విశ్వనాధపల్లి భిక్షం సంగమేశ్వరం గ్రామము
వయస్సు ; 22 సం.

కోడి కూతతో మేల్కొన్నాను. దుప్పటి కప్పుకొని యింటి బయటకు వెళ్ళాను తూర్పు తెల్ల వారింది. హోరుగాలి వీస్తుంది. వాన జల్లులు పడుతున్నాయి. గోనె సంచి ముసుగు వేసుకొని, కర్ర పోటీ వేసుకొంటూ బయలు దేరాను నాతోపాటు కొక్కిలిగడ్డ వసంతరావు, నాంచారయ్యగారలు కూడా యున్నారు మేమంతా రొయ్యల కట్టుకాడికి వెళ్ళాలి అందుకని ఎంతో కష్టపడి కట్టుకాడికి జేరుకొన్నాము. చలివేసి వణికి పోతున్నాము గాలికి కొట్టుకుపోయేటట్టున్నాము. ఏమైనా ఆ రోజు యెన్నడూ పడనన్ని రొయ్యలు పడ్డాయి. అందుకని మాకు చాలా సంతోషంగా యుంది వాటిని తీసుకొని యింటికి జేరుకున్నాము.
కావిళ్ళతో తెచ్చిన సరుకును దించి వేశాము ఆ సరుకంతా బుంగలలోనే వుంది. షుమారు 2000 రూ||లు ఖరీదు చేస్తుంది. ఆ రొయ్యల్ని ఏం చెయ్యాలో తోచటం లేదు. వాన ఎక్కువైంది గాలి విపరీతంగా వీస్తుంది. ఏం చేసేది తోచక వాటిని బయటే వదలి యింట్లోకి వెళ్ళాను అప్పటికి ఉదయం 10 గం||లయింది, మా నాన్న మంచం మీద పండుకొని నిదురపోతున్నారు. మిగిలిన వాళ్ళంతా చలితో వణికి పోతున్నారు. మా అమ్మ మాత్రం అటూ యిటూ తిరుగుతూంది.
నేను యింట్లోకి వెళ్ళిన కొంత సేపటికి మా నాన్న నిదురలో ఒకే గావు కేక వేశాడు. తుళ్ళిపడి లేచి, మంచం మీద కూర్చున్నారు. నిలువెల్లా వణికి పోతున్నారు. నేను దగ్గరకు పోయి, ఆయన చేయి పట్టుకొన్నాను. ఏమిటి నాన్నా? అని అడిగాను. నా కొక పీడకల వచ్చింది. కళ్ళంలో మన చేపలన్నింటిని ఎడ్లు కాళ్ళతో త్రొక్కుచూ, కొమ్ములతో జిమ్మేస్తున్నాయి. యిదేదో ప్రమాదానికి గుర్తుగా నా కనిపిస్తుంది. కనుక మీరంతా జాగ్రత్తగా వుండమని చెప్పాడు. కట్టు కాడికి వెళ్ళి నావల్ని జాగ్రత్తగా కట్టి, వలలు తీసుని రమ్మన్నాడు. నేను, మరో యిద్దరు కలసి రత్న కోడు వరకు వెళ్ళి, నావను భద్రపరచి, వలలన్నింటినీ యింటికి తెచ్చాము.
ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. మా యిల్లంతా ఎగిరిపోతోంది. గాలికి గోడలు కూడా వూగుతున్నాయి. నేను, మా నాన్న యిల్లెక్కి వలల్ని యింటిమీద కప్పాము; అవి షుమారు 2000 రూ.ల వరకు చేస్తాయి. వాటినన్నిటిని బిగించి కడుతూ సాయంత్రం 4 గం.ల వరకూ యింటిమీదే వున్నాము కొండంతా కావురు కమ్మింది. చుట్టుప్రక్కల ఏమీ కనిపించుటలేదు. చీకటిలో యున్నట్లుంది ఒక్కసారి తూర్పువైపున సముద్రంమీద ఎర్రగా మండినట్లు వుంది. అది చూచి మా నాన్న ఉప్పెన వచ్చేస్తోంది అని కేకవేశారు. మేము యిల్లు దిగి క్రిందకు వచ్చాము. అందరూ గోలచేసి యేడుస్తున్నారు, మాకు దగ్గరలో నా అక్కగారి యిల్లుంది. ఆమె పేరు వల్లభుని యానాదమ్మ ఆ యిల్లు చాలా పల్లంలో వుంది. అందుకని అక్కడకు పరుగెత్తికెళ్ళాను వాళ్ళనంతా రామమందిరం వద్దకు తీసుకువచ్చి దానిలో వుంచాను. తిరిగి యింటికి వెళ్ళి మావాళ్ళను కూడా రామమందిరంలోకి చేర్చాను.
నా యెడ్లు కట్టు కొయ్యలకు కట్టబడి వున్నాయి అది గుర్తుకు వచ్చి నేను తిరిగి మా యింటికి వెళ్ళాను. వాటి కట్టులు కోసి బయటకు తోలేశాను ఒక్కసారి వెనుదిరిగి చూశాను విపరీతమైన వాగ హోరు పెట్టుకొంటూ, నురుగులు కక్కుతూ వస్తోంది. నా గుండెలు బ్రద్దలై నాయి. వెంటనే నేను యిల్లెక్కాను మా యింటి కెదురుగా మా పెదనాన్నగా రిల్లుంది. దానిలోవారంతా వచ్చి మా యిల్లెక్కారు. వాళ్ళు మొత్తం 9 మంది అందరూ గోలచేసి ఏడుస్తున్నారు. ఇంతలో వాగలు ఎక్కువైనాయి. నీరు యిల్లెత్తున వచ్చింది. గోడలు పడిపోయాయి. ఇంటికప్పు నీటిపై తేలుతూ వెళుతోంది. ఒక్కొక్కచోట సుడి తిరుగుతూ మహావేగంగా పోతోంది.
మా యింటితోపాటు చాలా యిళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఒకచోట ఒక యింటిమీద చాలామంది జనం కనబడుతున్నారు. ఆ యిల్లు క్రిందకు గ్రుచ్చుకుపోయి నీటిపై తేలలేదు. దాని ప్రక్కనుంచి మా యిల్లు కొట్టుకుపోతోంది. దానిమీద నా మిత్రుడు విశ్వనాథపల్లి ముత్యాలు వున్నాడు ఆయన చేతిలో పెద్ద మూట కనిపిస్తోంది. అది గొంగళి మూట దానిలో చాలా అమంది పిల్లలున్నారు. వాళ్ళందరి తలలు కనిపిస్తున్నాయి. షుమారు పదిమంది వరకూ యుండవచ్చు. అతను మరో చేతిని నాకు అందించాడు. కాని దురదృష్టం కొలది అందుకోలేక కొట్టుక పోయాను.
మా తెప్ప చాలా దూరం కొట్టుక పోయింది. అక్కడొక తాడికి తగిలి రెండుగా చీలిపోయింది. నేనొక ప్రక్కకు మా పెద నాన్న, మిగిలిన వాళ్ళంతా మరో ప్రక్కకూ విడిపోయాము. మా పెదనాన్న యేవో కేక లేస్తున్నారు. అవి నాకు సరిగా తెలియుటల్లేదు. వాళ్ళ తెప్ప అక్కడొక శివాలయం వుంటే దాని ముందు ఆగింది. నేను కొట్టుక పోతున్నాను. కొంత దూరం పోయేటప్పటికి ఒక జత ఎడ్లు యీదుకొంటూ నా తెప్ప వద్దకు వచ్చాయి. అవి కూడా నా తెప్పమీదకు ఎక్కుతాయేమో ననిపించింది. అవి యెక్కినట్లయితె నా తెప్ప మునిగిపోయేదే. కాని అవి తప్పుకుపోయాయి. కొంతదూరం పోయి మునిగిపోయాయి.
నా తెప్ప మహావేగంగా కొట్టుకపోతోంది నేను మా వూరి నుండి చాలాదూరం పోయాను. నాకు దగ్గరలో ఒకతను ఏడుస్తూ తెప్పమీద కొట్టుకపోతున్నాడు. అతని తెప్ప అకస్మాత్తుగా సుడి గుండంలో పడింది. అది మునిగిపోయేటట్టుంది నా తెప్పకూడా దాని దగ్గరకు జేరింది అతను చేతులందించాడు. అతన్ని లాగి నా తెప్పమీద వేసుకొన్నాను. అతని వూరు "పాతవుప కాలి", పేరు కోలా వెంకటేశ్వర్లు.
చూస్తుండగానే మా తెప్ప "కమ్మనమోలు" చేరుకొన్నది. ఆ వూరంతా కొట్టుకపోయింది. అక్కడక్కడ నిలచియున్న యిండ్లను బట్టి ఆ వూరును గుర్తించాము కాని మా తెప్ప అక్కడకూడా నిలువకుండా కొట్టుకపోయింది. అసలే వాగలతో కావురు క్రమ్మి, చీకటిగా వుంది. ఆపైన ప్రొద్దుకూడా గూకింది. మా ప్రక్కనుంచే ఎవరో కేకలేస్తూ కొట్టుకపోతున్నారు, కాని వాళ్ళు ఎవరైందీ తెలియటంలేదు. అక్కడనుండి చాలాదూరం కొట్టుకపోయాము. ఒక కాలువకట్టకు పట్టి మా తెప్ప ఆగింది. అప్పటికి కొంచెం ప్రొద్దుపోయింది మేము సొమ్మసిల్లి దానిమీదనే పడిపోయాము. తరువాత ఏమి జరిగిందీ మాకు తెలియదు.
మేము లేచి చూచేటప్పటికి ఉదయం 7 గంటలయింది. పైకి లేచే ఓపిక లేదు నాకు ఒంటిమీద బట్టలన్నీ పోయాయి. అతనికి డ్రాయరు మాత్రం ఉంది. మాచుట్టూ యెటుచూచినా శవాలే కన్పిస్తున్నాయి నాకు భయమేస్తోంది అతనికి కూడా నోటివెంట మాట రావటంలేదు. ఇంతలో మావద్దకు ఒకతను వొచ్చాడు. అతనిది "భావదేవరపల్లి" మేము ఆవూరు కాలువకట్టను పట్టాము. యిక్కడికి ఆ వూరు 7 కి.మీ దూరం వుంటుంది.
వచ్చిన తను మాకు చేయి నిచ్చి లేవదీసాడు తన మొలపంచెలో సగం చించి నాకు యిచ్చాడు. నేను దానిని మొలకు చుట్టుకోలేక పోతున్నాను. అతనే నాకు గోచి పెట్టాడు. చేయి పట్టుకొని నన్ను మెల్లగా నడిపిస్తూ, నడుస్తున్నాడు. నా వెంట "ఉపకారి" అతను వస్తున్నాడు చాలా కష్టంమీద "భావ దేవరపల్లి" చేరుకొన్నాము. అల్లపర్తి అన్నపూర్ణయ్యగారి తోట దాపులోనికి వెళ్ళాము. ఆ వూరంతా స్మశానం లాగా వుంది. అక్కడక్కడ శవాల వద్ద జనం గుమిగూడి ఏడుస్తున్నారు. ఎక్కడ చూచినా శవాలే కనిపిస్తున్నాయి. వాటిని చూడలేక పోయాను నా కళ్ళు తిరిగినట్లయింది. మూర్చ వచ్చి పడిపోయాను. ఎవరో, ఒక కొబ్బరి బొండం తెచ్చి దానినీరు నా ముఖం మీద జల్లి నోరు తడిపారు. నేను కొంచెం తేరుకొన్నాను.
ఆదివారం సాయంత్రం 5 గం. కావచ్చింది. మండలి వెంకట కృష్ణారావుగారు అక్కడికి వచ్చారు. జీపులో మమ్మల్ని అవనిగడ్డ తీసుకు వెళ్ళారు. గాంధీ క్షేత్రంలో మాకు ఆశ్రయం కల్పించారు. రెండు రోజులు గడిచాయి మా వాళ్ళంతా నాగాయలంక వచ్చారని తెలిసి నేనక్కడికి వెళ్ళాను. నేను చచ్చి పోయానని మా వారంతా ఏడుస్తున్నారు. నన్ను జూచి వారికి ఎంతో ప్రాణం వచ్చింది. వాళ్ళని చూచి నాకు చాలా సంతోషం కలిగింది. 15 రోజుల పాటు మేము నాగాయలంకలోనే యున్నాము. తరువాత మా వూరు జేరుకొన్నాము. మా వూరిలో 76 మంది చనిపోయారు. మిగిలిన మేము ప్రాణాలతో నిలిచాము.
