అస్తమిస్తున్న సూర్యుడి సంధ్యారుణ కాంతి పరిగెడుతున్న తెలిమబ్బులమీద ప్ర్తతిఫలించి బంగారు తునకలను నీలాకాశంలోకి విసిరేసినట్టు కనిపింప చేస్తున్నది.
ఉప్పునీళ్ళతో చేదుమాత్రను మింగినట్టు ఘోషపెడుతున్న అలలను జుగుప్సతో చూశాడు రమేష్. సముద్రంలో సౌందర్యం కాని, రమణీయత కాని కనిపించలేదతనికి.
"ఎలా ఉంది సముద్రం?" రత్న అడిగింది.
"నేను సముద్రాన్ని చూడటం ఇదే మొదటి మారు. కాని, నా కేమీ ఆశ్చర్యంగా లేదు. కొత్తగా అనిపించటమూ లేదు."
"మీరు ఎక్కువగా ఇంగ్లీష్ పిక్చర్స్ చూస్తారా?"
రత్న-ప్రశ్న విని తలెత్తి ఆమెవైపు చూశాడు రమేష్. చేతిలో-చెయ్యివేసుకుని నడుస్తున్న జంటను తదేకంగా చూస్తోంది రత్న.
గతించిన మధుర స్వప్నాల తియ్యటి స్మృతి ఆమె కనురెప్పల వెనుక దాగిఉంది.
"అవును. ఇంగ్లీష్ సినిమాలు చూస్తాను. అలా అడుగుతున్నారేం?"
"సముద్రం మీకు కొత్తగా కనిపించటం లేదన్నారుగా. అందుకు చెబుతున్నా. వెన్నెల రాత్రిలో ఓసారి ఇక్కడికి వచ్చి చూడండి. అపుడు మీకు సముద్రపు పరిపూర్ణ సౌందర్య దర్శనం కలుగుతుంది."
"సౌందర్యానికి మీరంత ప్రాధాన్యత నిస్తారా?"
"ఎవరయినా అంతేకదా. సముద్రాన్ని చూడాలని ఎంతోమంది వస్తారు. కాని, బురద-నీళ్ళను చూడాలని ఎవరైనా వెడతారా? పున్నమి వెన్నెలలో బాల్కనీలో గంటలకొద్దీ కూర్చుంటాం. అదే అమావాస్య చిమ్మచీకటిని చూడాలనీ ఎవరైనా ఉవ్విళ్ళూరుతారా?" అంది రత్న, దూరంగా వెడుతున్న దంపతులమీదనే దృష్టిని కేంద్రీకరించి.
"పూర్ణిమ ఇంకో ముఖమేకదా అమావాస్య?"
"నిజమే కాని, లోకులు వెతికేది ఒక్కముఖం కోసం మాత్రమే."
"నేను మీతో ఏకీభవించలేను. వికారమన్నది ఈ ప్రపంచంలో లేనేలేదు. సృష్టిలో ప్రతీ వస్తువుకూ ప్రత్యేక సౌందర్య ముంటుంది. అమవసి రాత్రి నలుపు, పూర్ణిమ కెక్కడినుండి వస్తుంది."
రత్న పరధ్యానంగా "అదీ నిజమే" అంది.
రమేశుడి వేళ్ళు ఇసుకలో గీతలు గీస్తున్నాయి. రత్న అటువైపు చూసి:
"మీరు డాక్టరవనని అన్నారు కదూ" అంది.
"అవును."
"కాని మీరు తప్పకుండా డాక్టరవుతారు. కావాలంటే నేను రాసిస్తాను."
"నేను చదువు పూర్తి చెయ్యకూడదనుకున్నాను కదా; డాక్టర్నెలా అవుతాను?"
"మీరు చదివితీరుతారు."
"ఎలా చెపుతున్నారు మీరు?"
రత్న ఇసుకలో రమేశ్ గీసిన బొమ్మవైపు చూసింది. రమేశ్ మాట్లాడుతూనే, ఇసుకమీద మనిషి అస్తి పంజరమన్న బొమ్మ గీశాడు.
"మీ మనసులో, రక్తపు ప్రతీకరణంలోనూ డాక్టరుగా కావాలనే కాంక్ష నిండిఉంది. తాత్కాలికంగా, ఆ కాంక్షమీద ఉదాసీనత-తెరపడింది. అంతే.
తప్పుచేస్తూ దొరికిపోయిన కుర్రాడిలా గబుక్కున బొమ్మచెరిపేసి కొంచెం కోపంతో:
"నా ప్రతి కదలికనూ అంతగా గమనిస్తున్నారెందుకూ?" అన్నాడు.
"అది నా స్వభావం."
పగలల్లా మబ్బుల్తో వసంతాలాడి అలసి పోయిన సూర్యుడు సముద్రంలోకి దుముకబోతున్నాడు.
జన-సందడి కూడా ఎక్కువగానే ఉంది.
"ఆశా......ఆశా ఏది?"
రమేశ్ చుట్టూ చూశాడు. కొంచెం దూరంలో కూర్చున్న గుజరాతీ దంపతుల కుర్రాడితో కబుర్లు చెబుతోంది ఆశా. ఆంగ్లో ఇండియన్ కుర్రాడొకడు జూలు-కుక్కతో ఆడుకుంటున్నాడు. అతడు నీటి లోకి విసిరేసిన బంతిని కుక్క నోట్లో పట్టుకుని తెస్తోంది.
చీకటి వెలుగుస్థానాన్ని ఆక్రమించుకుంటోంది. తినుబండారాలు అమ్మేవాళ్ళ పెట్రోమాక్సు దీపాలు మట్టుకు అక్కడక్కడా వెలుగుతున్నాయి. చీకటి మందంగా అవుతున్నకొద్దీ సముద్రపు హోరు ఎక్కువ కాసాగింది.
రత్న తన చేతి-వాచిని కళ్ళదగ్గరగా పెట్టుకుని చూసి:
"ఇక వెడదామా?" అంది.
"ఊఁ"
ఇద్దరూ లేచి, గుడ్డలకు అంటుకున్న ఇసుకను విదలించుకున్నారు.
"ఆశా, రామ్మా వెడదాం."
ఆశ పరుగెత్తుకుంటూ వచ్చింది. ముగ్గురూ ఇంటికి బయల్దేరారు.
దోవలో బీచికి దగ్గరనే ఉన్న స్విమ్మింగ్ ఫూల్ ను చూపించింది రత్న రమేశుడికి.
"నీకు ఈత వచ్చా మామయ్యా" అని అడిగింది ఆశా.
"ఊఁ. నేలమీదే ఈత-కొడతాను" అన్నాడు రమేశ్.
రమేశుడితో తిరగటానికి శేషగిరికి తీరికుండేదికాదు. ఉదయంనుండి రాత్రివరకూ ఫార్మసీ లోనే ఉండవలసివచ్చేది. ఇంటికొచ్చిన తరువాత కూడా ఎవరయినా వెతుక్కుని వచ్చేవారు,
బొంబాయి చూడటానికి రమేశుడికి గైడ్ అవసరమేమీ లేదు. కావాలనుకున్న చోటికి వెళ్ళి రాగలడు. కాని, అతడి మనస్సులోని వ్యథ, పరధ్యానం, ఉదాసీనతలను గమనించిన రత్నకు అతడిని ఒంటరిగా పంపాలంటే భయంగా ఉండేది. ఉదయం వంట-పనీ అవీ ఉండేవి కనుక వెళ్ళలేకపోయేది. సాయంకాలాలు వెళ్ళటానికి వీలుగా ఉండేది. మొదటి రెండురోజులు ఆశా వెళ్ళటానికి ఉత్సాహం చూసింది. తరువాత విసుగనిపించింది. తన మరాఠీ- స్నేహితురాలితో ఆడుకోవటానికే ఇష్టపడింది.
ఒక సాయంత్రం ఆశకు తల దువ్వి పువ్వులు పెడుతూ. "ఆశా! చౌపాతికి వెడదాం ఏం?" అంది.
"నేను రానమ్మా; రజనీ, నేనూ ఇక్కడే ఆడుకుంటాం" అంది ఆశా.
రత్నకేమో కూతుర్ని తనతో తీసుకెళ్ళాలనే ఉంది. కాని, ఆశా రానని మొండికేసింది. సరే; ఇంట్లోనే ఆడుకోమని చెప్పి బయల్దేరింది రత్న.
"మీ రెందుకు శ్రమపడతారు? నేను వెళ్ళి రాగలను."
"ఒద్దు; నేనూ వస్తున్నా; ఒక్కరే వెళ్ళకండి" అని, తాళం వేసుకుని వచ్చింది రత్న.
బస్సులో రత్న రమేశుడి ప్రక్కనే కూర్చుంది. ఈ పద్ధతి అలవాటులేని రమేశ్, రత్న అలా కూర్చోగానే, సిగ్గుతో కుంచించుకుపోయాడు. అతడి సంకోచ ప్రకృతి చూసి రత్న నవ్వింది.
ఇంకో స్టాపులో ఒక సీటు ఖాళీకాగానే రత్న రమేశుడితో:
"కావాలంటే అక్కడికే వెళ్ళి కూర్చోండి" అంది.
"ఏం, ఇక్కడే బావుంది."
"ఆహా, సంకోచపడితేనూ" అంటూ నవ్వింది రత్న.
రమేశ్ మొదట్లో సంకోచపడినమాట వాస్తవమే. కాని, రత్న పక్కన కూర్చోగానే అతడి మనసు శాంతి, సమాధానాలతో తేలిక-పడినట్టయింది. అతడి గుండెలమీద ఉన్న అగోచరామిన బరువు తనంతట తానే దిగిపోయినట్టనిపించింది.
"లేదు.......లేదు....." అన్నాడతను.
"కావాలంటే నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను."
"వెళ్ళండి మీకంత కష్టంగా ఉంటే."
రత్న పక్కకు తిరిగి అతడి మొహంలోకి చూసింది.
అతడి క్రాపు ఎప్పటిలా చెదరిపోలేదు. శుభ్రంగా దువ్వుకున్నాడు. దుస్తులూ అంత అన్యాయంగా లేవు. కళ్ళలోని గాంభీర్యం మాత్రం అలాగే ఉంది.
రత్న-మనసు కొంచెం తేలిక-పడింది.
"డాక్టరయ్యేవారు ఇలా కోపించుకోరాదు. డాక్టరే కోపించుకుంటే రోగుల గతేమిటి?"
"నేను డాక్టర్నీ కాను; మీరు రోగులూ కాదు"
"ఎప్పటికయినా మీరు డాక్టరవుతారు."
"లేదు; ఎప్పటికీ కాబోను కూడా."
"నేనేమో ఎప్పుడయినా ఒకప్పుడు జబ్బుపడచ్చు. అప్పుడు మీ దగ్గర తప్ప మరెవరి దగ్గరా మందు పుచ్చుకోనంటే, అపుడేం చేస్తారు?"
"నేను మందివ్వను."
"వేచి చూస్తాను."
"అలాగే."
తరువాత వాళ్ళేమీ మాట్లాడుకోలేదు. చౌపాతి-బీచిలో దాదర్-బీచిలోకన్నా ఎక్కువ మంది జనం ఉన్నారు. అపుడే చీకటిపడుతోంది. బీచిలో కూర్చున్నవాళ్ళకు మలబార్ హిల్స్ లోని ఇళ్ళ దీపాలు దూర-నక్షత్రాల్లా, నల్లటి బ్యాక్ గ్రౌండ్ లో రమణీయంగా కనిపిస్తున్నాయి. అపుడపుడు, ఆరుతూ వెలుగుతూ కనిపిస్తున్న మోటార్ అడ్వర్టయిజ్ మెంటు ప్రజల్ని ఆకర్షిస్తోంది.
ఎంతసేపయినా రత్న మాట్లాడకపోయేసరికి రమేశుడికి విసుగనిపించింది. ఆమె మాటా పలుకూ, గాజుల గలగలకు అలవాటుపడిన అతడి మనసు వాటి ఆభావంలో వ్యాకులగ్రస్తమయింది.
"మాట్లాడరేం?" అన్నాడు రమేశ్.
"ఏం లేదు."
"ఏమిటి కారణం? చెప్పండి."
"కొంచెం తలనొప్పిగా ఉంది."
"సారిడాన్ వేసుకోండి. అదే తగ్గిపోతుంది."
"మందూ-మాకూ అంతా ఒట్టి బూటకం. నేను ఎంతసేపు తలనొప్పి అనుభవించాలని ఉందో అంతసేపు అనుభవించాల్సిందే; తప్పదు."
రమేశ్ చటుక్కున రత్నవైపు చూశాడు. రత్న అతడినే సూటిగా చూస్తోంది. ఆమె కళ్ళలోని ప్రశ్నకు బదులు చెప్పలేక అటు తిరుక్కున్నాడు.
"మాట్లాడరేం?" రత్న మళ్ళీ కదిలించింది.
"నేను చెప్పినట్టు వినేటట్టయితేనే మాట్లాడతాను."
"చెప్పండి."
"సారిడాన్ తీసుకోండి."
"తలనొప్పితో బాధపడేది నేనేగా; మీ కెందుకొచ్చిన ఆరాటం?"
"రేపు మీరు మంచాన పడితే రుచిరుచిగా వండిపెట్టేవాళ్ళుండరనీ....."
"ఎదురుగానే ఉంది మద్రాసీ హోటల్. అక్కడ భోజనం చాలా బాగుంటుందట."
"కాని, మీ చేతి వంట-రుచి దాని కెలావస్తుంది?"
"నిజంగా! భోజనంకోసమేనా? ఇంకేమీలేదా?"
"లేదు."
"నిజంగా?"
రమేశ్ కాస్సేపు ఊరుకుని మళ్ళీ అన్నాడు:
"మీరు బాధపడటం నేను చూడలేను."
"అంటే, నేను బాధపడుతూ ఉండటం మీ కిష్టం లేదన్నమాటేగా?"
"అవును."
"అయితే మీరే సారిడాన్ తెచ్చిపెట్టండి."
రమేశ్ చిక్కులో - పడ్డాడు. రత్న ఇంత తొందరగా తనను మాటల్ల్లో ఇరికిస్తుందని అనుకోలేదు రమేష్.
అతడి మనసు ఊగిసలాడింది.
ఆమెకు తలనొప్పయితే తనకేం? అనుభవించనీ; తనే మాత్ర తెచ్చివ్వాలనే పట్టుదలేమిటి?
"మీరు తలనొప్పితోనే బాధపడండి నాకేం" అన్నాడు రమేశ్ మొరటుగా.
"సంతోషంగా అనుభవించగలను. ఇహ నా తలనొప్పిమాట వదిలేయండి."
"రత్నా! నన్ను బాధపెట్టడంవల్ల మీకేం లాభం?" రమేష్ వ్యాకులంతో అడిగాడు.
"డాక్టరవకూడదని ప్రతిజ్ఞ చేశారే మీరు? మీకే లాభం? ఎవర్ని ఉద్దరిద్ధామని ఈ ప్రతిజ్ఞ చేశారు?"
"నాకు వృత్తిలో నమ్మకం లేదు."
"ఇన్నేళ్ళూ ఎలా చదివారు?"
"అపుడు నమ్మకం ఉండేది. అదీకాక అపుడు..."
"అపుడు ఏమిటి?"
"అపుడు వదిన ఉండేది; ఆమె ప్రోత్సాహమూ ఉండేది. కాని, ఇపుడు...."
"ఇపుడు మీ అమ్మా, నాన్నా, అన్నయ్య, నేనూ, నా మిత్రులూ-ఇంతమంది ప్రోత్సాహాన్నివ్వగలం. ఏదో ఒక దౌర్భల్యానికి లోనయి జీవితాన్నే బలి చేయటం న్యాయంకాదు. ఇంకా ముందుముందు మీరు ఎంత గొప్పవారు వాలని ఉంది, ఎవరికీ తెలుసు? మీ బుద్ధి, మేధాశక్తి, జెవెఇథమ్-అంతా వ్యర్ధం చేసుకుంటారా? మీ వదిన - ఆత్మకైనా శాంతిని కలుగనీయరా? ఇలాంటి ఆత్మవంచనను నేను ఒప్పుకోను....."
అరచేతులతో కణతలను నొక్కిపట్టుకుంది రత్న.
"చాలా నొప్పిగా ఉందా?"
"ఊఁ"
రమేశుడికి ఆమె తలను తన చేతుల్లోకి తీసుకుని కొట్టుకుంటున్న నరాలను మృదువుగా నిమురాలనిపించింది. సహృదయుడైన డాక్టరుకు సహజంగా కలిగే ప్రతి క్రియ- అతని భావన.
"నేను రేపు ఊరికి వెడతాను."
"మీరు ఊరికి వెళ్ళినంతమాత్రాన నా తలనొప్పి తగ్గిపోదు. అయినా మీరు ఎలా వెడతారో చూస్తాను. మిమ్మల్ని గదిలో పెట్టి తాళం వేసేస్తాను."
"రండి, వెడదాం" -రమేశ్ లేచి నిల్చున్నాడు.
"ఇంటికేనా?"
"ఉహుఁ. ఇక్కడే సారిడాన్ దొరుకుతుందేమో చూస్తాను."
"నేనిక్కడే ఉంటాను. మీరు వెళ్ళి తీసుకురండి."
రమేశ్ రెండడుగులు వేసి, మళ్ళీ వెనక్కు వచ్చి "చీకటిపడింది. ఒక్కరే ఉంటారా? భయం వెయ్యదూ?" అన్నాడు.
"ఇంతమంది ఉండగా భయమేమిటి?"
రమేశ్ వెళ్ళిపోయాడు.
రత్న చీకటిలోనే కూర్చుని సముద్రాన్నే చూస్తోంది.
పసిపిల్లవాడి స్వభావం గల రమేశ్ ఆమెను ఆకర్షించాడు. పరిచయమైనా కొద్ధిరోజుల్లోనే ఏర్పడిన ఈ ఆత్మీయత ఆమెను ఆకర్షించింది. నిష్కపటమైన అతడి మోహంలో చోటు చేసుకున్న అసహాయతను చూసినపుడల్లా ఆమెకు అతడిని రక్షించాలి - దేనినుండి, ఎవరినుండి అనే మాటే లేక- - అన్న మనోభావం పెరిగింది.
రత్నను ఆకర్షించింది అతనిలోని ముగ్ధత. కల్లా కపట మెరుగని, తనకు తోచిన దానిని సూటిగా అనే మనస్తత్వం ఆమెకు వచ్చింది. అతడి స్వభావ పరిచయం కాగానే, అతడికి అతని వదినతో ఉన్న బాంధవ్యపు తీరుకు ఆమె ఊహించుకోగలిగింది. కాని అతడి మనసును నొప్పించటం ఇష్టంలేక శాంత-పేరుకూడా ఎత్తేది కాదామె.
భావుకత అంటే రత్నకు తిరస్కారం. కాని ఇపుడు అదే భావుకతకు చెందిన ఓ నిపురవ్వ తన హృదయంలో రగుల్కొంటున్నదని తెలిసి రత్న కంగారు-పడింది.
చీకటిలో సముద్రం కలిసిపోయింది. మృదువుగా శరీరానికి తగిలే గాలి, సముద్రుడి ఘోష తప్ప మరేమీ తెలియటంలేదు.
సముద్రంపై నుండి తేలి-వచ్చే చల్లటి గాలిలో సముద్రపు హోరును వింటూ స్వప్నలోకంలో తేలిపోయింది రత్న, ఆమె- కపుడు వర్తమానం తప్ప భూత- భవిష్యత్కాలాల జ్ఞాపకాలే లేవు. మళ్ళీ రమేష్ వచ్చి కూర్చున్నపుడే రత్న మేలుకుంది.
"మీరు కూర్చున్న చోటే మరిచిపోయాను. ఒంటరిగా తెల్లచీరెలు కట్టుకుని కూర్చున్న ఆడపిల్లలందరి దగ్గరకూ వెళ్ళి చూశాను. వాళ్ళేమనుకున్నారో ఏమో!"
