Previous Page Next Page 
ముద్ద మందార పేజి 12

 

    రాధ ప్రవర్తనలో నాకు ఏదో మార్పు కనుపించింది. మునుపులా ఆమె ఉత్సాహంగా ఉండటం లేదు. ఒకవేళ నా ఆల్బం చూసిందేమో అనే అనుమానం వచ్చింది. పైగా 'ఆ' సంఘటన ఆమె కేదైనా అనుమానం కల్గించిందేమోనన్న అనుమానం కూడా కలిగింది. చాలాసార్లు "ఏం? అలా ఉన్నావ" ని అడిగాను. అడగ్గా అడగ్గా వోనాడు ఆమె ప్రసన్నురాలయ్యింది. "నా కోర్కె తీరుస్తే మీ కో మంచి విషయం చెప్తాను" అంది. ఆమె కళ్ళల్లో అనిర్వచనీయమైన ఆనందం వెలుగుతుంది.
    "ఏమిటో అది శలవియ్యండి" అన్నాను. ఆమె జడ పట్టుకుని విప్పుతూ. "ఏమిటిది?' అంటూ నా చేతిలోని తన జడను లాక్కుని "మనిద్దరం మహాబలిపురం వెళ్ళాలి. అక్కడ చెప్తాను" అంది.
    "వో యస్. ఇంతే కదా! పదయీ పూటే వెళ్దాం." అన్నాను. రాధ వెంటనే వో చిన్న లెదర్ బ్యాగులో తగు బట్టలు సర్దింది. సాయంత్రానికి మహాబలిపురం చేరాము. రాతి రధాలూ, కట్టడాలూ, చక్కడాలూ మరోసారి చూసి సముద్రపోడ్డు చేరాము.
    "ఆ, యిప్పుడు చెప్పు" అన్నాను యిసకలో వెల్లకిలాపడుకుని, తల క్రిందరెండు చేతులూ సరిగా పెట్టుకుంటూ. రాధ నామీదకు వంగి, చొక్కా గుండీలు సరిచేస్తూ "వో విషయం అడుగుతాను, ఉన్నదున్నట్టు చెప్తానని మాటివ్వాలి" అంది.
    నేను ఉలిక్కిపడి, లేచి కూర్చుని, "ఏమిటి?" అన్నాను. సింహాచలం విషయం గానీ, రాధ కనిపెట్టేసిందేమోనన్న అనుమానం వచ్చింది. భయం వేసింది. రాధ తన చూపులను వాల్చుకుని, ఇసకలో ఏవేవో పిచ్చి గీతలు గీసి, అవన్నీ చెరిపేసి 'ము'అనే అక్షరాన్ని రాసి, అదీ చెరిపి 'మ' రాసి 'చెప్పనా' అంది. దాన్ని చెరిపేస్తూ. 'చెప్పు" అన్నాను యాంత్రికంగా . రాధ నాకేసి ఒక్కసారి చూసి, తల దించుకుని "మీకూ , మందారపువ్వు కూ ఏదో చాలా సంబంధం ఉంది. దాని వెనుక ఏదో ఒక బలమైన గాధ ఉండుండాలని నాకు అనిపించింది. అది చెప్తే వినాలని కోర్కెగా వుంది" అంది.
    నేను గట్టిగా గాలి తీసుకోడానికి కూడా భయపడ్డాను.
    "చెప్పాలని లేకపోతె మాత్రం వద్దు. కానీ అబద్దం మాత్రం కల్పించి చెప్పకండి" అంది. కొరడాతో కొట్టినట్టు అయింది నాకు. సింహాచలం విషయం చెప్పాలా, వద్దా అనే సమస్య ప్రాణాంతకంగా తయారయ్యింది.
    "పోనీ వద్దులెండి. మీ మనస్సు కష్టపెట్టడానికి నాకు అధికారం లేదు. చెప్పరాని విషయమైనా, చెప్పేటంతటి విషయంగా పోయినా వద్దు. ఆ సంగతి వదిలెయ్యండి" అంది. నాకు ఎందుకో మొండి ధైర్యం వచ్చింది.
    "విను రాధా. ఏనాడో నీకు చెప్పాల్సిందసలు" అంటూ రాధ ముఖం చూడకుండా చెప్పవలసిందంతా చెప్పి, "అది రాధా మందారపువ్వు కధ. ఒకనాటి నా నిర్భలత  ఒక అమాయిక జీవితం నాశనం చెయ్యడమే గాకుండా మరో అమాయక జీవిని యీ ప్రపంచంలో ప్రవేశపెట్టింది. బహుశా ఆమెకు కొడుకు పుట్టి ఉండచ్చు" అన్నాను. ఆమె కేసి చూసే ధైర్యం చాలలేదు. అంతా విన్నాక, రాధ నన్ను క్షమించదు. ఏ స్త్రీ అయినా క్షమించదేమోనని పించింది. కాస్సేపటికి  వెక్కిళ్ళు వినపడ్డాయి. రాధ వెక్కి వెక్కి ఏడుస్తోంది.
    "రాధా నన్ను క్షమించలేవా" అన్నాను. ఆమె మాట్లాడలేదు.
    మరి పది నిముశాలయ్యాక, "రాధ! చెప్పు. నన్ను క్షమించలేవా! నీకు తెలియకుండా యీ బాధను నా మనస్సులో పెట్టుకుని కుమిలిపోతున్నాను.నువ్వు క్షమిస్తే నా మనస్సు శాంతిస్తుంది." అంటూ ఆమె రెండు చేతులూ పట్టుకున్నాను. రాధ తల ఎత్తలేదు. తన చేతులు లాక్కోనూ లేదు. గట్టిగా నిట్టూర్చి, :మీ నీడని బ్రతకవలసిన దాన్ని నేను. మీ తప్పులు ఎంచేశక్తి , క్షమించే హోదా నాకు ఎప్పుడూ ఒద్దు. నాకే అధికారం వద్దు." అందంతే. రాధ క్షమించదని నాకు తెలుసు. స్త్ర్రీ సహనానికి కెంత మారు పేరయినా ఆ సహనానికి హద్దుంది.
    మరో అరగంట అలాగే శిలా ప్రతిమల్లాగా కూర్చున్నాము. మౌనం చాలా భయంకరంగా ఉండడం వల్ల "నువ్వేదో చెప్తానన్నావు కదా" అన్నాను జంకుతూ.
    "ఏమీ లేదు. చీకటి పడ్తోంది. ఇక వెళ్దాం." అంటూ రాధ లేచి నిలబడింది. ఆమె గొంతులో వున్న స్థిరత్వం నన్ను మరో సారి ప్రశ్నించ నివ్వలేదు.
    ఒకరి కొకరు సంబంధం లేని వాళ్ళులాగ యింటికి చేరాము. మూడు రోజులయినా, రాధ ప్రసన్నురాలు కాలేదు. అవదేమోనని భయం వేసింది. ఆమెను బ్రతిమాలాను. విషాదంగా నవ్వి, "బాధ పడరాదనుకుంటే మాత్రం? అది మన చేతులో వుందా.... సరేలెండి. ఈ అసంతృప్తి ఒకటి రెండ్రోజులుండి పోతుందంతే " అంది.
    మూడ్రోజులు గడచిన నాల్గోనాటికి రాధ తల్లి వచ్చింది. ఆవిడను చూడగానే నా బుర్ర తిరిగింది. రాధ "నా కధ' తన తల్లికి రాసి , ఆవిడను తెప్పించిందేమో నన్న అనుమానం కలిగింది.
    "రాదని తీసుకు వెళ్ళడానికే వచ్చానోయ్" అంది జానకమ్మ గారు మధ్యాహ్నం భోజనమయ్యాక.

                                   7

    నాబుర్ర దిమ్మేక్కి పోయింది.  
    ఆవిడ తీరుబడిగా తమలపాకులు నవుల్తూ , "ఇదా పట్నం . నువ్వా ఆఫీసుకి పోతావు. అదా వంటరిగా వుండాలి. వుత్తరం రాయడంతోనే రెక్కలు కట్టుకుని వచ్చాను. ఇంతకీ నువ్వేమంటావు? మగపిల్లాడంటాను నేను. ఆడపిల్లంటారాయన. ఎవరి కోర్కె నెగ్గుతుందో......." నా శరీరం ఝల్లుమంది.
    రాధ నాతొ చెప్తానన్న విషయం ఇదా! నా పాపిష్టి కధ విన్నాక చెప్పడం మానేసి వుంటుంది. రాత్రి రాధను ఆసంగతి అడిగి "రాధా , నా మీద నీకు కోపం రావడం సహజమే కాదను. కానీ, నన్నింత కఠినంగా శిక్షించితే నేను బ్రతగ్గగలనా" అన్నాను.
    "ఏం చేశాను" అంది రాధ చాలా తాపీగా.
    "ఆ' సంగతి చెప్పి, నీ నోటితో నువ్వు చెప్తే ఎంతానందించి వుందును? రాధా అంత పాపినా నేను. నన్నింతగా బాధపెడ్తావా" అన్నాను రాధ చై పట్టుకుంటూ.
    రాధ వేదాంతి లా నవ్వి, నాచేతిలోని తన చేతిని విడిపించుకుంటూ , "అదంతా మీకు కొత్త కాదుగా. అందుకని ఆనందపడరనుకున్నను" అంది. ఆమాట నా హృదయంలో శూలంలా గుచ్చుకుంది. మరి మాట్లాడ లేకపోయాను. ఆ రాత్రి గడిచి, తెల్లావారే సరికి నాకు పది సంవత్సరాల వయస్సు ఎక్కువయినట్టయ్యింది. రాధ ఆరోజే ప్రయాణం అయ్యింది. నేనేమీ ఆపలేదు. రైలు కదిలేముందు మాత్రం "వీలుంటే ఒక్క కార్డు మాత్రం ఎప్పుడేనా రాయండి. మనస్సు బాగుండక పొతే గోపాలపురం వెళ్ళండి. ఆవిణ్ణి కూడా తీసుకు రండి. మనతో పాటే వుంటారు. నిజానికి మీమీద నాకన్నా ఆవిడకే ఎక్కువ హక్కుంది." అంది. రైలు క్రింద తల పెట్టుకుందామని పించింది.
    రైలు కదిలి పోయింది.
    బరువెక్కిన గుండెతో యింటికి చేరాను. లంకంత యింటికి వంటరి గాణ్ణయ్యాను. భాస్కరం హాయిగా వేసంగులకు అత్తారింటికి వెళ్ళాడు.
    ప్చ్--- నవ్వేవాళ్ళకి నవ్వే రోజులు, ఏడ్చే వాళ్ళకు ఏడ్చే రోజులు -- ఇదే న్యాయమేమో.
    రాదా.... సింహాచలం ....ఇద్దరూ ఆడవాళ్ళే. కానీ, మనః ప్రవృత్తులు కెక్కడా పొత్తు లేదు. లేనేలేదు. తన జీవితం నాశనం చేసినవాడిని క్షమించి, వాడినే సుఖపడమని వదిలేసింది. సింహాచలం.
    తన సొత్తును కొన్న వ్యక్తితో పరులకు భాగం వుందని తెలిసాక, తన మనస్సును సమాధాన పరచుకో లేక, ఆ వ్యక్తితో యిదివరలా వ్యవహరించలేక, ప్రేమను చంపుకోలేక -- రెంటి మధ్య నలిగి పోతోంది రాధ.
    ఆ రాత్రంతా నరకయాతన పడ్డాను -- నేను.

                              *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS