్నగారు రెండవది అందుకుంటే, చీపురు కట్టతో అరుగులు తుడవడానికి వచ్చిన తల్లి మూడవది పూర్తీ చేసేది. "లేరా, ప్రకాశం! ఝాము పొద్దెక్కింది. పాచి అరుగు అలాగే ఉండి పోయింది" అంటూ తట్టి లేపేది. అప్పటికి కూడా ఒళ్ళు విరుస్తూ బద్దకంగా లేచేవాడు ప్రకాశం. అలాటి మరిది ఈరోజు ఇంత చీకటి తో ఎందుకు లేచినట్లు? అనుకొన్నది కనకం.

                         
    "ఏం, ప్రకాశం, అప్పుడే లేచి పోయేవు? ఈరోజు పడమట సూర్యుడు ఉదయిస్తాడు లాగుంది" అంది.
    "ఈరోజు విజయదశమి కదా, వదినా! త్వరగా లేచి స్నానం అదీ చేద్దేమనే సత్సంకల్పం కలిగింది" అన్నాడు ప్రకాశం.
    వదినగారు తన ముగ్గులు ముగించక ముందే స్నానం చేసి, బట్టలు వేసుకుని బయటికి వచ్చేడు.
    "అదేమిటయ్యా! అప్పుడే ఎక్కడి కెళ్తున్నావు?" అని ప్రశ్నించింది కనకం ఆశ్చర్యంగా.
    నోటి మీద వేలు ఉంచుకొని "పని మీద వెళ్తున్న వాళ్ళని అలా అడక్కూడదని మీ అమ్మచెప్పలేదా, వదినా?" అన్నాడు నవ్వుతూ ప్రకాశం.
    ప్రకాశం నవ్వుతాలకే ఆ మాట అన్నా కనకం నిజమే అనుకోని తను పొరపాటుగా అడిగినందుకు చిన్నపుచ్చుకుంది.
    "అవును కానీ వదినా! విజయదశమినాడు ఏ పని మొదలు పెట్టినా జయప్రదంగా అవుతుందంటారు . నిజమేనా?"
    "నిజంగా అవుతుంది ప్రకాశం. పూర్వకాలంలో రాజులు అందుకే విజయదశమి నాడు యుద్దాలకి బయలుదేరేవారు."
    "కాని రెండు పక్షాల వారికి జయం కలుగదుగా! మరి అటు వారికి విజయదశమి కాదా?"
    ఆ నమ్మకం లో ఉన్న అసందర్భం తెలిసి వచ్చింది కనకానికి.
    "ఏమైనా , నీకు నమ్మకం ఉంది కాబట్టి నేనూ నమ్ముతాను. నన్ను ఆశీర్వదించు , వదినా!" అని ఆమె ముందు తల వంచేడు ప్రకాశం.
    "ఇంతకీ..." అని ఏదో అడగబోయి , కూడదను కొన్నట్లు అంతలోమాట ఆపి, "నువ్వే పని మొదలెట్టినా సఫలం అవుతుంది, ప్రకాశం , నాకు తెలుసు" అన్నది.
    వదిన గారి దీవెన లందుకొని వెనుదిరిగి చూడకుండా వీధిలో నడిచి పోయేడు ప్రకాశం.
    గంటలకల్లా సుందరమ్మ ఇంత కూరా, చారు వండి, పండక్కదా అని ఇంత పులగం చేసింది.
    దేవుని మట్టుకేనా ఇంత పరామాన్నం చేద్దామంటే, ఏమీ లేవు. పంచదారా లేదని విరామాయికొంది. పెట్టి పుట్టిన వాళ్ళిళ్ళ లో బొబ్బట్లు, బూరెలు పిండి వంటలు చేసుకొంటారు. మాకింతే ప్రాప్తి అనుకొంది.
    పిల్లలంతా నట్టింట కూర్చుని సరస్వతీ పూజ చేస్తున్నారు. కళ్ళ వేడుగ్గా ఓ మారు చూసి, అమ్మ వారికి దండం పెట్టి వద్దామని వంట ఇల్లు వదిలి నడిమింట్లోకి వచ్చింది సుందరమ్మ. సూర్యం, సాంబు,జానకి, శాంత వరసగా కూర్చుని పూజ చేస్తున్నారు. కనకం దేవీ సహస్రనామాలు చదువుతున్నది. ఆమెకు వచ్చిన కొద్ది పాటి చదువునూ పూజలకు , పాటలకు ఉపయోగించుకొంటుంది కనకం. ఆ పాటలు, పూజా విధానం ఆమెకు రమారమి కంఠతా వచ్చు. అయినా ఎక్కడైనా తప్పు పలకవచ్చని పుస్తకం ముందర  ఉంచుకొంటుంది. పూజ పూర్తయి హారతి ఇచ్చేక, "ప్రకాశం ఎడర్రా" అని ప్రశ్నించింది సుందరమ్మ.
    "తెల్లావారుఝామున నేను ముగ్గులు పెడుతుంటే ఏదో పనుందని వెళ్ళేడు , అత్తయ్యా! ఇంకా తిరిగి రాలేదు" అన్నది కనకం.
    "పండగ పూట ఎక్కడ తిరుగుతున్నాడో భోజనం వేళైనా ఇంకా ఇంటికి రాకుండా!" అన్నది సుందరమ్మ.
    "ఓపూజా పునస్కారం కావాలనుకొంటె కదా వేళకి ఇల్లు చేరడం! ఈమధ్య ఎప్పుడు చూసినా ఆ కిళ్ళీ కొట్టు అప్పన్న వెనకాలే తిరుగుతున్నాడు. బాగుంది కదూ? వాడికి, వీడికి స్నేహంట" అన్నాడు సూర్యారావు.
    "ఒరే! ఎక్కడో అక్కడ తిరగనీ కానీ, ఇంటికొస్తే పండగ పూట వాడినేం అనకు."
    "నేనెందు కంటానమ్మా! వాడి ఖర్మ ఎలాగుంటే అలా తగలడనీ. నాకేం కావాలి?
    జానకి ఏదో అనబోతుండగానే , "అదిగో అన్నయ్య" అన్నది శాంత, ఇంట్లో కాలు పెడుతున్న ప్రకాశాన్ని చూసి.
    "ఇంత వేళదాకా ఎక్కడ తిరుగుతున్నావురా? పండక్కదా? ఈ రోజైనా ఇంటి పట్టునుండి పూజ చేసుకోడం , అలాంటివేమీ అక్కర్లేదు?" చీవాట్లు పెట్టింది సుందరమ్మ.
    "నేను చెయ్యక పోయినా, మీరంతా చేసేరు కదా? నాకేలాగా చదువబ్బలేదు. ఇప్పుడు పూజ చేసినా సరస్వతమ్మ ఇస్తుందన్న నమ్మకం లేదు. ఆ ఇచ్చేదేదో ఇది వరకే ఇచ్చి, "నీకు కధలు, నవలలు చదువుకొందికి ఇది చాలు. ఇంతకన్నా ఎక్కువ ఇస్తే నీ బుర్ర భరించలేదు' అన్నది. ఇచ్చినదానిని పుచ్చుకొనే రకం నాది. పూజ చేసి ఇంకేం కోరేది?"
    "బాగుందిరా వెధవ కబుర్లూ నువ్వూ! పోనీ, తిండికెనా ఇంటికి రావాలనే బుద్ది కలిగింది. కొంత నయమే."
    "ఇదిగో నమ్మా. పంచదార, గోధుమ పిండి తెచ్చెను. పండగంటే మీకందరికీ పూజలు జ్ఞాపకమోస్తాయి. నాకు పిండి వంటలు తలపు కొస్తాయి. మనం బొప్పట్లు తిని ఎంత కాలమైందని? అమ్మా, ఒక్క గంటలో కమ్మగా నాలుగు బొబ్బట్లు చేసి నాకు పెట్టమ్మా! ఎమండోయి, వదిన గారూ! మరీ దిష్టి పెట్టినట్లు అలా చూడకండి. నే తినగా మిగిల్తే మీరు కూడా తినచ్చు లెండి" అన్నాడు ప్రకాశం నవ్వుతూ.
    "ఇంతకీ నీకు సొమ్మేక్కడిదిరా?" అనుమానంగా  ప్రశ్నించేడు సూర్యారావు.
    "ఆరోజు అప్పు పెట్టెనని చేస్తే నువ్వు నమ్మలేదు కదా! ఈరోజు ఆ సొమ్మే నన్ను బొబ్బట్లు తినమంది."    
    "మరి నువ్వు చేసిన అప్పో?"
    "అది కూడ తీరిపోతుంది , అన్నయ్యా. మరేం భయపడకు " అన్నాడు ప్రకాశం.
    ఆరోజు వారింట అంతా సంతోషంగా బొబ్బట్లతో భోజానాలు పూర్తీ చేసేరు. అన్ని పండుగల్లోకి ఆపండక్కు ఏదో కొత్త ప్రాధాన్యం వచ్చినట్లు అనిపించింది సుందరమ్మకు.
    మరునాటి ఉదయాన్నే ముందు రోజు లాగే చీకటి తో వీధిలోకి వెళ్ళిపోతున్న ప్రకాశాన్ని చూసి, "మల్లా పంచదార కోసమే?" అని ప్రశ్నించింది కనకం.
    "కాదు, వదినా. వేరే పనుంది" అని వెళ్లిపోయేడు.
    ఊరు తెల్లారకుండా బయటికి పోయి కాస్త పొద్దు పోడిచేసరికి ఇంటికి చేరుకొంటున్న ఈ మరిది బయట సాగిస్తున్న వ్యవహార మేమిటా? అని ఆలోచనలో పడింది కనకం. కొన్ని రోజుల వరకు ఇంట్లో ఎవరైనా ప్రకాశం ఏడని అడిగితె ఏదో విధాన సర్ది చెప్పి, ఆ రహస్యం దాచే బాధ్యత వదిన గారి మీద ఉంచేడు ప్రకాశం.    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS