మరుసటి రోజు సారధి వద్ద నుంచి ప్రకాశానికి ఒక ఉత్తరం వచ్చింది. ఉత్తరం చదవగానే పట్టలేని ఆనందంతో విశ్వనాధయ్య గారి కోసం పరుగెత్తి పోయాడు. రత్నమ్మ ఇంట్లో లేదు. ఊరి మీదికి వెళ్ళింది. విశ్వనాధయ్య గారు, సుందరమ్మ ఇద్దరే యింట్లో ఉన్నారు.
"సారధి వద్ద నుంచి ఉత్తరం వచ్చిందండి" అన్నాడు ఉత్తరాన్ని విశ్వనాధయ్య గారికి ఇస్తూ.
"కళ్ళజోడు లేదు. నువ్వే చదువు" అన్నారు వారు.
సుందరమ్మ కూడా వచ్చి దగ్గరగా కూర్చుంది. ప్రకాశం చదివాడు.
"....క్షేమం . క్షేమాలు తెలిపేది....రెండు రోజుల క్రితంమీ స్నేహితుడు ఉమాపతి కలిశాడు... విమల అతణ్ణి వదిలి వెళ్ళిపోయింది.
.....ఇప్పుడు రాజారావనే పెద్ద (కారు కూడా ఉన్న) లక్షాధికారిని ముగ్గులోకి లాగిందని విచారించగా తెలిసింది.... ఉమాపతి ఇప్పుడు తన పాత ఆదర్శాలకు తిలోదకాలిచ్చి క్రొత్త అవతారం ఎత్తాడు. ప్రపంచంలోని అన్ని అనర్ధలకూ కారణం ఆడదే నంటాడు. మాటకు ముందు షేక్స్ పియరో, షానో, నేనునో స్త్రీని గురించి అన్న మాటలు అప్పజెబుతాడు.... ఇవన్నీ అతని మంచికే నని నా అభిప్రాయం.అతడు బాగుపడే సూచనలున్నాయి...."
విశ్వనాధయ్యగారు , సుందరమ్మ ఎంత ఆనంద పడ్డారో ప్రకాశం అంచనా వేయలేక పోయాడు. ఆరోజు సాయంకాలమే మద్రాసుకు బయలుదేరారు విశ్వనాధయ్య గారు.విశ్వనాధయ్య గారు మద్రాసుకు బయలుదేరిన గంట కల్లా మామ గారింటి నుంచి శారదా వచ్చింది. అప్పటికి రత్నమ్మ యింట్లో లేదు. శారద వచ్చీ రాగానే సుందరమ్మ ను అడిగింది--
.jpg)
"నాకు జవాబైనా రాయలేదే మత్తయ్యా?" అని.
"నువ్వు జాబైనా వ్రాశావు గనకనా!" అంది శారద ముఖాన్ని రెండు చేతుల మధ్యఉంచుకున్న సుందరమ్మ. శారద ఆశ్చర్యపోయింది.
'అదేమీ అత్తయ్యా, అలా గంటావు? అమ్మపెరుతో ఆ రోజే రాశానే?అమ్మ నీకు చెప్పలేదూ?" అంది తల వంచుకుని.
"చెప్పలేదు. ఏమైనా విశేష ముందా?"
"ఉంది" అని సుందరమ్మ చెవిలో చెప్పింది శారద.
సుందరమ్మ ముఖం ఆనందంతో వెలిగి పోయింది. సంతోషంతో ఆమె కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి. శారద ముఖమంతా ముద్దులతో నింపేసింది. శారదను కౌగలించుకొని నలిపెసింది. ఇంతలో రత్నమ్మ వచ్చింది. శారద కనబడేసరికి ఆవిడ ముఖం ముడుచుకొని పోయింది.
"ఏమే,శారదా, ఎప్పుడే వచ్చావూ?" అంది రాగం తీస్తూ.
"ఇప్పుడే " అంది శారద ముక్తసరిగా.
'ఓహో!"
'అది సరే గాని, నీకు నేనురాసిన ఉత్తరం అందిందా?" కస్సుమంది శారద.
"ఏం ఉత్తరమే?"
"ఏం ఉత్తరమా? నేను కృష్ణాపురం నుండి రాసిన ఉత్తరం."
"ఆగద్దేదో నాకు తెలీదు. ఉత్తరమూ లేదు, నా తలకాయా లేదు" అంది రత్నమ్మ ఏమీ ఎరగనట్లు.
చేసిది లేక శారదా, సుందరమ్మా ఊరకున్నారు. ఆరోజు రాత్రి రత్నమ్మ కు నిద్ర రాలేదు. శారద నిశ్చింతగా హాయిగా నిద్ర పోయింది. సుందరమ్మ కు కూడా నిద్ర రాలేదు. ఆవిడ మనస్సు కూడా అశాంతిగా ఉంది.శారద చల్లని వార్త చెవిలో పడింది. ఈ మాట వారు వింటే ఎంత సంతోష పడేవారు! సమయానికి లేకుండా పోయారు. అది సరే హానీ, రత్నమ్మ కీపాడు బుద్ది లెందుకూ? మానావమానాలను కూడా వదిలి ఇలాంటి మాట లెందుకు చెబుతుంది ఆవిడ? అవిడ ఏమన్నా అనకపోయినా శారదెం అనా ఘ్రాత పుష్పం కాదు గదా! తాము ప్రకాశాని కెంత అన్యాయం చేస్తున్నారు? అన్యాయ మేముంది? ప్రకాశం ఉదారమైన హృదయం ఉన్నవాడు. క్షమించడం తెలిసిన వాడు. కాబట్టి తానె శారదను ఒప్పుకొన్నాడు. ప్రకాశం మానవులలో పుట్టిన దేవుడు!
ప్రకాశాన్ని గురించి సుందరమ్మగారిలా ఆలోచిస్తుంటే ప్రకాశం ఆరోజు సారధి వ్రాసిన ఉత్తరం చదువుకుంటున్నాడు.ప్రకాశం ఉత్తరాన్ని పూర్తిగా చదివి వినిపించలేదు. విశ్వనాధయ్య గారికి. సారది గోడవ విశ్వనాధయ్య గారికి అనవసరం.
".....ఉమాపతి సంగతి ఎలా ఉన్నా నన్ను కూడా యీ ప్రేమ సమస్యలు చుట్టుకున్నాయి. నాకు ప్రేమ మీద విశ్వాసం లేదు. మీరు 'ప్రేమ' అంటున్న దాన్ని నేను ఒక 'ఎకనామిక్ అడ్జస్ట్ మెంట్' అంటాను. అంతే కాకుండా యీనాటి సంఘం లో , సాంఘిక పరిస్థితుల్లో ప్రేమించి, విరహగీతాలు పాడుకోవటానికి, లేకుంటే, యుగళగీతాలతో ఏడ్చుకోవటానికి వ్యవధి లేదు. ప్రేమ మానవుల హృదయాల్ని దుర్బలం చేస్తుంది. అలా మానవ హృదయాలు దుర్బలం కాకూడదు. ఎప్పుడూ అగ్ని పర్వతం లా కుతకుత లాడుతుండాలి. అవసరం ఉన్నప్పుడు పిగిలి, పొగలు క్రక్కి , ఈ సంఘ స్వరూపాన్ని నాశనం చేసెయ్యాలి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మా ఆఫీసులో ఉన్న ఒక అడ గుమస్తా నన్ను ప్రేమిస్తున్నానంటూ నా వెంటపడి నా ప్రాణం తీస్తుంది. నిన్న నీ మీద నాకు ప్రేమా లేదు, కాకరకాయా లేదు పొమ్మన్నాను. ఏడుస్తూ వెళ్ళిపోయింది. .....నాదోకే మాట -- ఈ మాటే షేక్ స్పియర్ 'బెనడిక్ చేత అనిపించాడనుకుంటాను. నా ముఖం ఎప్పుడూ ప్రేమ వల్ల పాలిపోదు. కానీ ఆకలితో పాలి పోవచ్చు."
ఉత్తరం పూర్తీ చేసి ప్రక్కనే కూర్చున్న భానుమూర్తి కేసి చూశాడు ప్రకాశం. అతడు కాంపోజిషన్ పుస్తకాలు దిద్దుతున్నాడు. సారధి ఉత్తరాన్ని అతనికి ఇచ్చి చదవ మన్నాడు. భానుమూర్తి ఓపిగ్గా చివరి దాకా చదివి అన్నాడు.
"వీళ్ళ వల్ల సంఘానికి కలిగే అపచారం అంతా ఇంతా కాదు. వీరు చాదస్తులకన్నా ప్రమాదకరమైన వాళ్ళు. ప్రతిదాన్నీ నాశనం చేయటమే వీరికి తెలుసు. నాశనం చేసి నల్ల కాళ్ళేలుతారేమో! చివరికి ' బెనడిక్' కు పట్టిన గతే ఇతడికి పడుతుంది.' ఉత్తరాన్ని ప్రకాశం మీదకు విసిరేశాడు.
* * * *
విశ్వాంతరాళం మానవజీవితం లాంటిది. అందులో అనేక గోళాలు పరిభ్రమిస్తుంటాయి. ప్రతి గోళానికి ఒక ప్రయాణ మార్గం -- కక్ష్య-- ఉంటుంది. వాటికీ పరస్పర ఆకర్షణ కూడా ఉంటుంది. గోళాలు గతి తప్పి ప్రయాణం చేస్తే ఆకర్షణ కు లోనై భూపతన మౌతాయి. గతి తప్పని గోళాలు ఏనాడూ పతనం కావు. ఒక నిర్ణీతమైన పరిధి లో వాటికీ చాలా స్వేచ్చ ఉంది. కాని పతనమైన గోళాలు మాత్రం గతి తప్పినవే. లేదా కొన్ని గతి తప్పిన గోళాలు ఒక చోట కలుసుకున్నా ఈనాడు కాకున్నా ఏదో ఓనాడు అవి పతనమౌతాయి. ఇలాగే రెండు దారి తప్పిన గోళాల్లా ఉమాపతి, నీరజ కలుసుకున్నారు.
నీరజది నెల్లూరు. వారిది లేని కుటుంబం కాదు గాని బాగా కలిగిన కుటుంబం మాత్రం కాదు. వీలు ఉన్న దాకా చదివించి, ఒక ఉపాధ్యాయుని కిచ్చి పెళ్ళి చేశారు. కానీ సినిమా తార కావాలనుకున్న ఆవిడ కా పెళ్ళి నచ్చలేదు. ఒకరోజు తన బట్టలతో , చేతి కందిన నగలతో మద్రాసు చేరింది. సంవత్సరం స్టూడియో ల చుట్టూ తిరిగింది. జీవితాన్ని తివాచి లా పరిచింది. కానీ కోరికలు పండలేదు.
ఉమాపతీ, నీరజా పది రోజులు మాత్రమే కలిసి ఉన్నారు. ఆ రోజులు ఇద్దరికీ మధురాను భూతులు యివ్వలేదు, ఇవ్వలేవు! ఒకరోజున నీరజ కొన్ని వస్తువులు, అంతో ఇంతో డబ్బు పుచ్చుకుని పరారై పోయింది. ఉమాపతెం బాధపడలేదు. అతడు విమలతో ఉంచుకున్న అనుబంధం లాంటిది నీరజతో పెంచుకోలేదు. ఆ రోజు హాయిగా నవ్వుకున్నాడు. తృప్తిగా నిద్ర పోయాడు. ఉదయం చాలా ప్రొద్దెక్కి నిద్ర లేచాడు. లేచేసరికి ఎదురుగా విశ్వనాధయ్య గారు, సారదీ కనిపించారు.
* * * *
సాయంకాలం ముంగిట్లో ఆముదపు ప్రమిద ఉంచడానికి వచ్చిన సుందరమ్మ బండి లోంచి దిగుతున్న భర్తను, కొడుకునూ చూచి ఆనందం పట్టలేక పోయింది.
ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. అందరూ ఉమాపతి ను ఆదరం తోనే పలకరించారు. రత్నమ్మ మాత్రం లేని ప్రేమ ఒలకబోసింది. శారద ఉమాపతి కి కనబడలేదు. ఉమాపతి కూడా చాలా ముక్తసరిగా ఉండి భోజనం చేస్తూనే వెళ్ళి పడుకున్నాడు. శారద సుందరమ్మ ప్రక్కలో పడుకుంది.
మరుసటి రోజు ఇంట్లో పండుగ చేయమన్నారు విశ్వనాధయ్య గారు. ఆరోజు ప్రకాశాన్ని, సావిత్రమ్మ ను కూడా భోజనానికి పిలిచారు. సావిత్రమ్మ పొద్దుటే వచ్చి వంటపనిలో సాయం చేస్తూ ఉంది. భోజనం వేళకు ప్రకాశం చెరుకుతోట వద్ద నుంచి వచ్చాడు. అందాకా ఉమాపతి గది నుంచి బయటికి రాకుండా చదువుకుంటూ కూర్చున్నాడు.
"నేనింకా స్నానం చేయలేదు. ఇంటి కెళ్ళి స్నానం చేసి క్షణంలో వస్తాను" అన్నాడు ప్రకాశం.
"నేనూ వస్తాను. బావి కేడదాం" అన్నాడు ఉమాపతి. రత్నమ్మ ఇంట్లోనే యిద్దర్నీ స్నానం చేయమంది. కానీ వాళ్ళు బావికే వెళ్ళారు.
ఉమాపతి ప్రకాశంతో మాత్రం హుషారుగానే, ఏమీ జరిగనట్లే మాట్లాడాడు. ఉమాపతి కాస్త బిడియ పడతాడేమో అనుకున్నాడు ప్రకాశం. రాజకీయాలతో ప్రారంభించి, ఆడవాళ్ళ వెధవ బుద్దుల వరకూ అన్ని విషయాలూ మాట్లాడాడు ఉమాపతి. ప్రకాశం వింటూ ఊరుకున్నాడు. కానీ శారదను గురించి నీచంగా మాట్లాడేసరికి అభ్యంతరం చెప్పాడు.
'శారదను గురించి అలా మాట్లాడకు, ఉమాపతి. ఆవిడ మనసు నీకు తెలీదు. అసలు ఆడవాళ్ళను గురించి నీచంగా మాట్లాడ్డమంటే నాకు అసహ్యం. అందులోనూ శారద నాకు కాబోయే భార్య."
ఉమాపతి ఆశ్చర్యపోయాడు. కాస్సేపు మౌనంగా నడిచాడు.
'అన్ని విషయాలూ విచారించుకునే పెళ్ళికి ఒప్పుకున్నావా?"
"అన్నీ, ఒక్కటీ కూడా విడవకుండా విచారించుకున్నాను" అన్నాడు ప్రకాశం చురుగ్గా చూస్తూ. నీ ప్రవర్తన కూడా నాకు తెలుసు; ఆ రకం ప్రవర్తనంటే నాకు అసహ్యం-- అన్న భావం వ్యక్తమయింది ఆ చూపులో.ఇద్దరూ స్నానం చేసి మౌనంగా యింటికి మళ్ళారు. ఇల్లు చేరేసరికి అకులేసి అందరూ కాచు క్కోర్చున్నారు. సుందరమ్మ, శారద వడ్డించారు. విశ్వనాధయ్యగారి మనస్సు ఆనందంతో , తృప్తితో నిండిపోయింది ఆ దృశ్యం చూసి.
ఆరోజు సాయంకాలం ప్రకాశం తో, ఉమాపతి ని పిలుచుకు రావడం కోసం ఎంత శ్రమ పడ్డారో చెప్పారు విశ్వనాధయ్య గారు.
"వాణ్ణి పట్టుకోవడానికే నాలుగు రోజులు పట్టింది. నీవిచ్చిన అడ్రసు లో లేడు. మళ్ళీ గది మార్చాడు. సారధి చాలా శ్రమ పడ్డాడు పాపం. ఈ ఊరికి రమ్మని చాలా బలవంతం చేశాను. వాళ్ళ జనరల్ మేనేజరు కూ , అతనికీ ఏదో బెడిసిందట. అందువల్ల రావటం పడదన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది, ప్రకాశం. ఉమాపతి యిల్లు చేరాడు. శారద విషయం కూడా నాకు చాలా సంతోషంగా....."
విశ్వనాధయ్య గారు ఆ విషయాన్ని పొడిగించడం ప్రకాశానికి ఇష్టం లేదు.
"నాకు జగన్నాధం గారి బావి విషయమే భయంగా ఉందండి. రోజుకో అర మెట్టు తెగుతుంది." మాట మార్చాడు ప్రకాశం.
'చింతించి మనం చేయగలిగిందేం లేదు, ప్రకాశం. జీవితమంటే సంఘర్షణే. అందువల్ల ధైర్యంగా ఎదుర్కోవాలి."
విశ్వనాధయ్య గారు యింటికి వెళ్ళిపోయారు. ప్రకాశం ఇల్లు చేరేసరికి శని, ఆదివారాల్లో తిరుపతి వెళ్ళిన భానుమూర్తి వచ్చాడు. అతడు వచ్చాడని ఎలా తెలుసుకుందో కానీ ఎలాగో జగన్నాధాన్ని మాయ చేసి వచ్చేసింది ఇందిర. విశ్వనాధయ్య గారింటి పిండి వంటలు తింటూ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు.
"హల్లో ! ప్రకాశం! నీ నెత్తిన కనకవర్షం కురవమా! నీకు అమెరికన్ యూనివర్శిటి లో తెలుగు లెక్చరర్ ఉద్యోగం దొరకమా! ఏం అదృష్టం! ఏం అదృష్టం!" ఎగిరి గంతేశాడు ప్రకాశాన్ని చూడగానే భానుమూర్తి.
"ఏమిట్రా!" అన్నాడు ప్రకాశం నవ్వుతూ.
"మా మామయ్య బావిలో ఈనాడు బండ పండిందోయ్! మా మామ కూతురు ఇందిర చెప్పింది."
ప్రకాశం సంతోషానికి మేరలేకపోయింది. కానీ--
"బండ పడితే వదిలేస్తా డేమిటి, మీ మామయ్య? ఆయనకూ ఉడుము కూ అట్టే భేదం లేదు. ఆ బండ అంతు చూస్తాడు. దైనమైట్లు పెట్టి కొట్టిస్తాడు." అన్నాడు ప్రకాశం.
"అది అంతు దొరుకుందేమిటి! అతగాడికి ఈసరికి సొంత కూతురే అంతు పట్టలేదు తెలుసా!"
ఇందిర నవ్వుకుందో తనలోనే.
* * * *
