భార్గవి ఉలికిపాటుతో చటుక్కున కళ్ళెత్తి కోపంగా అతని కళ్ళలోకి చూసింది.
అతని పెదవుల చివర చిరునవ్వు -- కళ్ళల్లో కొంటె తనం చిందు లాడుతున్నాయి.
"ఛీ, ఛీ....!" టవల్ చటుక్కున అతని మీదకి విసిరేసి వెళ్ళిపోయింది.
కాసేపు శేఖర్ అలాగే చూస్తూ నిలబడి లోపలికి వెళ్ళాడు.
అతని దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.
కళ్ళు తెరిచి నీరసంగా చూస్తూ పడుకున్నాడతను.
"ఇప్పుడు చెప్పండి? ఎలా ఉంది వంట్లో?"
"చాలా థాంక్స్ డాక్టర్. మీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు.
అతి ప్రయత్నం మీద నీరసంగా వచ్చాయి మాటలు అతని నోటి వెంట.
"ఫరవాలేదు. నాలుగు రోజులు నా డిస్పేన్సరీ -- అంటే మా ఇల్లే అనుకోండి అక్కడ వుంటే త్వరగా కోలుకోవచ్చు. ఇప్పుడే మిమ్మల్ని తీసుకు వెళ్తాను-- అ, అన్నట్టు
మీ పేరు .......!"
"శ్రీధర్ " మళ్ళీ అతను కళ్ళు నెమ్మదిగా మూతలు పడిపోయినాయి. భార్గవి సహాయంతో నెమ్మదిగా శేఖర్ శ్రీధర్ ని తీసుకొచ్చి కారులో పడుకో బెట్టాడు. నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ఇంటి వైపు పోనిచ్చాడు కారుని.
గేటు లోపలి నుంచి కారు లోపలికి వచ్చ్జి ఇంటి ముందాగింది. ఇద్దరు నౌకర్లు గబగబా పరుగెత్తు కొచ్చారు. వాళ్ళ సహాయంతో శ్రీధర్ ని తన రూము కి పక్క గదిలో బెడ్ మీద పడుకో బెట్టాడు శేఖర్.
చీకటి పడిపోయింది. తదియ చంద్రుడు మసక వెన్నెల కురిపిస్తున్నాడు. కిటికీ లోంచి సన్నని వెన్నెల కొద్దిగా తొంగి చూస్తున్నది. శ్రీధర్ కి కాసేపు స్పృహ రావటం - మళ్ళీ స్పృహ పోవటం -- ఇలా ఉంది. అతని పక్కనే కదలకుండా కూర్చున్నాడు శేఖర్. గడియారం ఎనిమిది గంటలు కొట్టింది. శేఖర్ ముఖమంతా చెమట పట్టింది.
గంబీరంగా , దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు అతని ముఖ కవళికలు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి. "అన్నయ్య కెట్లా వుంది?' అని నోటి దాకా వచ్చిన మాటలే అతని ముఖం చూస్తూ అడగలేక పోయింది భార్గవి. ఆమెకు దుఃఖం ఉప్పెనలా ముంచు కోస్తున్నది.
మాటా పలుకూ లేకుండా పడున్న శ్రీధర్ ని చూడలేక బయట వరండా లోకి వచ్చి స్థంభం ఆసరాగా నిలబడి దుఃఖించ సాగింది భార్గవి.
"భార్గవీ! పదండి. మిమ్మల్ని మీ అక్క దగ్గర దింపుతాను" అన్నశేఖర్ మాటలకు ఉలిక్కిపడి తలెత్తి చూసింది.'
గుడ్డి వెలుగులో -- ఆమె ఏడుస్తున్నదని వెంటనే తెలియలేదు శేఖర్ కి. చీకట్లో నిలబడ్డారేం?" అని లైటు వేశాడు శేఖర్.
ఒక్కసారి వెలిగిన వెలుగులో మలినమైన ఆమె ముఖం చూస్తూనే "అరె ఎడుస్తున్నారా? మీ అన్నయ్య ప్రాణానికి నా ప్రాణం అడ్డు! సరా! ఊరు కోవాలి మరి ఇక్కడ ఉంటె మీ మనస్సు పాడై పోతుంది-- పదండి" అన్నాడు.
అతని మాటలతో ఆమెకు మరింత దుఃఖం కలిగింది. ముఖం రెండు చేతులతోనూ కప్పుకుని బిగ్గరగా ఏడవసాగింది.
"అయ్యయ్యో! మీరలా బెంబేలు పడిపోతే ఎలా? ఊరుకోండి -- నాకెలా సముదాయించాలో కూడా తెలియదే.. చూడండి భార్గవీ" అంటూ ఆమె రెండు చేతులూ తీసేసి తలని మృదువుగా తన గుండెల కానించుకున్నాడు శేఖర్. ఆ ఆవేదనలో అతని గుండెల్లో ఉన్న భార్గవి కి ఎంతో ధైర్యంగా అనిపించింది. మరుక్షణం లోనే చటుక్కున దూరంగా జరిగి "నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి." అంది.
* * * *
శేఖర్ భార్గవిని నీరజ దగ్గర దించి ఇందిరను తీసుకుని వచ్చాడు. ఆ రాత్రి గడవటం కష్టం అని నిర్ణయించుకున్న తరువాత ఇందిర అవసరం అతని కెంతైనా ఉందనిపించింది.
శ్రీధర్ దగ్గరిగా వచ్చి చూసిన ఇందిర కు మతి పోయింది . ఎంత నిగ్రహించుకున్నా ఆమె కన్నీటిని ఆపలేకపోయింది.
"ఇదేమిటి మీరు కూడానా! ఇప్పటి దాకా ఆవిడ ఏడ్చింది. మళ్ళీ మీరు మొదలు పెట్టారా! అయినా ఎవరో పేషెంటు కోసం మీరిలా...."
"కాదు శేఖర్! పాపం, భార్గవి ఏమవుతుందనే నాకు బాధ కలిగింది" అని తమాయించుకుని శేఖర్ తో కన్ సల్టు చేసి భగవంతుడి మీద భారం వేసి తన మనసుకి తోచిన విధంగా వైద్యం చేసింది.
ఆ రాత్రి ఇద్దరూ కళ్ళలో వత్తులు వేసుకుని కూర్చున్నారు. తెల్లవారుఝామున నాలుగు గంటల ప్రాంతంలో శ్రీధర్ కి టెంపరేచర్ కాస్త తగ్గి ఫరవాలేదని పించింది.
"అయినా ఇది నమ్మటానికి వీలులేదు ఇట్లా తగ్గుతూనే మళ్ళీ తిరగబెడుతుంది" అనుమానంగా అన్నాడు శేఖర్.
"లేదు శేఖర్! ఈసారి అలా జరగదు. తెల్లవారే సరికి బాగా తగ్గిపోతుంది చూడండి" అంది ఇందిర.
ఆమె గొంతులో ధ్వనిస్తున్న ఆత్మ విశ్వాసానికి ఆశ్చర్యపోతూ "నేను కూర్చుంటాను-- మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి" అన్నాడు శేఖర్.
"వద్దు. నేనే కూర్చుంటాను- మీరు నిద్రపోండి" పక్కనే ఉన్న మాగజైన్ చేతిలోకి తీసుకుంటూ అంది ఇందిర.
నిద్రలేకపోవటం వల్ల మానసికంగా కొంత శ్రమ పడటం వల్ల శేఖర్ వెంటనే లేచి తన రూము లోకి వెళ్ళిపోయాడు.
శేఖర్ వెళ్ళిపోయిన తరువాత మాగజైన్ పక్కన పడేసి శ్రీధర్ ని చూస్తూ కూర్చున్నది.
కళ్ళు మూసుకుని నిశ్చలంగా పడుకుని వున్నాడు శ్రీధర్. జ్వరం వల్ల కాస్త నల్లబడిన ముఖంలో ప్రత్యేకమైన మార్పేమీ ఈ ఏడు సంవత్సరాల ల్లోనూ రాలేదు. కొంచెం లావు మాత్రం అయి ఉండవచ్చు. తెల్లగా, బలంగా ఉన్న ఆ చేతులేనా తనని బంధించింది? గులాబీలతో పోటీ పడుతున్నట్టు ఆ పెదవులేనా తనను...."
ఇందిర పెదవుల మీద చిన్నగా చిరునవ్వు కదలాడింది.
ఏమిటో భగవంతుడి లీలలు. చిత్రాతి చిత్రంగా ఉంటాయి. ఆనాడు తనను వంచించి బలాత్కారంగా తన శీలాన్నపహారించి, శాశ్వతమైన కళంకం తన కాపాదించిన ఈ పురుష పుంగవుడ్నీ ఈనాడు తను ప్రాణా పాయం నుండి తక్షించటానికి వచ్చింది! ఏనాటి శ్రీధర్! ఏనాటి అనుభవం అది.
ఈ ప్రపంచంలో మనుష్యుల జీవితాలు -- ఒకొక్క సంఘటన ఒక్కొక్క తీరుగా మలచ బడతాయి. అనాడా ఘోరం జరగకుండా ఉంటె అందరి లాగే తనూ వివాహం చేసుకుని- పురుషుడి అండన, మాతృత్వం లో ప్రశాంతంగా ఉండి ఉండేది. తండ్రి చివరి క్షణాల్లో అంత క్షోభ కు గురి అయ్యేవాడు కాదు. కాని, తను ఎన్ని విధాల ఆలోచించినా తన మనసు వివాహానికి ఒప్పుకోలేదు. ఒక్కొక్కప్పుడు అనిపించేది -- జరిగిందేదో జరిగింది -- మాతృత్వ భాగ్యానికైనా నోచుకుని ఉంటె -- ఆ వెలుగులో జీవితం గడపాలని! "శ్రీధర్ ! నీ తప్పేం లేదు -- అంతా నేనే కావాలని-- కొని తెచ్చుకున్న ఉపద్రవం ! 'ఆమె ఇలా ఆలోచిస్తూ అతన్నే చూస్తూ కూర్చున్నది. ఇంతలో శ్రీధర్ కదిలాడు.
"దాహం ...దాహం" అని నెమ్మదిగా అతని పెదవులు కదిలినయి. ఇందిరా గ్లాసుతో గ్లూకోజ్ నీళ్ళు తెచ్చి చెంచాతో అతని నోట్లో పోయ్యసాగింది. అతను చాలన్నట్టు చెయ్యి నెమ్మదిగా అడ్డం పెట్టుకున్నాడు -- అతని నోటి దగ్గరగా ఉన్న ఇందిర చెయ్యి తగలడంతో ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని "భార్గవి ....ఎక్కడున్నాను నేను.....ఎవరది. భార్గవి కాదా! కాదు, కాదు ఈ చెయ్యి ....ఈ స్పర్శ .
ఇందిర ఒక్క ఉదుటున లేచి శేఖర్ గదిలోకి వెళ్ళింది. అతను నిద్ర పోతున్నాడు ప్రశాంతంగా.
గబగబా అక్కడే టేబుల్ మీద ఉన్న కాగితం కలం తీసుకుని.
శేఖర్!
శ్రీధర్ కి కులసాగానే ఉంది- నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. అతనేదైనా అడిగితె నా పేరు మాత్రం చెప్పకండి -- నా మాట మీద గౌరవం ఉంచి దయచేసి ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వద్దు. తరువాత విపులంగా మాట్లాడుకుందాం.
ఇందిర'.
అని వ్రాసి ఆ పేపరు శేఖర్ పక్కగా పెట్టి బయటకు వచ్చేసింది.
కారాపి ఇంటికి వచ్చేసరికి అప్పుడే తెల్లవారుతున్నది. వెలుగు ఇంకా పూర్తిగా చీకటిని మింగలేదు. లోపలకు వస్తున్నా ఇందిర పక్కకు చూసింది. మంచుకు తడిసిన గులాబీలు నెమ్మదిగా తలలూగిస్తూ నవ్వుతున్నాయి. నెమ్మదిగా ఆ చెట్ల వైపు నడిచి రెండు చేతులలోకి విరిసిన గులాబీ ని తీసుకుని తన ముఖానికి దగ్గరగా పెట్టుకుంది. విచ్చిన గులాబీ లో శ్రీధర్ ముఖం నవ్వుతూ కనిపించింది. ఇందిర మనసెందుకో అదోలా అయిపొయింది. గులాబీ ని వదిలేసి లోపలి కెళ్ళింది.
* * * *
భార్గవి ఫ్లాస్కు లో కాఫీ పోసుకుని తీసుకోచ్చేసరికి శ్రీధర్ కళ్ళు తెరిచి చూస్తూ పడుకుని ఉన్నాడు.
"అన్నయ్యా!" అంటూ దగ్గర కెళ్ళింది. శ్రీధర్ చెల్లెల్ని చూసి నీరసంగా నవ్వాడు.
"అన్నయ్యా! అబ్బ! ఎంత గాభరా పడి పోయానో! ఇవ్వాళే పెద్దమ్మ వచ్చింది.
