"ఏమయ్యా, ఇంత ఆలస్యం? బొత్తిగా ఇండియన్ పంక్చ్యుయాలిటీ దాటేస్తున్నావు." బయట వరండాలోనే తిరుగుతున్న కృష్ణమూర్తి గారు అన్నారు.
ఆయన మాటలకు చిరునవ్వుతో, "త్వరగానే రావాలనుకున్నానండి. ఇంతలో ఒక స్నేహితుడు ఎదురయ్యేటప్పటికి..." అన్నాడు.
"స్నేహితుడా,స్నేహితురాలా?" విచారించారు చిరునవ్వుతో చనువుగా.
ఆయన ఎవర్ని ఉద్దేశించి అన్న మాటలో గ్రహించి నవ్వుతూ, "స్నేహితురాళ్ళు ఎదురు రారుగదండీ, ఎదురు రప్పించుకుంటారుగాని" అన్నాడు.
ఆయన ఫక్కున నవ్వుతూ, "సరిగ్గా చెప్పావు. పద పద" అంటూ లోపలికి దారితీశారు.
"ఏమిటో, శ్రీనివాస్, నీ కా లైబ్రరీలో ఉద్యోగం ఏమిటో? .... నాకు బాగాలేదు."
"అదేమిటి సార్ అలాగంటారు?"
అతని ముఖంలో మారిన రంగులు చూస్తూ, "అది కాదోయ్. ఒక్కటి చెప్పు. పెద్దచదువులకు పోగలిగే స్తోమతు ఉండి, చదవగలిగే తెలివి ఉండి, పై ఉద్యోగం సంపాదించగలిగే అర్హతలున్నవాళ్ళు అకారణంగా ఇలాటి చిన్న ఉద్యోగాలలో స్థిరపడిపోతామంటే, ఆ ఉద్యోగంకోసం తహతహలాడే అభ్యర్దుల గతేమంటావు?" అన్నారు.
శ్రీనివాస్ తేలికగా శ్వాస వదులుతూ "మీరు చెప్పినట్లే చూస్తే అది నిజమే అనుకోండి. అయిన నాకీ ఉద్యోగంలో ఉన్న ప్రశాంతత, సంతృప్తి మరెందులోను దొరకలేదు" అన్నాడు.
"ఇంతకుముందు ఇంకేం ఉద్యోగాలు చేశావేమిటి?" అడిగారు నిశితంగా చూస్తూ.
"ఆఁ! ఏవో మామూలు వేనండీ!" అని దాటవెయ్యచూచాడు.
"పోనీ, ఏ ఉద్యోగమూ నచ్చకపోతే, చదువు మొదలుపెట్టవచ్చు కదా!"
"ఇంకా ఇప్పుడేం చదువు? అంత సరదా, ఓపికా రెండూ లేవు."
"అదేమిటయ్యా, ఏదో ముసలాడివయినట్లు మాట్లాడతావు! నాకు ఎవరూ సీట్లు ఇచ్చే దాత కనిపించలేదుగాని, ఉంటే ఇంకెందులోనయినా స్పెషలైజ్ చెయ్యాలని ఉంది."
"అందరూ మీఅంత అదృష్టవంతులు ఉంటారా? కావాలనుకున్న ప్రొఫెషన్ లోకి వెళ్ళగలగటం, ఏరుకున్న ప్రొఫెషన్ లో సంతృప్తి పొందగలగటం-అందరినీ వరించ దా అదృష్టం."
"అదృష్టం వచ్చి మనని వరించదు. మనం దాన్ని వెతుక్కోవాలి. సంతృప్తి అయినా అంతే! సంతృప్తి మనకు కలుగుతుందనుకోవడం ఒక భ్రమ. ఉన్నవాటితో సంతృప్తి పడటం నేర్చుకోవాలి" అన్నారు.
ఇంతలో వంటవాడు వచ్చి భోజనానికి పిలవడంతో ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది. 'అమ్మయ్య' అనుకుంటూ లేచాడు.
"ఇవాళేమయినా ప్రత్యేకమయిన రోజా? నన్ను భోజనానికి పిలిచారు!"
"ప్రత్యేకత ఏమీలేదు. నువ్వు కనిపించి చాలా రోజులైంది. నేనటు వచ్చీ అంతేననుకో. బొత్తిగా తోచడంలేదు. సరే, ఈ విధంగా అయితే ఎక్కువ సమయం గడపవచ్చు కదా అని."
"నిజమే! ఇంత ఇంట్లో ఒంటరిగా గడపటం కష్టమే!" అంగీకరించాడు.
"ఇంత ఇంట్లో ఏమిటి? ఎంత ఇంట్లోనయినా కష్టమే! ఇక్కడికి వచ్చెయ్. మా ఇంట్లో ఉండుదువుగాని."
సమాధానంగా నవ్వి ఊరుకున్నాడు. కొద్ది నిముషాలు అన్నం తినడంలో నిమగ్నుడయ్యాడు. శ్రీనివాస్ తో ఇది ప్రత్యేకమయిన దినం కాదన్నాడు గాని, ఈ దినం నిజంగా ప్రత్యేకమే ఆయనకు. తన ఏకైక పుత్రుడు తన ఇంట్లో తన సహపంక్తిని భోజనం! ఎదట కుర్చీలో తలవంచుకుని భోజనం చేస్తున్న శ్రీనివాస్ ను చూడగానే అవ్యక్తానుభూతి హృదయాన్ని నింపింది. కొద్ది క్షణాలు తదేకంగా అతనివంక చూస్తూ ఉంటే మనస్సులో అంతులేని ఆరాటాన్ని కలగచేసింది. అప్పటికప్పుడు జరిగినదంతా చెప్పి ఆ క్షణంలో ఒక్కసారి గాఢాలింగనం చేసుకోవాలనిపించింది. మునుపెన్నడూ ఎరగని ఈ దివ్యానుభూతికి తనలో తనే ఆశ్చర్యపోయారు కృష్ణమూర్తిగారు. తమకు తెలియకుండా తమలో పిల్లలంటే ఇంత బలీయమయిన కాంక్ష ఉన్నదా అనిపించింది ఆ క్షణంలో.
రకరకాల భావాలు చుట్టుముట్టిన ఆయనకు ఆ పూట భోజనం రుచించలేదు. ఆయన తింటున్న విధానాన్ని చూచి కొంచెం ఆశ్చర్యంపొందినా మౌనంగా ఊరుకున్నాడు శ్రీనివాస్.
"ఇళ్ళు తగలబడ్డ రోజు విషయం శేఖరం చెప్పాడు" అన్నారు కృష్ణమూర్తి గారు వక్కపొడి అందిస్తూ.
".............................."
"దానికి కారణం వినాలని ఉంది."
"నేను చెప్పిన విషయం ఆయన మీతో చెప్పే ఉండాలే!" అన్నాడు చివరకు.
"ఒక డాక్టర్ గా అది నేను నమ్మగలనంటావా?"
"ఒక్కొక్కసారి నిజాన్ని నమ్మాలనిపించదు."
"నమ్మకమయిన నిజం ఆ క్షణంలో కాకపోయినా తప్పకుండా నమ్మకం కలిగిస్తుంది, శ్రీనివాస్! ప్రతి మనిషిలో మంచి, చెడులతోపాటు ధీరత్వం, బలహీనతకూడా ఉంటాయి. మనలో ఉన్న బలహీనతకు దాచుకోవలిసిన అవసరం ఉందనుకోను, ముఖ్యంగా పురుషులకు."
"కాని ఉన్న అసమర్ధతను బహిరంగం చెయ్యలేకపోవడమే మనలోని బలహీనత అయితే? .... జీవితంలో కొన్ని బలహీనమయిన క్షణాలే జీవిత విధానాన్ని మారుస్తూ ఉంటాయి. అది బహిరంగం చేసే ధీరత్వం అందరిలోనూ ఉండదు."
అనాలోచితంగా అన్న మాటలతో కృష్ణమూర్తిగారి ముఖంలో ఒక్కసారిగా కళ తప్పింది. అది గమనించని శ్రీనివాస్ మౌనంగాఉండిపోయాడు. కొద్ది క్షణాలలో తేరుకుని, "నీ ఇష్టం. నీకేదయినా చెప్పాలనిపిస్తే చెప్పు. ఇందులో బలవంతమేమీ లేదు. కాని నువ్వు చెప్పిన విషయం నిజమనిమాత్రం నేననుకోను. నీ వెప్పుడైనా ఈ విషయాన్ని గురించి చర్చించడానికి సిద్ధమైనప్పుడు నన్ను తప్పకుండా గుర్తుంచుకో. నీ ఉన్నతి, అభివృద్ధి కోరుకునే ముఖ్యులలో నేనూ ఒకడిని అని తెలుసుకుంటే చాలు."
గంభీరంగా వెలువడుతున్న ఆ మాటలలో నిగూఢంగా దాగిఉన్న ఆయన బాధ గమనిస్తూ లోలోనే ఆశ్చర్యపోయాడు.
18
"సాయంత్రం మంచి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. వెడదాం, వస్తారా?" అడిగాడు శ్రీనివాస్.
"ఇవాళా?" అంది అనూరాధ మొహం అదోలా, అయిష్టంగా పెట్టి.
"అదేం అట్లా అన్నారు?"
"ఫైనల్ ఇయర్ కదండి. ఏదో కొంచెం ముక్కున పట్టి అప్పగించేస్తే, ఈ గోల వదిలిపోతుంది."
"అదా! ఫరవాలేదు లెండి. మరీ ఎక్కువగా చదివితే అజీర్తి చేస్తుంది."
"రేపు కర్మంకాలి నేను తప్పానా....మిమ్మల్నే నిందించేది."
"పోనీ, అలా కాసేపు బీచికి వెడదాం రండి, అలిసిపోయిన మీ మెదడు కొంచెం చల్లబరుద్దాం."
"నిజానికి నేను అంత అలిసిపోలేదుగాని, అయినా నేను మీతో ఇంక బీచికి రాను" అంది ఎటో చూస్తూ.
ఆమె ముఖంవంక చూచి నవ్వుతూ, "అదేమిటండి! అంత పాపం ఏం చేశాను, ఒంటరిగా బీచికి వెళ్ళడానికి?"
"మీరు బీచికి వెళ్ళి మీ సౌందర్యారాధనలో మునిగిపోతే, నేను ఒంటరిగా మిగిలిపోతాను."
"నేను నిజంగానే సౌందర్యారాధకున్నయితే, నే నారాధించే సౌందర్యం ఎవరిదో మీకీపాటికి తెలిసిఉండాలే!" అన్నాడు చిలిపిగా.
మౌనంగా కళ్ళు వాల్చుకుంది.
"మీరు అడిగిన ఏ ఒక్క విషయానికి నేను సరిగ్గా మాట్లాడటం లేదనేగా మీకు కోపం వచ్చింది? ఈసారి ఆ పరిస్థితి కలగనివ్వనులెండి! పదండి, వెడదాం."
"ఒక్క నిమిషం" అంటూ లోపలికి వెళ్ళింది తల్లి అనుమతికోసం,
కొద్దిక్షణాల అనంతరం తిరిగివస్తూ, "కారులో వెడదాం. ఇవాళ కారు ఇంట్లోనే ఉంది" అంటూ తాళాలు శ్రీనివాస్ కు అందించింది.
కారు ముందుడోరు తెరిచి పట్టుకున్నాడు. లోపల అనూరాధ కూర్చోగానే తలుపు వేసి, తిరిగివచ్చి స్టీరింగుముందు కూర్చున్నాడు.
కారు కొంచెం దూరంగా ఆపి, డదిగి నడుద్దామనుకున్నారు. కాని బాగా ఈదురుగాలిగా ఉండటంతో ఇసుక బాగా పైకి రేగుతూంది. కొంతసేపు కార్లోనే కూర్చుని కిందికి దిగుదామా వద్దా అని ఆలోసిస్తూ డోర్ తెరవగానే గాలిలో ఎగురుతున్న ఇసుకరేణువులు ఎగిరివచ్చి అనూరాధ కంట్లో పడ్డాయి. 'అబ్బా' అనుకుంటూ ఒక్కసారిగా కళ్ళు మూసుకుని తెరిచి చూచింది. హాండ్ బాగ్ లోనించి రుమాలు తీసి కంట్లోనించి నలక తియ్యాలని ప్రయత్నించింది. కన్ను బాగా ఎరుపెక్కి నీళ్ళు కారసాగిందికాని నలకమాత్రం రాలేదు. ఎర్రపడ్డ ఆమె కన్నువంక చూస్తూ, "ఇటు తిరుగుతారా, నేను చూస్తాను" అన్నాడు. జలజలా నీళ్ళు కారుతున్న కన్ను చూచి వెంటనే రుమాలు తీసి దాని కొసతో క్షణంలో కంట్లోంచి నలక తీశాడు.
"వచ్చేసింది. ఇంక మండదు. చూశారా, కళ్ళజోడుతో ఎడ్వాంటేజ్?" అన్నాడు తన కళ్ళజోడు తుడుచుకుంటూ.
"ఇంకా ఏదో ఉన్నట్లుంది" అంది వేలితో రెప్పమీద రాస్తూ.
"మీరు నలపకండి. కొంచెంసేపు ఊరికే అలా అనిపిస్తుంది. అదె తగ్గి పోతుంది. ఇదిగో, మీ శత్రువు" అన్నాడు రుమాలు కొసకు తడిమూలంగా అతుక్కున్న నల్లని రేణువు తీసి చనువుగా అనూరాధ అరిచేయి తెరిచి అందులో ఉంచుతూ.
"ఇంత గొప్ప స్నేహితుడు ఇంత బుల్లిశత్రువును తరమకుండా ఉండగలరా?" అంది అతనివంక చూచి నవ్వుతూ.
"ఇంత గొప్ప స్నేహంలో కలిగే సౌఖ్యంకంటే ఇంత బుల్లిశత్రువు ఇచ్చే బాధే ఎక్కువ."
"అబ్బ, నేను అంతసేపు ప్రయత్నించినా రాలేదు! మీరు అర క్షణంలో తీశారు. ఎంతయినా మీ డాక్టర్లకున్న నేర్పు మా కెలా వస్తుంది?" అంది ఓరగా చూస్తూ.
అంతసేపు ఎంతో ఉల్లాసంగా ఉన్న అతని ముఖం ఉదాసీనంగా మారిపోయింది. అతనివంక అభిమానంగా చూస్తూ, "ఈ విషయం ఎప్పుడు ఎత్తినా మీరు మందకొడిగా మారిపోతారు. ఎందు కింత దాచాలని ప్రయత్నిస్తారు? నాతో చెప్పకూడదా?" అంది.
"..................................."
"పోనీ, ఒక్క విషయం చెప్పండి. మీరు మెడిసిన్ చదివారా, లేదా?"
"నేను లేదంటే మీరు నమ్మరుగా."
"నేను నమ్మటం, నమ్మకపోవటం తరవాత విషయం. మీ విషయాలు మీద్వారా వినాలని ఉంది."
"మీరు వినడానికి, నేను చెప్పడానికికూడా అంత చెప్పుకోదగ్గవిషయాలు లేవు. అయినా ఇంత ప్రశాంతంగా ఉన్న సమయాన్ని నా సమస్యలతో కలుషితం చెయ్యాలని చూస్తారేం?"
"ప్రశాంతంగా ఉన్న సమయం కలుషిత మెలా అవుతుంది? అయినా అనుమానపు తెరలు విడిపోతే మరీ ప్రశాంతంగా ఉంటుంది."
"ఎందు కింత జిజ్ఞాస, అనూరాధా!"
"బావుంది. మీ విషయాలలో కాకపోతే, ఆ దారినపోయేవాళ్ళమీద ఉంటుందేమిటి?" అంది చిరుకోపంతో.
ఆమె కోసం చూసి నవ్వుతూ, "ఏం చెప్పమన్నారో చెప్పండి!" అన్నాడు.
"అదే మీరు ఇన్నాళ్ళు అబద్ధం ఎందుకు చెప్పారో... చెప్పవలసిన అవసరం..."
"అబద్ధం చెప్పాలని చెప్పింది కాదు, అనూరాధా! కాని ఉన్నదున్నట్లు చెబితే ప్రతి ఒక్కళ్ళకు ఏదో ఒక విధమైన కుతూహలం కలుగుతుంది. దానితో ఎక్కడలేని ఆరాలు అడగాలని ప్రయత్నిస్తారు. అదే నాకు ఇష్టం లేదు. నాకు నచ్చిన పని నేను చేస్తూ ఒకరికి సంజాయిషీ ఇవ్వడం సహించలేను."
"అది సంజాయిషీ ఎలా అవుతుంది? మీమీది అభిమానంతో అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నించడం కేవలం ఇష్టంతోనేగాని, అధికారంతో కాదు, శ్రీనివాస్. మీకు మరీ బాధ కలిగించేదయితే చెప్పకండి. మీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెబుదురుగాని. ఇందులో బలవంతమేముంది?"
"వద్దు, అనూరాధా, ఇవాళ ఈ విషయం మాటల్లో వచ్చింది. ఇవాళ్టితోనే అనుమానం తీరిపోయేలాగ నేనే నా అంతట చెబుదామనుకుంటున్నాను. కాని ఎప్పటికప్పుడు నా మనస్సు ఏమిటో వెనక్కి లాగుతూంది. ఏది ఏమయినప్పటికీ మన స్నేహం ఇలా సాగాలనుకుంటే మనమధ్య రహస్యాలు ఉండకూడదు."
".............................."
"మీరు అనుకున్నట్లుగా నేను డాక్టర్నే, అయిదేళ్ళ మెడికల్ కోర్సు, ఒక సంవత్సరం హౌస్ సర్జన్ షిప్ అంతా పూర్తి చేశాను."
ఇన్నేళ్ళుగా అనుకుంటున్న ముక్కే అతని నోటివెంట రావడం ఏమీ ఆశ్చర్యమనిపించలేదు.మౌనంగా అతనివంక దృష్టి అయినా మరల్చకుండా దూరంగా చూస్తూ కూర్చుంది. శ్రీనివాస్ కూడా దూరంగా కనుపిస్తున్న అలల వంక చూస్తూ, ఎక్కడినుండి చెప్పడమా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. తన పక్కగా కూర్చున్న అనూరాధవంక ఒక్క క్షణం చూచీ వెంటనే మరల్చుకున్నాడు. అప్రయత్నంగా ఆమె చేతిని తన చేతులలోకి తీసుకుని తెల్లని, సన్నని వేలికి ఉన్న ఉంగరం చూస్తూ కొద్దిక్షణాలు గడిపాడు.
"మీరు అనుకున్నట్లు మెడిసిన్ చదివాను. కాని మెడికల్ కోర్సు మాత్రం నాకు తగిన విద్య కాదు. ఎందుకు, ఏ విధంగా ఆ కాలేజీలో చేరానో నాకె అర్ధం కాదు. నాకు, వైద్యానికి సరిపడదని తెలిసినాకూడా చేరాను. ఉహుఁ. ఇలా కాదు చెప్పటం. ఇక్కడ మొదలుపెడితే ఎలా ముగించాలో నాకు తెలియదు. మా నాన్నగారికి వైద్యవిద్య అంటే ఎంతో ఇష్టం. ఆయనకు ఎంత ఇష్టమో నాకు అంత అయిష్టం. ఈ విద్య నేటి సమాజంలో ఎన్ని నవ్యమార్గాలు సృష్టించిందో తెలుసు. ఇది ఎన్ని ప్రాణాలు కాపాడుతూందో నాకు తెలుసు. కాని మా నాన్నగారి కోరిక తీర్చడానికి డాక్టరునయ్యాను, ఆయనకు సంతానం నే నొక్కన్నే అవటంవల్ల. నామీద ఆవ్యాజమయిన ప్రేమ ఉండటంవల్ల ఆయన కోరిక నాతో తీర్చుకోవాలని ఆశ పడ్డారు. ఆయనకు నేనంటే ఎంత అభిమానమో తలుచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. కాని మా నాన్నగారి మితంలేని ప్రేమలో, మా మామ్మ, తాతగార్ల అంతులేని గారాబంలోకూడా నేను చెడి పోవడం మాత్రం జరగలేదు. ఒకవిధంగా అదె ఎక్కువ మనశ్శాంతి చేకూర్చేదేమో! ఇలా చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. అవి అన్ని చెప్పడంలో అర్ధం లేదేమో! మా నాన్నగారి దగ్గిర ఎంత చనువున్నా, ఎదురుచెప్పే ధైర్యం ఉండేదికాదు. కావలసినవి ఎంత నిర్భయంగా చెప్పగలిగేవాన్నో, ఇష్టంలేనివి తెలిసేందుకు అంత భయం ఉండేది.
