చివరికి పెళ్ళి విషయంలో కూడా....మళ్ళీ అతను ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళేలోగా, అతన్ని డిస్ట్రబ్ చేస్తూ...
"హాయ్....శ్రీచరణ్..." అంటూ క్యాషియర్ కృష్ణమూర్తి వచ్చాడు.
'హలో.....ఏంటీ సంగతి..." అన్నాడు శ్రీచరణ్ కృష్ణమూర్తి వైపు చూసి.
"ఏం లేదు నువ్వేదో దీర్ఘాలోచనలోకి వెళ్ళిపోయావుగా. ఏంటో కనుక్కుందామని...." సరదాగా అన్నాడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి 'క్లాసిక్ ట్రావెల్స్ లో క్యాషియర్. అతనికి ప్రైవేటుగా వడ్డీ బిజినెస్ కూడా వుందని ఆఫీసులో చెప్పకుంటారు.
పేరుకు తగ్గట్టే కృష్ణలీలు కూడా చేస్తాడని అంటారు. ఎప్పుడూ నీట్ గా వుంటాడు. ఆఫీస్ డబ్బులు కూడా రొటేషన్ చేస్తాడని ఓ వదంతి.
"ఏం లేదు కృష్ణమూర్తీ. ఖాళీగా వున్నాను కదా అని ఓసారి ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళాను" అన్నాడు శ్రీచరణ్.
"ఏంటీ... నీకూ ఫ్లాష్ బాక్ వుందా? చెప్పు...చెప్పు....ఎంతమంది అమ్మాయిలతో వుందేమిటి లింక్?"
"ఛ.....ఛ....నేను అలాంటివాడిని కాదు" అన్నాడు శ్రీచరణ్.
"ఛా నేనూ అలాంటివాడిని కాదు....కాకపోతే ఆఫ్ ది రికార్డ్స్ లో మనకు బోల్డు హిస్టరీ వుంది. నేను ఎవర్తోను చెప్పన్లే..."
'నువ్వెవరితో చెప్పినా, చెప్పకపోయినా నా కలాంటి నీచమైన బ్యాగ్రౌండ్ లేదు. నేను మా బామ్మ గురించి ఆలోచిస్తున్నాను" అన్నాడు శ్రీచరణ్.
ఓసారి శ్రీచరణ్ వైపు ఎగాదిగా చూసి....
"ఇదిగో.....నేను నీకు ఎలా కనిపిస్తున్నాను. బొత్తిగా రోడ్డుపక్కన వేపగింజలు ఏరుకునే వెర్రి వెధవలా కనిపిస్తున్నానా?"
"ఏమో.....సైడ్ యాంగిల్లో అయితే మీరలా అనిపించారు. జెంటిల్మనే అనుకుంటున్నా..." అన్నాడు శ్రీచరణ్.
"ఎంత చీపయ్యాను శ్రీచరణూ...వయసులో వున్న కుర్రాడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి బామ్మను గుర్తుచేసుకుంటాడా?"
"నిజం.... మా బామ్మ అదో టైప్....ఆవిడ సెంటిమెంటుతో నేనెలా మొదలయ్యానో గుర్తుచేసుకుంటున్నా...."
'ఏంటోనోయ్.... నాకు మెంటలెక్కేలా వుంది గానీ, సరదాగా సాయంత్రం అలా టాంక్ బండ్ కు వెళ్దామా?"
'లేదు సాయంత్రం తొందరగా ఇంటికి వెళ్ళాలి"
"అదేంటోయ్! పిల్లా, పీచూ, పెళ్ళాం, గిళ్ళాం లేనివాడివి. నీకేంటోయ్ బిజీ..."
'ఏంటో.....సాయంత్రం కనుక్కుని చెబుతాను గానీ, నీ వడ్డీ బిజినెస్ ఎలా వుంది?"
"ఛ...ఛ.... నేను అలాంటివాడిని కాదు...." అన్నాడు కృష్ణమూర్తి.
"నువ్వెలాంటివాడివో.....జంటనగరాల్లో అమ్మాయిల్ని అడిగితే చెబుతార్లే." అన్నాడు శ్రీచరణ్.
వెంటనే అక్కడ్నుంచీ జారుకున్నాడు కృష్ణమూర్తి. లేకపోతే తన వడ్డీ బిజినెస్ గురించి, తనెవరెవర్ని ఎలా ట్రాప్ చేసింది. ఆరా తీసి కనుక్కుంటాడు.
అతడ్ని పంపించాలనే శ్రీచరణ్ అలా మాట్లాడాడన్న విషయం కృష్ణమూర్తికి తెలియదు.
ఆరోజే వేదాచలానికి సెండాఫ్ పార్టీ ఇచ్చారు స్టాఫ్,మ్ వేదాచలానికి స్టాఫ్ మీద కోపం పీకల్దాకా వచ్చింది.
వాళ్ళే తనమీద యండికి ఫిర్యాదు చేశారని అర్ధమైంది.
హైదరాబాద్ లోని మరో బ్రాంచీకి వేదాచలాన్ని ట్రాన్స్ ఫర్ చేశాడు ఎం.డి. వేదాచలం ప్లేస్ లో హైదరాబాద్ బ్రాంచ్ లో పనిచేస్తున్న ప్రభాత్ ని ఇక్కడికి ట్రాన్స్ ఫర్ చేశాడు యండి. వెంటనే అమలు లోకి వచ్చింది. ఆ ఆర్డర్, ఆరోజు మధ్యాహ్నమే వేదాచలాన్ని రిలీవ్ చేసి, ప్రభాత్ ని మరుసటిరోజు నుండి ఛార్జ్ తీసుకోమని చెప్పాడు యం.డి. ఇలాంటి విషయాల్లో యం.డి చాలా సీరియస్ గా వ్యవహరిస్తాడు.
స్టాఫ్ విశ్వాసాన్ని మేనేజర్ కోల్పోయినప్పుడు, ఆ మేనేజర్ సమర్ధవంతంగా పనిచేయలేడన్న విషయం యం.డికి అనుభవపూర్వకంగా తెలుసు.
యం.డి వెళ్ళిపోయాక ఫార్మల్ గా వేదాచలానికి సెండాఫ్ పార్టీ ఇచ్చారు స్టాఫ్.
తప్పనిసరిగా ప్రనూష కూడా అటెండ్ కావాల్సివచ్చింది. వేదాచలం మనసులో కుళ్ళు పెట్టుకున్నా, పైకి మాత్రం చిర్నవ్వులు చిందిస్తూనే ఉన్నాడు. అతనిలోని మరో మనిషి లోపల మండిపోయాడు.
అవకాశం కోసం కాచుక్కూచున్నాడు.
అతనికి ప్రనూష మీద కోపం పీకల్దాకా వుంది. ఇదంతా జరగడానికి కారణం ప్రనూషే.
తను ఘోరంగా అవమానించబడ్డానికి కారణం ప్రనూషే. అతనా ఓటమిని తట్టుకోలేకపోతున్నాడు.
ఎప్పుడైతే ద్వేషాన్ని పెంచుకోవడం మొదలెట్టాడో, అప్పుడే అతనిలోని నైతికానైతికాలు చచ్చిపోయాయి. అతనిలో క్రూరమైన మనిషి అవకాశం కోసం చూస్తున్నాడు.
అతనికి కొంతలో కొంత ఓదార్పు తన స్థానంలోకి ప్రభాత్ రావడం.
ప్రభాత్ తో ఆల్రెడీ పరిచయం ఉంది వేదాచలానికి అతనికి, తనకీ మధ్య వయసు తేడా తప్ప 'బుద్దిలో తేడా లేదు.
ప్రభాత్ ద్వారా తన ప్రతీకారం ప్రనూష మీద తీర్చుకోవచ్చు....అనుకున్నాడు వేదాచలం.
స్టాఫ్ అంతా కలిపి గిఫ్ట్ కొనితెచ్చారు.
పార్టీ అయిపోయేసరికి ఏడు దాటింది. అందరికీ థాంక్స్ చెప్పాడు. చివరగా ప్రనూష దగ్గరికి వచ్చి "థాంక్స్ చెప్పి" అదోలా చూసి వెళ్ళిపోయాడు.
ఆ చూపు ప్రనూష తన జీవితంలో ఎప్పటికీ మరువలేననుకుంది.
ప్రనూష ఇంట్లోకి అడుగుపెట్టే సరికి, శ్రీచరణ్ టీవీ చూస్తున్నాడు.
'అలా అస్తమానం మిడిగుడ్లేసుకుని టి.వి చూడకపోతే..." అయ్యో ఆలస్యమైంది. ఏమైందో, ఏమో అని కంగారుతో ఆఫీసుకు రావచ్చుగా....పైగా బోడి మానవత్వం పావుకేజీ వుందని చెప్పడమెందుకో! శ్రీచరణ్ కు వినిపించేలా అంది ప్రనూష.
బస్సుకోసం వస్తే రష్...ఓ పక్క చీకటి పడుతోంది. భయమేసింది ప్రనూషకు. శ్రీచరణ్ వస్తే బావుండనిపించింది.
అతను రానందుకే ఈ ఉక్రోషమంతా!
'ఆఫీసుకు వెళ్ళిన వాళ్ళు పెందలాడే రావాలి. అందులో మా ఆడవాళ్ళు.... తగుదునమ్మా.....అంటూ మగవాళ్ళకు మల్లె....రొమ్ము విరుచుకు తిరగడం కాదు." టీవీ నుంచి దృష్టి మరల్చకుండా చిప్స్ పాకెట్ లోనుండి ఒకోటి తీసుకుని తింటూ అన్నాడు శ్రీచరణ్.
"ఛీ...ఛీ....ఎంత మాటొస్తే అంత మాట అనడమే. మేమేం రొమ్ము విరుచుకుని తిరగడం లేదు" వెంటనే రియాక్ట్ అయి అంది ప్రనూష.
"ఏంటీ మళ్ళీ చెప్పు...." రెట్టించి అడిగాడు శ్రీచరణ్.
