"అర్ధరాత్రి యిల్లు చేరుతావు. నాన్నగారికి రోజు వంట్లో బావుండలేదు. డాక్టరు ను పిలవాలంటే ఎవరు లేరు" తల్లి అన్నది.
"ఏమైందమ్మా? మీరు ఫంక్షన్ కు రాకపోతే పని ఉండి ఆగిపోయారను కున్నాను. పిలువమంటావా?" బూట్లు విప్పుకోవడానికి వంగిన వాడు అలాగే లేచాడు.
"ఇప్పుడొద్దులే . చలమయ్య గారు ఏ వో మాత్రలిచ్చారు.' ప్రక్కింటి ఆయనకు మనసు లోనే ధన్యవాదాలు అర్పించాడు.
"నాల్గు గంటలకు లేచి స్టేషన్ కు వెళ్ళాలిరా. హైదరాబాద్ నుండి వచ్చే మద్రాసు ఎక్స్ ప్రెస్ లో మామయ్య వస్తున్నారుట.
"మామయ్యా కిల్లు తెలియదా ఏం?"
"తెలుసు లేరా? నిన్న సాయంత్రము కలప అమ్మితే అంతా క్యాష్ ఇచ్చారుట. తప్పక ఎవరయినా రండి అని రాశాడు. పెద్ద మొత్తములో డబ్బు తెచ్చేటప్పుడు ఆమాత్రము భయముండదా ఏం?
"సింగినాదం! ఇతని దగ్గర డబ్బుందని అందరికీ కనపడింది. విసుక్కుని, తండ్రి గది లోకి వెళ్ళాడు. చమట పట్టిందేమో హాయిగా నిదురపోతున్నాడతను. వెనుతిరిగి వచ్చాడు. రాత్రంతా కలత నిడురతోనే గడిపాడు. మూడున్నరకే లేచి స్టేషన్ కు వెళ్ళాడు. కాఫీ, టీ అమ్మేవారి కేకలు విసుగు గలిగిస్తున్నాయి. దూరాన వచ్చే వ్యక్తులను చూచి త్వరగా అటు వెళ్ళాడు.
"నమస్కారమండి." అన్నాడు .సీతారామయ్య ఆనంద్ ను గుర్తించి నవ్వాడు. సురేఖ మాత్రమూ తల మరో దిక్కుకు తిప్పుకుంది.
'నమస్కారము నాయనా ఇంత పెందలాడే వచ్చావెం? తను వచ్చిన పని చెప్పాడు.
"మీరు మద్రాసు వెళ్లి పోతున్నారా?"
"అవును నాయనా , పల్లెటూరి లో పొట్ట గడవక బెజవాడ కొచ్చాను. నాల్గు ట్యూషన్లు దొరుకుతాయోమోనని. ఇక్కడ అంత అభిరుచి లేదు. ఉన్నవారు ఐదు, పది ఇస్తామంటారు. ఇరువురి పొట్ట గడవవద్డా?
"ఏమిటి నాన్నా సోది! అందరితో చెప్పాలా?"
"అదేమిటి పాపా! అతను శాస్త్రి వంటి వాడే! మన శ్రేయోభిలాషి."
మీ అభిమానానికి కృతజ్ఞుడిని. మద్రాసు లో తెలిసిన వారున్నారా?"
"లేరు నాయనా, అక్కడ వారికి సంగీతము నందు అభిరుచి అని విన్నాను. నాల్గు ట్యూషన్లు దొరకవా! ప్రయత్నిస్తాను." అందరూ వెళ్లి ఓ బెంచీ పై కూర్చున్నారు. ఆనంద్ కాఫీ వాడిని పిచి మూడు కప్పు లివ్వమన్నాడు.
"నాకక్కరలేదు ఇంత ప్రొద్దుటే కాఫీ తాగను.' విసురుగా జవాబు ఇచ్చింది.
"తల్లి లేదని అతిగా గారంబంగా పెంచాను నాయనా. మా పాపకి బాగా పెంకితనము అలవడింది. అన్నారాయన కాఫీ కప్పందుకుంటూ. వారి సంభాషణ రుచించనట్టు దూరము వెళ్ళి నిలబడి సినిమా పోస్టరు కేసి చూడసాగింది.
'మద్రాసు వంటి మహా పట్టణము లో తెలియని వారు లేనిచోట యెలా కాలక్షేపము చేస్తారండీ!"
"చెయ్యాలి నాయనా. నావక్కడికైతే ఏ బాధ లేదు. ఆలయ ప్రాంగణములో కూర్చుని పాడుకుని దొరికిన ప్రసాదము తో పొట్ట పోషించుకుంటాను. పాప ఉంది. వయసు మళ్ళినాక పుట్టిన పిల్ల. దానినో ఇంటిదాన్ని చేయ్యోద్దా? జమీందారు గారి పుణ్యమా అంటూ అయన స్థాపించిన బడిలో ఇన్నాళ్ళు సంగీతము మాస్టారుగా ఉన్నాను. కొడుకు చేతిలోకి అధికారము వచ్చింది. క్రొత్తవారిని పెట్టుకున్నారు." అతను నిట్టూర్చాడు. అతనిని చూస్తె జాలి వేసింది ఆనంద్ కు.
"ఏదైనా అవసరమువస్తే నాకు రాయండి. మాష్టారు.' తన అడ్రసు రాసియిచ్చాడు.
"బాత్ రూమ్ వైపు వెళ్ళి వస్తాను నాయనా. బీడుగా ఉంటుందట." అని అతను వెళ్ళిపోయాడు. ఆనంద్ నెమ్మదిగా సురేఖ వైపు వెళ్ళాడు.
'చూడండి." జడుస్తూనే పిలిచాడు.
"ఏమండీ?" వెక్కిరింపుగా అడిగింది సురేఖ.
"నిన్న నేను మాట వరుసకో పాతిక రూపాయలిచ్చామంటే మీకు బాగా కోపం వచ్చినట్టుంది." నవ్వడానికి ప్రయత్నించాడు.
"ఇచ్చారు. అంటారు. కోపము దేనికి?"
"కోపము కాకపొతే కాఫీ ఎందుకు తీసుకోలేదు? అవమానించాలని కాదు. కాలేజీ డబ్బు మిగిలిన విద్యార్ధులు గొడవ చేస్తారని అన్నాను క్షమించండి."
"నాన్నగారికేం తెలియదు-' ఆమె కండ్ల లో నీళ్ళు మెరిశాయి.
"యెందుకెందుకు? మీకు బాధ కలిగించానా?"
"ఏం లేదు. " కళ్ళు వత్తుకుని వెళ్ళి సిమెంటు బెంచి మీద కూర్చున్నది. అతనేం మాట్లాడాలో తెలియక. షర్టు గుండీలు సర్దుకుంటూ కూర్చున్నాడు. చిన్న ట్రంకు పెట్టె తప్ప చేతిలో మరేమీ లేదు. రైలు వస్తున్నట్టు ప్రకటించారు. సీతారామయ్య గారు ఆడారా బాదరాగా వచ్చాడు. బండి ఆగక మునుపే త్రోసుకుంటూ జనం ఎగబడ్డారు. దిగేవారు విసుక్కుంటున్నారు. వారి నేక్కించాలని చూచాడు. ఇంతలో సెకండ్ క్లాసు కంపార్టు మెంటు నుండి చేయ్యూపాడు అతని మేనమామ. వారిని వదిలి మామ దగ్గర కొచ్చాడు. అయన సామాన్లు దింపించి , అయన చెప్పే లిస్టు ప్రకారం సామాన్లు చూచుకుంటుండగానే బండి కదిలింది. తండ్రి కూతురి కోసము చూచాడు ఎక్కడా కనిపించలేదు. యెక్కడో ఎక్కారు లెమ్మని తృప్తిగా నిట్టూర్చి, సామాన్లు పట్టించుకుని బయటకు వచ్చాడు. మేనమామ అడిగే ప్రశ్నలకు అన్య మనస్కంగా జవాబులిస్తున్నాడు. అతని మనసులో సురేఖ ఎందు కేడ్చిందో తెలియదని ఒకటే బాధ ఉంది.
మేనమామ ఉన్న వారం రోజులు పుస్తకము పట్టుకోవల్సిన పని లేకుండా కబుర్ల తో , సినిమా లతో కాలక్షేపము జరిగింది. అతన్ని సాగనంపి తరువాత పుస్తకము తీశాడు. బోలెడన్ని విషయాలున్నాయి. ఏం చెయ్యాలి? హౌసు ఎక్సామ్స్ లే. ఇంగ్లీషు, తెలుగు చదివి అవే రాసి, గ్రూపు చూడవచ్చు ననుకున్నాడు. యెంత ప్రయత్నించినా నాటకాలు అర్ధం కావు కధాంశము అర్ధం అవుతుంది. రాద్దామని కూర్చుంటే ఒక్క ఇంగ్లీషు వాక్యము కుదిరి చావదు. విసుక్కుని లేచి బయటకు వచ్చి ఓ సిగరెట్టు వెలిగించేవాడు. పరీక్షలు వచ్చాయి కాని, పాఠాలు మాత్రమూ బుర్రలోకి ఎక్కనన్నాయి. విసిగి , డాక్టరు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశాడు. రంగారావు చాలా విచారించినా, ఏకైక పుత్రుడాయే, కేకలు వేయలేక పోయాడు.
"వచ్చేయేడు ఈ పాడు పనులన్నీ వదిలి చదవరా తండ్రి ." అన్నది సరస్వతమ్మ. ఆ యేడు సెలవులలో కూర్చుని సంవత్సరం మూల పెట్టినదంతా చదవాలని సంకల్పించాడు. తల్లి తండ్రులు యాత్రలకని బయలుదేరారు. ఒక్క కుమారుడు వాడికై హోటళ్ళు తిరగటము ఇష్టం లేక వెంట ప్రయాణం చేయించింది, సరస్వతమ్మ కళ్ళ ముందే కాలము కరిగిపోయింది.
కాలేజీలు తెరిచారు. ఈసారి బుద్ది మంతుడనిపించుకోవాలని ఎంతో ప్రయత్నమూ చేశాడు. క్రమము తప్పక క్లాసులు కెళ్ళేవాడు. కాని తిరిగి యెన్నికలు ప్రారంభము కాగానే స్నేహితులు ఊర్కో లేదు. మళ్ళీ మొదటి ఆటే ప్రారంభమయింది. రంగారావు ఈసారి మాత్రమూ గట్టిగానే చెప్పాడు. రెండు రోజులు ఆనంద్ బిక్క మొహం వేసుకుని తిరిగితే కరిగిపోయాడు. అడిగినంతా అందించాడు. ఫలితము ఆ యేడు పరీక్ష లకు కూడా చదువలేక పోయాడు. తండ్రి ఏమంటాడో నని పరీక్ష వ్రాశాడు. తన నంబరు పేపర్లో రాదనీ అతనికి తెలుసు. పరీక్ష ఫలితాలు తెలిసిన నాడు గది విడిచి బయటకు రాలేకపోయాడు.
"వాడికి స్నేహితులు మంచివారు దొరకలేదే సరస్వతీ" రంగారావు గారి మాటలు అవి విని నవ్వుకున్నాడు. ప్రతి తల్లిదండ్రులు నేరము ఇతరుల పైకే నెట్టాలని చూస్తారెందుకో!
"అవునండి , హైద్రాబాద్, అన్నయ్య దగ్గరకు పంపించుదామా?"
"మీ అన్నయ్య దగ్గర వాడెం ఉంటాడు. వేంకటరత్నము చెప్పాడు. ఏదో ప్రింటింగ్ కోర్సు లో డిప్లమా అట , అది చదివించుదాము. మద్రాసు పంపాలని ఉంది. అక్కడుంటే మితంగా డబ్బు పంపవచ్చు. యెదురుగా ఉండి అడిగితె లేదనలేము కదా! రంగారావన్నారు. వారము రోజులలో ఆనంద్ మద్రాసు ప్రయాణము నిర్ణయమయింది.
