Previous Page Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 12

 

      నాయుడి మొహంలో రంగులు మారాయి. ఏదో ముడి విడిపోయినట్టు రాణావైపు చూశాడు. అతడి చూపుల్ని రాణా పట్టించుకోలేదు.    
    "వాడిమీద పక్కా కేసు నిలబడుతుంది సార్. రెండేళ్ళకి తక్కువ శిక్ష పడదు."    
    .... ఈ లోపులో పోలీసులు వ్యాన్ లో మస్తాన్ ని పట్టుకొచ్చారు.    
    "వీడి మక్కెలిరగదన్ని నిజం ఒప్పిస్తాను. మీరేం కంగారు పడకండి-"    
    "కంగారేమిటి-లక్షన్నర విలువ చేసే కారు కాలిపోతే" ఎవరో గొణుగుతున్నారు.    
    "ప్రజలకోసం నిలబడిన మనిషి నాయుడుగారు! ప్రజలకి సింహస్వప్నంగా మారీన ఒక రౌడీని పోలీసులకి పట్టించడం కోసం తన కారుని త్యాగం చేయవలసి వచ్చినా ఆయన బాధపడరు" అంటూ మస్తాన్ వైపు తిరిగి వాడిని ఫెడేల్మని కొట్టి, "ఏరా- కాలనీ వాళ్ళు నీ మీద కంప్లెయింట్ ఇచ్చారని వాళ్ళ మీదకు రౌడీలని పంపావు. ఇప్పుడు నాయుడుగారే ఇచ్చారు. ఏం చేస్తావాయన్ని? మళ్ళీ రౌడీల్ని పంపుతావా? పద.... సెంట్రల్ జైల్లో కూర్చుని ఏం చెయ్యాలో ఆలోచిద్దూగానీ" అని తన్నుకుంటూ వ్యాన్ ఎక్కించాడు.    
    కాలనీ వాళ్ళ మొహంలో రిలీఫ్ కనపడుతూంది.    
    నాయుడి మొహం మాత్రం జేగురురంగుకి తిరిగి వుంది.    
    జరిగినదంతా ఇప్పుడు క్లియర్ గా అతడికి అర్ధం అవుతోంది.    
                                                6    
    రాణా ఇంటికొచ్చేసరికి ఒంటిగంట దాటింది. కరెంట్ లేదు. అతడు బట్టలు మార్చుకుని బాత్ రూమ్ లోకి వెళ్ళాడు.    
    తలుపు తీసేసరికి ఒక శరీరం అతడిమీద పడింది.    
    మరెవరయినా అయితే కెవ్వున అరిచేవారే. అతడు కాబట్టి తమాయించుకుని ఆ శరీరాన్ని గట్టిగా పట్టుకుని నెమ్మదిగా క్రిందికి జార్చాడు.    
    బయటంతా చీకటి నిశ్శబ్దం.    
    రాణా ప్రొఫెషనలిస్టు అప్పటికే అతడు పోలీస్ డిపార్ట్ మెంట్ లో చాలా కాలంగా పనిచేస్తూ వున్నాడు. చీకట్లో ఒక ఆకారం మీదపడితే భయపడేటంత భీరువు కాదు.    
    ఆ శరీరాన్ని అలాగే గోడకి ఆన్చాడు.    
    ముందు శ్వాస ఆడుతుందో లేదో అని ముక్కు దగ్గిర వేలు పెట్టి చూశాడు. ఊపిరి బలహీనంగా వస్తోంది. ఏమైనా కత్తిపోట్లు వున్నాయేమో అని మెడ దగ్గరా, వీపుమీదా తడిమిచూసి, నడుము మీదకి చేయిజార్చి, చీరకీ జాకెట్టుకీ మధ్య చూశాడు. రక్తపు తడి ఏమీ తగల్లేదు. అతడు చేతిని మరింత క్రిందికి జార్చబోతుంటే-    
    "నేను బాగానే వున్నానండీ, నాకేమీ కాలేదు" అన్నమాటలు వినిపించాయి.    
    అతఃడు అదిరిపడి చెయ్యి తీసేసి, "ఎవరు నువ్వు? మా బాత్ రూమ్ లోకి ఎలా వచ్చి పడ్డావ్?" అని అడిగాడు.    
    "నా పేరు అలక్ నంద" అంది ఆమె. అతడు అప్రయత్నంగా చెయి తీసేసి, "....నువ్వా" అన్నాడు.    
    "మన ఇద్దరి పరిచయం ఇలా బాత్ రూమ్ మీద గచ్చుమీద మొట్టమొదటిసారి అవటం యాదృచ్చికమైనా, ఆనందంగా వుంది. అలా స్పృహ తప్పి పడిపోయావేమిటి? లోపల భయపడ్డావా?"    
    ఆమె ఏదో జవాబు చెప్పబోతూ వుంటే, "ఎవరదీ? అమ్మాయ్- అలకా" అని తల్లి గొంతు వినిపించింది. రాణా అడుగు వెనక్కి వేశాడు.    
    "ఇలా అర్దరాత్రి మనిద్దర్నీ నీ తల్లి చీకట్లో బాత్ రూమ్ దగ్గిర చూసిందంటే అపార్ధం చేసుకునే ప్రమాదం వుంది. లోపలికి వెళ్ళు" అన్నాడు.    
    అయోమయంగా చూసింది అతడివైపు.    
    "అబ్బే నీ మనసులోకి దుష్టాలోచనలు ప్రవేశపెట్టడం నా ఉద్దేశ్యం కాదు" అని అతడు ఇంకా ఏదో అంటూ వుంటే అలక్ నంద తల్లి అక్కడికి వచ్చింది.    
    "ఏమిటే! ఏమైందే?" అంది గోడకి ఆనుకుని కూర్చుని వున్న కూతుర్ని చూసి కంగారుగా.    
    రాణా మరింత కంగారుపడి, "అబ్బే ఇంకా ఏం కాలేదండి" అన్నాడు. కూతుర్ని రెక్కపట్టుకుని లేపుతూ "ఇలా ఉపవాసాలు వుండొద్డంటే విన్నావా?" అంది.    
    "ఉపవాసాలా?" అన్నాడు  రాణా ఆశ్చర్యంగా.    
    "అవున్నాయనా మొన్న శనివారం నిన్న ఏకాదశి ఈ రోజు కార్తీక సోమవారం".    
    అతడు అలక్ నంద వైపు చిత్రంగా చూసి, "ఈ వయసులో ఈ అమ్మాయి ఇలా అప్పుడప్పుడు మాత్రమే భోజనం చేయటానికి కారణం? ఏదైనా అజీర్తా?" అని అడిగాడు. అలక్ నంద అతడివైపు కోపంగా చూసింది. అతడు ప్రశ్నని కాస్త మార్చి, "ఎందుకీమెకి భుక్తిమీద అనాసక్తి?" అన్నాడు.

    "భక్తి" అంది తల్లి.

    "భక్తా? ఈ వయసులోనే ఇంత భక్తి అయితే ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి తప్పకుండా 'ఆడబాబా' అయి తీరుతుంది. ఇక మీ పంట పండినట్టే! ఒక్కసారి 'బాబా' అయితే బోలెడంత డబ్బు అందులోనూ ఆడబాబాలు ఈ మధ్య తక్కువయ్యారు."    
    అలక్ నంద మొహం ఎర్రబడింది.    
    "డబ్బు సంపాదించటం కోసం, బాబానవ్వటం కోసం నేను ఉపవాసాలుండటం లేదండీ. మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం కోసం ఉపవాసాలు వుంటున్నాను."    
    "మనసు ప్రశాంతంగా వుండటానికి ఉపవాసాలే కారణమైతే, ఈ దేశంలో ముప్పాతిక మంది జనం ప్రశాంతంగా బ్రతకాలే" అన్నాడు.    
    "ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి" అంది అలక్ నంద క్లుప్తంగా.    
    "ఉద్దేశ్యం ఏదైనా ఒక్కనిజం మాత్రం నువ్వు కాదనలేవు అలక్ నందా!"    
    "ఏమిటది?"    
    "అర్దరాత్రి దాటి మంగళవారం వచ్చేసింది. నువ్విక భోజనం చెయ్యవచ్చు."    
    ఆమె నయనాలు సగం మూసుకుని "మంగళవారం ఆంజనేయస్వామి మొక్కు భోజనం చెయ్యను" అంది.    
    "ఆయన బ్రహ్మచారి ఆయన్ని మొక్కితే జీవితాంతం కన్నెపిల్లగానే మిగిలిపోతావు" బెదిరించినట్టు అన్నాడు.    
    "అదే నాకు కావల్సింది" అని అలక్ నంద అక్కడినుంచి వెళ్ళిపోయింది.    
    "మీ అమ్మాయిని చూస్తూంటే చాలా ముచ్చటగా వుంది అత్తయ్యగారూ" అన్నాడు అటే చూస్తూ.    
    "ఏం ముచ్చటో నాయనా దీన్ని చూస్తూంటే ఇక జీవితంలో ఒక ముద్దుకీ, ముచ్చటకీ నోచుకున్నట్టు లేదు. దాని జీవితం అలా అయిపోయింది-"    
    "ఏమిటా ఫ్లాష్ బ్యాక్? ఏమా కథ?"    
    "పెద్ద కథేం లేదు. దీని పదమూడో ఏట ఒక చిలక జ్యోతిష్యుడు దీని జాతకం చెప్పాడు. 'కన్నెగండం' వుందనీ, కన్నెరికం పోయిన మరుక్షణం మరణం తథ్యమనీ అన్నాడు. అది దీని మనస్సులో బలంగా నాటుకుపోయింది. అప్పట్నుంఛీ ఇలా పూజలూ, పునస్కారాలూ మొదలు పెట్టింది."    
    "ఈ పూజలన్నీ పెళ్ళినుంచి మనసు మరల్చుకోవటానికా - లేక కన్నెగండం నుంచి తప్పించుకోవటానికా?"    
    "పెళ్ళంటేనే భయపడుతోంది నాయనా. చూస్తూంటే తెలియటం లేదూ!"

    "అమ్మాయి స్ట్రక్చర్ చూస్తూంటే మీ అభిప్రాయం తప్పనిపిస్తోంది. ఇలా అన్నానని ఏమీ అనుకోకండి అత్తయ్యగారూ! అమ్మాయి కన్నెగండం నుంచి తప్పించుకోవటానికే ఈ పూజలు చేస్తున్నట్టు నా అనుమానం. కొందరమ్మాయిలు శోభనం గురించి ఆలోచిస్తూ కూడా గుంభనంగా వుంటారు. ఎవరయినా పెద్ద జ్యోతిష్కుడికి చూపించి, ఆ చిలక జ్యోతిష్కుడు చెప్పింది తప్పని చెప్పించలేకపోయారా?"    
    "ఎంతమంది ఎన్ని చెప్పినా అమ్మాయి భయం పోలేదు బాబూ!"    
    "నన్ను ట్రై చెయ్యమంటారా?" అన్నాడు నిజాయితీగా ఆవిడ మొహంలో రంగులు మారాయి. అనుమానంగా చూస్తూ "ఏమిటి నువ్వు ట్రై చేసేది?" అంది.    
    "అపార్ధం చేసుకోకండి. కేవలం భయం పోగొడ్తానంతే."    
    ఆమె సమాధానం చెప్పలేదు.    
    ఆవిడవైపు ఆప్యాయంగా చూస్తూ "మొట్టమొదటిసారి మిమ్మల్ని చూడగానే మనిద్దరికీ జన్మజన్మల అనుబంధం వుందనిపించింది" అన్నాడు. ఆ ముసలావిడ భయంతో కెవ్వున అరవబోయింది. "ఆగండి అనుబంధం అనగానే అపార్ధం చేసుకోకండి. అది అత్తా అల్లుళ్ళ అనుబంధం. అంతే.... మీ అమ్మాయిని చూడగానే మీ పట్ల నా గుండె పొరల్లో ఎక్కడో చిన్న కదలిక ప్రారంభమై మిమ్మల్ని 'అత్తా' అని పిలవాలనిపించింది."    
    ఆవిడకి ఏదో అర్ధమైనట్టు అనిపించింది. అతడు నవ్వేడు. "మీరీ విషయంలో ఏ అనుమానాలూ పెట్టుకోకుండా నాకు సహాయం చేస్తానంటేనే నేను మీ అమ్మాయి కన్నెరికం పోగొడ్తాను.... సారీ....కన్నెగండం భయం పోగొడ్తాను."    
    "నీ ఇష్టం నాయనా-నేనేం చెప్పగలను?" అన్నదావిడ.    
                                           *    *    *    
    కాడిలాక్ కారు ఆ వీధి చివర్లో ఆగింది. అందులోంచి దిగినవ్యక్తి పక్కనే వున్న ప్లిమత్ లో ఎక్కాడు.    
    రాత్రి పన్నెండు దాటింది. రోడ్డు నిర్మానుష్యంగ వుంది.    
    ప్లిమత్ ఒక భవనం లోపలికి వెళ్ళింది. గూర్ఖాకి లోపల వున్న వ్యక్తి ఎవరో తెలీదు. అతడు దాదాపు ఆరేడు సంవత్సరాల్నుంచీ ఆ ఇంటికి కాపలాదారుగా వున్నాడు. అది ఒక గెస్ట్ హౌస్ గా మాత్రమే అతడికి తెలుసు. వారానికీ పది రోజులకీ ఒకసారి అక్కడికి అర్దరాత్రి దాటాక రెండు కార్లు వస్తూ వుంటాయి. పది నిముషాల వ్యవధిలో ఆ రెండు కార్లూ చేరుకుంటాయి. తెల్లవారుఝామున వెళ్ళిపోతాయి. పగటపూట మనుష్యులు, తోటమాలీ తమ పనులు తాము చేసుకుంటూ పోతుంటారు.    
    ప్రిస్మా ఏజెన్సీస్ గెస్ట్ హౌస్ అది. ఆ కంపెనీ తరపు నుంచే వారికి జీతాలు అందజేయబడతాయి. అంతవరకు మాత్రమే పని వాళ్ళకు తెలుసు. గూర్ఖా ఎప్పుడూ కారులోకి తొంగి చూడలేదు. ప్రిస్మా ఏజెన్సీస్ సెక్రటరీ పగటిపూట వస్తూ వుంటాడు. రాత్రి పూట ప్లిమత్ కారు డ్రైవ్ చేస్తూ వుంటాడు.    
    ఆ ప్లిమత్ కారులోంచి దిగిన వ్యక్తి అరవింద్ చౌరసియా!    
    మధ్య హాల్లో కామిని కూర్చొని అతడి కోసం ఎదురు చూస్తోంది. అతడిని చూడగానే లేచి దగ్గరికి వచ్చి భుజాలమీదుగా చెయ్యివేసి ముద్దు పెట్టుకుని, ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళి రెండు డ్రింక్స్ కలిపి తీసుకువచ్చి ఒక గ్లాసు అతడికిచ్చి ప్రక్కనే సోఫాలో కూర్చుంది.    
    "ఎంత సేపయింది నువ్వొచ్చి-" అడిగాడు.    
    "పది నిముషాలు."    
    చౌరసియా గ్లాసు పూర్తిచేసి, ఆమెని పొదివి పట్టుకుని బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్ళాడు.    
    కామినికి ఇది చాలా ఆశ్చర్యంగా వుంటుందెప్పుడూ.    
    గత ఆరేడేళ్ళుగా ఆమె అతడిని ఆ ఇంట్లో కలుసుకుంటూ వుంది. ఆమె తన కారు స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక సంకేత స్థలంలో ఆగుతుంది. చౌరసియా సెక్రటరీ అక్కడికి వచ్చి ఆమెని కారులో ఎక్కించుకుని, ఈ ఇంటికి తీసుకువస్తాడు. తెల్లవారుఝామున విడిపోతారు.    
    ఈ రహస్యం కేవలం నలుగురికే తెలుసు. చౌరసియాకీ, ఆమెకీ, అతని సెక్రటరీకీ, ఆమె భర్తకీ!    
    ఆమె భర్తకి- ఆమె పదిరోజుల కొకసారి ఎక్కడికో వెళ్తుందని తెలుసుగానీ, ఎవరికోసం వెళుతుందో తెలీదు. అతడంత పట్టించుకోలేదు. కొత్తగా వచ్చిన హోం మినిష్టర్ పదవితో అతడు చాలా సంతోషంగా వున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS