Previous Page Next Page 
దివిసీమ ఉప్పెన పేజి 12

   
    పేరే ప్రకాశరావు                చింతకోళ్ళ గ్రామము
    
    వయస్సు 25 సం.   

    
    
    కాయకష్టం చేసుకొని జీవించేవాళ్ళం, రెక్కాడితేనె డొక్కలు నిండే పరిస్థితులు మావి, అందుకని సొసైటీ పొలాలను సాగు చేసుకొంటూ చింతకోళ్ళలో వుంటున్నాము. ఎంతో కష్టపడి మా పొలాలను సాగులోకి తెచ్చాము. కాని మా దురదృష్టం మమ్మల్ని వెన్నాడుతూనే వుంది. మా సొసైటీలమీద లోగడ ఒక మారాజు డబ్బు తెచ్చుకొని తినేశాడట. ఆ విషయం మాకు తెలియదు. కర్మకొలది ఆ అప్పు మామీద పడింది. పదులా! వందలా! వేలకొలది వుంది ఆ అప్పు. దానిని కట్టే పరిస్థితిలో లేము. అందుకని మా పొలాలు జప్తు చేయబడ్డాయి. మా వూరంతా ఆ పొలాలమీద బ్రతికేవాళ్ళమే అందుకని మేమంతా దిగులుతో వున్నాము.
    
    ఆరోజు శుక్రవారం అవనిగడ్డనుంచి ఆఫీసర్లు వచ్చారు. ఒకప్రక్క తుఫానుఛాయలు కనపడుతున్నాయి. మరోప్రక్క రేడియోలు రానున్న పెనుతుఫానుని గురించి హెచ్చరికలు చేస్తున్నాయి. అయినా ఆ మారాజులు మమ్మల్ని వదలకుండా మా పొలాలవెంట రత్నకోడువరకు తీసుకొనివెళ్ళారు. అప్పటికి సాయంత్రం 3 గంటలు కావచ్చింది. కొండంతా కావురు కమ్మి వానజల్లులు యెక్కువయినాయి. మేము వెనుతిరిగి మావూరు రామమందిరంలోకి వచ్చేశాము. ఆఫీసర్లకు మా మొర విన్నవించాము. వారు సానుభూతి చూపించారు మర్నాడు మమ్మల్ని అవనిగడ్డ రమ్మన్నారు వారు తగురీతిని సాయం చేస్తామన్నారు, వారి త్రోవన వారు వెళ్ళిపోయారు. మా యిళ్ళకు మేము జేరుకున్నాము.     
    
    తెల్లవారింది. శనివారం వచ్చింది. మేమంతా అవనిగడ్డకు వెళ్ళిపోదామనుకొన్నాము. కాని అప్పటికే పరిస్థితులు విషమించాయి. గాలివాన యెక్కువయింది. తుఫాను ప్రమాదాన్నిగూర్చి రేడియోలు పదేపదే చెపుతున్నాయి. మాకు వీలుపడక మా ప్రయాణాన్ని విరమించుకొన్నాము. ఎవరి యిండ్లను వాళ్ళము కప్పుకొంటూ జాగ్రత్త పడుతున్నాము. పొద్దెక్కినకొలదీ గాలివాన యెక్కువయింది. ఏదో ప్రమాదం ముంచుక వచ్చేటట్టుంది. ఏంచేయాలో తోచటంలేదు.
    
    మా కుటుంబము మొత్తము ఇరవై ముగ్గురము, మేమంతా ఒకే చోటికి జేరుకున్నాము. కాని తినేదానికి అవకాశం లేదు. మధ్యాహ్నం పన్నెండు గంటలకే మా యిల్లు పడిపోయింది. మా నాన్న గారయిన పేరే అంజియ్యగారున్న యింట్లోకి మేము జేరుకున్నాము. అక్కడ కూడా మాకు నిలువ నీడ లేకుండా పోయింది. గాలికి యిల్లంతా లేచి పోయింది గోడలు కరిగి మా మీద పడిపోయే టట్టున్నాయి. మాకు దగ్గరలోనే రామ మందిరముంది. దానిని ఇటుకలతో కట్టి సిమెంటు చేయించుకున్నాము, పైన స్లాబ్ పోశాము. అది చాలా గట్టిగా వున్నది. అది తప్ప మా వూళ్ళో వేరే బిల్డింగేమీ లేదు. అందుకని అందరము దానిలోకి వెళ్ళాము అప్పటికే దానిలో 50 మంది వరకు వున్నారు. మాకుదానిలో చోటు దొరకలేదు. ఏదోలా యిరుక్కుని దానిలోనే వున్నాము. లోనకు గాలి చొరగటంలేదు. ఉక్కిరి బిక్కిరిగా వుంది. నా వాళ్ళంతా నాకు దగ్గరలోనే వున్నారు. నా చిన్న కొడుకును భుజాన వేసుకొని వున్నాను. అతని వయస్సు మూడు సంవత్సరాలు. మేమెవరము బయటకు చూడ లేక పోతున్నాము.
    
    శనివారము సాయంత్రము నాలుగు గంటలకు సముద్రముమీద ఒక మెరుపు మెరిసింది మేమంతా గాలివాన తగ్గిపోవచ్చు ననుకొన్నాము. తరువాత కొంత సేపటికి గుళ్ళోకి నీళ్ళొచ్చాయి. అవి మాకు చీల మండల వరకున్నాయి. నోట్లో పోసుకొని రుచి చూశాము ఉప్పునీరు. ఇంకేముంది. ఉప్పు నీటి వాగరానే వచ్చిందని అందరు గోల జేసి యేడుస్తున్నారు ఒకళ్ళ నొకళ్ళు కావిటించుకొని వదిలి పెట్టటం లేదు. చూస్తుండగానే బొడ్డులోతు వచ్చింది. రానున్న ప్రమాదాన్ని గుర్తించి నేను బయటకు రావటానికి ప్రయత్నించాను నన్ను నా తల్లి, నా భార్య పట్టుకొన్నారు. బయటకు పోవద్దని యేడుస్తున్నారు. నేను వాళ్ళను తప్పించుకొని బయటకు వచ్చాను, నీరు రొమ్ముల లోతు వచ్చింది. పిల్లవాడు భుజానే వున్నాడు. అక్కడ నా కొక బల్ల దొరికింది. దానిని చంకలోకి తీసుకొన్నాను నీరు పెరిగిన కొలది నేను పైకి తేలుతున్నాను. గుళ్ళో వాళ్ళు నీళ్ళలో మునిగి పోయారు. నా ప్రక్క నుంచి ఒక ముసలావిడ కొట్టుక వచ్చింది. వీళ్ళిద్దరూ చచ్చిపోయారు. గుళ్ళో వాళ్ళంతా చచ్చిపోయి వుండవచ్చు ననుకున్నాను. నేను కూడా బ్రతుకుమీద ఆశ వదులుకున్నాను.
    
    చెక్కను పట్టుకొని నేను నీళ్ళలో కొట్టుకొంటున్నా. ఇంతలో పెద్ద వాగ వచ్చింది. నన్నెత్తి రామమందిరముపైన పడేసింది. ఒక దున్న యీదుకొంటూ నావద్దకు వచ్చింది. కాని అది వాగల్లో కొట్టుకపోయింది. నేనా మందిరముపైనే వున్నాను. నాకన్నా ముందుగానే అక్కడ ఒకతనున్నాడు. అతని పేరు పేరే సుబ్బయ్య. మేము దానిమీద ఒకర్ని ఒకరు పట్టుకొని వున్నాము. వాగలు గుడి యెత్తున వస్తున్నవి. ఒక్కొక్కసారి గుడిమీదుగ పోతున్నవి. కొంతసేపటికి ఒక పెద్ద వాగ వచ్చింది. వాగ తాకిడికి గుడి దక్షిణంవైపు గోడ పడిపోయింది. పైనున్న స్లాబ్ యెగిరి పదిగజాల దూరాన పడింది. గోడక్రింద కొందరు పడ్డారు కప్పుక్రింద కొందరు కప్పడిపోయారు. మేము నీళ్ళలో పడిపోయాము. భుజాన బాబు కొట్టుకపోయాడు. గుళ్ళో మిగిలిన శవాలన్నీ కొట్టుకపోవటం మొదలుపెట్టాయి. నేను నీళ్ళలో మునుగుతూ లేస్తున్నా ముందుకు కొట్టుక పోతున్నా. ఇంతలో మరో వాగ వచ్చింది. నన్నెత్తి ఒక తుమ్మమీద పడేసింది. దాని చిట్టచివరి కొమ్మ నా చేతికి దొరికింది. దానిని పట్టుకొని వేళ్ళాడుతున్నా.
    
    కళ్ళు చూడనివ్వటం లేదు. చేతులు బిగుసుకపోయాయి, వాగలు నామీదుగ పోతున్నాయి ఇంతలో ఒక అమ్మాయి వచ్చి నా మెడను కావిటేసుకొన్నది. ఆమె పేరు పెరుమాళ్ళ కాశీరత్నం, నేను గొంతు బిగుసుకొని ఉక్కిరి బిక్కిరయిపోతున్నాను ఆమెచేతులు పట్టుక లాగాను. రాలేదు ఆమె నా మెడ బిగించి పట్టుకొన్నది చేసేది లేక ఆమెచేయి కరచాను ఆమె నన్ను వదిలింది ఇంతలో మరో వాగ వచ్చింది ఆమె నీళ్ళలో పడిపోయింది. నేనుకూడా పడిపోయాను. ఆమె కొంతదూరం పోయి ఒక చెట్టును పట్టుకొన్నది. నేనుకూడా ఆమె దాపులోకి చేరుకున్నాను. మరోచెట్టును పట్టుకొన్నాను.
    
    ఇప్పటికి మా వూరు నుంచి ఒక మైలు దూరం వచ్చివుంటాము. నాకు బట్టలు లేవు. ఆమెకు కూడా లేవు. చలివేసి వణికి పోతున్నాము. కాళ్ళు చేతులు కొంకర్లు పోతున్నాయి. ప్రాణం శోషకు వచ్చింది చీకటి పడింది ఎక్కడా యవరూ కన్పించటం లేదు. పొద్దు పోయే వరకు అలాగే వున్నాను. కొంత సేపటికి గాలిలో మార్పు కనిపించింది వాగాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఏమయినా ఏం ప్రయోజనం? నా వాళ్ళంతా పోయారు. నేను మాత్రం ఎందుకు బ్రతకాలి? నేను కూడా చచ్చిపోవాలని పించింది అమాంతం ఆ చెట్టు మీద నుంచి క్రిందకు దూకాను ఒక ముళ్ళ పొదలో పడిపోయాను. నేను ఎటూ కదలటానికి వీలు లేకుండా వళ్ళంతా ముళ్ళు దిగపడి పోయాయి. వాగలు తగ్గు ముఖం పట్టాయి. నీరు నా క్రిందుగా ప్రవహిస్తోంది. నాకు తల తిరిగిపోతోంది. వళ్ళంతా మంటెత్తి పోతోంది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఎటూ తప్పుకోనే దానికి వీలుపడక ఆ ముళ్ళ మండల పైనే వున్నాను.
    
    నాకు కొంత దూరంలో యేదో కేక వినిపించింది. ఆ కేక చాలా భయానకంగా వుంది. మరోవైపు మరో కేక వినిపించింది. నాకు భయం వేస్తోంది. అవి మనుషుల కేకల వలె లేవు. బహుశా దయ్యాల కేకలయి వుండవచ్చునని పించింది. నాకు భయమేసి మెదల కుండా వున్నాను మరలా నాకు దగ్గరలో ఒక కేక వినిపించింది. అది నా చిన్నన్న కేకలాగుంది. నాకు మరీ భయ మేసింది వాళ్ళంతా చచ్చిపోయారు కదా! వీళ్ళు దయ్యాలయి నన్ను తీసుకొని పోవటానికి వస్తున్నారేమోనని పించింది. అందుకని మెదలకుండా వున్నాను. మరలా నా చుట్టూ కేకలే వినిపిస్తున్నవి. అవన్నీ నేను లోగడ విన్నా గొంతుకలే. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. మరలా నా అన్న కేక వినిపించింది. ఒరే అన్నా! నే నిక్కడున్నారా! అని కేకేశా. నా చుట్టు ప్రక్కల వాళ్ళంతా నా వద్దకు వచ్చారు. నా అన్న కూడా వచ్చాడు నన్ను ముళ్ళ పొదనుంచి బయటకు లాగారు. అప్పటికి రాత్రి 2 గంటలు కావచ్చు. మేమంతా చలివేసి వణికిపోతున్నాము. ఒకర్ని ఒకరు కావిటించుకొని అక్కడే వున్నాము.
    
    తెల్ల వారింది. ఆదివారం వచ్చింది. మాకు ఎవరికీ వంటిమీద బట్టలు లేవు. మేము పదహారు మందిమి. మేమంతా కలసి మా వూళ్ళోకి వచ్చాము. ఊరంతా ఊడ్చుక పోయింది. ఒక్క యిల్లు కూడా లేదు. అంతా శవాల మయం. రామ మందిరం గోడ క్రింద ఒక శవం కనపడుతోంది అది ఆడ శవం. నడుమ నుంచి పైన గోడ క్రింద వుంది. కాళ్ళ వైపు మాత్రమే పయట వున్నది కట్టుకొన్నా చీరా కాలివంపూ చూశాను, అది నా భార్య మీదపడి బావురుమని యేడ్చాను. ఆమెను బయటకు లాగే ఓపిక నాకు లేదు. పైకి లేచి నా యింటి వద్దకు వెళ్ళాను. ఇల్లంతా పోయింది. మా దిబ్బమీద యెవరో యిద్దరు కూర్చొని వున్నారు. వాళ్ళు కూడా బట్టలు లేకుండా మోళ్ళులాగున్నారు. వాళ్ళను చూసి నేను ఏడ్చాను. వాళ్ళిద్దరు కమ్మన మోలునుంచి కొట్టుక వచ్చామని చెప్పారు.
    
    నా యింటి గోడక్రింద ఒక లుంగీ కనపడుతోంది. దానిని తీసి తలా ఒక ముక్క గోచీలు పెట్టుకొన్నాము, వాళ్ళని వదలి నేను బయలుదేరాను. ఎదురుగా ఎత్తాంటి ముళ్ళచెట్టు కనపడుతోంది. దాని మీద కాళ్ళు పైకి తల క్రిందకు పెట్టి వ్రేళ్ళాడుతున్న ఒక శవం కనిపించింది చెట్టెక్కి చూశాను అది శవం కాదు, కొంచెం ప్రాణముంది. అతని పేరు ఆదిశేషు. నోటివెంట నురుగు కక్కుతున్నాడు. అతన్ని భుజాన వేసుకొని క్రిందకు దించాను. రామమందిరంవద్దకు తీసుకవెళ్ళాను. నేను చేసిన శ్రమంతా నిష్ప్రయోజనమయింది అతను చనిపోయాడు.
    
    నేనూ నా యిద్దరన్నలు బ్రతికాము. మేము మరికొంతమంది కలిసి మందపాకలవైపు ప్రయాణం సాగించాము. ఎటుచూచినా నీళ్ళే ఎక్కడ చూచినా శవాలే. రొమ్ములలోతు నీళ్ళలో పోతున్నాము. కొంతదూరం పోయేటప్పటికి మాలో ఒకతను పడిపోయాడు. అతని పేరు పేరే ముత్యాలు. అతన్ని ఒక దిబ్బమీదకు జేర్చాము అతను గిలగిలా తన్నుకొంటున్నాడు. మేము చేయగలిగింది లేక అక్కడనుండి బయలుదేరాము. మాకు దగ్గరలోనే ఒకామె కొనవూపిరితో కనపడింది ఆమె పేరే చిట్టమ్మ. పాపం వీళ్ళిద్దరూ దాహంతో చనిపోతున్నారు. వీళ్ళనొక చోటికి చేర్చి మా ప్రయాణం మొదలుపెట్టాము.
    
    ఆదివారం ఉదయం పది గంటలకు మందపాకల జేరాము మిల్లు ఆదినారాయణగారి యింటికి వెళ్ళాము. అప్పటికే అక్కడ మా వూరివాళ్ళు 25 మంది వున్నారు. వీళ్ళంతా పాతరెడ్డిపాలెంవరకు కొట్టుకపోయి బ్రతికి బయటపడ్డవాళ్ళు, మమ్మల్ని చూచి వాళ్ళు యేడ్చారు. వాళ్ళని కావిటించుకొని మేమూ యేడ్చాము. ఆరోజక్కడే వున్నాము. ఆదినారాయణగారు మమ్మల్ని ఆదరించారు. అయిదు క్వింటాళ్ళ బియ్యంవరకు ఆయన ధర్మం చేశారు. మా ప్రాణాలను నిలిపారు.
    
    మేము అక్కడనుంచి బయలుదేరాము. కాలువకట్టవెంట నాగాయలంకవైపు వెళుచున్నాము ఆ కట్ట పొడవునా తెట్టువపట్టి వుంది. ఎక్కడ చూచినా శవాలే. వాటిని దాటుకొంటూ పోతున్నాము. భావదేవరపల్లి దాటాము కొంతదూరం వెళ్ళేటప్పటికి మండలి వెంకట కృష్ణారావుగారు మాకు యెదురొచ్చారు. వారిని చూచి మేమంతా యేడ్చాము. మమ్ము వారు ఓదార్చారు, మమ్ము నాగాయలంక క్యాంపులోకి పంపించారు.
    
    సోమవారంనాటికి మేము అవనిగడ్డ గాంధీక్షేత్రానికి వెళ్ళాము. మేము వెళ్ళిన మూడవనాటికి నా మూడవ వదిన 'పేరే ముసలమ్మ' జాడ తెలిసింది. ఆమె ఉల్లిపాలెం వద్ద పట్టిందట. ఆమెను ఆ వూరి వాళ్ళు కోడూరు జేర్చారు. తరువాత ఆమె మావద్దకు వచ్చింది మేమంతా ఇరువదిరోజులపాటు గాంధీక్షేత్రంలోనే వున్నాము. మమ్మల్ని మండలి వెంకట కృష్ణారావుగారు యెంతో కనికరించి ఆదరించారు. హేమలతా లవణంగారలు మమ్మల్ని యెంతగానో ఆదుకొన్నారు.
    
    నెలరోజుల తరువాత మమ్మల్ని మందపాకల క్యాంపుకు మార్చారు. అక్కడొక వారంరోజు లున్నాము. తరువాత మా గ్రామానికి వచ్చాము. పాకలు వేసుకొని వాటిలోనే వున్నాము. నా కుటుంబ సభ్యులు 23గ్గురులోను నేను, నా అన్నలిద్దరు, నా మూడవ వదిన మాత్రమే బ్రతికాము మావూళ్లో 15 సం||లోపు పిల్లలే లేరు. మేము మాత్రం జీవచ్చవాల్లా మిగిలిపోయాము.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS