Previous Page Next Page 
మమత పేజి 12

 

    ఆనతి కాలంలోనే కేవలం నిష్కటంగా మానవ కళ్యాణం కోసం బ్రతుకుతున్న అమ్మలక్కలంతా కూలిపోతున్న సీతమ్మ గారి సంసారాన్ని నిలబెట్టాలనే ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

                               *    *    *    *

    ఈ వార్తా-
    రెక్కలు కట్టుకుని ఎగిరివెళ్ళి సీతమ్మ గారి అన్నగారూ- మన స్వామికి మేనమామ - అయిన మంగపతి చెవిలో పడింది.
    జమాబందీకి తాలుకా కచేరీకి పోతూ ఒకసారి పనిగట్టుకుని రాజయ్యగారింటి కొచ్చి- ఒకరోజు బస చేశాడు మంగపతి.
    వీలు చూసుకుని 'నిజమేనా చెల్లమ్మా' అన్నాడు.
    చిరకాలంగా దాచుకున్న దుఃఖం ఒక్కసారి పెల్లుబికింది.
    'ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా తల్లీ ! ఊరూ- వాడా అంతా మోహన ఉమ్మేస్తున్నారు సుమా. ఈ ఆస్తి గూడా పొతే....'
    'నేనేం చేయనన్నయ్యా ఆడదాన్ని..
    'పోనీ --' నలుగురిలో పంచాయితీ పట్టించి నేనే అడుగుతా.
    'వద్దన్నయ్యా . అటువంటి పని మాత్రం చేయబోకు.'
    'నీకు తెలియదమ్మా నే చెప్తానుండు.'
    'అన్నయ్యా! ఆయనకు కోపం వస్తుంది.'
    'రానీ - ఏం తలకొట్టి మొలేస్తాడా?'
    'నిన్ను తలగొట్టి మోలేయ్యలేరు గానీ - వద్దన్నయ్య'
    'అడుక్కు తింటాడే చివారకు రోడ్ల మీద పడి.'
    'అంతేసి మాట లెందుకన్నయ్యా?'
    'వీడికి చివరకు కుక్క చావు తప్పదు. అరిచి చచ్చినా వీడి గడప త్రోక్కను సుమా! కుళ్ళి కుళ్ళి చావలసిందే. నేను మాత్రం గడప తొక్కేది లేదు.'
    'నీ దయ ఎలావుంటే అలాగే కానీ అన్నయ్యా! అంతా నా కర్మ. ఇంత కాలం పదిమందికి చెప్పిన మనిషి. ఈ రోజు అడ్డమైన వాళ్ళ చేతా చెప్పించుకోవలసి వస్తున్నది.'
    'అతగాడు చేసిన దౌర్భాగ్యపు పనికీ - రేపు అడుక్కునే రోజు వస్తే - బాధపడేది మనమే అనీ చెబుతున్నాను.'
    'నువ్వేం అంత బాధ పడనవసరం లేదు బావా!' అంతకుముందే వచ్చి ప్రక్కగదిలో నిలబడి మంగపతి మాటలన్నీ విన్న రాజయ్యగారు బయటకొచ్చి తీక్షణంగా అన్నారామాట.
    'కాదు బావా!'
    'ఔను బావా! నువ్వనుకున్నట్లు నాకు అడుక్కుతినే రోజు వచ్చినా - నీ యింటికి వచ్చి మాత్రం ముష్టేత్తుకోనులే. అటువంటి బెంగలు పెట్టుకోకుండా నువ్వు యింటికి తిరిగి పోవడం చాలా మంచిది. నేను మొరటు మనిషిని. నువ్వు పిల్లలు గల వాడివి. నీ వళ్ళు సక్రమంగా ఉండటం చాలా అవసరం. వెళ్ళు బావా. అసలే బక్క ప్రాణం నీది. అంతంతసేపు అటువంటి ఉపన్యాసాలివ్వడం నీ వంటికి మంచిది కాదు'
    ఆనాటితో అప్పటికి మంగపతి కుటుంబానికీ - రాజయ్య కుటుంబానికి రాకపోకలు నిలిచి పోయినై.

                            *    *    *    *

    ఆ తర్వాత ఒకసారి కరణంగారు స్వయంగా సీతమ్మ గారి దగ్గర కొచ్చి 'చెల్లాయమ్మగారు! నే చెప్పినట్లు చెప్పబోకండి. దేవాలయం అర్చకులు మహాదానందాచార్యులవారు కడుపులో పెట్టుకోమని రహస్యంగా నాకు చెప్పిన మాట, ఉండబట్టలేక -- మీ కుటుంబం మీదున్న అభిమానం కొద్దీ మీ చెవుల్లో వేస్తున్నాను. ' అనడం జరిగింది.
    ఒకానొక దొరగారు - రంగాజమ్మ వోణీలు కడుతున్న రోజుల్లోనే భ్రమిసి కన్నెరికం పెట్టారట. తాంబూలం లో ఓ రవ్వల నెక్లేసు తో పాటు వెయ్యి నూటపదహార్లు పెట్టి. ఆ బొర్ర మీసాలయనకు నాకు నచ్చలేదంటూ కలాయించిందట ఈడేరిన తర్వాత రంగాజమ్మ.
    తుపాకీ తోటా నింపి పేలుస్తానంటూ మీసం దువ్వి గర్జించారట దొరవారు. 'చంపండి' అంటూ ఎదుట నిలిచిందట రంగాజమ్మ. మొండికేత్తిన అంత అందగత్తెను చంపటానికి చేతులు రాక, ఎప్పటికైనా మనసు మార్చు కుంటుందనే ఆశతో ఎదురుచూస్తూ 'చివరకు నేడు ముసలి పీనుగునై కోరిక తీరకుండానే కన్నుముస్తానెమో' అనే బెంగతో మంచం పట్టారట. అయన చెవిన పడిందిట రాజయ్య గారి శృంగార గాధ. 'రాజయ్యను పట్టి తెండి. ఆనాడు రంగాజమ్మ గుండేలను తీయవలసిన తూటా , ఈ నాడు ఆ రాజయ్య గుండెలను తీయాలి' అంటూ పదిమంది రవుడీలను -కండలుతిరిగిన వాళ్ళను -- రంగాజమ్మ యింటి చుట్టూ కాపలా పెట్టారట.
    -- ఈ కధ ఎంత బిగితో వర్ణించి చెప్పటానికి అవకాశముందో -- అంత పట్టుతో చెప్పి "మీ పసుపు - కుంకుమలు దక్కించుకోండి చెల్లాయమ్మగారు.' అంటూ హితవు చెప్పివెళ్ళారు కరణం గారు.
    ఇనప పెట్టెలో ధగధగ మెరుస్తున్న బాకు గుర్తుకొచ్చింది సీతమ్మ గారికి. పిఠాపురం వెళ్లినప్పుడల్లా రాజయ్యగారు ఆ బాకును వెంట తీసుకు పోతున్నారని అర్ధం చేసుకుంది. అందుకనే ఆనాడు పిఠాపురం బయలుదేరి వెళ్తున్న భర్తకు ఎదురెళ్లి 'ఎక్కడికి వెళ్తున్నారు?' అంది.
    'నీకు తెలియదా?' అన్నారు రాజయ్యగారు.
    'తెలుసు. ఒక్కమాట అడగాలని....'
    'అడుగు'
    'మీరు పిఠాపురం వెళ్ళటం నాకిష్టం లేదు.'
    రాజయ్యగారు ఒక క్షణం తటపటాయించి మళ్ళీ బయలుదేరుతున్నాడు.
    'నేను అనేది-'
    "???'
    'నా మనస్సు ఏదో కీడు శంకిస్తోంది. ఆవిడనే యిక్కడకు తీసుకు రండి. నా కళ్ళముందు మీరు సుఖంగా ఉండటమే నాకు కావలసింది. ఏమండీ! నన్ను అర్ధం చేసుకోరూ?'
    'వేర్రిదానా'
    'ఏమంటారు?' వెంట నడుస్తూ అడిగింది సీతమ్మ గారు.
    'చూద్దాం'

                                    6

    ఈసారి పిఠాపురం నుంచి తిరిగి వస్తూ రంగాజమ్మ ను సరాసరి యింటికి తీసుకు వచ్చారు రాజయ్యగారు.
    అంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగనంత సంరంభంతో పెద్ద తుఫాను చెలరేగి - అట్టుడికి పోయింది ఆగ్రామం.
    ముఖం సగం కనిపించకుండా మేలిముసుగు వేసుకున్న రంగాజమ్మ వస్తూనే -- సీతమ్మ గారి పాదాలకు నమస్కరించింది.
    అంతకుముందు అనేకసార్లు రంగాజమ్మ ను గురించి పరిపరి విధాల ఆలోచించింది సీతమ్మ గారు. ఆనాడు కళ్యాణ మంటపం లో గజ్జ కట్టిన రంగాజమ్మ ను చూసినప్పటికీ - ఆమె మూర్తిని ఊహల్లో స్పష్టంగా నిలుపుకోలేక పోయింది. సర్వాభరణాలతో అలంకరించుకున్న రంగాజమ్మ రూపమే లీలగా ఆమెకు గుర్తు. ఏమైనా తాను ఊహించిన రూపం వేరు. ఇప్పుడు చూసిన స్వరూపం వేరు. ఆ కట్టుబోట్టూ వైష్ణవ సంప్రదాయం జీర్ణం చేసుకున్నట్టిది. లేత తమలపాకు మాదిరి నవనవలాడుతూ మెరిసిపోతున్న వళ్ళు ఒక్కొక్క మనిషినిచూస్తే - ఏదో జన్మాంతర సంబంధమున్నట్లు అపేక్ష పుట్టుకొస్తుంది ఎవరికైనా. ప్రసన్నత - అదొక లక్షణం - అది రంగజమ్మలో ఉందనిపించింది. గాలికి రాలిపడిన సంపెగలా కనిపించింది.
    సీతమ్మ గారు మౌనంగా రంగాజమ్మను పరికించి చూసింది పదిక్షనాలు. రాజయ్య గారు భార్యకు ఆమెను మాటలతో పరిచయం చేయలేదు. "తీసుకొచ్చాను సీతా' అని చెప్పి -- తన గదిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరిని అక్కడే అలాగే వదిలిపెట్టి.
    మనిషి చూపుకున్న శక్తి మాటలకు లేదేమో!
    ఆమె కళ్ళలోకి సూటిగా చూసింది సీతామ్మగారు. కఠిన్యంగాని, కాలుష్యం లేదు ఆ చూపుల్లో. ఒక రకమైన నిస్సహాయత -- నిర్లిప్తత - మౌనంగా మూలుగుతున్న వేదన - బెదిరిన లేడిపిల్లలా చెదిరిపోయిన రంగాజమ్మ చూపు -- కరిగింది.
    అవమానాన్ని సహించడానికే వచ్చింది రంగాజమ్మ. కాని అవసరం లేకపోయినా అటువంటి ఆదరణ లభిస్తుందని కలగనలేదు ఆమె. రాజయ్యగారి ఆదేశాన్ని తిరస్కరించలేక -- 'దొరగారు' బ్రతకనివ్వరనే నమ్మకం కుదిరింతర్వాత -- బయలుదేరి వచ్చింది.
    'లోపలికి రామ్మా.'
    పిలిచింది సీతమ్మగారు.
    చిరునవ్వు - అరువు దించుకున్నట్లు లీలగా మెదలినా దాన్ని పెదవుల మీద నిలుపుకోలేక పోయింది రంగాజమ్మ.
    సమస్య కోసం ఎదురు చూసింది రంగాజమ్మ. కాని నిజానికి ఎదుర్కున్నది సీతమ్మగారు. చెరువు నుంచి మడినీళ్ళు తెచ్చుకుంటున్నప్పుడు - ఊరి జనం ఆమెను వింత మృగాన్ని చూసినట్లు చూశారు. వాళ్ళ గుసగుసలు పోలికేకలై - బాకులై- మేకులై- ఆమె కర్ణపుటాలను చీల్చినై.
    
                            *    *    *    *
    పరిస్థితులను లొంగి అయింట్లో కాలు పెట్టింది రంగాజమ్మ.
    ఉండలేక పోయింది ఎక్కువ కాలం.
    దానికి కారణం సీతమ్మగారు మాత్రం కాదు. ఆ సంగతి రంగాజామ్మ కి తెలుసు.
    రాజయ్యగారు -
    అగ్నిహోత్రం లాంటి నైతిక సంప్రదాయాన్ని వారసత్వంగా  అంది పుచ్చుకున్న రాజయ్యగారు --

 

                        


    పడుపు కత్తెను తెచ్చి -- ప్రత్యక్షంగా భార్య సమక్షంలో -- ఉన్న యింట్లో కాపరం పెట్టడం ఎంత విద్దురంగా కనిపించినా--ఆయన్ను నిగ్గదీసి మందలించే శక్తి అవూళ్ళో ఎవరికి లేకపోయింది. రంగాజమ్మ మంచి చెడ్డలతో లోకానికి పనిలేదు.అటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న మనిషి రక్తంలో మంచి తనం బ్రతకదని ప్రపంచం నమ్ముతుంది. నమ్మింది. వైష్ణవ భక్తురాలైన రంగాజమ్మ  -- ప్రాతఃకాలం లేచి తలనిండా స్నానం చేసి పట్టుచీర కట్టుకొని- శ్రీచూర్ణం నుదుటున ధరించి- వెండి పళ్ళెంలో కొబ్బారికాయలు పెట్టుకొని, దేవాలయానికి వెళ్ళటం గురించి ఊరు ఊరంతా గోలగా చెప్పుకున్నారు. దేవాలయం అర్చకులు మహాదానండా ఆర్యుల వారు కాక -- ఆమె భక్తిని మెచ్చుకున్న మనిషి అవూళ్ళో లేకపోయారు--
    ఆ భక్తీ చూడండి--'
    'ఆహా! ఒక పక్కన కొంపలు తీస్తూ --'    
    'ఔనులే! భూషయ్య కొంపలు తీసిన కొద్దీ వంటి మీద పెట్టుకున్న నామాల సైజు పెంచుతున్నాడు చూడటం లా?' ఇదీ అదే బాపతు.
    'నన్నడిగితే బావా!...' అంటూ రంగం మీదకు ప్రవేశించారు కరణం గున్నేశ్వర్రావు. ఆయన్నేవరూ అడగలేదు.
    'ఇంత పాపానికి వడిగట్టుకుంటున్నదా? నరకానికి పోతుంది చూస్తూ వుండండి- ఆ రాజయ్య మాత్రం?' అప్పుడే వచ్చి రావిచెట్టు క్రింద బండల మీద చతికిలపడుతున్న భూషయ్య గారి భాష్యం అది.
    ఆయాసపడుతూ కరణం గున్నేశ్వర్రావు లేచారు.
    'పాపపుణ్యాల సంగతి అలా వుంచండి భూషయ్య గారు. వేదాలూ, ఉపనిషత్తులు అలా పిండి కొట్టేశారు గదా? మీరు చెప్పండి? అసలు మోక్షమంటే ఏమిటండి?
    చచ్చాక ఆ మోక్షం తగలబడక పొతే పోనీవ్వండి  బ్రతికుండగా మోక్ష ద్వారాలు తెరుచు కున్నాయంటారా లేదా మన రాజయ్యకు చెప్పండి? అవధాని గారు పురాణం లో ఎంతగా లోత్తలువేస్తూ వర్ణించినా -- సదరు రంభాలూ, మేనక యింత కంటే తలకొట్టి మొలేశారంటారా? ఆవిడగారిపస - పదునూ చూసి చెప్పండి సమాధానం మరి?'
    మళ్ళీ రక్తపు పోతులాంటిది వచ్చి కరణం గారి చిరాకు హెచ్చింది. ఊపిరాడక మాట్లాడి మాట్లాడి రొప్పుకుంటూ యింటికి పోయాడు. రాత్రి నిద్ర పట్టలేదు కరణం గారికి. మూడు పుష్కరాల క్రితం , తన పెళ్ళిలో పీరు సాయిబ్బు పీనుగుల మేళం పెట్టించి- తమ దగ్గర డబ్బుగుంజి కూడా - తనను అవమానం చేసినప్పటి గాయం రేగి - ఆనాడు ' గుదిబండలా' మెడకి తగిలించుకున్న పెళ్ళాం కనకమ్మ గారి మీద కోపమొచ్చి  తిట్టి అర్ధరాత్రికి గురకపెట్టి - నిద్రలో కలవరించి, పలవరించి , తెల్లవారకుండానే నిద్ర లేచారు కరణం గారు. ఎప్పుడూ లేనిది ప్రాతఃకాలాన్నే తలారా స్నానం చేశారు. ఆత్మహత్య చేసుకుంటున్నంత భయపడుతూ చెరువులో మునిగి, ఇంటికి వస్తూనే తాళం చేయి కనిపించక బ్రద్దలు కొట్టి బొషాణం తెరిచి -- పౌడరు పూతలా వీబూది దట్టించి - బోషాణంలో చిరకాలం గా దాక్కున్న నట్టు బట్టలు తీసి ' వీటి అమ్మ కడుపు కాలా' అంటూ చిమ్మెట్లను తిట్టుకుంటూ కాంతలు కనిపించకుండా కట్టి - ముక్కు పొడుం మరకలు లేని జరీ ఉత్తరీయం కప్పుకొని- గుడికి బయలుదేరాడుకరణం గారు. కనకమ్మగారు 'ఇన్నాళ్ళ కు ఈయనకు భక్తీ కుదిరింది . అపాడుమేరక దిబ్బ చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా ఉండేలా అయన మనస్సు మార్చు కన్న తండ్రి.' అంటూ కన్నయ్యను తలచుకుని పుటుక్కున తుమ్మి- ' అశుభం' అనుకుంటూ భయపడింది.
    ఆశుభమే జరిగింది కరణంగారికి.
    రంగాజమ్మ వెనకాతలే ఆలయ ప్రాంగణం లో అడుగు పెట్టారు. కరణంగారు. స్వామి గర్భాలయ చుట్టూ ఆమె ప్రదక్షిణం చేస్తున్నది. 'గోవు వెంట పోవు కోడె భంగి - కరణంగారు కూడా ప్రదక్షిణలు ప్రారంభించారు. తందరిస్తున్న గుండెలను అదిమిపట్టుకోని -- ధైర్యం కూడగట్టు కుంటానికి ఆయనకు రెండు న్నర ప్రదక్షిణాల కాలం పట్టింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS