విద్య వర్ష వైపు తిరిగి "నువ్వెళ్ళి కాఫీ పట్రా" అంది.
"ఒద్దండీ.....నేను....." అని సంజయ్ ఏదో చెప్పబోయాడు.
విద్య సీరియస్ గా "నియంతలు ఎదురుచెప్తే సహించరు" అంది.
ఇందాక తను అన్న మాటలకి అతను సిగ్గుపడినట్లు "సారీ" అన్నాడు.
వర్ష లోపలికి వెళ్ళిపోయింది.
విద్య గొంతు సవరించుకొని "సంజయ్.....ప్రతిపుట్టినరోజున నా కూతురు చాలా సంతోషంగా ఉండాలని నేను ఎన్నెన్నో బొమ్మలు కొనిచ్చేదాన్ని......ఎక్కడెక్కడికో తిప్పేదాన్ని......కానీ అవేమీ ఇవ్వలేనంత ఆనందాన్ని నిన్న నీకంపెనీ ఇచ్చింది. ఎంతగా అంటే.....కేవలం కొంచెంసేపు తల్లిని మరిపించేంతగా.....అందుకు నీకు థాంక్స్!" అంది.
అతను అది నిందో లేక పొగడ్తో అర్ధం కాక కలవరపడ్తూచూశాడు.
"నాదగ్గర అబద్దం చెప్పిందని నేను కొన్ని ఘడియలు బాధపడిన మాటనిజమే కానీ ఎందుకు అబద్దమాడిందో ఆలోచిస్తే...... నాకు బాధకలగకూడదనీ! అన్న విషయం అర్ధమై కుదుటపడ్డాను. రాత్రి వర్ష నీ గురించి మొత్తం చెప్పేశాక గర్వపడ్డాను. ఇప్పుడు చెప్పు......వర్ష నీకెందుకు నచ్చిందీ? గొప్పింటి అమ్మాయనాలేక లోకం తెలీని అమాయకపు పిల్ల అనా?" ఒకింత కరుకుగా అంది.
సంజయ్ చివాలున తలెత్తాడు.
"ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించడానికి మీకు తెలిసిన కారణాలు అవేనేమో కానీ నేను వర్ష వెనుకనున్న ఆస్తిని కానీ, ఆమె అమాయకత్వాన్ని చూసి మోసగించాలనికానీ ప్రేమించలేదు. ఆమెని చూడగానే ఇష్టం కలిగింది. పరిశీలించిన కొద్దీ అది ప్రేమగా మారింది. తనతో కలిసి బ్రతకాలనిపించింది. దట్సాల్!" అన్నాడు.
విద్య అతని మాటలకి చిన్నగా నవ్వి "నువ్వుకాదన్నా, ఔనన్నా ఈ ఆస్తిమొత్తం వర్షదే. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం నువ్వు వర్షని అర్ధం చేసుకుని ఆమెతో సుఖంగా ఉంటూ ఆమెని సుఖంగా ఉంచగలవా అని!" అంది.
"వర్షనా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. నన్ను నమ్మండి" సిన్సియర్ గా అన్నాడు.
వర్ష కాఫీ ట్రేతో వచ్చింది. విద్యకి అప్రయత్నంగా కంటనీరు తిరిగింది. గొంతు కొద్దిగా వణికింది.
"సంజయ్......వర్షకి ఏ కష్టం కలిగినా నేనుతట్టుకోలేను. ముఖ్యంగా ఆమెని చూడకుండా నేను బ్రతకలేను. నువ్వు నీ ఇష్టప్రకారం ఉద్యోగం చేసుకుంటున్నా, ఉండడం మాత్రం మా ఇంట్లోనే ఉండాలి!" అంది.
"అంటే ఇల్లరికమా?" సంజయ్ చిరాగ్గా అడిగాడు.
"ఆ పేర్లన్నీ పెట్టుకోవడం ఎందుకులే! వర్షా, బాబుకి కాఫీ ఇవ్వు" ప్రేమగా అంది.
వర్ష అతనికి కాఫీ కప్పు అందించింది.
"ఒద్దు, నాకిష్టం లేదు" అన్నాడు.
"కాఫీ ఒద్దకపోతే హార్లిక్స్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ దీసుకుందువుగానీ" అంది విద్య.
"నాకు ఇష్టం లేనిదీ కాఫీ కాదు ఇల్లరికపుటల్లుడిగా పడి ఉండటం!" విసురుగా అన్నాడు.
వర్ష ఇద్దర్నీ మార్చి మార్చి బెదురుచూపులు చూసింది.
విద్య కాఫీ సిప్ చేస్తూ "వర్షనినీకిచ్చి పెళ్ళి చెయ్యడానికి అదే ముఖ్యమైన కండిషనైతే, అప్పుడు కూడా ఇదే మాట అంటావా?" అడిగింది.
వర్ష ఊపిరి బిగబట్టి అతని నిర్ణయంకోసం ఎదురుచూస్తూ నిలబడింది.
"అంత మూర్ఖంగా మీరు కండిషన్ పెడ్తే.....వర్షని వదులుకోను.....కానీ మీ పెద్దరికం నిలబడలేదే అని బాధపడ్తాను" అన్నాడు.
"అంటే?" ఆమె భ్రుకుటి ముడిపడింది.
"వర్షని తీసుకుపోయి గుళ్ళో పెళ్ళిచేసుకొంటాను" అన్నాడు.
"హౌ డేర్ యూ?....." విద్య కుర్చీలోంచి లేచికోపంగా అరిచింది "అదేమైనా నా చెట్టుకి పూసినపువ్వా.... షోకేసులో బొమ్మానాకు చెప్పకుండానే ఎత్తుకుపోవడానికి? అది నాప్రాణం....ఇక్కడ.... ఇక్కడదాని స్థానం!" తనగుండెమీద చెయ్యేసుకుని చూపించింది "ఒక గంటలో, రెండు గంటలో నా నుండి దూరం చేయగలిగావేమోకానీ జీవితాంతం కాదు! అది నన్ను కాదనుకుని, నాకు చెప్పకుండా ఈ గడపదాటుతుందనే అనుకుంటున్నావా? ఏ ధైర్యంతో అలా అనుకున్నావు?" ఆవేశంగా అడిగింది.
వంటమనిషీ, వరమ్మా కంగారుగా పని వదిలేసిపరిగెత్తుకొచ్చారు.
వర్ష కొయ్యలా చేష్టలుడిగి చూస్తుండిపోయింది. సంజయ్ తొణకకుండా, బెదరకుండా "వర్ష నన్ను ప్రేమిస్తోంది, అదే నాకా ధైర్యాన్నిస్తోంది" అన్నాడు.
"పుట్టిన మరుక్షణం నుండీ ప్రేమించిన తల్లికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేటంత పరిచయమా మీకు?" వెటకారంగా అడిగింది విద్య.
"ఆ ప్రేమ వేరూ..... ఈ ప్రేమవేరూ అని మీరు అర్ధం చేసుకోలేకపోతున్నందుకు నాకు విచారంగా ఉంది!" చిన్నగా నవ్వి అన్నాడు.
"శభాష్! అలాంటప్పుడు ప్రేమకోసం మా వర్షే ఎందుకు నీవైపురావాలి? నువ్వు వర్షని గాఢంగా ప్రేమిస్తున్నావుగా......మరి నువ్వు తనవైపురావచ్చుగా!" అడిగింది.
"అది ఒక మగాడిగా నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విషయంకాకపోతే అలాగే చేసేవాడ్ని!" నిశ్చయంగా అన్నాడు.
"ఆత్మాభిమానమా లేక ఈగోనా?" అడిగింది వ్యంగ్యంగా.
"ఏదైనా కావచ్చు! కానీ లోకవిరుద్దంకాదుగా!" అన్నాడు.
"లోకంతో నాకు పనిలేకుండా ఇన్నేళ్ళు బ్రతికినదాన్ని! ఇప్పుడు లోకం కోసం ప్రాణాల్ని నా నుండి వేరు చేసుకోలేను!" కరాఖండీగా చెప్పేసింది.
"ఆంటీ......మీరు నిజంగా వర్ష మంచికోసమే ఆలోచిస్తుంటే ఇలా కఠినంగా వ్యవహారంలో మాట్లాడరు!" సంజయ్ నచ్చచెప్పబోయాడు.
విద్య చెయ్యి చూపించివారించింది. "ఇక ఈ విషయంలో నీతో తర్కించేదేమీలేదు. నేను చెప్పిన కండీషన్ కి ఓ.కే. అయితే వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను. లేదా.....ఇంకెప్పుడూ వర్ష పేరు కూడా నీ పెదవులమీదికి రానీయకు! యూ మేగో......."
సంజయ్ నెమ్మదిగా సోఫాలోంచిలేచాడు. వర్ష అతని వైపు కన్నీళ్ళతో అర్ధింపుగా చూసింది.
"వర్షా......మీ అమ్మ చెప్పింది విన్నావుగా...... నీ నిర్ణయం ఏమిటీ?" అడిగాడు.
"చిన్నపిల్ల అదేం చెప్తుంది?" విద్య అరిచింది.
"అదేమీ పొరపాటు! తనింకా చిన్నపిల్ల అనుకుంటున్నారు. ఇప్పుడు తనకి కావలసింది నేను. మీరు కాదు! వయసొచ్చేదాకా ఆడపిల్లకి తల్లిదండ్రులూ, ఆ తర్వాత చేసుకున్నమొగుడూ జీవితంగా మార్తారు" అన్నాడు.
