"వాళ్ళందరి దారి వేరు, అక్కా! వాళ్ళు పాసు కాకపోయినా ఏం మునిగి పోదు...."
అప్రయత్నంగా నవ్వు వచ్చింది జానకికి. తన మాటలలో అంత నవ్వవలసిన దేమున్నదని తెల్లబోయి చూసేడు సంబశివం.
"నీ పరీక్ష పొతే సప్త సముద్రాలు పొంగి, ప్రపంచాన్ని ముంచేస్తాయి కదురా? లేక భూమి తన గతి తప్పి సూర్యూడి లోకి చొచ్చుకుపోతుందా? ఏమవుతుంది రా పిచ్చి తండ్ర్రీ?"
"నా బాధ నీకు నవ్వుతాలుగా ఉంటుందనుకోలేదు అక్కా!"
"నీ బాధ చూసి కాదురా నవ్వింది. నీభయం చూసి . ఇప్పటి వరకు ఏ క్లాసూ తప్పకుండా పాసవుతున్నవాడివి, ఇప్పుడు ఎందుకు పోతుందిరా పరీక్ష? అనవసరంగా గాభరా పడి మనసు పాడుచేసుకోకు."
తమ్ముడికి దైర్యం చెప్పి లోపలికి తీసుకు వచ్చింది జానకి.
* * * *
చాల రాత్రి వరకు సాంబశివం, జానకి పక్కల పై నిద్ర రుచి చూడని కళ్ళతోనే కాలం గడిపి వేసేరు. కాస్త చీకటి ఉండగానే లేవాలను కొన్న జానకి రోజూ కన్న మరి కాస్త ఆలస్యంగా లేచింది. సుందరమ్మ ఇల్లూ, వాకిలీశుభ్రం చేసుకుని వంట ప్రయత్నాలలో ఉంది. కనకం అత్తాగారికి వంటకు బియ్యంలో రాళ్ళు, ధాన్యం ఏరి ఇస్తున్నది. జానకి కాలకృత్యాలు ముగించుకు వచ్చి వదిన గారి పక్కన కూర్చున్నది. చేటలో బియ్యం అటు ఇటుకదుపుతూ,"వదినా! ప్రకాశం ఏడీ?"అని ప్రశ్నించింది.
నాలుగు రోజులై ఇంట్లో ఎవరో ఒకరు వేస్తున్నదే ఈ ప్రశ్న. అందరికీ తలొక మాదిరిగా సమాధానం ఇస్తూ తప్పించుకుంటున్నది కనకం. ఈరోజు ఆడబిడ్డ పనిపెట్టుకొని దగ్గరికి వచ్చి కూర్చుని ప్రశ్నించడం తో ఇక ఈ విషయం గోప్యంగా ఉంచడం తలవల్ల కాదనుకొంది కనకం.
"ఎక్కడికో వెళ్ళేడమ్మా" అన్నది.
"అదే, ఎక్కడికి వెళ్ళేడు అని అడుగుతున్నాను."
"నాకేం తెలుసు! నాతోచేప్పి వెళ్ళేడా?"మీకెంత తెలుసో నాకూ అంతే."
"నీతో చెప్పకుండా వాడే పని చెయ్యడు కాని, వదినా! ప్రకాశం ఎన్ని రోజుల బట్టీ ఇలా ఉదయాన్నే బయటికి పోతున్నాడు?"
"ఏదీ! నాలుగైదు రోజులేగా అయింది?"
"అంటే విజయదశమి నాటి నుండి అన్నమాట."
"మరేం!"
"నిజంగా చెప్పు, వదినా! ప్రకాశం ఊరికే తిరిగిందికే బయటికి పోతున్నాడా?"
"నీ తోడుగా నాకేం తెలియదమ్మా, జానకీ! ఏదో పని మీద పోతున్నానంటాడు. ఏమిటని అడిగి అతని పనికి విఘ్నం కలిగించడం ఇష్టం లేక ఊరుకున్నాను; ఏదైనా చెప్పవలసి ఉంటె తనే చెప్తాడు అనే ఉద్దేశంతో."
"సరిలే, నే నడిగి తెలుసుకొంటాను."
"నే చెప్పెనని చెప్పబోకమ్మా, జానకీ! వదిన నా రహస్యం దాచింది కాదంటాడు" అన్నది కనకం.
"అలాగాలే" అన్నది జానకి నవ్వుతూ.
జానకి ఆలోచనలతో గడిఛిన రోజు మేలుకోంది. ఆఫీసులో తన పని ముగించుకొని బాలవిహార్ ను వదిలి వేస్తున్న సమయంలో "అనసూయమ్మ గారు పిలుస్తున్నా" రంటూ వచ్చేడు నౌకరు రంగయ్య.
"ఎక్కడున్నారు? హాస్టల్ లోనా, ఇంట్లోనా?" ప్రశ్నించింది జానకి.
"ఇంట్లోనే ఉన్నారు. మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు."
"సరే,పద" అంటూ అతనితో బయలుదేరింది జానకి.
బాలవిహార్ ను అనుకునే అనసూయమ్మ గారి ఇల్లు ఉన్నది. ఇల్లు అట్టే పెద్దది కాకపోయినా అధునాతన పద్దతిలో కట్టింది. ఇంటి ముందు పూల మొక్కలు, విశాలంగా ఉన్న కిటికీలకు, గుమ్మాలకు పొడుగ్గా వేలాడుతున్న తెరలు, కాలు జారెట్టు ఉన్న నున్నని గచ్చు ఆ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి.
ఆ ఇంటి గుమ్మంలో నిలబడిచూస్తె బాలవిహారంతా విరిసీ విరయని గులాబి తోటలా , రంగురంగుల పువ్వులతో , రకరకాల పక్షుల పలుకులతో గెంతుతూ దుముకుతూ ఇటు అటు పరుగులు పెట్టె చిన్నారి పాపల కేరింతలతో చూడ ముచ్చటగా కనిపిస్తుంది.
బాలవిహార్ అంటే ఒక పెద్ద సేవ సంస్థ కాని,విద్యాలయం కాని కాదు. అనాధ, అర్తజన శరణాలయం అన్న బిరుదు కూడా దానికి లేదు. ఒక తల్లి గర్భశోకం లో నుండి పుట్టిన మానవతకు చిహ్నం. అనసూయమ్మ దానికి అధికారిణి అనుకొంటే, జానకి ఆమె సెక్రటరీ. మరో ఇద్దరు ఉపాధ్యాయులు కొద్ది మంది ఆయాలు, నౌకర్లు ఉన్నారు అందులో. వీరంతా ఒక సమిష్టి కుటుంబంలోనివ్యక్తుల్లా మసలు కొంటారు. వీరందరి చేతుల్లో బాలవిహార్ పెరుగుతున్నది.
అనసూయమ్మకు వరుసగా నలుగురు పిల్లలు పుట్టి పురిటి గది దాతకున్దానేఎ లోకం విడిచి వెళ్ళిపోయేరు. అయిదవ సారి పుట్టిన బిడ్డ తనతోపాటు అనసూయమ్మ కు మరి పిల్లలు కలిగే అదృష్టాన్ని కూడా లాక్కుపోయింది. డబ్బు, దయ గల హృదయం కల అనసూయమ్మ తనకు నచ్చిన పిల్లల్ని ఆస్పత్రుల నుండి, అనాధ శరణాలయాల నుండి తీసుకువచ్చి పెంచి పెద్ద చెయ్యాలనే ఆశయంతో ఈ బాలవిహార్ ను స్థాపించింది.
భర్త పోయేక ఆమెకు అ పిల్లలే అప్తులయ్యేరు. అందులోని పాతిక, ముప్పై మంది పిల్లలకు ఆమె తల్లి. పెరిగి పెద్దవారైన వారు కూడా, "అమ్మా! అమ్మా!" అంటూ ఆమెను చూసేందుకు తిరిగి తిరిగి వస్తారు. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లల్లా , సెలవు మీద వచ్చిన మగపిల్లల్లా భావించి వారిని ఆదరిస్తుంది అనసూయమ్మ.
ఆమె బాలవిహార్ లోపిల్లలకు రుచికరమైన ఆహారం పెట్టి, శుచికరమైన అలవాట్లు నేర్పి, గృహజీవనం లోని మాధుర్యాన్ని వారికి అందజేస్తుంది. వారు కోల్పోయిన మాతృ ప్రేమతో వారిని దగ్గరికి తీసుకొంటుంది. అందుకే ఆ పిల్లలకు బాలవిహార్ పట్ల అంతఅభిమానం. తాము పెరిగిన చోటు తమలాటి మరి కొందరికి ఆశ్రయం కావాలన్న ఉద్దేశంతో తమకు తోచినంత సొమ్ము అప్పుడప్పుడు పంపుతుంటారు. బిడ్డల నుండి తల్లి సొమ్ము తీసుకొందుకు ఎలా సంకోచించదో, అలాగే అనసూయమ్మ తన చేతుల్లో పెరిగిన పిల్లలు సొమ్ము పంపితే ఆనందంగా స్వీకరిస్తుంది. తిరిగి దానిని వారిలాటి మరికొందరికి ఉపయోగిస్తుంది.
ఈ బాలవిహార్ గురించి చాలామందికి తెలియదు. దీనికి ప్రజాదరణ కాని, పేరు ప్రఖ్యాతులు గాని లేవు. కాని, ఇక్కడ పెరిగిన పిల్లలు తమ పెంపుడు తల్లి గురించి ఘనంగా చెప్పుకుంటారు. ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఆనందంగా, స్వేచ్చగా ఉంటారు.
శరణాలయం గురించి రకరకాల కధలు విన్న జానకి ఈ ఉద్యోగంలో చేరేందుకు మొదట వెనకాడింది. ఇటువంటి సేవా సంస్థలలో కాఠిన్యం , కాలుష్యం, కూడగట్టుకొని ఉంటాయని, అవినీతి రాజ్యం ఏలుతూఉంటుందని , ఇటువంటి చోట్ల కొంతకాలం మసలిన మనుష్యులు యంత్రాల్లా తయారై ఏ మీట నొక్కితే ఆ పని చేస్తూ కాలం వెళ్ళదీసే రకానికి దిగజారి పోతారని బావించింది. కాని , అవసరం ఆమెచే బాలవిహార్ ప్రాంగణం లో కాలు పెట్టించింది.
అనసూయమ్మనుచూసేక జానకి తన భయాన్ని మరిచిపోయింది. అమెలాటి నిస్వార్ధ పరులు అరుదు. కాని, ఉండరని మాత్రమూ అనలేము. బొగ్గులు రోజూ బస్తాలకు బస్తాలు కాలుస్తాము. అటువంటి బొగ్గు ల్లోనే అరుదుగా ఎక్కడో మాణిక్యాలు ఉంటాయి.
అనసూయమ్మ మంచం మీద పడుకొని ఉన్నది. కాళ్ళు పైకి ముడుచుకొని తలదాకా ముసుగు పెట్టుకొన్నది.
"నన్ను పిలిచేరా?" జానకి మెల్లగా ప్రశ్నించింది.
"వచ్చేవా, జానకీ?' అనసూయమ్మ అటునుండి ఇటుతిరిగింది.
"మీ ఒంట్లో సరిగా లేదా?" ఎర్రబడిన కళ్ళను, పీక్కుపోయిన ముఖాన్ని చూసి ప్రశ్నించింది జానకి.
"అవునమ్మా. నిన్నరాత్రి నుండి జ్వరంగా ఉంది. ఒళ్ళంతా నొప్పులు, కళ్ళ మంటలు. ఈరోజు పిల్లల్ని చూడ్డానికి రాలేకపోయాను. అంతా బాగున్నారా? రాముడు. శివన్న దెబ్బలాటలు మానేసి ఆడుకొంటూన్నారా?"
"వాళ్ళు అప్పుడే మరిచి పోయేరమ్మా. చిన్న పిల్లలికి అది దేముడిచ్చిన వరం. ఈక్షణంలో జరిగినదాన్ని మరుక్షణం లో మనసులోంచి తోసి పారేయ్యగలరు. మనలా ఆలోచిస్తూ , బాధపడుతూ కూర్చోరు."
"చూడు, నిన్న వాళ్ళ మీద చెయ్యి చేసుకోన్నావా? రాత్రల్లా బాధ పడుతూనే ఉన్నాను. వాళ్ళను దండించే అధికారం నాకుందా అని రాత్రల్లా నన్ను నేను ప్రశ్నించుకొంటూనే ఉన్నాను.
"కాని, చూడు, జానకీ! ఒక్కొక్కసారి దండన కూడా ప్రేమలో భాగమేమో అనిపిస్తుంది నాకు. నాది నావారు అన్న మమకారంతో ఒకదానిని చూస్తున్నప్పుడే అది చెడిపోతే బాధనిపిస్తుంది. బాగుపరించిందికి ప్రయత్నించాలనిపిస్తుంది. వీధిలో పోతున్న ఏ కుర్రాడో ఇంకొకడితో అటువంటి మాటలంటే క్షణ కాలం రోత పడినా ఏమనకుండా నా దారిన నేను పోయుండేదాన్ని. కాని నిన్న శివయ్య నోటంట ఆమాట వినేసరికి.... నా శరీరంలోని ఏదో భాగం చేదిపోతున్నట్లు బాధ పడ్డాను."
'అవునమ్మా! కన్నతల్లి అయినా పిల్లలను పాడుపని చేస్తే దండించకుండా ఉంటుందా? అలా చేస్తే బిడ్డల పట్ల ఆమెకు గల ప్రేమను శంకించవలసి ఉంటుంది. పిల్లలు సరిగా పెరిగిందికి లాలన, పాలన ఎంత అవసరమో, దండన కూడా అంత అవసరమే" అన్నది జానకి.
"ఇంతకీ అటువంటి పాడు మాటలు వీళ్ళకు ఎలా అబ్బేయంటావు?"
"నౌకర్ల నోట వినుంటారు."
"ఈవిషయంలో నౌకర్ల ను గదమాయించాలి. పసివాళ్ళ ముందు అసభ్యంగా మాట్లాడితే ఉద్యోగం ఊడి పోతుందని హెచ్చరించాలి."
",మీరు మరేం కంగారు పడకండి. ఈ విషయంలో నేను తగిన జాగ్రత్త తీసుకొంటాను. మీ ఆరోగ్యం బాగా చూసుకోండి. మరి నేను సెలవు తీసుకొంటాను." అని చెప్పి బయటికి వచ్చింది జానకి.
అప్పటికే కనుచీకటి పడుతున్నది. పని ముగించుకొని ఇళ్ళకు పోయే కూలీ, నాలీ జనం, మేత నుండి తిరిగి వస్తున్న పశువులు పగలల్లా ఆఫీసుల్లో , ఇళ్ళలో మగ్గి సాయంకాలం చల్లగాలి పీల్చుకొందికి పార్కులకు బయలుదేరే అడా మగతో మహా సందడిగా ఉన్నాయి రోడ్లన్నీ. జానకి తొందరగా ఇల్లు చేరుకొనే ఉద్దేశ్యంతో వడివడిగా అడుగులు వేస్తున్నది.
పార్కు లో గుంపులు గుంపులుగా కూర్చున్న శ్రోతలకు పాకిస్తాన్ చేస్తున్న డుండగాలను, అరాచకాలను వేనోళ్ళ వెల్లడిస్తున్నది ఆలిండియా రేడియో. "తెలుగులో వార్తలు సమాప్తం." అన్న మాట విని చాలామంది లేచి ఇళ్ళ ముఖం పట్టారు. అందరికి కాస్త దూరంగా బుర్ర వంచుకొని నడుస్తున్న యువకుణ్ణి చూసి, పోల్చుకొని, "సాంబూ!" అని పిలిచింది జానకి. త్రుళ్ళిపడి సాంబశివం వెనక్కు తిరిగి చూసేడు.
"నువ్వింత ఆలస్యంగా వస్తున్నావెమక్కా" అన్నాడు .
"ఆఫీసులో ఏదో పనుండి ఉండిపోయాను. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు?"
"ఏం తోచలేదు. మనస్సుకు కాస్త బాగుంటుందేమో అని ఇక్కడ కూర్చున్నాను."
కాలేజీ నుండి రాగానే కాళ్ళూ, చేతులు కడుక్కొని తిరిగి పుస్తకాలు ముందేసుకొని కూర్చునే సాంబు, ఈరోజు ఏం తోచలేదంటూ పార్కుల వెంట తిరగడం కాస్త కొత్తగానే అనిపించింది జానకికి.
"ఏం జరిగిందిరా! అంత దిగాలు పడి ఉన్నావు?" అన్నది.
ఆమె మాటకు సాంబశివం జవాబు చెప్పలేదు.
'అక్కా, మన ప్రకాశం న్యూస్ పేపర్లు అమ్ముతున్నాడు. నీకు తెలుసా?" అని ప్రశ్నించేడు జానకి కళ్ళలోకి చూస్తూ.
'అంటే?"
"పేపర్లమ్మడం అంటే ఆ మాటకు అర్ధం తెలియక కాదు. తమ్ముడు ఎంచుకొన్న జీవితాన్ని అవగాహన చేసుకొందుకు ఆపాటి సమయం కావలసి వచ్చింది ఆమెకు.
'అంటే ఉదయం ఇంటింటికి తిరిగి పేపర్లు అందియ్యడం. సాయంకాలం పార్కుల్లోనూ, కాలేజీ గేటు దగ్గరా, రైల్వే స్టేషను లోనూ పేపర్లు, పత్రికల , కదల పుస్తకాలు అమ్ముతుండడం...."
"అది సరే. ఈ విషయం నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు?"
"కాలేజీ వదిలేక చాలామంది గుంపుగా వస్తున్నాము. వెనక నుంచి "సార్, పేపర్ సార్.... ఈవెనింగ్ న్యూస్.... తాజావార్తలు' అంటూ మాటలు వినిపించేయి. అలవాటు పడిన కంఠం విని వెనక్కి తిరిగి చూసేను. మన ప్రకాశం..... నా నోటి లోంచి మాట రాలేదు. కళ్ళప్పగించి అలా చూస్తూ ఎంతసేపు నించున్నానో....
"ప్రకాశం 'పేపరు సార్...పేపరు సార్.' అంటూ నన్ను గుర్తు పట్టనట్లే కావలసిన వాళ్ళకి పేపర్లిచ్చి నా ముందు నుంచి వెళ్లిపోయేడు. ప్రకాశం ఈ పని ఎప్పటి నుంచి చేస్తున్నాడు? నన్ను చూసి పలకరించ కుండా ఎందుకు వెళ్ళిపోయేడు?"
"ఎంతకాలంగా చేస్తున్నాడో నాకు తెలియదు, సాంబూ!కాని, అలా ఎందుకు ప్రవర్తించేడో నేనర్ధం చేసుకోగలను, బహుశా నీ కళ్ళు, పదిమంది మధ్య నా తమ్ముడు పేపర్లమ్ముతూన్నాడని నన్ను అవమానం చెయ్యకురా అని ప్రార్ధించి ఉంటాయి. అందుకే నీకూ, వాడికీ సంబంధం లేనట్లు పలకరించకుండా వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడి వాళ్ళు అనుమానించిందికి నీకు,వాడికి వెయ్యి కాగడాలు పెట్టి వెదికినా పోలికలు లేవు."
"కాని...కాని.... వాడు అలాటి పని చేస్తుండగా లేనిది, వాడు నా తమ్ముడు అని చెప్పుకొందికి నే సిగ్గు పడతానా , అక్కా!"
"ఆ విషయం నీ మనసు నడిగి చూసుకో, ఏమంటుందో" అన్నది జానకి.
