లోనికి అడుగు పెట్టాడు.
కిట్టు తలక్రిందపెట్టుకుని నిద్రకు ఉపక్రమించాడు. కనులుమూసినా తెరచినా తన ఆరాధ్యమూర్తిఅయిన కెప్టెన్ మాలతి జ్ఞాపకాలు వెన్నాడుతున్నాయి. స్త్రీ అయి వుండి ఆమె ప్రదర్శించే సాహసమూ, చొరవా అడవిని ఎప్పటి కప్పుడు అమితమైన ఆశ్చర్యంతో ముంచెత్తుతున్నాయి.
ప్రప్రధమంగా ఆమెతోపరిచయమైన సంఘటన అతని మనసులో చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయింది. నేపాల్ లో ఖాట్మండూ నించి భోజ్ పూర్ వెడుతూ వుండగా రైలులో ఆమెతో పరిచయమైయింది.
రైలు బయలుదేరబోతున్న తుదిక్షణాలలో తాను పరుగెడుతూ వచ్చి రైలులోకి ఎక్కేశాడు ఫిజో! పోర్టర్ కొద్ది అడుగులు దూరంలో పరుగెడుతున్నాడు కాని అప్పటికే రైలు కదిలింది అతడు దాని వెంట పరుగెత్తలేక ఆయాసపడిపోవటం ప్రారంభించాడు. రైలుస్పీడు అందుకుంది.
ఇంక అతనిని చూస్తే జాలివేసింది. "పోర్టర్ : సామాను అంతా లాక్ రూంలో అప్పగించు. నేను తిరిగివచ్చాక తీసుకుంటాను" అంటూ కేకపెట్టాడు తాను. పోర్టర్ తిరిగి వెళ్ళిపోయాడు. తనతాలూకు సామగ్రి పర్స్, రైలు టికెట్ కూడా అంతా ఖాట్మండులో చిక్కిపోయింది.
అప్పటికే అందరూ తనవంక చూడడం గమనించాడు ఫిజో వెళ్ళేపని అతిముఖ్యమయినది. భోజ్ పూర్ లో విదేశాల నించి వచ్చిన టూరిస్టులు తనకోసం ఎదురుచూస్తూంటారు. వారికి హిమాలయ పాదభూములూ అడవులూ కొండలూ అన్నీ తిప్పి చూపించాలి. పదిరోజులపాటు వారితో పాటు తిరగాలి.
కేవలం సామగ్రి అయితే తిరిగి భోజ్ పూర్ లో సంపాదించుకోవచ్చు. కొంత మొత్తాన్ని వ్యయపరిచితే కొన్ని వస్తువులు అమర్చుకునేందుకు వీలు అవుతుంది. కాని సాంకేతిక మయిన సహాయంకోసం అడవుల్లో, కొండలలో తిరిగేందుకు పనికివచ్చే వస్తువులు కొన్ని వున్నాయి.
అది ఎంతోకాలం అనుభవాన్ని పురస్కరించుకుని తన తండ్రి తయారుచేసినవి. కొన్ని తాను స్వయంగా తయారు చేసుకున్నాడు. అలాంటివన్నీ కొనేందుకు దొరికేవికావు. కొన్ని రకాల చిత్ర విచిత్రమయిన ముడులు వేసిన త్రాళ్ళు, అడవులలో ఎలుగుబంట్లు, చిరుతపులులు లాంటివి అనుకోకుండా ఎదురు అయితే వాటిని కాల్చి చంపకుండా పట్టుకునేందుకు వీలయిన వలలూ వున్నాయి.
అడవులలో తిరిగే సమయాలలో తాను అందరికన్నా ముందు నడుస్తాడు. అందునించి ప్రమాదం ఎదురుఅయితే ముందుగా తాను ఎదుర్కోవాలి. తుపాకుల్ని పదేపదేఉపయోగించటం అరుదయిన అడవి జంతువుల్ని వధించటం సరియైన పద్దతికాదు. అలా అని ఉపేక్షించితే అవి ప్రాణాలు తీస్తాయి.
అందునించి ప్రధమదశలో వాటిని ఎదుర్కొని నిలువరించాలి. తొలివిడత వాటి పరవళ్ళు నిలువరించగలిగితే ఆపై వలలు ప్రయోగించేందుకు వీలు అవుతుంది.
అందుకోసం నిర్దేశించబడిన చేతి తొడుగులున్నాయి అతనికి. వాటికి వాడి అయిన చురికలు గోళ్ళు రూపంలో అమర్చి ఉంటాయి. ఆ చేతితొడుగులు ధరిస్తే వేరే యింక ఎటువంటి ఆయుధ సహాయం లేకుండానే వాటిని ఎదుర్కొనగలడు ఫిజో. ఆ చేతి తొడుగులు ఎన్నో అనుభవాల సారంగా రూపొందించినాడు ఫిజో తండ్రి లూయిమ్ అటువంటి సామగ్రి అంతా పోర్టర్ తో పాటు వెనుక చిక్కిపోయింది. ఈసారి తన అజాగ్రత్తను తాను నిందించుకున్నాడు ఫిజో. మనసు లోని బాధ అంతా ముఖంలో కన్పించకుండా దాచుకున్నాడు.
అప్పటికే అందరూ తనవంక విచిత్రంగా చూస్తూ ఉండటంనించి తల దింపుకుని వెళ్ళి తనసీట్లో కూర్చున్నాడు ప్రక్కనే పడిఉన్న మాగ్జయిన్ తీసి దానిలో ముఖం పెట్టాడు.
రైలు ప్రయాణం గంటన్నర పూర్తిఅయింది. కాని అతడు మాత్రం రవ్వంత అయినా ముఖం తిప్పలేదు.
భోజ్ పూర్ చేరిపోయాక మిగిలిన కార్యక్రమం ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. కూల్ డ్రింక్స్ అమ్మే కుర్రాడొచ్చినా, మీల్స్ ఆర్డర్ తీసుకునే కుర్రాడొచ్చినా తల ఎత్తి చూడలేదు. కూపేలో మిగిలిన ముగ్గురూ ఆర్డర్స్ ఇచ్చారు. తనదగ్గర డబ్బుకూడా లేదు.
అయినా భోజ్ పూర్ చేరేంతవరకూ అతడు బయట పడదలచుకోలేదు. వొంచినతల ఎత్తకుండా కొర్చొన్నాడు.
వెయిటర్ వచ్చాడు. అతనికికూడా భోజనం అమర్చి "సార్ భోంచేయండి" అన్నాడు. రైలు లోపలకు వచ్చిన దాదాపు రెండు గంటల అనంతరం ప్రధమ పర్యాయం తలఎత్తి చూచాడు ఫిజో. తనముందు భోజనం అమర్చటం అతని విడ్డూరం అన్పించింది.
"నేను ఆర్డరు యివ్వలేదు" అన్నాడు తడబడుతూ.
"మీరు యివ్వలేదు. నేను యిచ్చాను తినండి" అమ్మ కంఠం విని తల ప్రక్కకు త్రిప్పి చూచాడు ఫిజో. అందాకా మౌనంగా అతని కదలికల్ని పరిశీలిస్తున్న అమ్మాయి అందంగా నవ్వింది. మైత్రీభావంతో అతనివంక చూచింది.
"కాని......నేను....." అంటూ ఏదో చెప్పబోయాడు ఫిజో ఆ అమ్మాయి మరింత అందంగా నవ్వింది. నెమ్మది అయిన స్వరాన్ని కూపేలో అతనికి ఒక్కడికే విన్పించేలా అంది.
"దయచేసి తీసుకోండి. మీదగ్గర డబ్బులేదని నాకు తెలుసు. మొహమాటం పెట్టుకోకండి కడుపు కాలుతుంది" అని.
ఫిజో విస్తుపోయాడు. ఆమాట అన్న అమ్మాయి వంక నఖశిఖ పర్యంతం ఆసక్తిగా చూచాడు. వెయిటర్ నవ్వుకుంటూ అవతలకు పోయినాడు. ఆ కూపేలో మరొక యిద్దరున్నారు. కాని వాళ్ళ లోకంలో పది ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు కపాలీలో.
"మీకూ నాకూ..." అంటూ సంశయాత్మకంగా ప్రారంభించాడు ఫిజో.
"పరిచయం లేదంటారు. అంతేకదా! కలిసి భోం చేసేందుకు పరిచయమే ఉండాలంటారా. అయితే వినండి. నా పేరు మాలతి. ఆంద్రప్రదేశ్ నించి వచ్చాను. డార్జిలింగ్ లో మౌంట్ నీరింగ్ చదివి డిప్లొమా సంపాదించాను. ఎవరెస్ట్ ను అధిరోహించాలన్నది నా జీవిత ఆశయం.
"ఇవిచాలా ఇంకేమయినా వివరాలు కావాలా? ముందు భోజనం చేయండి. తరువాత భోజ్ పూర్ వెళ్ళేదాకా తీరుబడిగా మాట్లాడుకోవచ్చు." అందామె.
