Previous Page Next Page 
నిష్టూర ప్రేమ పేజి 12

   
    "చాలా బాగా పెట్టావే అమ్మాయ్" అన్నాడు కృష్ణమూర్తి గారు టూత్ బ్రష్ నోట్లో పెట్టుకుంటూ.
    గ్లాసుతో కాఫీ తీసుకొచ్చి కూతురికిస్తూ "అది చూస్తూనే కూర్చుంది మీ అమ్మాయి. కడుపు నిండిపోయింది దానికి" అన్నారు సీతమ్మ గారు. ఎవరూ మాట్లాడకపోవడం చూసి ఆవిడే మళ్ళీ అన్నారు.
    "ఫరవాలేదే. ఇందూ. నియమంగా గొబ్బి పూజ చేస్తున్నావు కాబట్టీ చక్కని మొగుడే దొరుకుతాడులే"
    "అందుకోసం ఏం పెట్టలేదులే , అమ్మా" అని లేచింది ఇందిర.
    ఆమె మనస్సంతా చెప్పలేని ఆనందంతో నిండిపోయింది.
     ఇందిర ఇల్లు చేరి అప్పుడే పదిహేను రోజులు కావస్తుంది. సెలవలు కూడా అయిపోవచ్చాయి. ఏదో మాటల్లో చెప్పనలవి కాని బాధ మనసులోకి మెల్లిగా చేరుతుంది. ఇందిర క్షేమంగా ఇల్లు చేరినట్టు కృష్ణమూర్తి గారిచ్చిన టెలిగ్రాం తప్ప , ఇంకేం సమాచారమూ వాల్తేరు నించీ డిల్లీ కి చేరలేదు. మంజుల కీ జోగీందర్ కీ ఉత్తరాలు రాయాలని అనుకున్నా, రాసే సాహసం లేక ఊరుకుంది ఇందిర ఇంతదాకా. ఆరోజే మంజుల నిష్టూరంగా, రాసిన ఉత్తరమూ, రేణు తన పెళ్ళికి తేదీ నిస్చయించినట్టు తెలుపుతూ వ్రాసిన జాబూ అందాయి. దాంతో ఇందిర కలం పట్టక తప్పలేదు. రేణుకి అభినందనలు తెలుపుతూ వ్రాసింది ముందు. మంజుల కు కూడా ఆలస్యానికి క్షమార్పణలు చెప్పుకుంటూ రాయగాలిగింది. కానీ జోగీ కి రాయడానికి ఇందిర శక్తి కి మించిన పని అయింది. చెంపకు చెయ్యి చేర్చి ఆలోచిస్తూ కూర్చున్న ఇందిరను రెండు మాట్లు పలకరించి , ఉపయోగించక పోయేసరికి సీతమ్మ గారు ఆ ప్రయత్నం విరమించుకుని పోయి కూర్చున్నారు.
    జోగీకి రాయవలసిన ఉత్తరం వాయిదా వేసి, రాసిన రెండు ఉత్తరాలు తపాల పెట్టెలో పడవేసి వచ్చి కూర్చున్న ఇందిర, తండ్రి తన కేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు పసికట్టింది.
    "ఇలా ఎంతకాలం మాకు దూరంగా, ఒంటరిగా ఉండగలవే అమ్మాయ్?' అంటూ సీతమ్మ గారు ప్రారంభించే సరికి, తన ఉద్యోగానికి రోజులు మూడాయని గ్రహించింది ఇందిర.
    మొదటి నుంచీ ఇందిర డిల్లీ పోవడం ఎవరికీ ఇష్టం లేదు. పిల్లల కోర్కె తీర్చడం , వాళ్ళ అభిప్రాయాలను మన్నించడం కృష్ణమూర్తి గారికి అలవాటు. అందువల్లే వాల్తేరు లోనే ఉండటం తన కిష్టం లేదనీ, కొంతకాలం పాటు ఈ ప్రాంతాలను వదిలి ఉండాలని ఉందనీ అన్నప్పుడు డిల్లీ కి వెళ్ళమని సలహా ఇచ్చినవారు కృష్ణమూర్తి గారే. ఆరునెలల పాటు కూతురు కళ్ళకి కనిపించక పోయేసరికి , పరాయి ఊళ్ళో , ఇతరుల చేతుల్లో పిల్లని పెట్టడం లో ఎన్నో లోపాలు కనబడడం మొదలు పెట్టాయి.
    "ఒంటరిగా ఏమిటి, అత్తయ్య వాళ్ళతోటేగా ఉన్నాను." మెల్లిగా అంది.
    "అది కాదు, తల్లీ. నువ్వు మా దగ్గిర ఉంటె మాకు తృప్తిగా ఉంటుంది. మా దగ్గిర మాత్రం ఎల్లకాలం ఎలాగ ఉంచుకుంటాం? నీకు తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేసేస్తే, మాకూ బాధ్యతలు తీరిపోతాయి. కృష్ణా, రామా అనుకుంటూ ముగ్గురు కూతుళ్ళ దగ్గిరా మూడేసి నెలలు గడిపామంటే రోజులిట్టే గడుస్తాయి మాకూనూ." తేలిగ్గా పెళ్లి ప్రసక్తి తెచ్చారు కృష్ణ మూర్తి గారు.
    ఇందిర కీ సంభాషణ బొత్తిగా రుచించలేదు. తల్లీ, తండ్రీ ఏదో గట్టిగా ఆలోచించుకుని తనతో మాట్లాడుతున్నారని ఆమె గ్రహించింది. తన మనస్సేమిటో తనకే తెలియని ఈ పరిస్థితిలో, సరికొత్తగా  ఏదన్నా నిర్ణయం తీసుకోవలసివస్తే చాలా కష్టమై పోతుంది.  తనకి సంబంధించిన ఏ విషయాన్ని గురించీ కూడా గట్టిగా అలోచించలేకుండా ఉంది ఇందిర. రోజూ లేలాగో గడిపి వెయ్యడమే ఈ వ్యాధికి తగిన మందని అనుకుంటున్న ఇందిర మాట మార్చడానికి ప్రయత్నించింది.
    "నాకు ఇక్కడే ఉద్యోగం చేయడాని కేమీ అభ్యంతరం లేదు. పోనీ, ఓ అప్లికేషను పడేస్తానిక్కడ. ఉద్యోగానికి రాజీనామా ఇస్తాను. నాకూ పెద్ద అక్కడుండాలని లేదు. డిల్లీ మోజు తీరిపోయింది.
    "ఉద్యోగం చేసుకోవడమే నీ జీవితాశయమయితే ఎక్కడ మంచి అవకాశా లుంటే అక్కడే చెయ్యచ్చు.  కానీ , పెళ్లి చేసుకుని అందరాడపిల్లల్లా ఉండాలను కుంటే మాత్రం అది వేరే సంగతి . పెళ్లి చేసుకోకూడదని నీకేం నియమం లేదుగా?"
    ఇందిర ఇరుకున పడింది.
    "మీరు మరీనీ. అజాన్మాంతం ఇది బ్రహ్మ చారిణీ గా ఉండిపోతుందా ఏం? ఏమే, ఏదన్నా మఠం లో చేరదల్చు కున్నావా? అలాంటి ఆలోచన ఉంటె నువ్వూ మీ నాయనా పోయి చేరండి.నా కభ్యంతరం లేదు." సీతమ్మ గారు యెగతాళి పట్టించారు.
    "సరెలేవే." భార్యను మందలించి, కూతురి వైపు తిరిగారు కృష్ణ మూర్తి గారు. "మీ అమ్మా నేను బాగా అలోచుంచుకుని నిన్నొక ఇంటిదాన్ని చెయ్యాలని నిశ్చయించు కున్నాం తల్లీ. నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దు కోవాలి. నీకు అభ్యంతరం లేకపోతె మేం తగిన వరుణ్ణి చూస్తాం -- నీకు నచ్చితే చేసుకుందువు గాని. ఏమంటావమ్మా?"
    "నా కిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనీ లేదు, నాన్నా." తడి ఆరుతున్న గొంతుతో చెప్పింది.
    "మరెప్పుడు చేసుకోవాలనుందమ్మా? జుట్టు నెరవాలా, పళ్ళు ఊడాలా?" సీతమ్మ గారు అసహనంగా అడిగారు.
    "నువ్వూరుకో, సీతా. కాదు, తల్లీ నిన్ను తొందర పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. నువ్వు మాకు బరువు కాదు. కానీ ఏ వయస్సు ముచ్చట ఆ వయస్సు లో తీరడం ధర్మం. అదీకాక ఉన్న పళాన పెళ్ళిళ్ళు జరగవు కదా. నీ ఆలోచనేమిటో తెలిస్తే, మన ప్రయత్నం లో మనం ఉండచ్చు."
    ఏం చెప్పడానికీ పాలుపోలేదు ఇందిరకు. మాల కడుతున్న వేళ్ళు వణికాయి.
    "మీ ఇష్టం , నాన్నగారూ . మీకేది మంచిదని తోస్తే అది చెయ్యండి." నిర్లిప్తంగా అంది.
    "పిచ్చి తల్లీ! నీ భయాలూ, అనుమానాలూ నాకు తెలియవను కున్నావా?' అనునయంగా , తన కూతురిని పూర్తిగా అర్ధం చేసుకో గలిగా నన్న తృప్తితో నవ్వుతూ అన్నాడాయన.
    ఒడిలో పూలన్నీ గిన్నె లో పోసి, సగం కట్టిన మాల అందులో పడేసి లేచింది ఇందిర.
    "పూర్తిగా కట్టవే అమ్మాయ్ , జడలో పెట్టుకుందువు గానీ."
    "కట్టాలని లేదు." క్లుప్తంగా జవాబు చెప్పి చరచరా తన గదిలోకి పోయి మంచం మీద పడింది. తల గిర్రున తిరుగుతుంది. కళ్ళకు చూసే శక్తీ, మెదడు కు ఆలోచించగలిగే స్పూర్తీ లోపించాయి రెండు నిమిషాల సేపు. ఎక్కడో తన్నులు తిని వచ్చినట్లుగా బడలికగా, బాధగా ఉంది ఆమె శరీరానికీ, మనసు కీ కూడా. అలాగే కళ్ళు మూసుకుని పడి ఉంది ఇందిర. ఆ రాత్రి సరిగ్గా భోజనం చెయ్యని కూతుర్ని మందలించబోతే కళ్ళతోనే సీతమ్మ గారిని వారించారు కృష్ణ మూర్తి గారు.  
    నిద్ర వస్తుందంటూ పక్క మీదికి చేరిందే కానీ ఇందిరకు నిద్రంటే ఎలా ఉంటుందో ఆ క్షణం లో తెలియదు. హృదయ భారం తీరేదాకా గట్టిగా ఏడవాలని ఉన్నా కంటి వెంట ఒక్క చుక్క కూడా కన్నీరు రాలేదు. ఆ శూన్య రాత్రిని తన మనసులోకి తరిచి చూసుకుంటూ గడిపింది.
    మనసులో మాధవరావు తిష్ట వేసుకుని కూర్చున్నాడు. అతడు కావాలని పదేపదే ఘోషిస్తున్న హృదయాని సమాధాన పరిచి చూసింది ఇందిర. మరి అందుబాటు లో లేని చంద్రుణ్ణి పొందాలంటే ఎలా? అవకాశం కలిగినప్పుడు చేజేతులా అభిమానానికి పోయి చెడగొట్టుకుంది. అతన్ని చేసుకుని , జీవితాంతం హీనమయిన పని చేశానన్న భావం వెంటాడు తుంటే భరించ గలిగే శక్తి తనకు లేదని అనుకుందామె. అందులోనూ ఇప్పుడు ఇంకొకరు వాంచిస్తున్న మనిషిని తను కోరడం మంచిది కాదు. ఇటు అక్కని అవమానించిన మనిషిని, అటు మంజుల కోరుతున్న అదే వ్యక్తీ ని తను చేసుకుని ఏం సుఖ పడగలదు? తెలివి తక్కువగా ఉద్రేకపుటూబిలో పడి సామరస్యం కుదరని సంబంధం చేసుకోవడం కన్న ఆజన్మాంతం అవివాహిత గా ఉండటం మంచిదని పించిందామెకు. మాధవరావు కన్నె పిల్ల కలగా ఉండిపోవడం మంచిది అందరికీ. ఔను, అతనితోటి తన పరిచయం ఒక స్వప్నం. స్వప్నాలను వాస్తవం లోకి అనువదించ ప్రయత్నించరాదు. కలలను ప్రేమించడం కూడా ఆరోగ్య ప్రదం కాదు.
    తెల్లారేదాకా ఆలోచించాక జోగీకి రాయవలసిన ఉత్తరం త్వరగా రాసి పడేయ్యాలని నిర్ణయించుకుని నిద్ర కుపక్రమించింది.
    మండే కళ్ళనూ, అంతకంటే ఎక్కువగా చిరచిర లాడుతున్న ఎదనూ కూడదీసుకుని పెందరాళే ఉత్తరం రాయడానికి కూర్చుంది ఇందిర.
    ఇందిర ఉత్తరాన్ని పూర్తిగా రెండు సార్లు చదివిన జోగీందర్, ఇందిర అనుకున్నట్టుగా వెంటనే జవాబు రాయడానికీ కూర్చోలేదు. అతనికి కొంత  కాలంగా ఉన్న అనుమానాలను ఇందిర ఉత్తరం దృడ పరిచింది. అయితే అస్తవ్యస్తంగా , నిరాశామయంగా, వ్యధా పూరితంగా ఉన్న ఆ లేఖ అతనిలో సంచలనాన్ని కలిగించింది కూడా. అతనికి ఇందిర అంటే ఒక పక్క జాలీ, ఇంకొక పక్క అభిమానమూ ముంచుకు వచ్చాయి. "పిచ్చి ఇందిరా , నీ చేతులతో నువ్వు తెచ్చుకున్నదే ఇందంతా." అన్నాడతను మనసులోని స్నేహితురాల్ని ఉద్దేశించి. ఇందిర అడగడాని కయితే అతన్ని సలహా అడిగిందే కానీ, అతనికివ్వవలసిన సలహా ఏం లేదని ఇద్దరికీ తెలుసు. ఇందిర పూర్తిగా తన మనసు విప్పి చెప్పలేదు. తన సమస్య ఏమిటో అతనికి తెలియ జెయ్యలేదు. ఆమె ఉన్న పరిస్థితి కి ఇందిరే కారకురాలని అతనికి తెలుసు. తాను నిందించి, చులకన చేసిన మనిషినే తనకంటే అధికుడుగా , వంద నీయుడుగా గ్రహించి పరిణయమాడాలంటే ఇందిర కు కష్టమవుతుంది. తొందరపడి ఇతరులను దూషించడం, ద్వేషించడం తప్పు అన్న పాఠం అనుభవ పూర్వకంగా నేర్చు కుంటుంది పిచ్చిపిల్ల అనుకున్నాడతను. కానీ ఈ అనుభవం లో నించి పైకి వచ్చే ఇందిర ఇంకా బలమైన , దూరాలోచన గల యువతి గా పరిణతి చెందుతుందని అతనికి గట్టి నమ్మకం ఉంది. అందుకే వెంటనే జవాబు రాయకుండా ఊరుకున్నాడు జోగీందర్.
    ఆ సాయంత్రం లగూనా లో స్నేహితుడితో కాఫీ తీసుకుని పైకి వచ్చి పేవ్ మెంట్ మీద కబురు చెబుతున్న జోగీందర్ తమ ఎదురుగా ఆగిన నీలం కారులో నించి దిగిన వ్యక్తిని ఎక్కడో చూశాననుకున్నాడు. మాధవరావు మాత్రం జోగీ ని చూసిన   వెంటనే గుర్తు పట్టాడు . చిరునవ్వుతో చేయి జాపి జోగీతో చెయ్యి కలిపాడు. "ణా పేరు మాధవరావు . ఇందిర స్నేహితుణ్ణి" అన్నాడు ఇంగ్లీషు లో.
    "నా క్వాలిఫికేషన్ అదే. ఇందిర స్నేహితుణ్ణి. పేరు జోగీందర్. " తనతో అతని కేం అవసరం వచ్చిందో అని మనసులో అనుకుంటూ బదులు పలికాడు జోగీ. తనతో ఉన్న బెంగాలీ మిత్రుణ్ణి అతనికి పరిచయం చేశాడు.
    "వీరు నా కొలీగ్ శిశిర్ మిత్ర."
    "హౌడూ యూ డూ?"
    "హౌడూ యూ డూ?"
    రెండు  నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడిన తరవాత "ఫిర్ మిలేంగే జోగీందర్" అని సెలవు తీసుకుని శిశిర్ మిత్ర వెళ్ళిపోయాడు.
    ఆ శీతాకాలపు సాయంత్రం, మసక వెలుతురూ లో ఆ ఇద్దరూ యువకులూ కూడా మస్తిష్కకం లో ఎన్నో  ఆలోచనలు మసలుతుంటే మాటలు రాక నిశ్శబ్దంగా నుంచుండిపోయారు చాలా సేపటి వరకూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS