ఎప్పుడైనా సినిమాకు వెళ్ళినా పేర్లు రాగానే నిద్రపోయి, శుభం అన్న అక్షరాలు వచ్చినప్పుడు ఎవరో తట్టి లేపితే లేస్తాం.
గంగాభవానీ అందరిలోకి మరీ అమాయకపు పిల్ల. ఒక్కర్తో కలిసేది కాదు. తన పని తప్ప మరొకటి పట్టదు. అమాయకత్వం ఆపిల్లకు ఆభరణంలా అమరింది.
ఇలాంటి గంగాభవానీకి పెళ్ళి కుదిరింది. పెళ్ళి కొడుకు ఏదో ఆఫీసులో అటెండర్. పిల్ల టౌన్ లో వుంటుంది కదా అని ఆమె తండ్రి అతనడిగిన అయిదువేలూ కట్నం కింద ఇచ్చాడు. పెళ్ళి చేసి ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు.
మావాడలో ఏ కార్యానికయినా తప్పక వుండేది రేడియో రేడియో అంటే బుల్లి రేడియో కాదు. ఇనుపగద్దల్లా వుండే లౌడ్ స్పీకర్లు పెట్టి పాటలు విన్పిస్తారే అలాంటిదన్న మాట.
ఇలాంటి రేడియో పెట్టి, రెండు మూడు సెట్ల సీరియల్ బల్బులు పెట్టి జామ్ జామ్ అని గంగాభవానీ పెళ్ళి చేశాడు ఆమె నాన్న.
పెళ్ళి కొడుకుదంతా తెచ్చి పెట్టుకున్న స్టయిల్ అని మాకర్ధమైంది. కుడిచేతికి వాచ్ కట్టాడు. తన పేరును పొడి అక్షరాల్లో చెక్కిన ఉంగరం వేసుకున్నాడు. కాళ్ళకు బూట్లు, కళ్ళకు సలువ కళ్ళద్దాలు టిప్ టాప్ గా వున్నాడు పెళ్ళికొడుకు.
టౌన్ లో వుంటున్నానన్న గొప్పలు, ఉద్యోగం చేస్తూ వున్నానన్న గర్వం ప్రతి కదలికలోనూ, మాటలాడే ప్రతి మాటలోనూ కనిపిస్తోంది.
పెళ్ళి అయిపోయిన రాత్రే శోభనం ఏర్పాటైంది. ఎందుకు ఏదో, ఏది ఎందుకో తెలియని గంగాభవానీ జరిగే తంతులన్నీ ఆశ్చర్యంగా చూస్తోందే తప్ప మరే భావాన్నీ బయట పెట్టలేకపోయింది.
ఆ కొత్త వ్యక్తితో ఇంట్లోకి ఎందుకు తోశారో అర్ధంకాక అమాయకంగా చూస్తూ ద్వారం దగ్గర నిలబడిపోయింది. ఓ మూలనున్న కిరోసిన్ దీపం రెక్కలు తెగి ఎగరలేని ఎర్రటి పురుగులా వుంది. నులక మంచం రాక్షసి సాలీడు అల్లిన గూడులా వుంది. దానిమీద పరిచిన రంగు రంగుల దుప్పటి అందంగా వుంది.
"నీకోసమే చూస్తున్నాను - రారా - అంత సిగ్గు పడతావేమిటి? అదే మా టౌన్ లో అయితే ఆడపిల్లలు ఇలా సిగ్గుపడరు తెలుసా?" అన్నాడతను టౌనంతా అతనిదే అయినట్టు.
ఆమె ఒకడుగు ముందుకేసింది.
'పూలజడ అంతా ఓల్డ్ ఫ్యాషన్. ముందు అది విప్పేయ్'
ఆమె మంచం మీద కూర్చుని అతను చెప్పినట్టే పూలజడ విప్పేసింది.
'ఇదే పెళ్ళికి నేను కొన్న వాచీ - సీకో - మీ వాడలో ఎవరూ ఇలాంటి వాచీ కట్టుకుని వుండరు - మద్రాసుకు మా ఫ్రెండ్ పోతుంటే డబ్బులిచ్చి తెప్పించాను అని వాచీ విప్పి చూపించాడు.
'బూట్లు కూడా కొత్తవే లేసులు కూడా వున్నాయి' అంటూ మూలపెట్టిన బూట్లు తెప్పించి చూపించాడు.
'మా టౌన్ లో కాళ్ళకు బూట్లు లేకుంటే అసలు మతించరు. నీకూ ఓ జత కొనిస్తాలే' అన్నాడు.
'ఇంకెప్పుడూ అలా నడింపాపిట తీసుకోకు. సైడ్ పాపిటే తీసుకో' అని ఓ అమూల్యమైన సూచన కూడా చేశాడు.
'నేనెప్పుడూ లైఫ్ బాయ్ సోప్ వాడను. అంతా పియర్సే' అంటూ ప్రారంభించి 'ఇది సీజర్ సిగరెట్టు మా టౌన్ లో బాగా డబ్బున్న వాళ్ళే ఇది తాగుతారు' అన్న దాకా చెప్పి ఆమెను వూదరగొట్టాడు.
ఇక ఆ తరువాత అసలు శోభనం ప్రారంభమైంది. మధ్యలో 'నేను టౌన్ లో పుట్టి పెరిగి, ఉద్యోగం చేస్తున్నా నీలాంటి పల్లెటూరి పిల్లను ఎందుకు పెళ్ళి చేసుకున్నానో తెలుసా? కన్య కావాలని - టౌన్ లో అయితే దొరకరనుకో" అంటూ టౌన్ లో వున్న స్త్రీల జాతకాలన్నీ తెలిసినట్లు మాట్లాడాడు.
ఆ పిమ్మట అతను, ఆమె ఓ అరగంటసేపు పెనుగులాడారు. పడకటింట్లో తను ఏ ఆడపిల్లనయినా ఆకట్టుకుంటానని అతనికి ఓ గొప్ప భ్రమ వుండేది. తన చేయి తగిలితే ఏ ఆడపిల్లయినా ఐస్ అయిపోతుందని నమ్మకం. ఆమె కూడా అలానే మురిసి పోయుంటుందనీ, ఈ మాట ఆమె నోటంట వినాలని శోభనం ముగిశాక 'ఎలా వుంది మన మొదటిరాత్రి?' అని కళ్ళు తమాషాగా అటూ ఇటూ కదుపుతూ అడిగాడు.
అంతవరకు అతను చెప్పినవన్నీ ఆశ్చర్యంతో విన్న గంగాభవానీ ఆ ప్రశ్నకు జవాబు చెబుతూ - 'ఇదేనా మొదటి రాత్రంటే. ఇదే శోభనం అయితే మా నాన్న నీకెందుకు అయిదువేలు ఇచ్చాడో నా కర్ధం కావడం లేదు. దీనికి ఒప్పుకున్నందుకు మా ఎదురింటి రమేష్ నా చేతిలో ఏభై రూపాయల నోటుంచాడు' అంది.
"అంతే - తెల్లవారేసరికి అతను పారిపోయాడు. మళ్ళీ మా వాడకు వచ్చుంటే ఒట్టు" అని గంగాభవాని కథ చెప్పింది సుబ్బులు.
"మీగంగాభవానీ ఎవరోగానీ కట్నం తీసుకునే మగవాళ్ళని భలే దెబ్బ కొట్టింది. ఇంతకీ ఎక్కడికి బయల్దేరావ్?" వంశీ మామూలుగా అయితే ఇంకాస్త ఎంజాయ్ చేసుండేవాడేగాని ప్రస్తుతం అతనున్న పరిస్థితి వేరు. సుజనకు ఉత్తరం చేరవేయాలన్న తొందరలో ఉన్నాడు.
"సుజానమ్మకు తలనొప్పిగా వుంది. అమృతాంజనం బాటిల్ తెమ్మంటే ఇటొచ్చాను"
"సుజనకి తలనొప్పా?" కంగారుపడిపోయాడు.
"మరీ అంత తలనొప్పి కాహ్దులే రాత్రి సరిగా నిద్రపట్టక తలనొచ్చుతోందట. ఇప్పటికే లేటయింది వస్తానండీ" అని ఆమె కొట్టువైపు నడిచింది.
ఆమెతో ఉత్తరం పంపడం సేఫ్ అని వంశీకి తెలుసు. కానీ డైరక్టుగా అడగలేదు. అలా అని ఈ అవకాశాన్ని జారవిడుచుకోలేడు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ అలానే నిలబడిపోయాడు.
సుబ్బులు అమృతాంజనం బాటిల్ కొని దుకాణం మెట్లు దిగుతోంది. ఆచేతిలోని ప్యాక్ ను చూడగానే అతని బుర్రలో ప్లాష్ వెలిగింది.
తన తెలివితేటలకి తనే అబ్బుర పడిపోతూ - "ఏదీ ఆ బాటిల్ ఒకసారి ఇవ్వు" అని సుబ్బుల్ని అడిగాడు.
ఎక్స్ ఫైర్డ్ డేటూ, రేటూ చూస్తూ ఆమె గమనించకుండా ప్యాక్ మూత తీశాడు. మందు ఎలా వాడాలో ముద్రించి వున్న కాగితాన్ని అందులోంచి తీసి, దాని స్థానే తను రాసిన ఉత్తరాన్ని పెట్టాడు. తిరిగి మూత పెట్టేసి, "అన్నీ కరెక్ట్ గానే వున్నాయి గానీ, లోపల మందు ఎలా వాడాలో తెలుస్తుంది చదువుకోమను" అని దాన్ని ఇచ్చాడు.
"అలానే"
తన ఆపరేషన్ మొదటి ఘట్టం పూర్తయిందని మురిసిపోయాడు. ఇక చేయాల్సిన పనులు రెండున్నాయి. ఇవి రెండూ ముగించేస్తే 'పూలపల్లకి' గ్రాండ్ సక్సెస్. ఈ రాత్రే తమకు మొదటిరాత్రవుతుంది. నిజానికి దీనికి మొదటిరాత్రి అని పెట్టినవాడు మహామేధావి అనిపించింది.
ఆ హుషారులో మిగిలిన పనులు పూర్తి చేయడానికి టౌన్ బయల్దేరాడు.
బస్సు దిగగానే ఆటో వేసుకుని తన మిత్రుడి మెడికల్ షాప్ కి వెళ్ళాడు. అతన్ని చూడగానే మిత్రుడు సాదరంగా ఆహ్వానించాడు.
