ఉదయశ్రీ రెండవ భాగము
అరుణరేఖలు
'శ్రీ' శబ్దానికి లక్ష్మి, వైభవము,సంపద, శోభ, అభివృద్ధి, ఐశ్వర్యము ఇత్యాదిగా అనేకార్దాలు ఉన్నవి. కావ్యంపేరు "ఉదయశ్రీ" బాగానే ఉన్నది కాని కవిపేరు 'కరుణశ్రీ' అనటంలో ఔచిత్యం ఏమున్నదని కొందరు పెద్దలు ధర్మసందేహాన్ని ప్రకటించారు. వ్యాకరణ వేత్తలం అనుకొనే మరికొందరు పండితులు ఈ శబ్దంమీద తర్జనభర్జనలు సాగించారు.
"కరుణం" అంటే శోకరసం కదా - కరుణానికి "శ్రీ" ఏమిటి అనీ, ఒకవేళ దయార్ధకం అయితే "కరుణాశ్రీ" అని ఉండవద్దా అనీ సాగదీశారు.
పెద్దలయిన మన విమర్శకులకు మనవి చేస్తున్నాను. "కరుణశ్రీ" అంటే దయామయమైన శ్రీ కలవాడని అర్ధం. ఈ పదాన్ని బుద్ధదేవునికి పర్యాయ పదంగా నేను స్వీకరించాను. ఆ దివ్యనామాన్నే కావ్యం పేరుగా కలంపేరుగా నేను అందుకొన్నాను.
అటువంటప్పుడు 'కరుణశ్రీ' అని ఉండవద్దా అంటారేమో ! అవసరంలేదు. "కరుణశ్రీ" అనే ఉండవచ్చు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తనకు ప్రియమైనభక్తుడు ఎటువంటివాడో వివరిస్తూ అర్జునితో అంటాడు -
"అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ"
ఇక్కడ "కరుణః" అంటే కరుణాగుణంతో కూడినవాడు అని పెద్దలు వ్యాఖ్యానించారు. కనుక "కరుణశ్రీ" అంటే దయామయమైన సంపద కలవాడనీ, ఆ పధం వ్యాకరణశుద్ధమేకాని ఏ మాత్రం విరుద్దం కాదనీ విజ్ఞులకు విన్నవిస్తున్నాను.
"ఉదయశ్రీ - విజయశ్రీ - కరుణశ్రీ ఈ మూడు కావ్యాల్లో మీ అభిమాన కావ్యం ఏది?" ఈ విధంగా చాలామంది మిత్రులు నన్ను ప్రశ్నిస్తుంటారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం కొంచెం కష్టమే. ఎందువల్లనంటే కవికి తన కావ్యాల్లో దేనిమీదా తక్కువ ప్రీతి ఉండదు కనుక.
అయినా యిందుకు నా ప్రత్యుత్తర మిది : ఉదయశ్రీ నా హృదయం - విజయశ్రీ నా శిరస్సు - కరుణశ్రీ నా జీవితం.
ఇప్పుడు ఇది "ఉదయశ్రీ" రెండవ భాగం. ఈ భాగంకూడా "ఇరవై ఆరు" ముద్రణలు గడచి "ఇరవై ఏడో" ముద్రణం నడుస్తున్నది. ఇందులోని కిరణాలు అరుణారుణాలు - ఉజ్వలాలు - ఉల్లాసాన్నీ ఉత్సాహాన్నీ రేకెత్తించే చైతన్యరేఖలు.
ఇందులోని 'ధర్మపరశు' 'పురుషోత్తముడు' అనే ఖండికల విషయంలో నా భావనవేరు. అనుశ్రుతంగావచ్చే 'జనశ్రుతి'కి ఒక ఉపశ్రుతి మేళవించాను. విజ్ఞులు ఉచితజ్ఞులు ఐన రసజ్ఞులు సవిమర్శంగా దర్శిస్తారనీ భావుకత్వంతో పరామర్శిస్తారనీ విశ్వసిస్తున్నాను.
ఈ కావ్యంలో వాడిన 'హిందూ' 'హైందవ' శబ్దాలు విశాల హిందూజాతికీ అఖండ భారతావనికీ అపార హైందవసంస్కృతికీ స్ఫోరకాలు.
ఆదరంతో అభిమానంతో అనురాగంతో ఆప్యాయంగా నా రచనలు అందుకొంటూ ఉన్న ఆంధ్రరసజ్ఞలోకానికి పిన్నలకూ పెద్దలకూ నా కృతజ్ఞతాపూర్వక నమోవాకాలు మరో మాటు సమర్పిస్తున్నాను -
కరుణశ్రీ
స్వతంత్ర భారతి
'గణగణ' మ్రోగెరా విజయఘంటలు భారతమాత మందిరాం
గణమున; ద్వారబంధములఁ గట్టిరి చిత్ర విచిత్ర రత్న తో
రణ తతి; వీథివీథుల విరాజిలుచున్న వవే త్రివర్ణ కే
తనములు; మేలు కాంచె పరతంత్ర పరాఙ్ముఖ సుప్త కంఠముల్.
కంటికి కజ్జలమ్ము నిడి, ఖద్దరుచీర ధరించి, నేఁడు పే
రంటము పిల్చుచున్నది స్వరాజ్యవధూమణి ప్రక్కయింటి వా
ల్గంటుల; కర్ణపేయములుగా ప్రవహించె 'స్వతంత్ర భారతీ'
మంటపమందు శాంత సుకుమార మనోహర గాన వాహినుల్ !!
'పాటాగొట్టి' పరప్రభుత్వమునకున్, బ్రహ్మాండమౌ శాంతి పో
రాటంబున్ నడిపించినాఁడు మన 'వార్ధాయోగి' ఆంగ్ల ప్రభుల్
మూటల్ ముల్లెలు నెత్తికెత్తుకొని నిర్మోహాత్ములై సంద్రముల్
దాటంజొచ్చిరి; నవ్వుకొన్నవి స్వతంత్ర స్వర్ణ సోపానముల్ !!
'నేతాజీ' ప్రతాపాములు, 'గాంధీతాత' సత్యాగ్రహ
జ్యోతిర్దీపతులు; 'దేశభక్తుల' అఖండోత్సాహముల్, విశ్వ వి
ఖ్యాతంబైన 'అగస్టు విప్లవ' మహాగాథల్, సమైక్యమ్ములై
స్వాతంత్ర్యధ్వజ మెత్తె భారత మహాసౌధాగ్ర భాగమ్ములన్ !!
లాఠీ పోటులు పూలచెండ్లు, చెరసాలల్ పెండ్లి వారిండ్లు, ఏ
కాఠిన్యం బయినన్ సుఖానుభవమే, "గాంధీ కళాశాల"లో
పాఠంబుల్ పఠియించు శిష్యులకు; తద్ బ్రహ్మాస్త్ర సంధానమే
పీఠంబుల్ కదలించి సీమలకుఁ బంపెన్ శ్వేత సమ్రాట్టులన్.
ప్రస్థానించిరి త్యాగమూర్తులు పవిత్రంబైన "శ్రీ కృష్ణ జ
న్మ స్థానంబున" కెందరో; నిహతులైనారెందరో శౌర్య దై
ర్య స్థైర్యంబులు చూపి విప్లవ సమిద్రంగమ్ములన్; వారి సు
ప్తాస్థి శ్రేణికలే పునాదులట మా స్వారాజ్య సౌధాలకున్ !!!
నీదేనోయి సమస్త భారతము తండ్రీ! యింక నీ గడ్డపై
లేదోయీ యధికార మెవ్వరికి! పాలింపంగదోయీ! ప్రపం
చాదర్శంబుగ, సర్వమానవ సమాహ్లాదంబు సంధిల్ల, నీ
వైదుష్య ప్రతిభా విశేషములు విశ్వమ్మెల్ల కీర్తింపగన్ !!!
అరుణ హస్తము
అద్దమరేయి నా సదనమందు పదంబిడి, పట్టు పాన్పుపై
నిద్దురపోవు నన్ను నవనీత కరమ్మున తట్టిలేపి, నీ
ముద్దుల కళ్ళతో భువన మోహన రేఖలు నా ముఖమ్ముపై
దిద్దుచునున్న సౌహృదవతీ! వచియింపుము నీ వెవర్తవో?
ఎవ్వతె వీవు? మంగళమయీ! మెల్లమెల్లఁగ కున్కిపోవు నా
దివ్వియ పెద్దచేసి నవదీప్తుల నింపితి వింటినిండ; నీ
నవ్వు తరంగమాలల వినంబడు 'విశ్వరహస్య' నిస్వనా
లెవ్వియొ! భాగ్యముల్ పరువులెత్తెడు నీ కడగంటి చూపులన్ !!!
చెక్కుల పాటలప్రభలు చిమ్మ దయాపరిపూర్ణ దృక్కులన్
చిక్కని ప్రేమరాగములు చింద, నవారుణ హస్తమెత్తి ఆ
దిక్కుకు చూపినావు! గురుతించితి నీ యనుశాసనంబు నో
చక్కనితల్లి! నా 'కరుణసాహితి' కింక నవోదయంబటే !!
