Previous Page Next Page 
ఎండమావులు పేజి 12


    "ఈ వ్యభిచారిని పెళ్ళి చేసుకోమని సంఘసంస్కర్తలా నాకు చెప్పుతున్నావ్. ఈపని నావల్ల కాదు. నువ్వే సత్తిని చేసుకుంటే అంతా హర్షిస్తారు. సత్తి సంతోషిస్తుంది. భగవంతుడు మిమ్మల్ని దీవిస్తాడు" అంటూ హేళన చేశారు విష్ణురావు.
    కృష్ణమూర్తిలో ఆవేశం పెరిగింది. అచేతనురాలై ఉన్న సత్తి చూస్తుంటే అతని మనస్సు ద్రవించిపోయింది. క్షణం ఆలోచించాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ సమయంలో అతనికి ఆర్తురాలైన సత్తి శ్రేయస్సు తప్ప మరెవ్వరి శ్రేయస్సూ కనబడలేదు.
    "అవును సత్తిని నేనే పెళ్ళిచేసుకుంటాను. గుణానికి మేలిమి. సత్తి నా భార్య. సత్తి వ్యభిచారి కాదు. దేవత. అనవసరంగా నిందలు వేశావ్. పాపాత్ముడా, సత్తి పాదాలమీద పడి క్షమాపణ వేడుకో. నీ పాపం క్షాళితమౌతుంది. సత్తి ఋణం కనీసం ఈ రీతిగా నైనా తీర్చుకో" అన్నాడు ఆవేశంతో కృష్ణమూర్తి.
    అంతా ఆశ్చర్యపోయారు. కృష్ణమూర్తి పాదాలమీద పడి పత్తి తల బాదుకుంది.
    'అన్నయ్య కృష్ణమూర్తి దేవుడులాంటివాడు. సత్తి నిజంగా దేవత. ఆమె వ్యభిచారి కాదనీ, పరం పవిత్రురాలనీ చెప్పి వాళ్ళకు నమస్కరించి, నీ తప్పులను వప్పుకో. సత్తి బాహ్య సౌందర్యాన్ని మలినపర్చాలనుకున్నావుగాని ఆత్మసౌందర్యాన్ని నువ్వు చూడలేకపోయావు. అలాంటి ఆత్మ సౌందర్యాన్ని కృష్ణమూర్తి తెల్సుకున్నాడు. ఆ పుణ్యాత్ముల పాదాలమీద పడి, నీ తప్పులను క్షమించమని వేడుకో" అన్నది రాజేశ్వరి.
    పశ్చాత్తాపంతో వాళ్ళకు పాదాభివందనం చేశాడు విష్ణురావు.
    వారం రోజుల్లోనే దైవసన్నిధిని సత్తికీ, కృష్ణమూర్తికీ వివాహమైంది. సత్తి స్వాతిగా మారింది. ఈ వర్ణాంతర వివాహానికి అంతా ఎంతో సంతోషించారు. ఆశీస్సులు అందజేశారు. పంచరత్నాలు పఠించారు. పత్రికలు వారి ఫోటో లను ప్రకటించాయి, ఆదర్శదంపతులుగా అభివర్ణించారు. సనాతనులు దుయ్యబట్టారు.
    కృష్ణమూర్తి తల్లిదండ్రులూ, బంధువర్గమూ ఆరోజు నుంచే అతన్ని వెలివేశారు. గోపాలశాస్త్రి "నా పెద్దకొడుకు గుంటూరులో చనిపోయినాడని" అందరికి చెప్పాడు. తల్లి నెత్తీ నోరూ బాదుకుంది. వర్ణసంకర వివాహం చేసుకున్న కొడుకు ముఖం చూడనన్నది. ఆరోజునుంచే కృష్ణ మూర్తి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళలేదు. ఈ వివాహంతో తల్లిదండ్రులతో తెగతెంపు లయింది. ఆరోజునుంచీ జానకిరాం కూడా అన్నగారింటికి వెళ్ళలేదు. పదేళ్ళ తరువాత తమ్ముడు తమ ఇంటికి రావటం జరిగేసరికి కృష్ణమూర్తి మనస్సు పదిసంవత్సరాలు వెనక్కు వెళ్ళింది. హృదయం పరవళ్ళు తొక్కింది. రక్తస్పర్శ కట్టలు తెంచుకుని ప్రేమపూరితమైన ఉద్వేగాన్ని ఇనుమడింపజేసింది.
    తమ్ముడ్ని ఆప్యాయంగా చూస్తూ ఒక్కసారి గట్టిగా కౌగలించుకుని అమితానందంతో కళ్ళు తుడ్చుకున్నాడు కృష్ణమూర్తి.    
    కాఫీ కాచి తెచ్చిన స్వాతి ఈ అన్నదమ్ముల్ని చూసేసరికి సిగ్గుపడి, అభిమానపడి, అరమోడ్పు కన్నులతో అట్లాగే నిల్చుండిపోయింది.
    ఆమె జీవితంలో ఈ సంఘటన మరువరానిది, మరిచిపోలేనిది. తాను నిజంగానే ఎంతో ధన్యురాలనుకుంది స్వాతి.
    
                                       9

    "నేను అన్నయ్యగారింటికి వెళ్ళొచ్చాను శ్రీలక్ష్మీ" అన్నాడు జానకిరాం.
    శ్రీలక్ష్మి నిశ్చేష్టురాలై ఖంగారుపడింది. అటూ యిటూ చూసి మెల్లిగా "నాన్నకు తెలిస్తే ఇంకేమయినా ఉందా అన్నయ్యా ఎంతపని చేశావు" అన్నది.
    వితంతువుగా శ్రీలక్ష్మి పుట్టింట చేరినప్పట్నుంచీ ఆమె భావాలు తల్లిదండ్రుల భావాలకు అనుగుణంగానే ఉండేవి గాని ఏ విషయంలోనూ తల్లిదండ్రులమాట జవదాటి ఎరుగదు. కృష్ణ మూర్తి ఆ తీరుగా వెళ్ళిపోవటంనుంచి గాని, తల్లిదండ్రుల భావాలతో తను పూర్తిగా ఏకీభవించటం చేత గాని, తమందరితోబాటుగా తమ ఇంట్లో ఉండకపోవటం చేతగాని శ్రీలక్ష్మి ఎప్పుడూ కృష్ణ మూర్తి మాట ఎత్తదు. ఆమెకు అన్నా, వదినెలు జానకిరాం, గౌతమిలే గాని కృష్ణమూర్తి, స్వాతి మాత్రం కాదు. స్వాతి సౌందర్యానికి దాసుడై కులగోత్రాలను కూడా లెక్కచెయ్యకుండా స్వాతిని పెళ్ళిచేసుకున్నాడని శ్రీలక్ష్మికి కోపం. దానికి తగినట్లే జానకిరాం కూడా ఎన్నడూ కృష్ణమూర్తి ఇంటికి పోకపోవటం నుంచి కృష్ణమూర్తి సంగతే శ్రీలక్ష్మి స్పురణకు వచ్చేదికాదు. ఇలాంటి వాతావరణంలో జీవిస్తున్న శ్రీలక్ష్మి ఈనాడు ఇట్లా జరిగిందని వినేసరికి ఆశ్చర్యంతో కూడిన భయం వ్యక్తపరచింది.
    "అన్నయ్య ఏమన్నాడు. కులాసాగా ఉంటున్నాడా ఆవిడ, అదే ఆ పంతులమ్మ ఏమంటున్నది. కన్న తల్లిదండ్రులకూ, అక్కచెల్లెళ్ళకూ కాకుండా చేసింది. ఇలాంటివారు ఏ చీకూచింతా లేకుండా రాళ్ళల్లే ఉంటారు" అన్నది శ్రీలక్ష్మి.
    జానకిరాం కు నవ్వొచ్చింది.
    "నువ్వు నిజంగా గోపాలశాస్త్రిగారి బిడ్డ వని పించుకున్నావు శ్రీలక్ష్మీ. నువ్వు ఏమనుకున్నాసరే. స్వాతి వదిన ఎంతో ఉత్తమ ఇల్లాలు. ఆప్యాయంగా మనందరి సంగతులూ అడిగింది ప్రత్యేకించి నిన్ను అడిగానని చెప్పమన్నది. నీ జీవితం ఎట్లా తెల్లవారుతుందోనని విచారపడింది. వదిన తక్కువ జాతి వంశంలో పుట్టినా ఉత్తమ జాతిలో పుట్టిన వారితో పోల్చి చూస్తే ఎన్నో రెట్లు నయం. సంసారభావా లనేవి, మంచి హృదయ మనేది అ వ్యక్తినిబట్టి ఉంటుంది గాని ఆ జాతిని బట్టి కాదు. ఈ సత్యాన్ని ఈ రోజున కూలం కషంగా తెల్చుకున్నాను. శ్రీలక్ష్మీ అన్నయ్య ఎంతో అదృష్టవంతుడు. వదిన అన్నయ్యను పువ్వుల్లో పెట్టి పూజిస్తున్నది. ఆవిడకు మనమూ చెయ్యెత్తి నమస్కరించవచ్చు" అన్నాడు.
    శ్రీలక్ష్మి విభ్రాంతురాలైంది. జానకిరాంకు మతిపోయిందనుకుంది.
    "ఆవిడ మనకు వదినేంటి అన్నయ్యా. తాళి గట్టించుకున్నంత మాత్రాన ఆవిడను నేను వదినగా ఎన్నటికీ స్వీకరించను. వదినా, వదినా అంటూ నోరూర మాట్లాడతున్నావు నిన్నూ ఆవిడ వల్లో వేసుకోవాలనుకుంటున్నదేమో?" అన్నది శ్రీలక్ష్మి కోపంతో కూడిన ఎగతాళిని వ్యక్తపరుస్తూ.
    జానకిరాం నవ్వాడు. శ్రీలక్ష్మి ముఖంలోకి చిరునవ్వు నవ్వుతూ చూశాడు. ఒక్క నిట్టూర్పు విడిచి "వదినెమీద అక్కసు తీరిందా శ్రీలక్ష్మీ. ఆవిడను నువ్వు చూసి ఉండొచ్చు గాని, ఎన్నడూ మాట్లాడలేదు కదూ నీకు ఏమాత్రమూ పరిచయంలేని ఒక స్త్రీని గురించి అంత నీచంగా మాట్లాట్టం మన సంకుచిత్వాన్ని వ్యక్త పర్చినట్లే అవుతుందేమో? వదిన మీద అంత కక్ష ఎందుకు లక్ష్మీ, పైగా నన్ను కూడా వల్లో వేసుకుందా అని ప్రశ్నిస్తున్నావు కదూ. అంతమాట అన్నందుకు నువ్వు కనక ఊరుకున్నావు, అటువంటి ఉద్దేశ్యం వదినెకు ఈ జన్మలో కలుగదు. ఇంక నా సంగతి నీకు తెల్సిందే కదా. పోనీలే, చెల్లెలిచేత అంత మాట అనిపించుకున్నందుకు నేను బాధపడను. వదినె యిచ్చిన కాఫీ త్రాగాను. దాంట్లో ఏమయినా మందుపెట్టి యిచ్చిందేమో నంటావా". అన్నాడు నవ్వుతూ జానకిరాం.
    శ్రీలక్ష్మి ఇంక మాట్లాడలేకపోయింది. మెల్లిగా అవతలకు వెళ్ళిపోయింది.

                                     *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS