"హమ్మయ్య కథానాయిక కష్టాలన్నీ గట్టెక్కాయి దేవుడు కలలో కనిపించి కరుణించాడు. కథ ఇలా చక్కగా ముగిస్తుంది కన్కే ఈ రచయిత్రి అంటే ఎంతో ఇష్టం నాకు... రండి ఒక్క నిముషంలో కంచాలూ అవీ పెట్టేస్తా"
"ఎవరో ఆ కథానాయికలాగ నా కష్టాలు కూడా గట్టెక్కితే బావుండును నావి కూడా కడతేడ్చు భగవంతుడా!" అని దేవుడికి మనసారా మొక్కుకుని లేచింది సునంద.
"వదినా నీకు ఆఫీసు ఉంది కదా పొద్దుటి పూట పోనీ రత్నాన్ని వండమనక పోయావు? రోజూ వంటచేసుకుని ఆఫీసుకు బయలుదేరడ మంటే కష్టం కాదూ?" పీటమీద కూర్చుంటూ అన్నాడు గోపాలం.
"వెర్రి వాడా! వండమని చెప్పాలా నేను? తోటి ఆడదానికి చెప్పి అలా పురమాయించడంలో ఎని ఇబ్బందులున్నాయో నీకేం తెలుసు? ఇది నువ్వు చెయ్యి అని అనడంకంటే, కష్టం అయినా చేసుకోడం సుఖం. అయినా చెప్పి చేయించడానికి రత్నం ఏమైనా చిన్నపిల్లా అని మనస్సులో అనుకోని "మేం ఇద్దరం ఏదో సద్దుకుపోతాం. ఆ గొడవలన్నీ నీకేందుకుగాని నువ్వు భోం చెయ్యి" అంది సునంద నవ్వుతూ.
"తొమ్మిదిన్నర దాటింది. మరి నువ్వెప్పుడు తింటావు? ఆఫీసుకి టైము కావడంలేదూ?"
"ఇవాళ శలవు పెట్టేశానులే" అంది చటుక్కున సునంద, అలా అనేశాక, ఆలోచన వచ్చింది. పోనీ ఇవాళ శలవు పెడితేనో అని. అవును వీధి చివర ఉంటూన్న ఆఫీసుఫ్యూన్ కి ఇచ్చి శలవుచీటీ పంపిస్తేసరి. ఇంకా వెళ్ళి ఉండడు ఆఫీసుకి శలవుపెట్టి హాస్పిటల్ కి వెళ్ళి ఆయన దగ్గర సాయంత్రం దాకా కూచుని కబుర్లు చెబితే తన మనస్సుకి కొంత ప్రశాంతంగా ఉంటుంది. ఈమధ్య ఆదమరచి కూర్చోవడమే కుదరడం లేదు ఆయనకి కోపం కూడా వస్తోంది. ఇలా అనుకోని, "కెరియర్ ఇవాళ నేను పట్టికెళ్తానులే! నువ్వు ఆఫీసుకి వెళ్ళు" అని గోపాలనికి చెప్పి తన భోజనం పూర్తి చేసుకుని కెరియర్ తీసుకుని హాస్పిటల్ కి బయలుదేరింది సునంద.
దారిపొడుగునా ఆలోచనలు, కొన్ని మధురంగా హృదయంగమంగా - కొన్ని చేదుగా భయంకరంగా - ఆయనకి జబ్బుతగ్గి హాస్పిటల్ నుంచి విడుదల అయ్యాక, మళ్ళీ తన జీవితంలో ఆనందమందారాలు పూస్తాయి వసంతం తిరిగి తన ముంగిటికి వస్తుంది. పూర్వంలాగ మళ్ళీ తన కాపురం శ్రుతి పక్వమైన వీణాగానంలా హాయిగా సాగిపోతుంది.
"తగ్గకపోతే" -వీపుమీద చెళ్ళున చరిచి నట్లయి, వెన్నెముక కలుక్కుమంది. "అమ్మో! ఆ ఆలోచనవద్దు. నేను ఊహించలేను. భరించలేను" అంటూ గట్టిగా తనలోతను అరుచుకుంది.
పోస్టుమేన్ ఎదురయి రెండు కవర్లు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అవి ఎవరు రాశారు? ఏమని రాశారు? చదువుదాం అనే ఆలోచనైనా కలగలేదు సునందకి. ఆమె మనస్సు ఎంతకీ శివరాం చుట్టూనే తిరుగుతోంది. ఈ జబ్బేవిటి ఆయన్ని ఇలా పట్టుకుంది? ఎప్పటికి తగ్గుతుంది భగవంతుడా? అని అనుకుంటూ హాస్పిటల్ చేరింది సునంద.
గోపాలం వస్తాడని ఎదురు చూస్తున్నాడేమో. అలా కాకుండా కెరియర్ పట్టుకుని సునంద రావడంతో మొదట ఆశ్చర్యపోయాడు శివరాం. "పోనీ ఇదీ మంచిదే!" అని ఆ తర్వాత ఆనందించాడు.
"ఏవిటి ఇవాళ ఆఫీసులేదా?"
"ఉంది కాని శలవు పెట్టాను. ఏవిటో ఈ రోజల్లా మీ దగ్గర కూచుని కబుర్లు చెప్పాలనిపించింది."
మధురంగా వినిపించాయి ఆ మాటలు. "నిజంగా? ఇవాళ ఎంత అదృష్టం!" అంటూ చిలిపిగా చూశాడు శివరాం. సునంద ముసిముసి నవ్వులు నవ్వింది కేరియర్ విప్పుతూ. "ఇవాళ నేను కలుపుకొని తినేదిలేదు. అమ్మాయిగారు కలిపి ముద్దలు చేసి నోట్లో పెట్టవలసిందే!" అనూ మూతి బిగించాడు శివరాం. అప్పుడు కూడా అతని బుగ్గలు లోతుగానే ఉన్నాయి. కళ్ళల్లో నీరసం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. "ఎలా ఉండేవారు ఎలా చిక్కిపోయారు!" అంటూ మనస్సులో బాధపడింది సునంద.
"ఊ- ముద్దలు చేసి నోటికి అందించు మరీ"
"ఏవిటా చిలిపితనం ఎవరైనా చూస్తారు" మెల్లగా అంది సునంద ఇటూ, అటూ పరికించి.
"చూస్తేయేం - అన్యోన్య దాంపత్యం అనుకుంటారు"
"వాళ్ళు అనుకోవడం కోసమేమిటి మన అన్యోన్య్హత?"
"మరింకనేం?"
"చుట్టూ ఇంతమంది రోగులూ వచ్చేపోయే నర్సులూ, పేచీ పెట్టక తినండి. జబ్బు తగ్గి హాస్పిటల్ నుంచి విడుదలై వచ్చాక మీ ముద్దు చెల్లిస్తాను-ఏం? మంచివారట! చెప్పినట్టు వింటారట!" అంది.
"అప్పుడు మళ్ళీ ఇంకోవంక పెట్టకూడదు... ఆ!" చంటిపిల్లాడిలా అంటూ చిలిపిగా చూశాడు శివరాం.
"అబ్బే ఒక్కనాటికి వంకపెట్టను, మీరు ఏం చెయ్యమంటే అది చేస్తాను. సారా?" వస్తూన్న నవ్వుని ఆపుకొంటూ అతి సీరియస్ గా మాట్లాడటం వల్ల సునందకి పొలమారింది నెత్తిమీద మెల్లగా తఃడుతూ" మీ అమ్మగారూ, నాన్నగారూ తలుచుకుంటున్నట్టున్నారు" అన్నాడు శివరాం.
వాళ్ళ ప్రస్తావన వచ్చేటప్పటికి సునంద కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి వెంటనే మాట తప్పిస్తూ, ఏదో అనబోయి దగ్గుతెర వచ్చి ఆగిపోయింది.
"ఏవిటి? దగ్గు వస్తున్నట్టుంది. ఎప్పటినుంచి? ఆత్రుతగా ప్రశ్నించాడు. శివరాం నిజంచెప్పి అతనికి వ్యాకులత ఆ సమయంలో కల్పించడం ఇష్టంలేక. నిర్లక్ష్యంగా నవ్వేసి" అబ్బే ఎప్పటి నుంచీకాదు ఇప్పుడే వచ్చింది," అంది.
"వేడిచేసి వచ్చిందేమో"
సునంద మాట్లాడలేదు.
శివరాం పరిశీలనగా సునందకేసి చూశాడు.
బాగా చిక్కిపోయి లంఖణాలు చేసిన దానిలా నీరసంగా ఉంది. కళ్ళు లోతుకు పోయి బుగ్గలు పాలిపోయి బాధగా కనిపించింది. తన కోసం రాత్రింబవళ్ళు నిద్రా హారాలు మాని తపిస్తూ శ్రమ పడుతోంది. నాకోసం కాకపోయినా అమాయకురాలి కోసమేనా నాకు ఆరోగ్యం ప్రసాదించు భగవాన్. అని పట్టలేని ఆవేదనతో కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్ధించాడు శివరాం. శివరాం మౌనంగా ఉండడం చూసి కంగారు పడి అతని భుజం పట్టుకుని కుదిపింది సునంద. కళ్ళు తెరిచి సునంద కేసి జాలిగా చూసి అన్నం కలుపుకున్నాడు శివరాం.
దగ్గర కూచుని కోసరికోసరి వడ్డిస్తూ, మధ్య మధ్య అతని మాటలకి నవ్వు వచ్చి పులకిస్తూ దాదాపు గంట గడిపింది. సునంద అతనికి అన్నం పెడుతూ , ఆ గంటా తన బ్రతుకులో ఎంతో విలువైనది గా వెలకట్టి, ఆ జ్ఞాపకాన్ని ఎప్పటి కెనా గుండెల్లో తియ్యగా దాచుకోవాలనుకుంది సునంద.
"సునందా!"
శివరాం పిలుపికి ఉలిక్కిపడి చూసింది.
"ఇలారా నా బెడ్ మీద కూచొ వచ్చి. పిచ్చి పిల్లా ఏవిటలా చిక్కిపోతున్నావు. నాకోసం ఇంత శ్రమ పడుతున్నావు. నీ ఋణం ఎలా తీర్చుకోవడం?"
ఛ అవెం మాటలండీ....మనలో మనకి రుణాలెవిటి , తీర్చుకోవడమేమిటి?"
"సునందా నువ్వు మనిషివి కాదు దేవతవి. ఏ జన్మలో చేసిన పుణ్యం వల్లో నువ్వు నాకు లభించావు."
సునంద నవ్వుతూ "ఏవిటి వాళ ఇలా మొదలెట్టారు?"అంది.
"తేలిగ్గా నవ్వేయ్యకు సునందా.... నిజం అన్నాడు శివరాం ఉద్వేగంతో. సునంద ఏం మాట్లాడలేదు. శివరాం కొద్దిగా దగ్గిరికి జరిగి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మౌనంగా ఆమె కేసి చూస్తూ కొంచెం సేపు ఉండిపోయాడు. ఆ తర్వాత ఆ చేతిని సున్నితంగా నిమిరి తన మెడ మీదికి చేర్చుకొని తన దవడకి భుజానికి మధ్యన బలంగా అడుముతూ అరమోడ్పు కన్నులతో అలా ఉండిపోయాడు. ఏ దివ్య లోకా ల్లోనో విహరిస్తూ. ఆ స్పర్శ సునంద కి కూడా ఏంతో హాయిగా ఉంది . ఒళ్ళంతా విద్యుత్తూ ప్రవహించినట్లయి, కనురెప్పలు బరువుగా వాలిపోసాగాయి. కాని వెంటనే ఈ లోకంలోకి ఉలిక్కిపడుతూ వచ్చింది.
ఈ స్థితిలో తమనేవరేనా చూస్తె?
"అమ్మో" భయంతో గుండె దడదడ లాడింది.
బెదురుతూ అటూ ఇటూ చూసి "ఉండండి చెయ్యి వదలండి." అంది నెమ్మదిగా.
ఉహూ.... శివరాం ఆమె చేతిని మరింత గట్టిగా తన భుజానికి అదుముకున్నాడు. "అన్నట్లు ఇందాక నేను వస్తున్నప్పుడు పోస్టు మేన్ కవర్లేవో ఇచ్చాడు ఆ కప్ బోర్డు మీద పెట్టాను . ఉండండి....అబ్బబ్బ.... రోజు రోజుకీ మరీ పసి వారై పోతున్నారు." అంటూ అతని చెయ్యి నెమ్మదిగా తప్పించి , తన చేతిని విడిపించుకొని లేచింది.
ఓ కవరు చింపి చదివి నిట్టూర్చి "ఇది అమ్మ రాసింది" అంది.
"ఏమంటారు?"
"ఎవంటుంది?....మామూలే?... చదవండి."
శివరాం ఆ ఉత్తరం చదవడం ముగిస్తూ "ఆవిడంతగా కుమిలిపోతూన్నప్పుడు ఓసారి వెళ్ళకూడదూ?' అన్నాడు.
సునంద దీర్ఘంగా నిట్టూర్చి "నేను మళ్ళీ వాళ్ళ గుమ్మంలో అడుగేట్టేది మీకు ఆరోగ్యం చిక్కాక ఇద్దరం ఏకంగా కలిసి వెళ్ళినప్పుడే ?' అంది.
శివరాం ఏం అనలేదు. అనడం అనవసరం. ఆమె వెళ్ళదని అతనికి తెలుసు. "పెళ్ళి నాటికే టి.బి టింజ్ ఉండి ఉంటుంది. చెప్పకుండా దాచి మా పిల్ల గొంతు కోశాడని" రాఘవయ్య ఎప్పుడైతే శివరాం ని మోసకారి గా నిర్ధారించి మాట జారేశాడో అప్పుడే అయన సునంద కి దూరం అయిపోయాడు. తండ్రి అయేది, అతని తాత అయేది , తన భర్త ని అవమానపరచిన వాళ్ళని ఓ పట్టాన క్షమించదు సునంద. ఈ సంగతి శివరాం కి బాగా తెలుసు. అందుకే ఇంకా విషయంలో మరి రెచ్చ కొట్టకుండా అంతటితో ఊరుకున్నాడు. ఆ ప్రస్తావన మార్చే ఉద్దేశంలో ఆ రెండో కవరు ఎక్కడ నుంచి?' అన్నాడు.
సునంద రెండో కవరు చింపి చదవసాగింది. అది జగపతి రాసింది . జగపతి తనకి జాబు రాయడం ఏవిటి? మొదట ఆశ్చర్య పోయింది. అతని కుర్రతనం పనికి చికాకు పడింది. ఉత్తరం సాంతం చదివే టప్పటికి మనస్సు వికలం అయింది. సునంద ముఖంలో ఇలా రకరకాల భావాలతో రంగులు మారడం చూసి, శివరాం ఆదుర్దాగా "ఏమైంది?..... ఎక్కడ నుంచి ?.... ఎవరు రాశారు?" అన్నాడు.
సునంద మాట్లాడలేదు.
"నిన్నే సునందా? ..... ఎవరు రాశారు?"
"జ...గ...ప....తి"
"ఆ"-- అ పేరు వినేసరి కల్లా శివరాం ఇంగితం అంతా తలకిందులై పోయింది. జగపతి తన భార్యకి ఉత్తరం రాశాడా? అది తీసుకు వచ్చి నా మొహం ఎదురుగుండా ఇది చదువుతుందా? తన నిస్సహాయ స్థితి ని, అనారోగ్య పరిస్థితినీ వీళ్ళిద్దరూ అవహేళన చేస్తున్నారని పించింది శివరాం కి. అవమానం తోనూ, పౌరుషంతోనూ అతని ముఖం ఎరుపెక్కింది. కోపంగా చూసి విసురుగా బెడ్ మీంచి లేచి నిలబడ్డాడు. ఆ హటాత్పరిణామాన్ని చూచి కళవళ పడింది సునంద. ఇదిగో ఉత్తరం చూడండి అంటూ అందివబోయింది.
"నీకు రాసింది ....నేనెందుకు చూడ్డం?.... అందులో ఏం సంగతులున్నాయో ఏమో! అంటూ విసిరి కొట్టాడు . అయ్యో ఆ రోగిష్టి మొగుడితో ఏం అవస్థ పడుతున్నావు? నిన్ను చూస్తె నా మనస్సు కరిగి పోతోంది, అంటూ తన మీద అసహ్యం, అతని మీద అభిమానం పుట్టుకొచ్చే లాగా ఓదార్పు వచనాలేవో రాసి ఉంటాడు. అంతేగా! అయినా వాడెవడో తన భార్యకి జాబు రాయడం ఏమిటి? ఇది తన దగ్గరికి తీసుకొచ్చి తన ఎదురు గుండా చదువు కోవడమే కాకుండా, మీరు కూడా చదవండి అంటూ అందివ్వబోవడం ఏవిటి? ఇంతకంటే సాహసం ఏమైనా ఉందా? ఇంత కంటే ఏ స్త్రీ అయినా భర్తని అవమానపరచగలదా? నిప్పులు కక్కుతూ నిలుచుంది సునంద. ఆ ఉత్తరం లో సంగతులు చూస్తె అతనికింత కోపం రాదు తన మీద అతనేవో తన సంసారం గొడవలు రాసుకుని తన సలహాలు అడిగాడు-- అందుకే ఉత్తరం ఒక మారు చదవండి " అంటూ మళ్ళీ అతనికి అందించింది. దాన్ని తెరవకుండానే ముక్క ముక్కలు కింద పరపరా చింపేసి, కిటికీ లోంచి అవతల పోశాడు శివరాం.
అతని రౌద్ర రూపం చూసి హడలిపోయింది . విధి తన నింకా వెక్కిరిస్తూనే వుంది. తనకి జగపతి ఉత్తరం రాయడం ఏవిటి? అది అయన కంత ఆగ్రహం తెప్పించడం ఏవిటి? అంతా తన దురదృష్టం.
ఆ రాత్రి తెల్లవార్లూ ఊపిరి సలపని దగ్గుతో బాధపడుతూ జరిగిన ఈ సంఘటనకి కుమిలి పోతూ ఎడతెరిపి లేకుండా ఏడుస్తూనే ఉంది సునంద.
