మొత్తం మీద మావారి గాడి పొయ్యి పర్యవేక్షణ మా దాంపత్య జీవితాని కోక సద్భావనే తెచ్చి పెట్టింది.
వంటలయాయి. సరిగ్గాపన్నెండు గంటలకు విస్తళ్ళు వేశారు. అందరూ కూర్చున్నారు. వడ్డన చేసేందుకు అయిదారుగురు స్టాఫ్ మెంబర్లు తయారయ్యారు వారిలో మా శ్రీవారూ ఉన్నారు.
వడ్డన జరుగుతోంది. కూరల సెట్టు తీసుకుని వారు గబగబా విస్తళ్ళ ల్లో కూరలు వడ్డిస్తుంటే ఈ మనిషి లో ఇన్ని రకాల అనుభవాలూ యెట్లా దాగి ఉన్నాయా అని ఆశ్చర్య పోయాను.
నా విస్తట్లో నిమ్మాకాయ కారం వేస్తూ "సుభా, నీ కోసమే తయారు చేయించాను. ఈ నిమ్మకాయ కారం లో షడ్రుచు లూ ఉన్నాయి. పారెయ్యక చక్కగా నంజుకో" అన్నాడు.
"నయమే ఆపేక్ష అనేది అట్లా ఉండాలి. భార్య క్కావలసిన పదార్ధాలు ఇంత హడావుడి సమయం లోనూ వారు తయారు చేయించారంటే మీ అనురాగం ఎట్లా ఉంటుందో అర్ధమైంది. సుభాషిణి గారూ" అన్నాది రామారావు భార్య. అందరూ నా వైపు చూశారు. "మీకు తెల్సింది అంత వరకే . నాకోసం వారు చేయించింది నిమ్మకాయ కారం. దీంతో మా దాంపత్యం ఎంతటితో తేల్చి చెప్పారు మిసెస్ రామారావు. ఇందులో నిమ్మరసం , ఉప్పూ నా తత్త్వం లాంటిది, మెత్తని జల్లెడ తో జల్లించిన ఊరగాయ కారం లాంటిది మా శ్రీవారి మనస్సు అన్నాను నేను.
భోజనాలు సగం లో ఉండగా మా అన్నయ్య వాణీ నాదం వచ్చాడు. వాడి అవతారమూ వాణ్ణీ చూస్తుంటే నాకు చాలా చిన్నతనమనిపించింది. వాణ్ణి కూడా భోజనానికి కూర్చోమన్నారు మా శ్రీవారు. వాడూ నన్ను పలకరించి ఒక చివర్న పంక్తి లో కూర్చున్నాడు. అందరూ అన్నయ్య ను చూశారు. మా ఆఫీసులో కొంతమంది కి వాడు తెలుసు. అతనెవరండీ అని ఆడవాళ్ళు నన్నడిగారు.
"మా అన్నయ్య" తల వంచుకునే చెప్పాను. అన్నం తినాలని పించలేదు. అన్నయ్య మీద కోపం కాదు, వాడి బుద్దులూ, గుణాల మీద నాకు అసహ్యం.
"మీ అన్నగారేం చేస్తున్నారు?' మరోకావిడ అడిగింది.
ఆ క్షణాన ఎంత ఇబ్బంది పడ్డానో చెప్పలేను. కడుపున దేవినట్టనిపించింది.
"కొన్ని కుటుంబాలకు ఒక శాపం ఉంటుందండీ బిందెడు అమృతం లో ఒక్క విషపు చుక్క లాంటి వారూ ఉంటారు. అతనొక గెంబర్. అందుకు కావాల్సిన అన్ని లక్షణాలూ ఉన్నాయి నెమ్మదిగా ఆవిడతో చెప్పేడు మా కో టైపిస్టు. ఆడవాళ్ళంతా ఒకరి ముఖాలొకరు చూచుకొని ఏవగింపు గా అన్నయ్య వైపు చూశారు. నన్నూ మా దాంపత్యాన్ని కొనియాడిన వారి మనస్సులో అన్నయ్య రాక శాశ్వతముద్ర వేసింది. నాకు అన్నం సయించలేదు. వెళ్ళిపోవాలనిపించింది. కాని సభ్యతగా తోచలేదు.
భోజనాలయాక అన్నయ్యా, వారూ ఒక మామిడి చెట్టు కింద కూర్చుని అయిదు నిమిషాలు మాట్లాడారు. ఏం మాట్లాడారో ఎవరికి తెలీదు. వెళుతూ వస్తాను సుభా" అన్నాడు, నా గొంతుకు ఉరితాడు వేసి లాగినంతగా బాధపడ్డాను. అ తరువాత వెళ్ళే వరకు ఆడవాళ్ళేవారూ నాతొ మాట్లాడలేదు. వాళ్ళ మనస్సు ల్లో నేనొక రౌడీ కి చెల్లెలి గా చిత్రీకరించబడ్డాను. అంతవరకూ నామీద ఉన్న గౌరవ మంతా గాలికి ఎగిరిపోయి పెలపిండిలా అయింది.
ఇంటికి వెళ్ళాక వారని అడిగాను. అంత అర్జంటు గా అన్నయ్య ఎందుకోచ్చాడో " మీ అన్నయ్యే గా, అడక్క పోయావా" వ్యగ్యంగా అన్నారు.
"అవును మా అన్నయ్యే బంధుత్వం నాది. ఆ బంధుత్వపు బాధ కూడా నేనే అనుభవించాను గుసగుసలు గుడు పుటాణీ మాత్రం మీది" ఉక్రోషంతో అన్నాను. వారి మనస్సు కేదో నూరి పోశాడని నాకు తెల్సు. కాని అదేదో తెల్సుకోవాలనే ఆశ కాదు. ఆందోళన. మా జీవితాల మధ్య ఏ విష నాగునో వదిలి పెడతాడని నా భయం. "గుసగుస. గూడు పుటాణీ అని నువ్వే చెప్పావుగా. కాదని చెప్పినా నువ్వు నమ్మవు. అయినా గర్భవతివి ఇంత ఆందోళన పనికి రాదు కావలసినంత విశ్రాంతి తీసుకో సుభా" అన్నారు.
ఆ మాటల్లోని భావాలు పూర్తిగా అర్ధమయాయి. యింక తర్కించదల్చుకోలేదు.
మర్నాడు ఆఫీసుకు వెళ్ళి సాయంత్రం నన్నగారింటికి వెళ్ళొస్తానని చెప్పాను.
"మళ్ళీ రాజమండ్రి స్టేషన్ కు వెళతావేమిటి" వెటకారంగా అన్నారు.
"లేదు, మనిషికి కావలసింది జ్ఞానం. అది లేనప్పుడు కొబ్బరి చెట్టుకు మడింట కట్టినట్లే ఉంటుంది." అన్నాను. వారు నవ్వుకున్నారు.
ఆ సాయంత్రం ఆఫీసు నుంచీ నాన్నగారింటికి వెళ్లాను. అమ్మా, నాన్నతో అన్ని విషయాలూ చెప్పాను. నిశ్చేష్టులయారు.
8
నాన్న కర్మ కాండలకు కూడా ఇంట్లో డబ్బు లేదు. ఉన్న ఒక్క కొడుకూ జైల్లో ఉన్నాడు. ఎంతో గౌరవ ప్రదంగా జీవించిన నాన్న బ్రతుకు అట్లా తెల్లావారింది.
యిందు వందల రూపాయల ఖర్చుతో నాన్న కర్మ కాండలు పూర్తీ చేయించాము. ఈ ఖర్చు మేమే భరించాము . ఇందుకు వారికి కాస్త కష్టంగా ఉన్నా, ఈ కష్ట దశలో బైట పడలేదు.
నాన్న చావు, అన్నయ్య జైలు కు వెళ్ళటం తో అమ్మ కూడా మానసికంగా కాస్త దెబ్బతిన్నది. ఉన్న ఆ కాస్త పెంకిటిల్లూ అక్కయ్య పెళ్ళికి ఆమ్మేశాక అద్దె కుంటున్న ఈ పూరి ల్లు కూడా ఖాళీ చెయ్యవలసి వచ్చింది. ఈ పరిస్థితిలో అక్కయ్య తో వేరే ఎవరూ తోడూ లేకుండా మరెక్కడా ఉండలేనని ఏడుస్తూ చేతులు పట్టుకుని అమ్మ వాపోయింది. నా దగ్గిరే మా ఇంట్లోనే ఉంటానని పట్టుబట్టింది. అక్కయ్య కాళ్ళను చుట్టేసి ఏడవ సాగింది. జరిగిన ఈ అఘాతానికి అమ్మ తట్టుకో లేకపోయింది.
చివరికి మా అత్తయ్య ప్రోద్భలం తోనే అమ్మ, అక్కయ్యా మా ఇంటికి చేరారు. భావబంధాలను తెంచుకుని ముముక్షువులా జీవించాలనే సంకల్పం మనస్సు లో ఉన్నా అక్కయ్య సమస్య అమ్మ కోక గుది బండలా తయారయింది. "నీ నుంచి నా జీవితం తెల్ల వార్చు కుందామను కున్నా వీలుగాకుండా ఉండే సునందా" అని అక్కయ్య మీద విసుక్కుంది అమ్మ.
వీళ్ళిద్దరూ ఇక్కడికి రావటం వారికి మనస్సులో ఏ మాత్రం ఇష్టం లేకపోయినా పరిస్థితిని అర్ధం చేసుకుని ముభావంగా ఊరుకున్నారు.
మా పెద్దవాడికి నాలుగో ఏడు వచ్చింది. రెండో వాడికి ఏడాది వెళ్ళింది. వాళ్ళిద్దర్నీ దగ్గరకు పిల్చి వాళ్లకు బొమ్మలు వేసి పెడుతూ, నీళ్ళు పోసి, బట్టలు వేసి, పౌడరు రాసి బొట్టు పెట్టి యేవో పిచ్చి కబుర్లు చెపుతూ, గోరు ముద్దలు చేసి అన్నం పెడుతూ వల్లానూ ఆడిస్తూ కాలం గడిపేది అక్కయ్య. తమ్ముడు చిన్నప్పుడే మారు పడిపోవటం తో అక్కయ్య కు పసిపిల్లలన్నా, చిన్న పిల్లలన్నా ఎంతో అపేక్ష. ఎదిగీ ఎదగని దాని మనస్సూ, భావాలు కూడా ఆ చిన్న పిల్లలకు తగినట్లే ఉండేవి.
ఒకరోజున పిల్లలిద్దరికీ నీళ్ళు పోస్తూ "సుభా అంటే తప్పేమో కానీ నాన్న పోవటం కూడా ఒకందుకు మంచిదేనే. లేకపోతె నీ పిల్లలిద్దరూ నాకు అలవాటు ఎందుకవుతారు చెప్పు" అన్నది.
నాకూ కళ్ళ నీళ్ళపర్యంతమైంది.
"నోరు ముయ్యి. అమ్మ వింటే ఎంత బాధ పడుతుందో తెలుసా. ఆ మాత్రం గ్రహింపు ఉంటె నీ కాపురమే బాగుపడేది" అన్నాను.
అమ్మ మాత్రం తనకు చేతనయిన పనిచేస్తూ వంట పనులో అత్తయ్య కు సాయం గా ఉండేది. వీళ్ళిద్దరి రాకతో మా ఇంటి వాతావరణం కూడా మారిపోయింది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా నాకేమీ పని కనిపించేది కాదు.
పిల్లలిద్దరి సంరక్షణా అక్కయ్య చెయ్యటంతో ఇంటి దగ్గర వున్న ఆ కాసేపూ కూడా ఏం తోచక వారు కూడా ఇంట్లో వుంటే గదిలో కూర్చుని కబుర్లు చెప్పేదాన్ని.
"మీ అమ్మ, అక్కయ్య వచ్చాక నువ్వు కొత్త పెళ్లి కూతుర్లా పూచిన తంగేడు లా ఉంటున్నావే గాని ఇద్దరు పిల్లల తల్లిలా లేవు. ఎతోచ్చినా పని తగ్గక పోయినా పెరిగింది" అన్నారు.
"కొత్త పెళ్లి కూతురయినా , పూచిన తంగేడయినా మీరు సంతోషంగా ఉంటేనే నా పెళ్లి కూతురుతనం రాణించేది. కస్సు బుస్సుమంటుంటే నా ముఖమూ తుమ్మల్లో పోద్దూకినట్టే ఉంటుంది" అన్నాను.
"సంసార సాగరాన్ని ఈదటం లో ఆడది చుక్కాని అయితే కావచ్చు కాని మగవాడు సరుకులతో నిండిన పడవ లాంటి వాడు. బరువంతా పడవదే కాని చిక్కానిది ఎంత మాత్రం కాదు" అన్నారు.
నెమ్మదిగా నాతొ తర్కించటానికి పూనుకు నట్లే తోచింది.
"ఈ రోజుల్లో భర్త తెచ్చిన చింత పండుతో చెంబులు తోముతూ కూర్చునే అడదేవరూ లేదు ఆ రోజుల్లో ఉద్యోగం పురుష లక్షణ మైతే కావచ్చు. కాని ఈ రోజుల్లో అది మానవ లక్షణం."
"ఎట్లాగయితేనేం నువ్వూ ఉద్యోగం వెలగ బెడుతున్నావులే. అదీ ఘనకార్యమే. చెట్టు లేని ఊళ్ళో ఆముదపు మొక్క మహా వృక్షం లా మీ కుటుంబం లో నువ్వొక ఉద్యోగస్తురాలివి. హయ్యర్ గ్రేడ్ టైపిస్టు కూడా పెద్ద ఉద్యోగస్తురాలై పోయింది."
ఈసడింపు గా అన్నారు. ఈ మాటలు వారెందుకంటున్నారో నాకు తెలుసు. నేను ఉద్యోగం చెయ్యకుండా వారి సంపాదన మీదనే ఆధారపడి ఉండే ఆడదాన్నయితే రోజుకు వంద గుంజీలు తీయించి రోజు బూట్లు తుడిచి పాలిష్ కొట్టమనేవారు.
"అన్నీ తెలిసి ఈ ఆముదపు చెట్టు నెందుకు పెళ్ళాడారు మహాశయః నేనూ అదే అనుకుంటున్నాను. నన్ను మీరు పెళ్ళాడకుండా ఉంటె ఏ ఐ.ఏ.యస్ అఫీసరో వచ్చేవాడేమో. ఎవరికి తెలుసు. నన్ను పెళ్ళి చేసుకుని మీ నిజ స్వరూపాన్ని దశావరారాలుగా బయట పెడుతూ నా గొంతు కోశారని నేనూ చెప్పుకుని ఏడవొచ్చుగా, బాబుగారూ! మీ దేప్పుళ్ళు కాస్త అనండి. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా మీ మనస్తత్వం నాకు తెలీదా" అన్నాను. నవ్వి ఊరుకున్నారు. ఆ నవ్వు వెనక ఎంత కార్పణ్యం ఉందొ నాకు తెల్సు.
ఒక రోజున నేను ఆఫీసు నుంచి వచ్చి స్నానం చేస్తున్నాను. జమాబండి కావటం తో వారికి కాస్త ఆఫీసు పని జాస్తి అయింది. ఆ రోజు ఆదివారమయినా ఆఫీసు కు వెళ్ళి సాయంత్రం నాలుగ్గంటలకు వచ్చాను, ఆదివారం కావటంతో ఆఫీసు క్యాంటీన్ లేదు. కాఫీకి వెళ్ళాలంటే కాస్త దూరం వెళ్ళాలి. ఏమనుకున్నారో ఏమో అర్జంటు గా చూడవలసిన కాగితాలన్నీ ఒక పేడ్ లో కట్టుకుని ఇంటి దగ్గర పని చూసుకుందామని వచ్చారు. ఆ సమయంలో మా పెద్దవాడు నడి రోడ్డు మీద కూర్చుని నెత్తి నిండా మట్టి పోసు కుంటున్నాడు. వాడు వీధిలోకి వెళ్ళిన సంగతి ఎవ్వరూ చూడలేదు. వళ్ళంతా మట్టి చేసుకున్నవాడు ఇంటికి వస్తున్న వార్ని చూడం గానే , "నాన్నా ఏం తెచ్చావ్ తింటానికీ" అంటూ ఆ మట్టి చేతుల్తో వారి తెల్ల పాంటూ, చొక్కా నిండా మట్టి పులిమి పాడు చేశాడు ఆ స్థితిలో వారి కోపం తారా స్థాయికి వెళ్ళి ఒక చేత్తో ఫైలు పుచ్చుకుని మరో చేత్తో వాడి రెక్క పుచ్చుకుని ఈడ్చుకుంటూ ఇంట్లోకి వచ్చారు. నేనూ స్నానం చేసి జడల్లుకుంటున్నాను. ఆ స్థితిలో వారని చూసేసరికి నేనూ నిర్విన్నురాలినైనాను.

"ఈ కొంప సత్రమై పోయింది. పొట్టలు పగిలేట్లు తిని దొర్లే వాళ్ళే తప్ప కుర్ర వెధవ ఎక్కడికి వెళ్ళాడో చూసే దిక్కయిన లేదు. ఈ కొంప మొగుడు చచ్చిన వాళ్ళకీ, మొగుడు వదిలి పెట్టిన వాళ్ళకి నిలయంగా తయారయింది గాని పసి వాళ్ళుండే ఇల్లులా లేదు" అంటూ దండకం మొదలు పెట్టారు. అక్కయ్య గిజగిజ లాదిపోయింది. పెద్ద వాడికి నీళ్ళు పోసి బట్టలు వేసింది. రెండో వాడికి నీళ్ళు పోద్దామని పెరట్లో కి వచ్చింది అక్కయ్య. ఇంతలోనే అందరికీ కళ్ళూ కప్పి వీధిలోకి వెళ్ళాడు వాడు.
"ఇక పోనీండి వాడేప్పుడు వీధిలోకి వెళ్ళాడో ఎవరం చూళ్ళేదు. ఇంత రాద్దాంతం ఎందుకూ వాడికి ఇప్పుడే తలంటి పోస్తాను. మీరూ ఆ బట్టలు విప్పెసేయండి." అన్నాను శాంతింప చేద్దామనే ఉద్దేశ్యంతో.
"ఎదా వెకిలి ముండ ఎక్కడ చచ్చింది. పిల్లల్ని మాలిమి చేసుకున్నదని మురిసిపోయావే వొళ్ళు కొవ్వెక్కి బలిసి పోయింది. లేకపోతె వాడు వీధిలోకి వెళుతుంటే ఎందుకు చూళ్ళేదు." విసురుగా అని అక్కయ్య వైపు చూస్తూ వెళ్ళారు. నాలో సహనం పూర్తిగా నశించింది. అంతంత మాటలు అక్కయ్య ను అంటే చూస్తూ ఊరు కోలేక పోయాను.
"ఎందుకలా ఆవేశపడి మాటలు మీరుతారు. మీ ఇంటి కొచ్చిందని, మీరు పెట్టె తిండి తింటున్నదని ముండా అంటే పడేవాళ్ళూ లేరు. బాగుండదు" గదిలోకి వెళ్లి అన్నాను . అక్కయ్య ఏడుస్తూ కూర్చుంది. అమ్మకు నోట మాట రాలేదు.
"నోర్మూయ్ ఏ పెంకి సమాధానాలు నా దగ్గర సాగవ్ తప్పు ముందరుంచుకుని సిగ్గు లేకుండా సమర్దిస్తావెం" నా వీపు మీద రెండు దెబ్బలు పడ్డయ్యి. అత్తయ్య వచ్చి నన్ను ఇవతలకి లాగారు. వారి కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నయ్యి.
"పశువా ఆడదాని మీద చెయ్యి చేసుకుంటావా, ఇంక నీ బోకరింపు చాలించు నే బ్రతికుండగా ఇక దాని మీద చెయ్యి చేసుకున్నావో మర్యాదగా ఉండదు" అన్నారు అత్తయ్య.
