Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 12

   

    వెనువెంటనే ఏదో స్పురించినట్లయి టెలిఫోన్ డైరిలోని ఏ నెంబరు కోసమో వెదికింది. ఎక్కువ సమయం వృదా కాకుండానే దొరికింది. అదోలాంటి ఉద్వేకం ఫోన్ డయల్ చేస్తుంటే, ముప్పై సెకండ్ల విరామం

 

    "మధూళీ హియర్" అది స్వరం కాదు .....వసంత సమీరం.....గంధర్వగానం.....మధూళీకి దేవుడు ప్రత్యేకంగా యిచ్చిన వరం.

 

    "గుర్తున్నానా మధూళీగారూ! ఉద్వేగభరితంగా అంది సామ్రాజ్యం. "మీకు నేను హలిడేయిన్ లో పరిచయమయ్యాను, మీ స్నేహితురాలు రమ్య నన్ను పరిచయం చేసింది, నా పేరు సామ్రాజ్యం."

 

    "భలేవారే."

 

    మధూళీ నవ్వు సామ్రాజ్యం నిస్త్రాణని చెరిపేసింది. తృటిలో. "బాగా గుర్తున్నారు. నాలాగే మీరు ఎక్కువ చదువుతారని రమ్య ఆ రోజే చెప్పిందిగా.

 

    మధూళీ నిరాడంబరత ఏ అద్బుత సౌధాల మణికవాటాలనో తెరిచి అందులోకి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నట్లుగా వుంది.

    "మీరిప్పుడు నాలాంటి పాఠకురాలు కాదు మిస్ మధూళీ......పెద్ద రచయిత్రి."

 

    "పెద్దా...."మధూళీ నవ్వింది మళ్ళీ. "ఆ విశేషణాలు వుపయోగించేటంత పెద్ద రచయిత్రిని కాను సామ్రాజ్యంగారూ!"

 

    "మీ నీరవం సీరియల్ చదువుతున్నా."

 

    క్షణం విరామం తర్వాత అంది సామ్రాజ్యం.

 

    "ఎలా వుందని మీరు అడిగే అవకాశం యివ్వకుండా చెబుతున్నా సింప్లీ సుపర్బ్.....నిజం మధూళీ! నా భావాల్ని అందంగా చెప్పగల శక్తి నాకు లేదు. కానీ ఒక్కటి! మీ భావుకత్వం అమోఘం. ఇంత చిన్న వయసులో ఎలా సాధించానంత అభినివేశాన్ని."

 

    "థాంక్స్ సామ్రాజ్యంగారూ!" మధూళీ గొంతులో అస్పష్టమైన వివశత్వం. "మిరన్నమాటే చాలామంది అంటున్నారని నేను చెప్పడం అవసరమో కాదో నాకు తెలీదు. కానీ మీలాంటి సహృదయం స్పూర్తి నన్ను చాలా ఉత్తేజపరుస్తుంది."

 

    సామ్రాజ్యం వింటుంది ట్రాన్స్ లోలా.

 

    "ఇక బావుకత్వం అంటారా....మీరు క్షమిస్తాను అంటే....."

 

    అర్దోక్తిగా అంది సామ్రాజ్యం. "అంతగా మన్నించాల్సిన అవసరం లేదు మధూళీ....చెప్పండి."


    
    "స్పందనకి వయసుతో సంబంధం లేదన్నది నా అభిప్రాయం....ఆకాశంలో అందమైన హరివిల్లును చూసి ఆనందించటానికి గానీ, ఓ పికిలి పిట్ట పొగడ చెట్టు నిడన చేసే కువకువల సద్దుని వింటూ సంబరపడటానికి గానీ, చీకటి ఆకాశపు నుదుట వెలిగే నెలవంక అందాన్ని ఆస్వాదించటానికి గానీ, నింగి-నేలా కలిసే క్షితిజ రేఖని చూసి అలవోకగా రెండు వాక్యాలు మాట్లాడటానికి గానీ వయసుతో సంబంధం వుండదేమో కదూ....."

 

    "అంగీకరిస్తున్నాను మధూళీ....భావుకత్వం ప్రదర్శించటానికి వయసుతో పనిలేదని ఒప్పుకుంటున్నాను. కాని అంత అందంగా అక్షరరూపం ఇవ్వటానికైనా నిజానికి అనుభవంతో కూడిన వయసుండాలిగా! అసలు మీ వయసెంతని? మనసు లోతుల్లోకి చొచ్చుకుపోయే పదజాలంతో అంత గొప్పగా ఎలా రాస్తున్నారు?" ఉద్వేగంతో మాట్లాడుతూ ఆగింది క్షణం పాటు. "ఈ ప్రశ్నకి కూడా మీరు అందంగా సమాధానం చెప్పగలరని అంగీకరిస్తున్నాను మధూళీ....అందుకే అలాంటి బెస్ట్ అవకాశం మికివ్వకుండా నేనే మిమ్మల్ని మరో ప్రశ్న అడుగుతున్నాను."

 

    "ఓ.కె.!"

 

    "ఇంతమంది అభినందించే మీ 'నీరవం' నవలని ఇప్పటిదాకా ఎవరైనా విమర్చించారా.....బాగోలేదని?"

 

    "లేదు."

 

    "వింటే తట్టుకోగలరా?"

 

    "తట్టుకోగలగడం ఎదగటానికి మరో మంచి మెట్టుగా ఆలోచించే అలవాటు గలదాన్ని."

 

    "పుస్తకాల్ని, ప్రపంచాన్ని చాలా చదివిన మేధావి మీ రచన్ని దారుణంగా విమర్శిస్తున్నాడు."

 

    "సద్విమర్శగా అనిపిస్తే నన్ను నేను కరెక్టు చేసుకుంటాను."

 

    ధన్వితో సమావేశం ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించిందో సామ్రాజ్యనికి తెలీదు. :మేధావి అని ముందే చెప్పాను మధూళీ....అతడు చేసేది సద్విమర్శే అవుతుందిగా?"

 

    "కాదనను సామ్రాజ్యంగారూ! వేలమందికి తన పరిశ్రమల ద్వారా ఉపాదిని కల్పించగల పారిశ్రామికవేత్త బిర్లా తరచూ విమాన ప్రయాణం చేస్తాడు కాబట్టి ఆయనకి విమానం నడపడం రావాలని రూల్లేదుగా?"

 

    "అంటే?"

 

    "మేధావులు మంచి సృష్టికర్తలు కాగలరేమోకానీ , గొప్ప విమర్శకులు కాలేరని ఎక్కడో చదివాను."

 

    "అప్పుడే భయపడిపోతున్నావా మధూళీ?"

 

    "దేనికి?"

 

    "నేను చెప్పిన మేధావిని మీరు పరిచయం చేశాక అయన విమర్శ తట్టుకోలేరేమోనని."

 

    నవ్వింది మధూళీ.....కనిపించలేదుగాని పదే పదే నవ్వడం వినిపిస్తూనే వుంది.

 

    "నేను ఆశావాదిని సామ్రాజ్యంగారు! దురదృష్టవశాత్తూ మీరనుకునే రచయిత్రుల కోవలోకిరాను...ఇక విమర్శ విషయం అంటారా.....నేను నా ఆలోచనల కన్నా బలవంతురాల్ని" మధూళీ నమ్మకంగా చెప్పింది. "అంతకుమించి పరిస్థితుల్ని బట్టికాక, ఆ పరిస్థితులకి రియాక్ట్ కావడం బట్టే అనందంగానీ భాధ కానీ అని బలంగా నమ్మే ఆడపిల్లని నేను." "ఇట్స్ సుపర్బ్...అయితే మీకు పరిచయం చేస్తాను తప్పకుండా."

 

    "ఎందుకో మీతో స్నేహం చేయాలని నాకూ అనిపిస్తోంది సామ్రాజ్యంగారూ...." ఉన్నట్టుండి అంది మధూళీ. "నిజం సామ్రాజ్యంగారూ ! మీరు నన్ను అంత బలంగానే ఇంప్రెస్ చేశారు. సో....నేను మీ ఇంటికి వస్తాను."

 

    "ఫెంటాస్టిక్!" సామ్రాజ్యం అరిచింది ఉత్సాహంగా. "త్వరలోనే మిమ్మల్ని నా ఇంటికి ఆహ్వానిస్తాను మిస్ మధూళీ.....థెంక్యూ.....ఈ చిన్ని పరిచయంలోనే నన్ను స్నేహితురాలిగా అంగికరించినందుకు మెనీ మెనీ ధెంక్స్!" ఫోన్ క్రెడిల్ చేసిన సామ్రాజ్యం జరిగిందంతా మననం చేసుకుంటూ సోఫాలో కూర్చుంది.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS