"అబ్బ! అప్పుడే పదిహేడేళ్ళా? అంటే పెళ్ళి వయస్సుకదూ?"
"ఛ! అప్పుడే పెళ్ళి వయస్సేమిటి? ఎవరైనా నవ్విపోతారు. మీర ఇంకా పసిపాపగదూ! కాలేజీకి వెళ్ళనీ, నాటకాల్లో వేషాలు వెయ్యనీ! పెళ్ళికేం తొందరా?" అంటూ దెప్పిపొడిచారు కమలమ్మగారు.
"కోపం తెచ్చుకుంటావెందుకు కమలా? నా కిపుడు మీరకు పెళ్ళి చెయ్యాలనిపించింది."
"అబ్బ! ఇప్పటికైనాతోచిందిగదా మీకు. రెండేళ్ళుగా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నా వినిపించుకున్నారా? మీరు గోపి కలిసి చనువిచ్చి నెత్తి కెక్కించుకున్నారు మీరని."
"లేడు కమలా ఈఏడు తప్పక మీర పెళ్ళి చేసేస్తాను."
కృష్ణయ్యగారి కంఠంలోని దృఢ నిశ్చయాన్ని గమనించి కమలమ్మగారికి ఆశ్చర్యం వేసింది.
"ఏమిటి విశేషం? ఉన్నట్లుండి ఈ నిశ్చయాని కొచ్చారు."
"మీర......మన శాము ఎలా ఉన్నాడంటావ్?"
కృష్ణయ్యగారు ఆతురతతో భార్యవేపు చూశారు.
"కుర్రవాడికేం నిక్షేపంలా ఉన్నాడు. పూర్వజన్మలో ఎన్ని నోములు నోచి ఉండాలో అతడిని చేపట్టడానికి కాని మీ గారాలపట్టి ఒప్పుకుంటుందా?"
"ఒప్పుకోకేం కుర్రాడా మన్మధుడు. తండ్రి సంపాదించిన ఆస్తి కూర్చునితిన్నా తరగనంటుంది. ఒక్కడే కొడుకు.....కానీ....."
" 'కానీ' ఏమిటండి?"
"శాము ఎక్కవ చదువుకోలేదు. కాని వినయ విధేయతలలో ఏ విద్యావంతుడికి తీసిపోడు."
"ఎంతవరకు చదువుకున్నాడు?"
"ఎస్సెల్సీదాకా చదివాడట. రెండుసార్లు తప్ప డంతో మానేశాడట."
కమలమ్మగారు కుంపటిలోకి బొగ్గులు వేస్తూ,
"అబ్బో ఆ చదువు చాలదా ఏమిటి? ఈ కాలంలో కూటికి పనికిరాని చదువులు కట్టుకొని ఏం చేసుకుంటాం చెప్పండి? పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారంతా ఉద్యోగాలు దొరక్క ఏడవటంలా? కుర్రాడికి రూపముంది. గుణం ఉంది. డబ్బుకా కొదవలేదు. ఇంకేం కావాలి? కిం అనక ఒప్పుకుంటుంది" అన్నారు.
"అలా కాదేవ్ మీర కాలేజీలో చదువుతూన్న పిల్ల సున్నితమయిన మనసు. ఇంతవరకు ఏ నొప్పి కలిగించకుండా పెంచామా? ఇప్పుడు ఏమంత చదువుకోని శామును పెళ్ళిచేసుకోటానికి ఒప్పుకుంటుందా? అని."
"ఇదేమిటండి చోద్యం. ఒప్పుకోకేం చేస్తుంది? చదువుకోటం దేనికీ? పొట్టకోసమేగా? కావలసి నంత ఆస్తి ఉన్నప్పుడు చదువెందుకు? మీరింకేం సందేహించక ముందర ప్రయత్నాలు చేయండి."
కృష్ణయ్యగారు కాస్సేపు మనసులోనే ఆలోచించుకొని,
"సరే శాము కొక మేనమామ ఉన్నాడు. ఆయనే వాళ్ళకు పెద్ద నాకూ ఆయన తెలుసనుకో ఆయనకు రాసి జాతకం తెప్పిస్తాను. కానీ.....మీర...."
"మీరింకేం అనుమానించకండి. మీరను ఒప్పించే బాధ్యత నాది" అన్నారు కమలమ్మగారు.
ఆరోజే కృష్ణయ్యగారు శాము మేనమామ శీనయ్యగారికి ఉత్తరం రాశారు.
కృష్ణయ్యగారు దేవుడిమీద భారంవేసి ఉత్తరం పోస్టులో వేశారు.
రెండు రోజులలోనే శీనయ్యగారినుండి బదులు వచ్చింది.
"శ్రీకృష్ణయ్యగారికి:
మీ ఉత్తరం అందింది. జాతకం పంపుతున్నాను. శాము పిల్లను ఒప్పుకున్నట్టయితే మేమందరం ఒప్పుకున్నట్టే అతని అభిప్రాయం తెలుసుకో వలసినది" అని ముగించాడు.
కృష్ణయ్యగారు మొదట జాతకం చూపించి తరువాత శాముకు ఉత్తరం రాద్దామన్న ఉద్ధేశ్యంతో ఇంటి పురోహితులు రామశాస్త్రిగారిని పిలిపించి జాతకాలు చూపించారు.
రామశాస్త్రిగారు జాతకాలు చూసి అరగంట మనసులోనే గుణించి, లెక్కించి ఆఖరికి,
"జాతకం ప్రశస్తంగా ఉంది. ఈ వరునికి వధువు ఈమేనని బ్రహ్మ ముడి వేసి పెట్టాడు. ముహూర్తం పెట్టించండి. మీర సుఖంగా ఉంటుంది. శుభం." అన్నారు.
కృష్ణయ్యగారి సంతోషానికి పారమే లేకపోయింది.
"ఏడుకొండలవాడు కరుణించాడు" అంటూ కూర్చున్న చోటినుండి తిరుపతిస్వామికి దండం పెట్టారు.
శాస్త్రిగారు కమలమ్మగారు తెచ్చిచ్చిన పాలు స్వీకరించి వెళ్ళిపోయారు.
ఆరోజు రాత్రే కృష్ణయ్యగారు శాముకు ఉత్తరం రాశారు. తమకు అతనిమీదున్న ప్రేమాభిమానాలను వ్యక్తపరుస్తూ వెనుకటి స్నేహబంధం మాసిపోకుండా, బాంధవ్యంతో బలపరచి, తమ కూతురిని వివహం చేసుకోవాలని వినయంగా కోరారు.
కృష్ణయ్యగారు ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు శాము తన పల్లెలో విశాలమయిన తన ఇంటిలో పడకమీద కూర్చుని వెలుగుతున్న లాంతరు వత్తి వేసే చూస్తున్నాడు. ఎందుకో ఆ రోజు ఉదయం నుండి మీర మాటి మాటికీ గుర్తుకొస్తూ ఉందతనికి. నాటకంలోని ఆమె అభినయం, గమ్మత్తుగా తనకు టికెట్టు అమ్మటం, ముగ్ధ మనోహరమయిన ఆమె రూపం, కళ్ళకు కట్టినట్టుంది. పెళ్ళీడు వచ్చిన శాము ఇంకా పెళ్ళిని గురించి ఏమాత్రమూ- ఆసక్తి చూపెట్టటంలేదు. తన జీవితంలో భార్య ఆవశ్యకత అతని కింతవరకు కనుపించలేదు. అతని ఆస్తిమీద దృష్టి ఉంచుకొని స్నేహితులు బంధువులు "పెళ్ళి చేసుకోవుటోయ్ శాము" అన్నప్పుడు నేర్పుగా మాట తప్పించేవాడు. అతని మేనమామ శీనయ్యగారు తమ కూతురు సరస్వతిని అతనికిచ్చి చేయాలని ప్రయత్నించి విఫలులయ్యారు.
కాని ఈసారి అతని మైసూరి ప్రయణం, అతని పట్టుదలను సడలింపచేసింది. మీరని చూడనప్పటినుండి తన జీవితంలోని అసంపూర్ణత అతనికి తెలిసివచ్చి, తన హృదయం దేనినో కాంక్షిస్తోందన్న సంగతి అతని దృష్టి లోకి వచ్చింది.
మరుసటిరోజు వెంకమ్మగారు చేసిన దోసెతిని పొలాలవేపు బయలుదేరాడు.
ఉదయపు గాలి చల్లగా వీస్తోంది. చూచినంతవరకు పచ్చని చేలు కనిపిస్తున్నాయి. ఆ చల్లటి గాలి, ప్రకృతి రమణీయత, అతని మనసుకు హాయి గొలిపింది. సూర్యోదయపు సుందర దృశ్యాన్ని తిలకించేటప్పుడు ఆ ఆనందాన్ని పంచుకోవటానికి తనకు తోడు లేదన్న వెల్తిని మోఅత్య్సారిగా అనుభవించాడు శాము వెంటనే మైసూరు సుందరి మీర అతని ముందు మెరిసింది. ఆమె ఉంగరాల జుత్తు, మెరిసే కళ్ళు, గంభీరమయిన నడక-శాము కళ్ళముందు నిలిచాయి. కొబ్బరితోటలో తిరుగుతూన్నప్పుడు చేల మధ్య గట్లమీదుగా నడచి వెళ్ళేటపుడు మామిడి తోటలో చెట్టు నీడన కూర్చొని, ఆకాశం వేపు చూస్తూన్నప్పుడు తాను 'ఒంటరి' అనుకోసాగాడు.
పరధ్యానంగా నడుస్తూ ఇంటి కొచ్చాడు.
భోంచేసేటపుడు వెంకమ్మగారు "పులుసులో కారం సరిపోయిందా సంకటి సరిగ్గా కుదిరిందా నాయనా?" అని అడిగారు. కాని తను భోంచేస్తున్నానన్న ధ్యాసే లేని శాము బదులు పలకకుండ, రెండు మెతుకులు కెలికి లేచిపోయాడు.
సాయంత్రం మళ్ళీ పొలాలవైపు వెళ్ళి ఇంటికి వచ్చాడు. రాత్రి న్నం తిని, నిద్రాదేవి తన వడి లోకి తీసుకునేవరకూ మీరనే తల్చుకుంటూ లాంతరువైపు చూస్తూ పడుకున్నాడు శాము.
మరుసటిరోజు మధ్యాహ్నం భోజనంచేసి తమలపాకుల పళ్ళెం ముందు పెట్టుకుని ఆకులు వేసుకుంటూ ఉండగా పోస్టుమాన్ రంగప్ప ఉత్తరం తెచ్చిచ్చాడు. చేతిలోఉన్న ఆకు నోట్లో వేసుకుని కవర్ చించాడు శాము. ఉత్తరం సగం చదివే టప్పటికే అతడి దవడలు పని చేయటం మానేశాయి. ఒక్క నిమిషం తాను స్పృహలో ఉన్నానా లేదా అన్న సందేహం కలిగింది శాముకు ఇది కలకాదుకదా అనుకున్నాడు. కాలేజిపిల్ల మీర తన లాంటి పల్లెటూరి బైతును చేపడుతుందా? తనేమంత పెద్ద చదువుకున్నవాడు కూడా కాదు ఎస్సెల్సీ దాటలేక చదువుకే ఓ దండం పెట్టేసిన పల్లెటూరి మొద్దు-మీర పట్నవాసపు సుకుమారి. ఆమె తనను పెళ్ళి చేసుకోగలదా? లేచి వెళ్ళి అద్దం ముందు నిల్చున్నాడు శాము.
చదువులేకపోతేనేం? ఇలాంటి కండలు తిరిగిన బలమయిన శరీరం పట్నవాసపు కుర్రకారు కెక్కడిది? శాముకు తన శరీర సౌష్ఠవం మీద పూర్తిగా నమ్మకముంది. నిసర్గపు వడిలో స్వేచ్చగా పెరిగిన మట్టి బిడ్డ తను. పూర్వీకులు గడించి పెట్టిన ఆస్తి మరో నాలుగు తరాలవరకూ తరిగిపోతుందన్న భయంలేదు. ధన, రూపాలు తనవిగా ఉన్నప్పుడు ఏ అమ్మాయైనా తనను కోరుకోవటం అసహజమేమీ కాదు.
ఉత్సాహంగా ఈలవేస్తూ తల దువ్వుకున్నాడు. "ఏమని రాస్తావు?" అనడిగింది. అద్దంలోని ప్రతి రూపం. తన ఆత్రుతను చూపించుకోవడం ఇష్టంలేక ఓ వారం రోజులు ఆగి జవాబు చూశాడు.'
శాము రాసిన ఉత్తరం అందుకుని కృష్ణయ్య గారు చాలా సంతోషించారు. తల్లీ తండ్రీలేని పిల్ల మీరను ఓ మంచి ఇంట్లో పడేయగలుగుతున్నామన్న తృప్తి కలిగిందాయనకు.
ఉత్తరం తీసుకుని వంటింట్లోకి వెళ్ళి ఈ శుభ సమాచారాన్ని భార్య చెవిలో వేశారు.
కమలమ్మగారు చేస్తున్న పని వదలి, లేచి దేవుని ఎదుట దీపాలు వెలిగించి దండం పెట్టి "ముహూర్తం పెట్టించెయ్యండి:" అన్నారు.
మీరకు మాత్రం ఈ సంగతు లేమీ తెలియవు. పరీక్షలు దగ్గర పడుతున్నందువలన ఇంటి పనులు కూడా పట్టించుకోకుండా శ్రద్ధగా చదువుకుంటోంది. శాము వెళ్ళిపోగానే అతని ఉనికిని మరచిపోయింది, మీర. కాలేజి, స్నేహితురాళ్ళు పరీక్షలు వీటి గొడవల్లోపడి, ఇంట్లో జరుగుతున్న విషయాలేమీ తెలియకుండా నిర్యోచనగా ఉండిపోయింది.
