Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 13


    ఆమె చాచిన మైత్రీ హస్తాన్ని ఎంతో ఆరాధనా భావంతో అందుకున్నాడు ఫిజో. ఏక్షణంలో అయినా ప్రాణాలు కోల్పోవలసి వచ్చే సాహసోపేతమయిన జీవితానికి అలవాటుపడిన వారు క్షణాల మీద యిట్టే కలిసిపోతారు.
    ఉన్నతమయిన లక్ష్యసాధనకోసం ఏ క్షణంలోఅయినా ఈ ప్రపంచాన్ని వదిలిపోయేందుకు వారు సిద్దపడి ఉంటారు. అందునించి ప్రేమకుతప్ప వారి హృదయాలలో ద్వేషానికి తావు ఉండదు. అలా సునాయాసంగా వారిమధ్య గాఢమయిన మైత్రి ఏర్పడిపోయింది.
    కొంతసేపు అయ్యాక "నాదగ్గర డబ్బులేదని  మీకెలా తెలుసు" అని అడిగాడు ఫిజో. ఆమెనవ్వింది.
    "డబ్బు ఒకటేకాదు. మీవెంట సామగ్రిలేదు. బహుశా టికెట్ కూడా వుండి వుండదు. అంతా విన్నాను" అందామె కిలకిలా నవ్వుతూ.
    "నా స్థితి మీకు నవ్వు తెప్పిస్తోందన్నమాట?" ఫిజో సిగ్గు పడ్డాడు.
    "ఇందులో బాధపడేందుకేముంది. పొరపాట్లు ఎవరివల్ల అయినా జరుగుతాయి. మీరు మీ గమ్యం చేరేవరకూ వెంట నేనుంటాను. భయపడకండి" అన్నదామె.
    భయం అనేమాట విని బిగ్గరగా నవ్వాడు ఫిజో.
    "మేడమ్ మీ సహృదయతను నేను గుర్తించాను.ఆపదలో ఉన్నవారు ఆ స్థితినించి బయటకు రావాలంటే మీలాంటి వారు వెన్నంటి నిలువవలసిన అవుసరం ఎంతయినా ఉంది. కాదనను. కాని అడవులలో, కొండలలో క్రూర మృగాలమధ్య జీవితాన్ని వెళ్ళదీస్తున్న నాకు భయమంటే ఏమిటో తెలియదు. నాతాలూకు సామగ్రి అంతా డబ్బు, టికెట్, బట్టలు అన్నీ పోర్టర్ దగ్గర ఉండిపోయినాయి. ఇది చాలా సాధారణమయిన పొరపాటు. ఇంతమాత్రానికి భయపడతానని మీరెలా భావించారు. నాతండ్రి నాకు యిచ్చిన తర్ఫీదువల్ల చిన్నతనంలో నేను భయమంటే ఏమిటో మర్చిపోయినాను. మృగాలమధ్య అవలీలగా తిరిగే నాకు మనుషులంటే భయమేమిటి?" అంటూ మళ్ళీ నవ్వాడు ఫిజో.
    మాలతి అతనివంక చాల చిత్రంగా చూచింది. తాను  భావించిన విధంగా అతడు అతి సాధారణ ప్రయాణీకుడు మాత్రం కాదని, ఒక విలక్షణమయిన జీవిత గమనానికి అలవాటు పడిన వ్యక్తి అని అర్ధమయించామెకు.
    "ముందు భోజనం పూర్తి కానివ్వండి. తరువాత తీరికగా మీగురించి చెప్పుకోవచ్చు" అంటూ భోజనానికి ఉపక్రమించిందామె. ఫిజో భోజనం తీసుకునేందుకు సంసిద్ధుడయి నాడు. పరస్పరం పరిచయాలు పూర్తి అయినాయి.
    "నా తండ్రి లూయిమ్. నాగభూమినుంచి నేపాల్ కు వలస వచ్చిన వ్యక్తి. ఫారిన్ యాత్రికులకు అడవులలో మార్గదర్శిగా పనిచేస్తూ వుండేవాడు. ఆయన తదనంతరం నేనుకూడా ఆ వృత్తినే చేపట్టాను మిగిలినవాటిగురించి ఆలోచించను. కాని కొన్ని వలలూ, ఉచ్చులూ అవీ మరచిపోయినాను. అవి లేకుండా అడవిలో ఎదురుఅయే ఆపదల నుంచి బయటపడటం చాల కష్టం" అన్నాడు ఫిజో!
    "మీరు ఏపనికోసమయితే ఖట్మండూ నుంచి భోజ్ పూర్ వెడుతున్నారో అదే పనిమీద నేనువెడుతున్నాను. బహుశా ఇక్కడ మీతో పరిచయం అయివుండకపోతే భోజ్ పూర్ లో మీకోసం విచారించ వలసి వచ్చేది. అవసరమయితే మీకోసం ఖట్మండూ రావలసి వచ్చేది. మీరుయిలా పరిచయం కావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను."
    "అయితే అడవిలో తిరిగేందుకు అవసరమైన సామగ్రి వెంట తెచ్చుకోవటం మరచినందుకు మీరు బాధపడవలసిన అవుసరం రవంతయినాలేదు. అటువంటి వస్తువులు కొన్నింటిని నేను సేకరించాను. అని యిప్పుడు నావెంట తెస్తున్నాను" అన్నది మాలతి.
    ఆమెతో అయిన ప్రధమ పరిచయంలోనే సమస్యలన్నీ మబ్బులా విడిపోవటంతో తన అదృష్టదేవతలా కన్పించింది మాలతి "అయితే మీకు శతాధికమయినా కృతజ్ఞతాభివందనాలు" అంటూ కెప్టెన్ మాలతిముందు అంజలి ఘటించి తలవంచాడు ఫిజో. భోజ్ పూర్ చేసుకునేలోగా వారిమధ్య అపురూపమయిన మైత్రీభావం దృఢతరమయింది. ఇద్దరి అభిరుచులు అడవులలో కొండలలో క్లిష్టతరమయిన పరిస్థితుల్ని ఎదుర్కోవటమనే చోటున సమన్వయపడినాయి.
    అంతటితో వారు అపూర్వ మిత్రులయినారు.
    భోజ్ పూర్ లో దిగిపోయిన తరువాత రైల్వే  అధికారులకి పరిస్థితుల్నీ వివరించి బయటపడ్డారు. ఫిజోకి ఆపట్నంలో విస్త్రుతమయిన పరిచయాలున్నాయి.
    అప్పటికే అతనికోసం కొన్నిపార్టీలు ఎదురు చూస్తున్నారు. మాలతి వారితోపాటుగా అడవులలోతిరిగేందుకు వెళ్ళింది. అక్కడనివసించి ఫిజో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అడవులలో తిరిగే సమయాలలో అతడుచూపే
    ఒకవారం రోజులపాటు టూరుపూర్తిఅయ్యేలోపుగా అతని సమర్ధత ఏమిటో మాలతికి తెలిసిపోయింది. తనతో కలిసి ఎవరెస్టుని అధిరోహించే బృందంలో ఉండేందుకు అతడు అన్ని విధాల అర్హుడని నిర్ణయించుకుందామె.
     "మేడమ్ మీరు ప్రదర్శించే ధైర్యసాహసాలు నాకెంతో నచ్చాయి- మీపరిచయం లభించటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పుడయినా ఖట్మండూ రావటంజరిగితే నాకు ముందుగా తెలియచెయ్యండి. నేనువచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను" అన్నాడతడు ఎంతో మైత్రీభావంతో.
    "ఫిజో! నేను చాలాకాలంగా నీలాంటివ్యక్తి కోసం అన్వేషిస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే ఎవరెస్ట్ ఎక్కే ప్రయత్నంలో నీవుకూడా నాతోపాటు సహకరించాలి. కొద్ది రోజులలో నీకు నా వార్తపంపుతాను. వెంటనే ఢిల్లీ వచ్చినన్ను కలుసుకోవాలి" అన్నదామె.
    ఫికోవిభ్రాంతుడయినాడు. ఆమెకేవలం ఔత్సాహికురాలయిన టూరిస్టు మాత్రమే అనుకున్నాడు ప్రధమంలో కాని ఒక నిర్దిష్టమయిన లక్ష్యాన్ని మనసులో ఉంచుకొని కృషిచేస్తోందా?
    మౌంటెనీరింగ్ లో తానుచేయదలచిన సాహసకృత్యానికి సహకరించగల వ్యక్తులకోసం అన్వేషిస్తోంది. ఆపరీక్షలో తాను ఉత్తీర్ణుడు అయినందుకు ఎంతగానో పొంగిపోయినాడు. తనమనసులో వున్న ఆలోచనకు ఆమె సాధించదలచుకున్న లక్ష్యం తోడు అయింది.
    దాంతో అతని ఆనందం అవధులు మీరిపోయింది. స్త్రీ అయివుండీ ఆమె ప్రదర్శించే అద్భుతమయిన సాహసం పట్ల అతనికి ఆరాధనా భావం ఏర్పడిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS