"లెంగ్వేజస్ పాసయ్యారా?"
"క్లాసుతో."
"మరి గ్రూపులో ఎందుకు ఫెయిలయినట్లు? ఇంటరెస్టు లేకనా?"
"ఊ...."
"మళ్ళీ పరీక్షకు కట్టుకోలేదా?"
"లేదు."
"ఎందుకని?"
"ఉద్యోగంలో చేరాను."
"చేరితేనేం ? పూర్తీ చేయాలని లేదు గాబోలు?"
"అవును."
"కవిత్వంలో పడ్డారు గాబోలు?"
"తన కవిత్వమంటే ఎందుకీ విడ కింత ఎగతాళి? అదే చంద్రశేఖరం కు అర్ధం కాలేదు. బాధగా చూశాడు.
"ఇప్పుడెం కవిత్వం రాస్తున్నారు?"
"అంటే?"
"ఆకలి కవిత్వమా? విప్లవ కవిత్వమా? ప్రేమ కవిత్వమా? లేక సరిక్రొత్త ప్రణాళికా కవిత్వమా?" గలగలా నవ్వి అంది సుధీర'.
చంద్రశేఖరం ఆశ్చర్యంగా సుధీర వేపు చూసి -- ఈవిడకు సాహిత్వంలో కొంచెం పరిచయమున్నట్లుంది- అనుకున్నాడు.
"ఆకలి కవిత్వమా?"
"అది ఔటాఫ్ ఫాషన్."
"విప్లవకవిత్వం?"
"అవసరం లేదనుకుంటాను."
"ప్రేమ కవిత్వం?'
"ప్రేయసి లేందే?'ఇద్దరూ ఘోల్లుమని నవ్వారు.
"ఇక మిగిలింది ప్రణాళికా కవిత్వమే."
"అదే రాస్తున్నాను...." వచ్చే నవ్వాపుకుంటూ అన్నాడు చంద్రశేఖరం.
"దేశానికి ఏది అవసరమో అదే రాయాలి. కవిగా మీరు దేశానికి చేయదగ్గ సేవ అంతకన్నా మరోకటేముంది?'
"కావచ్చు. ఇంతకూ మీ పేరు చెప్పారు కాదు." ధైర్యం చేసి అడిగాడు.
"అమ్మయ్య!"
"ఏం?"
"ఇంతవరకూ నేను ప్రశ్నలు వెయ్యటం, మీరు జవాబు చెప్పటం తోటే సరిపోయింది! ప్రశ్నించడం చాతనవునని నిరూపించుకొన్నారు! క్వెశ్చన్ నెం. వన్ ఏమిటి? నా పేరా? సుధీర!" రెండు చేతుల్లో గడ్డం ఆన్చి అంది.
"బాగుంది."
"ఏమిటి?"
"పేరు."
"అలాగా! సరే! ఇక రెండో ప్రశ్నేమిటో...?"
"ఇంకేం లేవు." తల వంచుకుని సిగ్గుపడి పోతూ అన్నాడు చంద్రశేఖరం.
"నిజం!"
"నిజంగానే!" తలెత్తి సుధీర కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు.
సుధీర ఆ చూపుల్ని తప్పించుకుంటూ, "ఈ రోజు మీకు సెలవనుకుంటాను" అంది.
"మా బాస్ మంచివాడు. ఆదివారం ఆఫీసుకు రమ్మనడు."
"రమ్మంటే అతని మీద కవిత్వం రాస్తారని భయం కాబోలు!" నోటికి చేతిగుడ్డ అడ్డం పెట్టుకుని అంది సుధీర'.
చంద్రశేఖరం కళ్ళల్లో కోపం పొడసూపింది. "మాటిమాటికి నా కవిత్వం విషయం తీసుకొస్తారెందుకూ?' కోపంగానే అన్నాడు.
"ఓహో! తప్పా? అయితే అనన్లెండి! అన్నట్టు అంత మంచి బాస్ పేరు చెప్పలేదేం?'
"భానుమూర్తి గారని...."
"భానుమూర్తా!"
"అతను మీకు తెలుసేమిటి?"
"ఊ...."
"బంధువులా?"
"అవును. ప్రతి ఆదివారం కొండ పైకోస్తారా?"
"వీలైనంతవరకూ వస్తాను. దేశం నలుమూలల నుండి ప్రజ తండోపతండాలుగా వస్తున్నప్పుడు మనం క్రింద ఉండి ఎందుకు రాకుండా వుండాలి?"
"నిజమే! ఇక వెళ్దామా? ఈపాటికీ మావాళ్ళు వస్తూ వుంటారు." వాచీ చూస్తూ అంది సుధీర.
"మీ వాళ్ళెవరిచ్చారు?"
"మా అక్కయ్య స్నేహితులు హైదరాబాద్ నుండి వచ్చారు. వాళ్ళను తీసుకొచ్చాను. పాపనాశం చూసేందు కెళ్ళారు డ్రైవర్ తో. నేనిక్కడే ఉండిపోయాను."
ఇద్దరూ లేచి కారున్న దగ్గరికి వచ్చారు. చంద్రశేఖరం సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
సాయంత్రం నాలుగ్గంటలకు కారు దిగువ తిరుపతికి ప్రయాణమైంది.
చంద్రశేఖరం ఇక బయల్దేర్దామనుకుంటుండగా బస్ స్టాండ్ లో సుధీర కార్లో కనిపించింది.చంద్రశేఖరం గబుక్కున కారు వెనుక దాక్కున్నాడు. సుధీర కార్లోకి రమ్మని పిలుద్దామనుకునే సరికి చంద్రశేఖరం కంటికే కనిపించలేదు!
8
"మీనాక్షీ!"
"కాఫీ చేస్తున్నా , ఏం?"
భానుమూర్తి తానె వెళ్ళి నడవకూ, వంటింటి కి మధ్య ఉన్న గడప మీద కూర్చున్నాడు.
"పుస్తకం చదివావా?"
"ఊ...." బొగ్గుల పొయ్యి విసురుతూ ఊ కొట్టింది.
"ఎలా వుంది?"
"బాగుంది."
"బాగుందని ఎందు కనిపించింది?"
"ఏమో బాబూ! విమర్శ నాకు రాదు." ముఖం కొంచెం చిట్లించి అంది.
"నీ స్నేహితురా లెం చెప్పింది?"
"ఇంకా ఏం చెప్పలేదు. తనింతకు మునుపే ఒకసారి చదివిందిట. మళ్ళీ చదివిస్తానని తీసి కెళ్ళింది." కుంపటి మీద నుండి నీళ్ళు దించి కాఫీ పొడి వేస్తూ అంది మీనాక్షి.
"చాలా రోజుల నుండీ నీతో ఒకమాట చెప్పాలనుకుంటున్నాను." నేలమీద వ్రేలితో పిచ్చిగా రాస్తూ అన్నాడు.
"ఏవిటీ?' డికాక్షన్ ఫిల్టర్ లో పోస్తూ అంది.
"మావయ్య చనిపోయిన రోజూ నువ్వు వరండా లో వుండి యింట్లోకి వెళ్ళకుండా వచ్చేశావని అత్తయ్య ఎంతో బాధపడింది. అర్ధం లేని పట్టుదలల వలన ఎంతమంది బాధపడాలో చూడు. మావయ్య చనిపోయి గూడా మున్నేల్లు కావస్తోంది . ఒక్క రోజున్నా నువ్వు వాళ్ళింటి కెళ్ళావా?"
"అదేనా చెప్పాలనుకున్నది?" కఠినంగా అంది మీనాక్షి --- డికాక్షన్ తో పాలు కలుపుతూ.
"కాదనుకో.... నీ పద్దతి మార్చుకోనేది లేదా?" అన్నాడు చెల్లెలి ముఖంలోకి బాధగా చూస్తూ.
"ఆ విషయం యిప్పుడెందుకు? నువ్వు చెప్పాలనుకున్న దేమిటో చెప్పు?" కనుబొమలు ముడిఛి అంది.
"నీ జవాబు మీదే నేను చెప్పబోయే విషయం ఆధారపడి వుంటుంది."
"బాగుంది!" కాఫీ గ్లాసు భానుమూర్తి ముందు పెట్టి విసుక్కుంది.
"ఏం లేదు. అత్తయ్య నన్ను తన అల్లుడుగా చేసుకోవాలనుకుంటుంది -" నేల చూపులు చూస్తూ అన్నాడు భానుమూర్తి.
"అంటే?' ముఖం చిట్లించి అంది మీనాక్షి.
"సుధీరను నా కివ్వాలనుకుంటుంది."
"నువ్వూ నన్ను వాళ్ళ కొడుక్కు యివ్వాలను కున్నావుగా?' ప్రశ్నలోనే జవాబు యిమిడ్చి చెప్పింది మీనాక్షి.
భానుమూర్తి చెల్లెలి ముఖంలో నుండి చూపులు త్రిప్పుకుని బరువుగా నిట్టూర్చాడు. హృదయం బాధతో క్రుంగి పోయింది మీనాక్షి కేలా నచ్చచెప్పాలో తెలీలేదు.
"అత్తయ్య ప్రేమ మయి. మనిద్దర్నీ చిన్నప్పట్నుంచి ఎలా సాకిందో నీకు తెలీకపోదు.
అమ్మ వున్నా మనల్నంత గారాబంగా పెంచేది కాదు. నీ విషయంలో యీ రోజుకూ ఎంత బాధపడుతుందో అది ఆ భగవంతుడి కొక్కడికే తెలుసు. అర్ధం లేని పట్టుదల అత్తయ్య హృదయాన్ని ఎంతగా వేదిస్తుందో నువ్వు తెలుసుకుంటే యింత మూర్ఖంగా ప్రవర్తించవనుకుంటాను. సుధీరను చేసుకోవాలన్న పట్టింపు నాకేం లేదు. కానీ, అత్తయ్య మనసు నొప్పించడం నాకు చేతకాదు. అది మనం ఋణ విముక్తుఅయ్యేందుకు మార్గమూ కాదు" అన్నాడు వ్యధిత కంఠం తో.
"అయితే చేసుకో" అంది తల విసురుగా ప్రక్కకు తిప్పుకుని.
"ఇలా చూడు, మీనాక్షి! నీ కిష్టం లేని పని నేనేరో చేశానా, చెప్పు? ఈరోజు మటుకేలా చేస్తాను? నీ కిష్టం లేని అమ్మాయిని నీకు వదినగా ఎలా తీసుకొస్తా ననుకున్నావు? అలాగ ఎప్పుడూ అనుకోకు" అన్నాడు.
"అంటే నేను యిష్టపడిన పిల్లనే చేసుకుంటా వన్నమాట?" తల త్రిప్పి , కళ్ళు పెద్దవి చేసి అంది మీనాక్షి.
"అవును."
"నాకు వచ్చిన పిల్లే లేకుంటే?" భాను మూర్తి ముఖంలో పరిశీలనగా చూస్తూ అంది.
"పోనీయ్!"
"పెళ్ళే మానుకుంటావా?"
"ఊ...."
మీనాక్షి కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. "ఏం అక్కర్లేదు. " అంది తనలోని భావాలను పైకి కనిపించనీకుండా.
"అంటే?"
"పెళ్ళి చేసుకొనేది నేను కాదుగా? నీయిష్టమోచ్చిన పిల్లనే చేసుకో." తల వంచుకుని తప్త కంఠం తో అంది.
"సుధీర మనింటికి రావడం నీకిష్టమేనా?"
"మీనాక్షి మాట్లాడలేదు.
"చెప్పు, మీనాక్షి!"
"ముందు కాఫీ త్రాగు. చల్లారిపోతుంది."
"ఊహు....నువ్వేదో ఒకటి చెప్పేవరకూ నేను త్రాగను."
"సరే! మీ అందరి యిష్టమే నా యిష్టం."
"ఏవిటీ , బావా? వంట గదిలో కూర్చున్నావేం? చెల్లెలికి వంట సాయం చేస్తున్నావా?" అంది అప్పుడే లోపలికి వచ్చిన సుధీర.
