Previous Page Next Page 
పిల్లలతో ప్రేమయాత్ర పేజి 12

 

    ఇంతలో పక్క కాటేజీ లో ఉన్న ఒకాయన వాళ్ళ దగ్గరకు పరుగెత్తు కుంటూ వచ్చేడు. 'విన్నారాండీ యీ వార్తా! ఎంత ఘోరం! ఎంత అపచారం! కలికాలం!' అంటూ రొప్పుతూ ఒకటే అంటున్నాడాయన.
    అయన అరుపులకు పిల్ల లెక్కడ లేస్తారోనని కాంతారావు కళ్యాణి యిద్దరూ బయటకు వరండా లోకి వచ్చి 'యేమయిందండీ?" అనడిగేరు.
    'ఇంకా యేమవ్వాలండి! ప్రళయం వచ్చేస్తోంది. కలియుగం అంతం కాబోతోంది. అందుకే యీ పాపాలన్నీ యిలా రోజురోజుకీ పెరిగిపోతున్నాయ్.' అయాస పడ్డాడా ముసలాయన.
    'ఇంతకూ యీ వార్త మీ చెవుల దాకా రానేలేదటండీ! తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి హుండీ లోని డబ్బుల్లో పదివేల రొక్కం  తక్కువయినాయ్ ట. నిన్న భక్తులంతా పోయిన తరువాత డబ్బు లెక్క కట్టుకుంటుంటే పదివేలు తక్కువైనట్టు తెలిసిందట. అంతా ఒకటే గోల. అన్నట్టు కాజేసిన వానిని అరెస్టు చేసేరట వివరాలింకా తెల్లెదనుకొండి. అయినా యిదెం పొయ్యేకాల మండి! స్వామి వారి హుండీ లోని డబ్బు కాజేయటానికి వాడికి ఎన్ని గుండెలుండి ఉండాలి? ఎన్ని గుండేలుండి ఉండాలి?' అంటూ తన గుండె బాదుకున్నాడాయన.
    కళ్యాణి కి నవ్వొచ్చింది.
    తిరుపతి వెంకటేశ్వరస్వామిని నిలబెట్టి యిలా అడగాలని పించింది ఆమెకు. 'వో ప్రభూ! ఎక్కడున్నావు నువ్వు? మండుటండ;లో కాళ్ళు చచ్చులు పడేలా క్యూలో నిలబడి నీ దర్శనం కోసం పడి గాపులు కాసే ఈ సామాన్య  ప్రజలలోనా? అమాయకులైన భక్తులను మోసపుచ్చి, అడ్డదారిన వారికి దైవాన్ని చూపిస్తానని నమ్మించి డబ్బు గుంజుతున్న పనివాళ్ళలోనా? వాళ్ళు చేసేఘాతుక కృత్యాలను చూసి కూడా వాటిని అరికట్ట వలసిన బాధ్యత తమకున్న దన్న సంగతిని విస్మరించి 'వాటా' కోసం కక్కుర్తి పడి ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోయే ఈ రక్షణ శాఖలోనా? కరకరమని మండుతున్న కడుపులతో క్యూలో నిలబడిన భక్తులను నోరూరిస్తున్న వేడి వేడి గారెలతో ఉన్నావా? లేక దైవం కోసం కొన్న ప్రసాదాన్ని ఎత్తుకు పోయి పళ్ళికిలిస్తూ తినే ఆ వానర మూకల్లో ఉన్నావా? భక్తులను పశువుల్లా అదిలించే ఆ పూజారుల లోనా? లేక దైవం కోసం భక్తులు సమర్పించుకున్న ముడుపుల తాలుకూ పైకాన్ని మింగేయగలిగిన వారిలోనా చెప్పు ప్రభూ! చెప్పు! వీరిలో ఎక్కడున్నావు నువ్వు?" అని.
    సరిగ్గా అదే సమయంలో కళ్యాణి కి గీతాకారుడు తన 'ఉనికి' ని గూర్చి చెప్పిన వాక్యాలు స్పురణ కి వచ్చినాయ్. 'వో అర్జునా! నేను ఎక్కడైనా ఉంటాను. అంతటా వ్యాపించి ఉంటాను. అందరి లోనూ ఉంటాను. సజ్జనుని మంచి తనాన్ని నేను; దుర్జనుని దుర్మార్గాన్ని నేను. వంచకుని మోసాన్ని నేను. జూదరి లోని జూదాన్ని నేను.  భక్తుడి లోని భక్తీ ని నేను, నాస్తికుడి లోని నాస్తికతను నేను. ఈ విశ్వం లో నేను లేని అణువే లేదు. ఈ విశ్వమే నేను. నేనే ఈ విశ్వాన్ని ' యించు మించుగా ఆ వాక్యాల సారాంశం అది.
    కళ్యాణి అనుకుంది అప్పుడు మనస్పూర్తిగా 'ఔను స్వామి! నువ్వు సర్వాంతర్యామి వి. అందులో సందేహం లేదు.' అని.

                                                     *    *    *    *
    ఆ సాయంత్రం పాపనాశనం, ఆకాశ గంగ చూట్టానికి వెళ్ళేరు. అక్కడికి వెళ్ళేందుకు టాక్సీలు సిద్దంగా స్టాండు లో నిలబడి ఉన్నా, టాక్సీ వాళ్ళు మాత్రం యాత్రికులను ఆ ప్రదేశాలకు తీసుకు పోవటానికి అంత సిద్దంగా లేరు. గీచి గీచి బేరమాడి రెండు రూపాయల దూరానికి పన్నెండు రూపాయలు చేతిలో పడితే గాని కదలమని కూర్చున్నారు. 'పోనీలే మనం యాత్రలకు వచ్చింది డబ్బు ఖర్చు పెట్ట్టానికీ కదా' అని సరిపెట్టుకుని వాళ్ళడిగినంత డబ్బు యివ్వటానికి కాంతారావు సిద్దమయినా 'మరో ముగ్గురు మనుషులన్నా- అంటే కనీసం 'ఐదుగురు మనుషులన్నా ఉండందే టాక్సీని యిక్కడ నుండి చస్తే  కదిలించను' అన్నట్టు భీష్మించుకున్నాడు.
    మరో ముగ్గురు మనుషులను తమతో రమ్మని బ్రతి మలటానికి వేట ప్రారంభించేడు కాంతారావు. ఎలాగో వో కుటుంబం కలసింది టాక్సీ కదిలింది.
    తుప్పలను, పొదలను దాటుకుంటూ ఎగుడుదిగుళ్ళు రోడ్డు మీదుగా టాక్సీ కదిలి పోతుంటే కళ్యాణికి మళ్ళీ ప్రాణం హాయిగా ఉంది. ప్రయాణం అంటే కళ్యాణి కి చాలా యిష్టం. వేగంగా నడచే కారులో కూర్చుని దూసుకు పోతున్న చెట్లను, పుట్ల ను కొండలను దాటి ఎక్కడికో గమ్యం తెలియని ప్రదేశాల లోనికి, ఎన్నిటికీ అంతం కాని యాత్రలో జీవితాన్ని గడపెయాలనిపిస్తుందామేకు. ముఖ్యంగా ఆ ప్రయాణం జన సందోహానికి దూరంగా ఉంటె మరీ యిష్టం. ఆ ప్రయాణం పచ్చని చేల మధ్యగా గాని, మహా వృక్షాల మధ్య గాని, ఆఖరికి ముళ్ళ కంచేల మధ్యనైనా సరే.... అది మానవ కల్పితమైన వాతావరణం కాకపొతే అంతే చాలు ఆమెకు సహజమైన ప్రకృతి యే రూపంలో ఉన్నా ఆమె కంటికి మనోహరంగానే కనిపిస్తుంది. ఆకులూ రాలి , కొమ్మలు విరిగి , మొద్దులా నిలబడిన ఎండిన మ్రాను కూడా ఆమెను కళాత్మకం గానే ఉంటుంది. కారణం మరేం లేదు. ప్రకృతి లో సహజత్వం ఉంది. మనుషులలో కృత్రిమత్వం - నటన ఉంటాయ్. అందుకే ఎక్కువ సమయం మనుషుల మధ్య కన్నా ప్రకృతి తోనే గడిపేస్తే బాగుంటుందని పిస్తుంది. కాని అలాటి అవకాశం నాగరిక ప్రపంచంలో యాంత్రికంగా బ్రతుకుతున్న తనకి సాధ్యం కాదు. అందుకే ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి జీవితంలో తరచుగా యిలాంటి యాత్రలు చెయ్యవలసిన అవసరం చాలా వుంది.
    పుణ్య యాత్ర పేరుతొ గాని, ప్రేమ యాత్ర పేరుతొ గాని కనీసం ఏడాది కో సారన్నా ప్రతి మనిషి రొటీన్ జీవితాన్నుండి తాత్కాలికంగా తప్పించుకుని ప్రకృతి దృశ్యాలను ప్రాచీన కళా ఖండాలను చూసి కొంతలో కొంత మానసిక శాంతి పొందవచ్చు. ఇలాటి ప్రయాణాలు ఆలోచనలను విస్తృత పరుస్తాయ్. హృదయాన్ని స్పందింపజేస్తాయ్.
    కళ్యాణికి చాలా నిరాశకలిగించేలా, ఆమె ఆలోచనలు బ్రేక్ వేస్తూ టాక్సీ చాలా తక్కువ టైము లోనే 'ఆకాశ గంగ' దగ్గర ఆగింది. టాక్సీ ఆగిన చోటుకు , గమ్య స్థలానికి, మధ్యదూరం కొంచెం ఎక్కువే ఉండటం వల్ల వాళ్ళు నడిచే వెళ్ళాలి. కాని ఎగుడుదిగుడు గా ఉన్న ఆ ప్రదేశంలో పాప నెత్తుకుని నడుస్తూ ఉన్నా ఆమెకు అలసట అనేది అనిపించ లేదు. బూడిద రంగులో ఉన్న నేల, అక్కడక్కడ 'రాళ్ళు రప్పలు తుమ్మపొదలు , అన్నీ ఎంతో సహజంగా , అత్యంత ప్రియంగా ఉన్నాయ్ ఆమెకు. ఆ ప్రదేశం లో నడుస్తుంటే ఏదో ఒక నూతన ప్రపంచం లోకి అడుగు పెడ్తున్నట్లు అనుభూతి కలుగుతోంది.
    కొన్ని నిమిషాలలో 'ఆకాశ గంగ' దగ్గరకు వచ్చేరు. పేరుకు తగ్గట్టు అక్కడ గంగా ప్రవాహమేమీ లేదు. ఎత్తైన గుట్ట ఒకటి, మూడు గోడలతో గుహ లాగా కనిపిస్తోంది. అందులో ఒకవైపు నుండి సనన్నిదార గా  నీళ్ళు పడుతున్నాయ్. క్రింద పడి చిన్న నీళ్ళ గుంటలా ఉన్న ఆ ప్రవాహం లో అందరూ కాళ్ళు కడుక్కున్నారు. గుహలాగా ఉన్న ఆ గుట్టాను దూరం నుండి చూస్తె వో చిన్న సైజు లోయలా ఉంది. అక్కడ ఒక బ్రాహ్మణుడు కూర్చుని ఏదో విగ్రహాన్ని పెత్తుకుని పూజ చేస్తున్నాడు. భక్తులందరూ ఆ నీళ్ళలో నుండి నడిచి వెళ్ళి కొబ్బరి కాయలు, పళ్ళు , పూలు , పైసలు ఆ బ్రాహ్మణుడి కి సమర్పించుకుని వస్తున్నారు. కళ్యాణి కి చీర నెత్తుకుని నీళ్ళలో నడచి వెళ్ళటానికి సిగ్గనిపించి యివతల గానే నిలబడింది పిల్లలతో. కాంతారావు పాంటు పైకి- మడచుకుని వెళ్ళి వో పది పైసలు దేవుడికి సమర్పించి, కుంకం, పూలు తీసుకు వచ్చేడు.
    ఆ ప్రదేశం ఏకాంతంగా ఊరికి దూరంగా ఉన్న 'ఆకాశ గంగ' దృశ్యం చాలా మనోహరంగా ఉంది. చుట్టూ దట్టమైన చెట్లు, పచ్చగా నిండుగా  యాత్రికులను కనుల పండువ చేస్తున్నాయ్. వాటి పైన సంధ్యారుణ కాంతులతో వెలిగి పోతున్న ఆకాశం. సన్నగా పడుతున్న నీటి ధార.... చిన్న సైజు లోయలా కనపడుతూన్న ఆ గుట్ట , దాని మీద బ్రాహ్మణుడు .....అన్నీ ఎంతో వింతగా ఉన్నయ్. ఈ భక్తులేవ్వరూ లేకుండా, ఆఖరికి తన భర్తని పిల్లలను కూడా వదిలి కొంతసేపు ఆ బండ రాళ్ళ మీద ఏకాంతంగా, సోమరిగా కలలు కంటూ , గాలికి ఊగే ఆకుల చిరుసవ్వడి ని వింటూ , చల్లని పిల్ల వాయువులతో శరీరాన్ని నింపుకుని మౌనంగా ఉండి పోవాలనిపించింది కళ్యాణి కి.
    ఉదయం 'క్యూ' లో నిలబడి నానా అవస్థలూ పడి శరీరాన్ని మనసు నీ హూనం చేసుకుని ఆ దైవాన్ని సందర్శించి నప్పటి కన్న యీ పచ్చని ప్రకృతి మధ్య జన సమూహం లేని యీ ప్రదేశం లో ఏకాంతంగా నిల్చుంటే ఎంతో ప్రశాంతత కలుగుతోంది మనసులో ఎందుకో!
    'ఏమిటిలా పరధ్యానంగా నిలబడ్డావు? ఔన్లె! ఈ ప్రదేశం నీకు నచ్చటం లో ఆశ్చర్యం లేదు. కొంపతీసి యింటికి వెళ్ళగానే మళ్ళీ కవిత్వం వ్రాయవు కదా?' అన్నాడు పరిహాసంగా కాంతారావు.
    ఆలోచనల నుండి తేరుకుని చురుక్కున చూసింది భర్త వంక కళ్యాణి. 'నా ముఖానికి తోడూ కవిత్వం వ్రాయటం కూడానా! మిమ్మల్ని చేసుకున్నప్పుడే నాలోని కవితా శక్తి చచ్చిపోయింది. ఈ పిల్లలు సంసార జంజాటం లో కవిటం సంగతటుంఛి....... ఈమూడు సంవత్సరాల్లోనూ గట్టిగా ఊపిరి పీల్చుకునే సమయమైనా లభించలేదు నాకు. అందుకే అరుదుగా లభించిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోవటం యిష్టం లేక కాసేపు ఒంటరిగా సర్వం మరచి నిల్చున్నాను.' అంది అలా అంటుంటే కళ్యాణి కళ్ళు ఆర్ద్రమయినాయ్.
    కాంతారావు మనసుకు ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. కళ్యాణి మాటలు వింటుంటే 'మిమ్మల్ని చేసుకున్న నాడే నాలోని కవితా శక్తి చచ్చిపోయింది.' అన్న వాక్యం మరింత లోతుగా దూసుకుని బాధించింది అతనిని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS