ఫకాల్న నవ్వాడు ఉదయ్.
"అమ్మాయెవరో నువ్వు చెప్పవు కాని, నువ్వాడగ్గానే నేను కవిత రాసివ్వాలి . అది అద్భుతంగా!"
నీకు బీర్లు లంచంగా ఇస్తానన్నాను కదరా!"
"మంచి కధకు బీర్లే కారణమైతే ఓ బార్ ముందుకెళ్ళి నిలబడితే బేరం దొరక్కపోదు" మళ్ళీ అనునయంగా అడిగాడు....."ఎవరు ఉదయ్ ఆమె నీ తోటి లేడి లేక్చరరా? లేకపోతే నీ స్టూడెంటా?"
"అర్జెంటుగా రాసివ్వమంటే ఈ నసేమిట్రా?"
రెప్పలార్పకుండా చూశాడు రాఘవ. వెంటనే ఓ కవిత రాశాడు.
కవిత చదివిన ఉదయ్ అద్భుతంగా ఉందనుకున్నాడు తప్ప , వేగంగా ఎలా రాయగలిగాడు అని ఆలోచించలేకపోయాడు.
అలా ఆలోచించి ఉంటే అవసరమైన జాగ్రత్తలు పాటించినట్టయ్యేది!
అదే కవితను ఆ మరుసటి రోజు కిన్నెర లైబ్రరీ నుంచి తెచ్చుకున్న ఓ నవల్లో రహస్యంగా ఉంచాడు ఉదయ్.
* * * * * * * *
"మంగా!"
మళ్ళీ సాయంకాలానికి యధాప్రకారం కేక పెట్టింది కిన్నెర. రూంలోకి పరుగున వచ్చిన మంగ ఈరోజు ఎక్కువ ప్రశ్నలు అడక్కుండా అదో దైనందిక కార్యక్రమంలా నవల అందుకుని మధ్య ఉన్న కాగితాన్ని తీసుకుని చదవటం ప్రారంభించింది.
'నీ కోసం నిద్ర లేచి జాగరణం రణమై నన్ను
బాధిస్తుంది ప్రియ నేస్తం!
మరణం శరీరానికి అయితే అనందం కాని, నా
మనసుని బాధించి ఇలా ఆడకు పరిహాసం.....
నీ ఆలోచన అగ్ని పుష్పాలు నన్ను కాల్చి నా ఉనికిని
భస్మంగా మార్చితే.....
అనక నీ కలల కర్పూర పేటికలో నా స్మృతుల
బుడిదని దాచుకోవాల్సి ఉంటుంది.....
నన్ను దోచుకునే అవకాశ మున్నా నా కెందుకు దూర
మయ్యావు మిత్రమా అని.....
అశ్రు పుష్పాల శ్రద్ధాంజలితో ఏడు జన్మల పాటు నా
కోసం ఎదురు చూడాల్సి వస్తుంది.
అందుకే ప్రియతమా, నా ఆర్తిని అర్ధం చేసుకో మంటున్నది.
నీ మనసులోకి పదిలంగా నన్ను ఆహ్వానించి
ప్రతి క్షణాన్ని ప్రేమ సింహాసనం అధిరోహించ మంటున్నది.
"ఆహా!" అంది మంగ తమకంగా.
మళ్ళీ 'ఓహో' అనబోయింది కాని అమాంతం మంగ చేతిలో నుంచి కాగితాన్ని అందుకున్నది కిన్నెర.
ఆ మాటకొస్తే తను యిప్పటికి యిదే కవితను వందసార్లు చదివింది. అదోలాంటి వివశత్వానికి లోనైంది కాని, ఇప్పుడు మంగని పిలిచింది కవిత 'ఎఫెక్ట్' ఏ స్థాయిలో ఉన్నదీ పరిశీలించటానిక్కాదు.
"చెప్పు ఇది మళ్ళీ నవలలోకి ఎలా వచ్చి ఉంటుంది?" సీరియస్ గా అడిగింది కిన్నెర. "మీరు లైబ్రరీలో సరిగ్గా చెక్ చేయలేదేమో అనకు. ఒకసారి కాదు.....వందసార్లయినా పుస్తకాన్ని అక్కడ అటూ ఇటూ తిప్పి చూశాను. మరి అక్కడ లేనిది ఇక్కడ ఎలా ప్రత్యక్షమైంది?"
"ఇది తప్పకుండా పరిశోధించాల్సిన విషయం చిన్నమ్మాయిగారూ! తప్పదు.....లేకపోతే.....'
విస్మయంగా చూసింది కిన్నెర "లేకపోతే?"
"కొంత కాలానికి ఈ కాగితాలు ఓ సంపుటి సైజులో బైండ్ చేయాల్సి వస్తుంది. అనక అది చదివితే తప్ప మీరుండలేని స్థితికి చేరుకునే అవకాశముంది."
"నీ మొహం!" తనకు అలాగే ఇప్పుడిప్పుడే అనిపించడంతో ఆవేశంగా అంది కిన్నెర. "సంపుటి, గింపుటి అంటూ నీకున్న భాషా పరిజ్ఞానాన్ని ప్రదర్శించక అసలీ కవిత ఎవరు పెట్టి ఉంటారో ఆలోచించు?"
కొన్ని క్షణాలు ధ్యానంలోకి జారిపోయింది మంగ.
చిన్నమ్మయిగారి తర్వాత సాహిత్యం మీద అంతో ఇంతో 'కమేండ్' ఉన్నది తనకు మాత్రమే.
పని వాళ్ళెవరు రాయలేరు. ఒకవేళ రాసినా పుస్తకంలో ఉంచే ధైర్యం చేయలేరు.
అసలు ధైర్యం మాట అటుంచితే ఆ కవిత పుస్తకంలో ఉంచాల్సిన అవసరం ఎమిటట?
ఉన్నట్టుండి ఫ్లాష్ లా ఓ ఆలోచన మెరిసింది మంగ మెదడుకు. తల పంకించింది వెంటనే- "అర్ధమైంది అమ్మాయిగారూ!"
"ఏమిటి?"
"ఈ కవిత లైబ్రరీలో మీరు చెక్ చేసినప్పుడు కనిపించటం లేదు కాని ఇంటి కొచ్చాక దర్శనమిస్తుంది."
"సరిగ్గా చెప్పేడువు!" కసురుకుంది కిన్నెర.
"అదేనమ్మా! మన ఇంట్లోని మనుషులే ఈ పనికి పూనుకుంటున్నారని బోధ పడుతుంది."
"ఎందుకు?" విస్మయంగా చూసింది కిన్నెర.
"మీ చేత పెళ్ళి చూపుల్లో తిరస్కరించబడిన నూట ఒక్క మగాళ్ళలో ఎవరో ఒకరికి ఈ కవితలు రాసే అలవాటు ఉండి ఉంటుంది. మీరు తిరస్కరించినా, మిమ్మల్ని మరచిపోలేనంత పిచ్చి వ్యామోహం పెరిగి ఉంటుంది కాబట్టి, తన ఆలోచనల్ని కాగితం మీద రాసి మన ఇంటిలోని ఏ పనివాడితో డబ్బు లిచ్చి ఇలా 'ప్లే' చేస్తున్నాడని బోధ పడుతుంది."
