Previous Page
దివిసీమ ఉప్పెన పేజి 14

                      దివిసీమ ఉప్పెనకు  46 సంవత్సరాలు పూర్తి 

    
    వక్కలగడ్డ. కోటేశ్వరావు          మందపాకల గ్రామము
    
    వయస్సు : 45 సం.

    
                       
    
    నేను చిన్ననాటినుంచి దైవభక్తి కలవాడను నాయిష్టదైవం రాముడు. అట్లని యితర దైవముపట్ల యితర మతాలపట్ల, నాకు ద్వేషంలేదు. నేను హిందువుడనైనా ముస్లిం మరియు క్రైస్తవ ప్రార్ధనాలయములకు కూడ వెళ్ళుతూవుండేవాడిని మేమంతా కలసి మెలసి అన్నదమ్ముల్లా తిరిగేవాళ్ళం. నా శాయశక్తులా దైవకార్యాలకు ధనవ్యయముచేస్తుండేవాడిని నాకు రెండు చిన్న కార్లుండేవి. మరో లారీకూడ యుంది. నేనూ, ఒక చిన్నకారు ఎప్పుడూ భక్తిబృందాలను చేరవేయటానికే సతమతమై పోతుండేవాళ్ళం. కాలక్రమేణా నా ఆస్థి ముద్దకర్పూరంలా హరించుకుపోవటం మొదలుపెట్టింది. నా కార్లు అప్పులవాళ్ళకు అంకితమయ్యాయి నా లారీకూడ మరో దారి చూచుకొంది. మేము మాత్రం మిగిలిపోయాము.
    
    కాలం దొర్లిపోతున్న కొలది కష్టాలుకూడ ఎక్కువైనాయి. బ్రతుకు తెరువు చాలా కష్టమైంది. కాని, నేను భక్తితత్పరతను మాత్రం వీడలేదు. నాకు కలుగుచున్న ప్రతి పరీక్షను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నా! నేను నా స్వగ్రామమైన అవనిగడ్డలో నుండి చేయగలిగిందేమియులేక మందపాకలవద్ద కొంత భూమిని తీసుకొని నామకాం అక్కడికి మార్చాను కష్టపడి భూమిని సాగులోకి తీసుకొని వచ్చాను. అక్కడే ఒక దిబ్బమీద యిల్లు కట్టుకొని దానిలోనే కాపురముంటున్నాను.
    
    ఆరోజు శనివారం ఉదయానేలేచి, పైనపంచి వేసుకొని, చేను చుట్టూతిరిగి వచ్చాను. నాభూమంతా బాగాపండి ఒరిగింది, యకరాకు ఇరువది బస్తాలకు మించవచ్చుననుకొన్నా గాలి వున్నకొలది ఎక్కువయి వాన జల్లులు కూడా ఎక్కువైనాయి. నేను నిలువలేక ఇంటికి జేరుకొన్నాను.
    
    మా యిల్లు ఒంటరి యిల్లు దగ్గరలో మరేయిళ్ళు లేవు. మందపాకలకు, చింతకోళ్ళకు, మయాన వుంది నా భార్య. మనుమన్ని దగ్గర వుంచుకొని వున్నది. మాకు దగ్గరలో బాతుల వాళ్ళున్నారు. వాళ్ళకు ఒక వేయి బాతులున్నాయి. వాళ్ళు కూడా మా యింటి లోకి వచ్చారు. ఉదయం ఎనిమిది గంటలకే బాతులన్నీ చెల్లాచెరురైపోవటం మొదలు పెట్టాయి. గాలి వాన ఎక్కువైంది గాలి వేగానికి బాతులు పక్షుల్లా పై కేగిరి గిరగిరా తిరుగుతూ కొట్టుకు పోతున్నాయి గొడ్లకు కట్టిన త్రాళ్ళు కూడా ఆగటం లేదు. త్రాళ్ళు తెంచుకొని గొడ్లు అడులుతూ, పరుగులెడుతున్నాయి. బయటకు చూడనివ్వటం లేదు. చాలా భయానకంగా యుంది.

                 
    
    తుఫాను గాలులు తారస్థాయి నందుకొన్నాయి. మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యేటప్పటికి, మా యిల్లు నేల కూలింది. నాలుగు ప్రక్కల భూమిని ఆనుకొన్నది మేము మాత్రం మయానా వున్నాము బయట ఏమి జరుగుతుందో తెలియటం లేదు మేము ఎక్కడికి వెళ్ళటానికి వీలుపడక దానిలోనే యున్నాము.
    
    శనివారం సాయంత్రం 5 గం.లు కావచ్చింది. మా యింట్లోకి నీళ్ళు వచ్చాయి. అవి వాన నీళ్ళు అనుకొన్నాము. చూస్తుండగానే ఆ నీళ్ళు పెరిగిపోతున్నాయి. యింట్లో సామానులన్నీ నీళ్ళ మీద తేలుతున్నాయి. నా గుండెలు బ్రద్దలయ్యాయి. ఉప్పునీటి వాగ వచ్చిందని, నేననగానే మా వాళ్ళంతా ఏడ్వడం మొదలు పెట్టారు. అప్పటికి మా యింట్లో 11 మందిమే వున్నాము అందరమూ యింటి కప్పు మీదకు ఎక్కాము. మేమంతా పైకి వెళ్ళగానే పెద్ద వాగా వచ్చింది ఒకేసారి మా యిల్లు పైకి తేలింది. మా యింటి ముందు ఒక తాడి వుంది. దాని మొవ్వును రాసుకొంటూ మా యిల్లు కొట్టుకపోతోంది. ఉప్పెన అలలలో నేను నా మనవడ్ని పట్టుకొని వున్నాను. మా యిల్లు గిరగిరా తిరుగుతూ మహా వేగంగా కొట్టుక పోతోంది. నన్ను పట్టుకొని నాభార్య కూర్చున్నది. మిగిలిన వాళ్ళంతా వేరు వేరుగా యున్నారు.
    
    యిల్లు కొట్టుక పోతోంది. యింతలో ఒక పెద్ద వాగ వచ్చింది. దాంతో మా యిల్లు తలక్రిందులైంది. మేమంతా నీళ్ళలో పడి పోయాము. నా చంకలోని పిల్లవాడు నీళ్ళలో కొట్టుక పోయాడు. నా భార్య నన్ను వాటేసుకున్నది. నేను కూడా నీళ్ళలో ఉక్కిరి  బిక్కిరై పోతున్నాను. తెప్పరించుకొని నీటి పైకి లేచి ఆమె వంక చూశాను. ఆమె చనిపోయింది కాని నేను ఆ శవాన్ని వదలలేదు. ఆమెతో పాటు నేను కూడా చనిపోవుటకే నిశ్చయించుకున్నాను. మరలా వాగ వచ్చింది. నా భార్య శవం నా నుంచి విడిపోయింది. నాకు అంతవరకే తెలుసు. తరువాత తాళ్ళతోపు మయాన ఒక తుమ్మ మీద పట్టాను. అప్పటికి నాకు స్పృహ తెలిసింది. నేనొక రెప్పపాటు లోనే యిక్కడకు వచ్చినట్లుంది. మీ మయానా ఏమి జరిగిందీ నాకు తెలియదు. నేనా నీళ్ళ మీద వెళ్ళటానికి నాకేమీ ఆధారం లేదు. నే నెలా వచ్చానో తెలియదు.
        
    నేను తుమ్మచెట్టు మీద చిక్కుకు పోయాను గాలి మహావేగంగా వీస్తుంది షుమారు గంటకు 200 కి.మీ వేగం వుండవచ్చు. అంతకు మించిన వేగంతో సముద్రపు పోటు పొడుస్తుంది. ఎటు చూచినా భయంకరంగా కనబడుతూంది. నేను ప్రాణాలపై ఆశ వదలుకొన్నా! అవసాన దశలో రామ నామ తప్ప మరేమీ నాకు కనిపించలేదు. ఒళ్ళంతా తుమ్మముళ్ళు దిగబడి పోయాయి. ఒక్కొక్క సారి వాగలు నామీదుగా పోతున్నాయి. నేను మాత్రం రామా రామా! రామా! రామ అంటూ రామ నామంలోనే లీనమయ్యాను. నా కళ్ళు మూతలు పడి వున్నాయి. కాని ఆ మహానుభావుని మూర్తి నా కళ్ళెదుట కట్టినట్లుంది. యిక నేనేమైనా ఫరవా లేదు. నా రాముడు నాకు కనిపిస్తున్నాడు. నా రాముని నేను కలుసుకుంటాను, రామా! రామా ! రామా! అంటూ అదే ధ్యానంలో వుండిపోయాను. బయట ఏమి జరుగుతుందో నాకు తెలియదు నాకు తెలిసిందల్లా రామ నామ మొక్కటే నాకు కనిపించేది శ్రీ రాముని దివ్యసుందర విగ్రహం మాత్రమే.
    
    ఆ తుమ్మపొదలో చిక్కుకొని నేను ఎంత సేపు వున్నానో తెలియదు. కళ్ళు తెరచి చూచేసరికి తూర్పు తెల్లవారుతోంది నా శరీరమంతా తుమ్మముళ్ళు దిగబడి వున్నాయి. నా బట్టలన్నీ పోయాయి. రక్తం రానిది, ముళ్ళు పోటు లేనిది, నా కళ్ళు మాత్రమే నా శరీర మంతా తూట్లు పడి కళ్ళెందుకు సురక్షితంగా వున్నాయో నాకే అర్ధం కాలేదు నా క్రింద నీరు చాలావరకు తగ్గింది. సూర్యోదయమయింది నేనెలా లేవాలో అర్ధం కావటం లేదు. కళ్ళు మూసుకొని రామనామం చేస్తూ నేను క్రిందకు దిగాను. అది లింగారెడ్డి పాలెం యిక్కడకు మా యిల్లు 3 మైళ్ళు వుంటుంది. నా వంటి నిండా ముళ్ళ మండలు పట్టుకొని వున్నాయి. ఎంతో బలంగా వాటిని లాగేశాను. నా శరీరం నుండి నెత్తురు ధారలుగా కారిపోతున్నాయి. ఉప్పునీరు తగిలి శరీరమంతా మంటెత్తి పోతోంది. నేను నిటారుగా నిలబడ లేక పోతున్నాను. ఒక గడ దొరికితే దానిని పోటీ వేసుకొంటూ ప్రయాణం మొదలు పెట్టాను.
    
    ఎక్కడ చూచినాశవాలే! నాభార్య ఎక్కడైనా కనిపిస్తుందేమోనని కనిపించిన ప్రతిశవాన్ని పరిశీలిస్తూ వెళుతున్నా షుమారు 100 శవాలవరకు చూశాను. నా ప్రాణం శోషకు వచ్చింది. ఇంకా నేను శవాలను వెతుకలేక, ఎదురొచ్చిన ప్రతిశవాన్ని తప్పించుకొంటూ రొమ్ములోతు నీళ్ళల్లో పోతున్నా ఒక ఎత్తైన గట్టుమీద మూడుశవాలు కనిపించాయి. దగ్గరకు పోయిచూశాను. వాళ్ళు ప్రాణాలతోనే వున్నారు. దాహ్మతో బాధపడుతున్నారు. అక్కడెక్కడా  మంచినీళ్ళు లేవు. నేనేం చేసేది? చేతులెత్తి వారికీ నమస్కరించి తిరిగి నాప్రయానం మొదలు పెట్టాను.

                  
    
    కొంతదూరం పోయేటప్పటికి చింతకోళ్ళనుంచి నాలాగే కొట్టుకపోయి, ప్రాణాలతో బయటపడినవాళ్ళు నాకు కనిపించారు. జరుగువాని పాలెం వద్ద ఒక తాడిచెట్టుమీద ఎడ్లబండి పట్టివుందని వారు చెప్పారు. మేమంతాకలసి మందపాకాల జేరుకొన్నాము. నేను కడవకొల్లు నాగేశ్వరరావు యింటికి వెళ్ళాను. వారు నాకొక గుడ్డని చ్చారు. దానిని మొలకు చుట్టుకొని నా బంధువులను చూచుటకు ఆ వూరి చాకలి పేటకు వెళ్ళాను. ఆ పేటంతా తుడిచి పెట్టుక పోయింది. నా బంధువులంతా పోయారు. వాళ్ళ 40 మందిలోనూ ముగ్గురు మాత్రమే బ్రతికారు. వాళ్ళని చూచి తిరిగి న అప్రయనం మొదలు పెట్టాను.
    
    ఆ వూళ్ళో నాకెక్కడా మంచినీళ్ళు దొరక లేదు. దాహంతో నానాలుక పిడచ కట్టుక పోతుంది కాళ్ళు, చేతులు కొంకర్లు పోతున్నాయి. నడవటం చాలా కష్టంగా వుంది. అయినా గడ పోటీ వేసుకొంటూ కాలవ కట్ట ఎక్కాము త్రోవ పొడవునా తెట్టున పట్టి వుంది. ఎక్కడ చూచినా శవాలే. వాటిని దాటుకొంటూ ముందుకు పోతున్నాను. నాకు ఉదయానే కనిపించిన ముగ్గురు దాహ పీడితులు ఆ రోజు మధ్యాహ్నం 12 గం.లకు చనిపోయారని తెలిసింది. మా యింటి వెనుక ఒక చింతచెట్టు వుంది. అది చాలా పెద్ద చెట్టు. దానికి 200 సం.లు మించి వయసు వుంటుందని అక్కడి వాళ్ళు అంటుంటారు. పురాతనమైన వృక్షంగా చెప్పు చుండెడి వాళ్ళు అది లోగడ ఉప్పెనకు కూడా తట్టుకొని నిలచింది. కానీ, యీ ఉప్పెనలో 2 మైళ్ళు కొట్టుకపోయి ఒక దిబ్బమీద పట్టింది. దానిని చూచి తిరిగి ప్రయాణం మొదలు పెట్టాను.
    
    నేను కుంటుకుంటూ ముందుకు సాగిపోతున్నాను. దాహం విపరీతంగా వేస్తున్నది, ఎక్కడా మంచినెలలు లేవు. రామ నామమే నాకు శరణ్యమైంది. రామ నామ స్మరణ చేతనే దాహోప శాంతి కలుగుచున్నది. ఆ నామ మహిమ చేతనే ముందుకు వెళ్ళ గలుగుచున్నాను. ఆదివారం సాయంత్రం 5 గం.లకు వక్కపట్ల వారి పాలెం వద్దకు జేరుకొన్నాను. అక్కడ నాకు మంచినెలలు దొరికాయి. నా ప్రాణం జేరుకొన్నది. మరలా ప్రయాణం మొదలు పెట్టాను.
    
    నా తమ్ముడు రోడ్డునకు అడ్డం వచ్చిన చెట్లను తొలగించుకొంటూ లారీ తీసుకు వచ్చాడు. మండలి కృష్ణారావుగారు కూడా వచ్చారు. నా విషాద గాధ విని వారెంతో బాధ పడ్డారు. నన్ను నా తమ్ముడు అవనిగడ్డకు జేర్చాడు. నా నుంచి విడిపోయిన మనుమడు, నా భార్య శవాలైనా కనపడతాయేమోనని వెతికించాను. సముద్రపుదరిని కూడా గాలించాము. వేలకొలది శవాలు కనిపించాయి కాని, మా వాళ్ళు మాత్రం కనిపించలేదు. వాళ్ళ శవాలు చూచే దానికైనా నేను నోచుకోలేదు మరుపరాని విషాద గాథ బడబానలంలా నా కడుపును దహించి వేస్తున్నా నేను మాత్రం అచంచల మైన భక్తి విశ్వాసముతో యిప్పుడొక సిటీ బస్సు డ్రయివరుగా జీవనయాత్ర గడుపుచున్నాను.

 

                           

 

                                      ****


 Previous Page

WRITERS
PUBLICATIONS