Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 12


    ఆంజనేయులు ఏమీ మాట్లాడలేదు. తన తమ్ముడు చెప్పేవి అబద్దాలో, నిజాలో తెలియవు. ఎప్పుడో తన పరపతి గురించి ఆ పార్టీలో తనకు చాలా వెయిట్ వున్నట్టు గొప్పలు చెప్పుకుంటూ వుంటాడు.
    నిజంగా రామమూర్తికి ఆ పార్టీలో అంత పలుకుబడి వుందా అని ఆంజనేయుల కు అనుమానం. ఇంత పలుకుబడి వున్నవాడు చిన్న ఉద్యోగం సంపాదించుకోవచ్చు కదా లేదంటే ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకోకూడదా? మరెందుకు అలా చేయడంలేదని అనుకుంటూ వుంటాడు.
    మళ్ళీ రామ్మూర్తి చెప్పాడు." ఈరోజు ఖర్చంతా వెంకటసుబ్బయ్యదే కానీ ఏదో మన చేతిలోనూ వుంటే మంచిది గదా అని పదిరూపాయలు అడుగుతున్నాను.
    "నా దగ్గర చిల్లిగవ్వలేదు." ఆంజనేయులు ఆమాట చెప్పటానికి కూడా మొహమాటపడ్డాడు.
    "సరే ఏదో ఒకటి చేస్తాలే" అని రామ్మూర్తి బయల్దేరాడు.
    ఆంజనేయులు వెళుతున్న అతనివైపే చూస్తూ నిలబడ్డాడు. తన చెల్లెళ్ళులాగే తన తమ్ముడు రామ్మూర్తి కూడా అర్ధంకాని పజిల్ ఇంట్లోపరిస్థితి ఇలా వున్నా రామ్మూర్తి ఎప్పుడూ గోల్డ్ పేక్ కింగ్ సైజు సిగరెట్లే  తాడుతాడు బట్టలు మంచివి తొడుగుతాడు. బాటా చెప్పులు తప్ప మరొకటి వాడడు. ఎప్పుడూ, స్టయిల్ గా పెద్ద ఆఫీసర్ లా వుంటాడు. నిజంగా రామమూర్తికి పార్టీలో అంత పలుకుబడి వున్నట్టుంది లేకపోతే ఇంత లగ్జరీగా ఎలా వుంటాడు? తనదేనన్న స్థాయిలో ఎలా మాట్లాడగలడు?
    తిరిగి ఆంజనేయులు మంచంలో పడుకున్నాడు.
    మధ్యాహ్నం కావడంతో పిన్ని భోజనానికి పిలవడంతో లేచాడు. శీనయ్యకు ఆంజనేయులకు ప్రభావతి మౌనంగా వడ్డించింది.
    పాపం! శీనయ్య ఎముకలను నోట్లో పెట్టుకుని కండ కోసం నానా తంటాలు పడుతున్నాడు కానీ కండేలేని ఆ ఎముకలు పళ్ళకు గట్టిగా తగుల్తున్నాయి తప్ప ప్రయోజనం కనిపించడం లేదు.
    పళ్ళెంలో పోసిన పాయసాన్ని తాగలేక కొంగ పడిన అవస్థంతా గుర్తొచ్చింది ఆంజనేయులకు.
    భోజనం చేసి లేచాడు. తిరిగి మంచంలో పడుకున్నాడు.
    ఆదివారం పూట ఏం చేయాలో తోచంది తనకొక్కడికే వినయ్ ఆదివారం అంతా గర్ల్ ఫ్రెండ్స్ తో బిజీగా వుంటాడు. అంతమంది అమ్మాయిల్ని చుట్టూ తిప్పుకోవడానికి అతని దగ్గరున్న మంత్రదండం ఏమిటి? తెలివిగా మాట్లాడటమా? డబ్బా? చొరవా? డామినేషనా? ఏమిటి?
    వీటిలో ఏ ఒక్కటీ తనకు లేదు. అందుకే తను ఆదివారం పూట కూడా ఒంటరిగా గడుపుతున్నాడు.
    తనకంటూ ఓ కుటుంబం ఎప్పుడు ఏర్పడుతుంది? తనకు పిల్లనిస్తామని ఎవరూ రాలేదు. అవే జగదీష్ కయితే పదిహేనో సంవత్సరం నుంచి సంబంధాలు రావడం  ప్రారంభించాయి.
    తాము అంతే! ప్రభావతి కోసం ఇంతవరకు పెళ్ళి సంబంధాలు చూడలేదు. ఒకరిద్దరు వచ్చినా తమ పేదరికాన్ని చూసి తిరిగిరాలేదు. చెల్లెళ్ళకు పెళ్ళి చేస్తే తప్ప తను చేసుకోలేడు. కానీ తను అశక్తుడు వాళ్ళకు పెళ్ళి చేసే స్థోమత లేదు.
    ఇంతకీ పెళ్ళెందుకు?
    ఈ దేశంలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకునేది సెక్స్ కోసమే. పెళ్ళంటేనే సెక్స్ ఎక్స్ ప్లాయిటేషన్. పెళ్ళికాకుండా సెక్స్ ను పొందడం చాలా కాస్ట్ లీ వ్యవహారం. అందుకే అబ్బాయిలంతా పెళ్ళి కోసం కలవరిస్తారు. పెళ్ళంటే సెక్స్ తప్ప మరొకటి కాదని చాలామంది అభిప్రాయం. రోజూ రాత్రి ఓ అమ్మాయిని కొనుక్కోలేరు గనుక ఓ అమ్మాయిని పెళ్ళాంగా చేసుకుని ఇంట్లో కట్టిపడేస్తారు.
    అయితే కొంతకాలానికి ఆ పిల్లతో సెక్స్ అంటే మొహం మొత్తుతుంది ఇక అవసరం లేదుగనుక పెళ్ళి చేసుకోవడం శుద్ద వేస్ట్ అని, పెళ్ళి చేసుకోవడం అంత బుద్ది లేని పని మరొకటి లేదని అందరి దగ్గరా ఏడుస్తుంటాడు మరో జీవితం అంటూ వుంటే పెళ్ళి మాత్రం చేసుకోనని ప్రతిజ్ఞలు చేస్తాడు.
    కానీ పెళ్ళంటే సాహచర్యం అని, పెళ్ళామంటే మంచి కంపానియన్ అని భావిస్తే ఈ సమస్యరాదు. భార్యను ఓ చక్కటి స్నేహితురాలిగా భావించే మగవాడు ఇలాంటి ట్రాష్ మాట్లాడడు. పెళ్ళి చేసుకుని పొరపాటుపడ్డానని ఎప్పుడూ అనడు.
    వినయ్ ఎప్పుడో ఓ సందర్భంలో అన్న మాటలు గుర్తొచ్చాయి ఆంజనేయులకు.
    వినయ్ చెప్పిందంతా నిజమే. ఈ పేద దేశంలో సెక్స్ కోసమే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ప్రేమించుకుని ఆ తరువాత పెళ్ళి చేసుకుని ఒకరికొకరు తోడుగా వుండడం ఎక్కడోగానీ జరగదు. అలాంటి జంటలు చాలా అరుదు.
    ఆడపిల్లలంతా ఇంతే. పైట కొంగు పక్కకు తొలగితే ప్రపంచం బ్రద్దలైపోయినట్టు యాగీ చేసే ఈ పెద్దవాళ్ళ పెంపకంలో పెరిగి అబ్బాయంటేనే అస్ప్రుశ్యుడిలా ఫీల్ అవుతున్నారు. పెళ్ళికి ముందు సహజంగా కావాల్సిన వాటికి దూరమైపోతున్నారు. అబ్బాయిలతో కూడా స్నేహం పెంచుకోవచ్చున్న ఆలోచన రానివ్వడం లేదు. అబ్బాయంటేనే సెక్చువల్ ఆబ్జెక్ట్ గా చూస్తున్నారు.
    అందుకే అరవైఏళ్ళ ముసలాడు ఎదురుపడ్డా అమ్మాయి ఠక్కున పైట సర్దుకుంటుంది. ఇలాంటి స్థితిలో వున్న అమ్మాయి పెళ్ళంటే సెక్స్ కాక మరొకటి అంటే నమ్ముతుందా? అంతకంటే ఉన్నతమైన బంధాన్ని ఆశిస్తుందా?
    మానసిక అనుబంధాలు, ప్రేమలు ఇవేకాదు. సెక్స్ కూడా అందని ద్రాక్షపండే చాలా మందికి తనూ అలాంటి దురదృష్టవంతుల్లో ఒకడు ప్రభావతీ అంతే. ముఫ్ఫయి రెండేళ్ళు అవుతున్నా స్త్రీ స్పర్శ ఎరుగడు తను. తన చెల్లెలు ప్రభావతీ అంతే. ఇరవై ఎనిమిదేళ్ళు వ్యర్ధంగా గడచిపోయాయి. తన పదిహేనవ ఏటనుంచీ అనుభవం కోసం ఎగిసిపడుతున్న శరీరాన్ని అణిచిపెడుతూ వుంది ప్రతిరాత్రీ శరీరంతో యుద్ధం చేయడం ఎంత నరకం. ఈ యుద్దంచేసి తన చెల్లెలు అంత బలహీనంగా తయారైందా? ఏమో?
    ఇలా ఆలోచిస్తూనే ఆంజనేయులు నిద్రలోకి జారుకున్నాడు.
    లేచేసరికి సాయంకాలమైంది. స్నానం చేసి అలా పొలాలవైపు వెళ్ళాడు. పొలాలంటే పదీ, ఇరవై ఎకరాలుగాదు. కేవలం పదిగుంటలు అందులో వరిపైరు నాటారు. ఏపుగా పెరిగింది. అతని కుటుంబానికంతా ఆ పది గుంటలే ఆధారం ఇందులో పండినవిగాక ప్రతి నెలా ఇచ్చే సబ్సిడీ బియ్యం కొనుక్కుంటారు.
    ఆ పొలం చూసినప్పుడల్లా తన తండ్రి చేసిన హితబోధ గుర్తొస్తుంది ఆంజనేయులకు.
    తనలాంటి డబ్బులేని మనుషులకు కోరికలు ఇష్టాలు వుండకూడదని తమలాంటి వారు బతకాలంటే ఇది మొదటి సూత్రమని తండ్రి ఎప్పుడో చెప్పాడు. కానీ ఈ పిచ్చిమనసు వినదు. ఏవేవో కోరుకుంటుంది.
    తన తండ్రి ఏ పరిస్థితుల్లో ఈ హితబోధ చేశాడో గుర్తొచ్చింది అతనికి.
    అప్పుడు ఆంజనేయులకు పదహారేళ్ళు. ఇంటర్ లో చేరాడు రోజూ ఉదయం నిద్రలేచి ఇక కాలేజీకి పరుగుపెట్టేవాడు. సద్ది అన్నం తిని దాన్నే కొంత క్యారియర్ లో వేసుకుని డొక్కు సైకిల్ మీద రేణిగుంటకు వెళ్ళేవాడు. అక్కడి నుంచి రైల్లో తిరుపతికి  చేరుకునేవాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS