నేను ఇంటికి చేరుకుంటూనే వీధి గొళ్ళెం వైపు చూశాను. అక్కడ తాళం వేసి లేకపోవడంతో నా గుండె దడదడ లాడింది. మధురిమను చేత్తో నడిపిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళెను. అయన పడకకుర్చీలో కూచుని అటు తిరిగి గుప్ గుప్ మని సిగరెట్టు పొగ ఒదుల్తున్నారు. నా రాక గుర్తించక పొతే నూనె పిల్లనయినా దగ్గిరకు తీసుకోనంత తప్పు నేనేం చేశాను? హోటల్ నుంచి టిఫిన్ తెప్పించి దానికి పెట్టి బట్టలు మార్చి దాన్ని ఆటకి పంపేశాను. ఆయన దగ్గిరగా వెళ్ళి ఏదో చెప్పబోయాను. వారు మరింతగా అటు వైపు పడక్కుర్చీలో ముడుచుకు పోయి పుస్తకంలో లీనమై పోయారు. చాతకాని తనంతో నాకు కళ్ళమ్మట గిర్రున నీళ్ళు తిరిగేయి. తగినంత కారణం ఉండబట్టి చెప్పకుండా వెళ్ళడం జరిగింది. ఇంతకీ చిన్నారిని ఆఖరుసారిగా చూసుకోడానికి వీల్లేక పోయింది. వెళ్ళేటప్పుడు అన్నీ రాసి ఉత్తరంలో పెట్టి వెళ్ళనే వెళ్ళాను. దాని కింత శిక్ష దేనికీ? చిన్నారి చావు బతుకుల కన్న అయన వాళ్ళు వచ్చారో లేదో అన్నది అంత ముఖ్య విషయం కాదె! ఇంతకీ ఇంటి కొచ్చిన మనిషిని ఎప్పుడోచ్చావని పకలరించక పోడానికి నేను చేసిన మహాపరాధం ఏమిటో!
ఇటువంటివి మా కాపురంలో ఇవే కొత్త. ఓ అరగంట సేపు ఆలోచిస్తూ అలా గదిలో ఉండి పోయాను. ఆఖరికి ఆయనకు లేకపోతె నా బుద్ది ఏమైందనిపించింది. అభిమానపు తెర చీల్చుకుని మళ్ళీ వెళ్ళాను.
"ఏమండీ, మీ కామేశ్వరక్కా వాళ్ళు వచ్చారా?' జవాబు లేదు. తలెత్తి చూశాను. ఆయనే అక్కడ లేరు! వీధి వైపు డ్రాయింగు రూం లోకి వచ్చాను, అక్కడా లేరు. నాకేం చెయ్యాలో తోచలేదు. మొట్టమొదటే నేను పలకరించి ఉంటే ఇంత వరకూ రాకపోను గదా అనిపించింది. తప్పు చేసినట్లు క్షణ మాత్రమేనా నేను అనుకోలేదు గాని జరిగిన దానికి మహా చిరాకనిపించింది. మధురిమ వచ్చి 'ఆమ్మ, ఆకలే' అని నాభుజాలు పట్టుకు వూపేదాకా అక్కడ కూలబడే ఉన్నాను. కూరలు తెప్పిద్దామని దాని చేత బంట్రోతుకి కబురంపించాను.
'మేం లేనప్పుడు మనింటికి చుట్టాలు ఎవరేనా వచ్చేరా పోతురాజూ?'
'వచ్చిన జాడ లేదు తల్లీ.... అయినా సరిగ్గా నా కేరిక లేదు కూడా. ఇంటిదానికి ఒంట్లో ఉడుకుగా ఉంటె నాల్రోలు సెలవెట్టేసినోను. తవరు కవురంపించారని ఒచ్చినాను గాని ఇసుమంటి టయిం లో బెమ్మ దేవుడు పిలుస్తే - మాతరం కడుల్తానా తల్లీ?'
వాడి పిల్ల జబ్బూ అదీ ఏకరువు పెట్టడం ప్రారంభించాడు. ఆ సోది వినలేక నాకు విసుగని పించింది.
'కొంచెం మార్కెట్ కి వెళ్ళి బంగళా దుంపలూ ఉల్లిపాయలూ తెచ్చి పెడుదూ.... అలా వచ్చేటప్పుడు క్లబ్బు కెళ్ళి అయన ఉన్నారేమో చూసిరా.'
తలనొప్పిగా ఉండి స్నానం చేసి తల అరబెట్టుకుంటుంటే వాడు వచ్చాడు. అయన మళ్ళీ క్యాంపు కి వెళ్ళారుట. మూడు రోజులకి గాని రారుట! భోం చేశాక మధురిమతో పాటు పడుకున్నానే గాని అయిదు నిమిషాలు ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. వేదన అంటే ఏమిటో ఎరగని నా మనస్సుకు ఈ మాత్రం బాధ భరించడమైనా కష్టమై పోయింది. లైటు వేసి ఏవేవో పాత పత్రికలూ తిరగేశాను. దేని మీదా దృష్టి పోలేదు. ఎదురుగా అల్మారా లో ఉన్న ఏం.ఏ నోట్సూ గైడ్స్ నన్ను వెక్కిరించి నట్టయింది. లిటరేచర్ లాంటి కష్టమైన విషయాన్ని తీసుకుని మొదటి సారే ప్యాసయ్యాననే తృప్తి నాకే మాత్రమూ కలగలేదు.
ఆవాళ బాగా తెల్లవారేక గాని నాకు మెలకువ రాలేదు. ఒవల్టీను తాగేసి మధురిమ ఆడుకోడానికి పారిపోయింది. నేను ఏదో కూర తరుగుతున్నాను. వీధిలో రిక్షా అగినట్టై -- చేతులు తుడుచుకుని ఇవతలి కొచ్చాను. బరబర పట్టుచీర చప్పుడు చేసుకుంటూ కామేశ్వరీ, కనక మహాలక్షమ్మ గారూ లోపలికి వస్తుంటే వీళ్ళీద్దరికీ కాక ఇంక మరొకరికి ఆ హల్లో చోటుందా అనిపించింది.
'నమస్కారం లోపలికి రండి.'
'ఏడీ మా వాడూ ? ఇంట్లో లేడూ?'
'లేరండీ, క్యాంపు కి వెళ్ళారు.'
'ఎప్పుడోస్తాడూ'
'ఎల్లుండి రావచ్చు.'
'అబ్బో ఎల్లుండే , అందాకా ఎవరుండగలరూ? ఉత్తరం వేశామే అందలేదూ?'
నేనేమీ మాటాడ లేదు. నాకా ఉత్తరం గురించి ఏమీ తెలీదు.
'అన్నయ్య లేకుండా ఇక్కడ ఉండడమంటే అదోలా ఉంటుందే పిన్నీ నాకూ.... వెంటనే వెళ్లి పోదాం పదవే"
మరొక పరిస్థితుల్లో అయితే "తక్షణమే దయ చెయ్యండి" అని ఉందును. ఆ వయారాలు చూసి . అసలే గాయపడిన నా మనసు ఇంకా తొందర పడదలుచుకోలేదు.
'మీ అన్నయ్య లేకపోతె మాత్రం నేను లేనా ఏమిటి వదినా అలా కొత్తగా మాటాడతారు? అయినా ఇది మీకు పరాయి ఇల్లా? రాకరాక ఇన్నాళ్ళ కి వచ్చారు గదా, ఓ నాలుగు రోజులైనా ఉండకుండా మిమ్మల్ని వదిలి పెడతా ననుకున్నారా?'
'పిన్నీ చూశావటే వదిన గడుసుతనం, నాలుగు రోజులతోటే మనల్ని సాగనంపేద్దామని చూస్తోంది!" మరిందులో ఏ మాత్రం హాస్య ముందో ఇద్దరూ కలిసి ఇల్లెరిగి పోయినట్టు నవ్వడం ప్రారంభించారు. ఈ హడావుడికి పక్కింట్లో తొక్కుడు బిళ్ళ ఆడుతున్న మధురిమ దాని ఫ్రండ్స్ ముగ్గురితో సహా అక్కడికి వచ్చింది. అదేమిటో చూద్దామని.
"ఎవర్తే ఇందులో నీ కూతురూ?' అంది కనక మహాలక్ష్మమ్మ.
'చెప్పుకోండి చూద్దాం' అన్నాను పెంకితనంగా.
'బాగుందే నీ వరసా, ఇదేకదా మొదటిసారి చూడ్డం, మాకేలా తెలుస్తుందీ!' అంది ఆవిడ.
'మనల్ని అంత తెలివి తక్కువ వాళ్ళ కింద కట్టేసింది వదిన. ఇంతకీ అదేమంత కష్టమని!'
అని కామేశ్వరి నన్నూ ఆ పిల్లల్నీ పరకాయించి చూసింది. పట్టుపరికిణీ పట్టు జాకేట్టూ తొడుక్కుని, మెళ్ళో ముత్యాల నెక్లిసు పెట్టుకుని, జడగంటలు , చేతికి ఎనిమిదేసి జతల బంగారు గాజులూ ఉన్న ఎదురింటి వరహాల శ్రాష్టి గారి అమ్మాయి గోవర్ధనాన్ని చూసి ఇట్టే పోల్చేసుకుంది.
'దాచుకుంటే మాత్రం దగుతుందటే అమ్మాయీ నీ రహస్యం! ఈ ముక్కూ, ఈ నోరూ మా తమ్ముడివి అలా కొట్టోచ్చినట్టు కనబడ్డం లేదూ? అసలు ఆ పిల్ల గుమ్మం లోకి రాగానే పోల్చేశాను. ఆ నడక చూసి , ఇప్పుడేమంటావ్ మేనకోడలా?'
అని ఆపిల్ల చెయ్యి పట్టుకుని కామేశ్వరి లాగింది. ఆ పిల్ల తెల్లబోతూ ఉందేమో త్రుళ్ళి పడి నిలదొక్కుకోలేక పక్కనున్న లక్షమ్మ గారి మీద పడింది. ముగ్గురూ, అంటే కుర్చీతో సహా వాళ్ళిద్దరూ మరుక్షణం నేల మీదున్నారు. పిల్ల లందరూ గొల్లుమన్నారు. నాకు అపుకుందామన్నా నవ్వాగలేదు.అలాగే పడిపోయిన దాన్ని లేవదీయ బోయాను . విసిరి కొట్టేసింది.
'నాకు నువ్వేం చెయ్యందియ్యక్కర్లేదులే! నువ్వనుకున్నంతగా నాకేం దెబ్బ తగల్లేదులే! నా ఇదేం హస్యమమ్మా మాయదారి హాస్యం. అయ్యో అయ్యో పట్టుకోండర్రా జీవుడు ఎగురి పోతుంది.'
కామేశ్వరి ఆమెను నెమ్మదిగా లేవనెత్తి పడక్కుర్చీలో కూచో బెట్టింది. నిజానికి పెద్ద దెబ్బ తగిలింది. గోవర్ధననికి. మణికి పచ్చడయింది. నేను టీంచరయిడిన్ తెచ్చేలోగా ఆ పిల్ల మంటకి వోర్చుకోలేక ఇంటికి దాటేసింది.
