Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 12


    నేను వెంటనే "మిస్ మార్లిన్, కమ్ హియర్" అన్నాను.
    ఆమె కదిలి వచ్చింది.
    "మిస్ మార్లిన్ సిట్ హియర్ ప్లీజ్" అన్నాను.
    ఆమె కూర్చుంది. అంటే మళ్ళీ మిస్ మార్లిన్ అయింది.
    "మీరు యెక్కడనించి వచ్చారు?"
    ఆమె చెప్పింది.
    "ఎందుకు వచ్చారో చెప్పగలరా?" అని అడిగాను.
    "బొబ్బిలి గురించి మలామ గురించి తెలుసుకోవాలి" అంది.
    "మీరు యిప్పుడు యెక్కడ వున్నారో చెప్పగలరా?" నా ప్రశ్న,
    "తెలియదు. నేనిప్పుడు యెక్కడ వున్నాను? చెప్పండి ప్లీజ్" అంది మిస్ మార్లిన్. నేను నవ్వాను. జవాబు యివ్వకుండా వూరుకున్నాను.
    ఆమె ఆదుర్దాపడింది. పదిసార్లు అడిగింది అదే ప్రశ్న. చివరకు సమాధానం యివ్వరేమిటి? అసలు మీరు యెవరు? అని అడిగింది నావంక అనుమానంగా చూస్తూ లేచి నిలబడింది.
    "యిది బొబ్బిలి మీరు కలలు కంటున్న బొబ్బిలి. మీకు కలలో ఆవేశించే మల్లమ్మ మెట్టిన యిల్లు యిది. యిక్కడే.....యీ బొబ్బిలిలో ఆమె శరీరమూ, మనస్సూ కాలిబూడిద అయినాయి కాని ఆమె ఆత్మ......అంటూ మిస్ మార్లిన్ కన్నులలోకి సూటిగా చూచాను.
    "ఆమె ఆత్మ నాతో వుంది. నాకు తెలుసు మిష్టర్. నేను మిస్ మార్లిన్ ని పారాసైకాలజీలో రీసెర్చి స్టూడెంటుని. ఫ్రాన్సునించి బొబ్బిలి చూచేందుకు వచ్చాను. విశాఖలో రాయపూర్ పాసింజరు యెక్కి యిక్కడ దిగిపోయాను. యిప్పటి నా స్థితి నాకు తెలుసు. కాని అప్పటి నా స్థితి నేను మల్లమ్మను అనే స్మృతి నన్ను ఆవహించినప్పుడు నన్ను నేను మర్చిపోతాను. యీ స్థితిలో యేం చేస్తానో, నేనెవరినో ఆ స్థితిలో జ్ఞాపకం వుండదు. ఆ స్థితిలో నేను యేం మాట్లాడతానో, యేం చేస్తానో, మనం యీ స్థితిలోనే వచ్చాక గుర్తువుండదు. కాని అప్పుడూ యిప్పుడూ నేను మల్లమ్మదేవిని అని జ్ఞాపకం వుంటుంది. మల్లమ్మదేవి అవతారం వున్నప్పుడు మాత్రం మిస్ మార్లిన్ ని అనే గుర్తు వుండదు" అంటూ తన పూర్తి స్థితి వివరాలను యిచ్చింది ఆమె.
    అవన్నీ నేను నమ్మాను.
    "ఇంతవరకూ మీరు యెవరో చెప్పనేలేదు" అంది మిస్ మార్లిన్.
    "ఒక దురదృష్టవంతుడిని" అన్నాను.
    ఆమె నవ్వి "యెందుకు?" అంది.
    "ఆడవాళ్ళతో తన్నులు తిన్నందుకు" అన్నాను ఆమె మళ్ళీ నవ్వింది.
    "ఏ ఆడవాళ్ళండీ?" అంది.
    "మీరే! రాత్రి నా పీక మీదికి పొట్టమీదికి కాలు యెక్కించలా?" అన్నాను అమాయకుడిలా ముఖంపెట్టి.
    ఆమె నన్ను జాలితో చూచింది. "అంతపని చేశావా?" అంటూ సిగ్గుతో తల వంచుకుంది మిస్ మార్లిన్. యెంతో బాధపడింది.
    "నన్ను క్షమించండి" అని పదిసార్లు అడిగింది.
    "మగవాళ్ళని ఆడవాళ్ళు తన్నటం ముక్కుతిమ్మన్న కాలంనించీ మా తెలుగుదేశంలో వింటున్న ముచ్చటే మరేమీ బాధపడకండి" అన్నాను.
    "ముక్కు తిమ్మన్న యెవరు?" అని అడిగిందామె.
    "ఆయనొక మహానుభావుడు. కవి అనకుండా మహానుభావుడు అని యెందుకు అన్నానంటే తన్నించేవాడు ఒక సాధారణ హీరోని ప్రియురాలిచేత తన్నిస్తే ఆయన సొమ్మేం పోయింది. యావత్తు భారతదేశానికి ఆరాధ్యదైవం అయిన కృష్ణపరమాత్మని సత్యభామచేత తన్నించాడు. తన్నించటంలోకూడా అలాగ యిలాగ కాదు లెండి. యెడంకాలితో తల మీది కిరీటాన్ని తన్నించాడు" అంటూ వివరించాను.
    "మాకు అందుబాటులో వుండే గ్రీకు లాటిన్ పురాణాల్లో అయితే అటువంటిది జరిగినప్పుడు వెంటనే ప్రియురాలి ప్రాణం తీస్తారు. మీ కృష్ణుడు ఏంచేశాడు?" అని అడిగింది మిస్ మార్లిన్.
    "మా కృష్ణుడు తల తియ్యలేదండీ! తల వంచాడు. బ్రతిమాలుకున్నాడు. కాలితో తన్నిందాన్ని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాడని వ్రాశాడాయన. అదే శృంగారం అని నిర్వచిస్తే మేమంతా పిచ్చివెధవల్లా చదువుకుంటున్నాం. యెందుకు మీ ముఖం అలా వికారంగా పెట్టారు?" అని మిస్ మార్లిన్ ని అడిగాను.
    "బొత్తిగా నీరసంగా వున్నదండీ" అన్నదామె.
    అలా వుండటానికి కారణం నేనూహించాను. అధికమయిన స్థాయిలో ఆలోచనలు ఆమె మనసు మారుమూలల్ని తాకినాయి. రాత్రి ఆమెకు కలిగిన భావతీవ్రత ఆమె శరీరంమీద తన శక్తిని చూపింది. ఆ నొప్పులు భావతీవ్రత తగ్గినాక యిప్పుడు బయటపడినాయి ఆమెకు విశ్రాంతి అవుసరం అని అర్ధమయింది.
    ఆమెకోసం ప్రత్యేకించిన పడకగాదిలోకి ఆమెను వెంటపెట్టుకు పోయాను. ఆమెను పడుకోబెట్టి నేను తిరిగి వచ్చేశాను.
    అయిదు నిముషాలకే ఆమె నిద్రపోతోందని వార్త వచ్చింది. ఒక వ్యక్తి వరండాలో కాపలా వుండేట్టూ, యిహ ఆ చుట్టుప్రక్కల పనివాళ్ళు యెటువంటి శబ్దాలూ చెయ్యకుండా వుండేటట్టు యేర్పాటు చేశాను.
    పదిన్నర దాటుతూ వుండగా ఒకసారి నేను పైకి వెళ్ళి చూచి వచ్చాను. ఆమె ప్రశాంతంగా నిద్రపోతోంది. అమాయకురాలిలా, పసి పాపలా ఆదమరచి నిద్రపోతోంది.
    నేనూ నిద్రకు ముఖం వాచి వున్నాను. నా పడగ్గదిలో దూరి యిరవై నాలుగ్గంటలు అయింది అప్పటికే.
    నా ఆఫీసు గదికి వచ్చి యింత నాస్తా తెప్పించుకుని తిని పొట్టనిండా మంచినీళ్ళు త్రాగి బోర్లాపడిపోయాను బెడ్ రూంలో నిద్ర ముంచుకు వచ్చింది. ప్రశాంతంగా నిద్రపోయాను.
    టైము యెంత అయిందో తెలియదు కాని తలుపులు బాదుతుంటే ఆ మోతకు మెలుకువ వచ్చించి మళ్ళీ యేదో కొంపమీదికి ముంచుకు వచ్చిందన్న భయంతో తలుపులు తీశాను యెదురుగా డ్రైవరు. "విశాఖ నించి డాక్టరు వచ్చారు. మీ ఆఫీసు గదిలో మీకోసం కూర్చున్నారు" అని చెప్పాడు. తక్షణమే వెళ్ళాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS